జొకో జోరు

ABN , First Publish Date - 2021-06-06T08:47:25+05:30 IST

రొలాండ్‌ గారో్‌సలో టైటిల్‌ ఫేవరెట్ల జోరు కొనసాగుతోంది. టాప్‌సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌, డిఫెండింగ్‌ చాంపియన్‌ రఫెల్‌ నడాల్‌ సునాయాస విజయాలతో ప్రీక్వార్టర్స్‌కు చేరారు...

జొకో జోరు

  • ప్రీక్వార్టర్స్‌లో నొవాక్‌, నడాల్‌
  • స్వియటెక్‌, కెనిన్‌ కూడా
  • స్విటోలినా అవుట్‌
  • ఫ్రెంచ్‌ ఓపెన్‌

పారిస్‌: రొలాండ్‌ గారో్‌సలో టైటిల్‌ ఫేవరెట్ల జోరు కొనసాగుతోంది. టాప్‌సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌, డిఫెండింగ్‌ చాంపియన్‌ రఫెల్‌ నడాల్‌ సునాయాస విజయాలతో ప్రీక్వార్టర్స్‌కు చేరారు. గ్రీకు వీరుడు స్టెఫనోస్‌ సిట్సిపాస్‌ మూడో రౌండ్‌లో చెమటోడ్చాల్సి వచ్చింది. మహిళల్లో ఐదోసీడ్‌ స్విటోలినాకు అన్‌సీడెడ్‌ క్రెజిసికోవా షాకిచ్చింది. 

జొకో, ‘బుల్‌’ సులువుగా: సెర్బియా వీరుడు నొవాక్‌ జొకోవిచ్‌ శనివారం 6-1, 6-4, 6-1 స్కోరుతో రికార్డస్‌ బెరాంకిస్‌ (లిథువేనియా)పై వరుస సెట్ల విజయంతో నాలుగో రౌండ్‌ చేరాడు. రొలాండ్‌ గారోస్‌లో అతడు వరుసగా 12వ ఏడాది ప్రీక్వార్టర్స్‌ చేరి రికార్డు నెలకొల్పాడు. ఈక్రమంలో నడాల్‌, ఫెడరర్‌ సరసన జొకో చేరాడు. ప్రీక్వార్టర్స్‌లో ఇటలీ టీనేజర్‌ లొరెంజో ముసేటితో జొకో తలపడతాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ బరిలోకి దిగిన తొలిసారే ముసేటి ప్రీక్వార్టర్‌ఫైనల్‌కు దూసుకుపోయాడు. 19 ఏళ్ల ముసేటి 3-6, 6-4, 6-3, 3-6, 6-3తో తన దేశానికే చెందిన కెచినోట్‌ను చిత్తు చేశాడు. నడాల్‌ 6-3, 6-3, 6-3తో కామెరాన్‌ నోరీ (యూకే)ని మట్టికరిపించాడు. ఇక సిట్సిపాస్‌ 5-7, 6-3, 7-6 (3), 6-1తో 31వ సీడ్‌ ఇస్నెర్‌ (అమెరికా)పై పోరాడి గెలిచాడు. ఇతర మూడో రౌండ్‌ మ్యాచ్‌ల్లో 10వ సీడ్‌ ష్వార్జ్‌మన్‌ (అర్జెంటీనా) 6-4, 6-2, 6-1తో కోల్‌ష్రీబెర్‌(జర్మనీ)పై, 18వ సీడ్‌ సిన్నర్‌ (ఇటలీ) 6-1, 7-5, 6-3తో యెమెర్‌ (స్వీడన్‌)పై నెగ్గి ప్రీక్వార్టర్స్‌లో ప్రవేశించారు. 



స్విటోలినా అవుట్‌: మహిళల సింగిల్స్‌లో టాప్‌ ప్లేయర్ల నిష్క్రమణ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉక్రెయిన్‌ క్రీడాకారిణి స్విటోలినా పరాజితుల జాబితాలో చేరింది. చెక్‌రిపబ్లిక్‌ ప్లేయర్‌ బార్బొరా క్రెజిసికోవా 6-3, 6-2తో స్విటోలినినాను చిత్తుచేసి ప్రీక్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టింది. క్రెజిసికోవా నాలుగో రౌండ్‌లో యూఎస్‌ ఓపెన్‌ మాజీ చాంపియన్‌ స్లోన్‌ స్టీఫెన్స్‌ను ఢీకొంటుంది. మరో మ్యాచ్‌లో 17వ సీడ్‌ సకారి (గ్రీస్‌) 7-5, 6-7 (2-7), 6-1తో 14వ సీడ్‌ మెర్టెన్స్‌ (బెల్జియం)ను కంగుతినిపించింది. అన్‌సీడెడ్‌ స్టీఫెన్స్‌ (అమెరికా) 6-3, 7-5తో 18వ సీడ్‌ కరోలినా మ్యుచోవా (చెక్‌ రిపబ్లిక్‌)కు చెక్‌ చెప్పింది. నాలుగో సీడ్‌ సోఫియా కెనిన్‌ (అమెరికా) 4-6, 6-1, 6-4తో సహచరి పెగ్యూలపై కష్టపడి గెలుపొందింది. ఇతర మూడో రౌండ్‌ మ్యాచ్‌ల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇగా స్వియటెక్‌ (పోలెండ్‌) 7-6 (4), 6-0తో కొంటావీట్‌ (ఎస్థోనియాపై)పై, 25వ సీడ్‌ జెబ్యూర్‌ (ట్యునీసియా) 3-6, 6-0, 6-1తో మగ్దా లినెట్‌ (పోలెండ్‌)పై నెగ్గారు. ప్రత్యర్థి నుంచి వాకోవర్‌ లభించడంతో కొకొ గాఫ్‌ (అమెరికా) ప్రీక్వార్టర్స్‌ చేరింది. 


‘టాప్‌’ మ్యాచ్‌లకు కర్ఫ్యూ దెబ్బ!

ఫ్రెంచ్‌ ఓపెన్‌ నిర్వాహకులు తొలిసారి రాత్రి మ్యాచ్‌లకు ప్లాన్‌ చేశారు. బ్రాడ్‌కాస్టర్‌తో డీల్‌లో భాగంగా ఈ రాత్రి మ్యాచ్‌లను టాప్‌ ఆటగాళ్లకోసం కేటాయించారు. కానీ కరోనాతో పారి్‌సలో రాత్రి కర్ఫ్యూ విధించడం నిర్వాహకులకు తలనొప్పిగా మారింది. గురువారం రాత్రి ఫిలిప్‌ చాటియర్‌ కోర్టులో గాస్కెట్‌తో డిఫెండింగ్‌ చాంప్‌ నడాల్‌ రెండోరౌండ్‌ మ్యాచ్‌ ఆడాడు. కానీ విద్యుత్‌ వెలుగులతో ధగధగలాడుతున్న కోర్టులో ఒక్కరంటే ఒక్కరు లేకుండా నడాల్‌ మ్యాచ్‌ ఆడాల్సి రావడం గమనార్హం. రాత్రి 9 నుంచి కర్ఫ్యూ అమలుకానుండడంతో స్టేడియంలోని ప్రేక్షకులను 8.30కే బయటకు పంపిస్తున్నారు. దాంతో టాప్‌ ప్లేయర్ల మ్యాచ్‌లు ఖాళీ కోర్టుల్లో జరుగుతున్నాయి.



సిజికోవా విడుదల

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో పోలీసులు అదుపులోకి తీసుకున్న రష్యా టెన్నిస్‌ క్రీడాకారిణి యానా సిజికోవా శనివారం విడుదలైంది. గత ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల డబుల్స్‌ మ్యాచ్‌ ఫిక్స్‌ అయ్యిందన్న అనుమానంతో 26 ఏళ్ల సిజికోవాను పారిస్‌ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. యానాను ప్రశ్నించిన పోలీసులు కేసులో ఆమె పేరు నమోదు చేయకుండానే విడుదలజేశారు. విచారణ కొనసాగుతుందని వారు తెలిపారు. అయితే తనపై ఆరోపణలను సిజికోవా తోసిపుచ్చింది. పోలీసులపై ఆమె పరువునష్టం కేసు వేయనున్నట్టు యానా లాయర్‌ ఫ్రెడరిక్‌ బెలోట్‌ వెల్లడించారు. 




Updated Date - 2021-06-06T08:47:25+05:30 IST