అమేజింక్ ఫుడ్

ABN , First Publish Date - 2020-08-08T05:34:44+05:30 IST

‘‘కరోనా బారినపడకుండా... ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే జింక్‌ తీసుకోవాలి’’ పోషకాహార నిపుణులు చెబుతున్న మాట ఇది. అయితే మాత్రల రూపంలో కాకుండా జింక్‌ సమృద్ధిగా లభించే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి...

అమేజింక్ ఫుడ్

‘‘కరోనా బారినపడకుండా... ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే జింక్‌ తీసుకోవాలి’’ పోషకాహార నిపుణులు చెబుతున్న మాట ఇది. అయితే మాత్రల రూపంలో కాకుండా జింక్‌ సమృద్ధిగా లభించే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. రోగనిరోధకశక్తిని పెంచే ఈ అమే‘జింక్‌’ రెసిపీలను మీరూ ప్రయత్నించండి.


బేక్డ్‌ వెజ్‌ బ్రొకోలి


కావలసినవి

బ్రొకోలి  - పావుకేజీ, క్యారెట్లు - రెండు, బీన్స్‌ - నాలుగైదు, మైదా - 100గ్రా, వెన్న - 100గ్రా, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - ఒక  టీస్పూన్‌, ఛీజ్‌ - అరకప్పు, పాలు - ఒకకప్పు.

తయారీ: ముందుగా బ్రొకోలిని ముక్కలుగా కట్‌ చేయాలి. క్యారెట్లు, బీన్స్‌ను కట్‌ చేసుకోవాలి. అన్నింటిని ఉడికించి పక్కన పెట్టుకోవాలి.

  1. స్టవ్‌పై పాన్‌ పెట్టి కాస్త వేడి అయ్యాక వెన్న వేయాలి. వెన్న కరిగాక మైదా వేసి బాగా కలపాలి.
  2. తరువాత పాలు పోయాలి. మిశ్రమం ఉండలు లేకుండా క్రీమ్‌లా అయ్యేలా చూసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కలపవచ్చు. ఇందులో కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు ఒక పాత్రలో బ్రొకోలి, క్యారెట్‌, బీన్స్‌ ముక్కలు తీసుకోవాలి. అన్ని బాగా కలిసేలా కలియబెట్టాలి. 
  4. వాటిపై క్రీమ్‌ను లేయర్‌లా పోయాలి. ఛీజ్‌ను సన్నగా తురిమి పైన వేయాలి.
  5. తరువాత ఓవెన్‌లో 180 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నాలుగు నిమిషాల పాటు బేక్‌ చేయాలి.
  6. అంతే... టేస్టీ టేస్టీ వెజ్‌ బ్రొకోలి రెడీ.





మష్రూమ్‌తో...


కావలసినవి

మష్రూమ్స్‌(పుట్టగొడుగులు) - పావుకేజీ, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - మూడు, టొమాటోలు - రెండు, జీలకర్ర - అర టీస్పూన్‌, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, జీలకర్ర పొడి - అర టీస్పూన్‌, గరంమసాలా - పావుటీస్పూన్‌, పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, కరివేపాకు - కొద్దిగా, నూనె - సరిపడా, కొత్తిమీర - ఒక కట్ట.

తయారీ: మష్రూమ్స్‌ను శుభ్రంగా కడగాలి. పెద్దగా ఉంటే రెండు ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటోలను తరిగి పెట్టుకోవాలి.

  1. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేగించాలి.
  2. తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయాలి. ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు.
  3. ఉల్లిపాయలు వేగిన తరువాత కరివేపాకు, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి కలపాలి.
  4. కాసేపు వేగిన తరువాత టొమాటో ముక్కలు, పసుపు వేసి కలియబెట్టాలి. టొమాటో ముక్కలు మెత్తగా అయ్యే వరకు మూతపెట్టి ఉడికించాలి.
  5. టొమాటో ముక్కలు ఉడికిన తరువాత ధనియాల పొడి, కారం, జీలకర్రపొడి వేసి కలపాలి.
  6. ఇప్పడు మష్రూమ్స్‌ వేసి కలియబెట్టాలి. మూతపెట్టి చిన్న మంటపై ఐదునిమిషాలు ఉడికించాలి.
  7. తగినంత ఉప్పు వేయాలి. మూతపెట్టి మరో రెండు నిమిషాలు ఉడకనివ్వాలి.
  8. చివరగా గరంమసాలా వేయాలి. కొత్తిమీరతో గార్నిష్‌ చేస్తే మష్రూమ్‌ కూర రెడీ.

పాలకూర కబాబ్స్‌


కావలసినవి

పాలకూర - రెండు కట్టలు, బంగాళదుంపలు - రెండు, పచ్చిబఠాణీ - పావు కప్పు, పచ్చిమిర్చి - రెండు, అల్లం ముక్క - కొద్దిగా, కొత్తిమీర - ఒకకట్ట, పసుపు - చిటికెడు, యాలకుల పొడి - చిటికెడు, గరంమసాలా- పావు టీస్పూన్‌, మామిడికాయ పొడి - పావు టీస్పూన్‌, బ్రెడ్‌ క్రంబ్స్‌ - కొద్దిగా, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.

తయారీ: ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి, కట్‌ చేసి రెండు, మూడు నిమిషాల పాటు వేడి నీళ్లలో ఉడికించాలి. బంగాళదుంపలను ఉడికించి, పొట్టు తీసి గుజ్జుగా చేసుకోవాలి. పచ్చి బఠాణీని ఉడికించుకోవాలి.

  1. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక పచ్చిబఠాణీ, పాలకూర వేసి వేగించాలి.
  2. కొద్దిగా ఉప్పు వేయాలి. పసుపు, కొత్తిమీర వేసి కలపాలి. మూడు, నాలుగు నిమిషాల పాటు వేగించాలి.
  3. చల్లారిన తరువాత మిక్సీలో వేయాలి. పచ్చిమిర్చి, అల్లం వేసి గ్రైండ్‌ చేయాలి.
  4. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్‌లో తీసుకోవాలి. అందులో బంగాళదుంప గుజ్జు, యాలకుల పొడి, గరంమసాలా, మామడికాయ పొడి, బ్రెడ్‌క్రంబ్స్‌, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి.
  5. చేతికి నూనె రాసుకుంటూ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ గారెల్లా ఒత్తుకోవాలి.
  6. స్టవ్‌పై నాన్‌స్టిక్‌ పాన్‌ పెట్టి కొద్దికొద్దిగా నూనె వేస్తూ పాలకూర కబాబ్స్‌ను కాల్చాలి. కబాబ్స్‌ను రెండు వైపులా గోధుమరంగులోకి మారే వరకు  కాల్చాలి. 
  7. చట్నీతో సర్వ్‌ చేసుకుంటే ఇవి రుచిగా ఉంటాయి.

చనా మసాలా కర్రీ


కావలసినవి

కాబూలీ సెనగలు - ఒక కప్పు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, జీలకర్ర - ఒక టీస్పూన్‌, ధనియాలు - ఒక టీస్పూన్‌, మిరియాలు - ఒక టీస్పూన్‌, ఎండుమిర్చి - నాలుగైదు, బిర్యానీ ఆకు - ఒకటి, దాల్చిన చెక్క - కొద్దిగా, లవంగాలు - నాలుగైదు, యాలకులు - రెండు, ఉప్పు, కారం - రుచికి తగినంత, నూనె - సరిపడా, పసుపు - చిటికెడు, టొమాటో పేస్టు - అరకప్పు, కొత్తిమీర - కొద్దిగా. 

తయారీ: ముందుగా సెనగలను నాలుగైదు గంటల పాటు నానబెట్టాలి. తరువాత కొద్దిగా ఉప్పు వేసి కాబూలీ సెనగలను ఉడికించి పెట్టుకోవాలి. ఒక టేబుల్‌స్పూన్‌ సెనగలను పేస్టుగా చేయాలి.

  1. మసాలా కోసం స్టవ్‌పై ఒక పాన్‌ పెట్టి, కాస్త వేడి అయ్యాక ఎండుమిర్చి, దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, బిర్యానీ ఆకు వేసి కాసేపు వేగించాలి. 
  2. తరువాత వాటిని మిక్సీలో వేసి పట్టుకోవాలి. 
  3. ఇప్పుడు స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేయాలి. నూనె వేడి అయ్యాక తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కలపాలి.
  4. అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి. కాసేపు వేగిన తరువాత టొమాటో పేస్టు, సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసి కలియబెట్టాలి.
  5. కాసేపయ్యాక ఉడికించి పెట్టుకున్న సెనగలు వేయాలి. 
  6. సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పొడి, సెనగల పేస్టు వేసి కలపాలి. 
  7. గ్రేవీ కోసం కొద్దిగా నీళ్లు పోయాలి. మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి.
  8. చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.


Updated Date - 2020-08-08T05:34:44+05:30 IST