జొమాటో జిగేల్!

ABN , First Publish Date - 2021-07-24T06:47:38+05:30 IST

గత వారంలో పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)కు వచ్చిన జొమాటో షేర్లు శుక్రవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ అయ్యాయి.

జొమాటో  జిగేల్!

  • లిస్టింగ్‌ రోజే రూ.లక్ష కోట్ల కంపెనీగా అవతరణ 
  • ఇష్యూ ధరతో పోలిస్తే 66% ఎగబాకిన షేరు 


న్యూఢిల్లీ: గత వారంలో పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)కు వచ్చిన జొమాటో షేర్లు శుక్రవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ అయ్యాయి. ఈ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌కు మార్కెట్‌ ఇన్వెస్టర్లు బ్రహ్మరథం పట్టారు. దాంతో కంపెనీ షేరు లిస్టింగ్‌ రోజే ఉవ్వెత్తున ఎగిసింది. పబ్లిక్‌ ఇష్యూ ధర రూ.76తో పోలిస్తే, బీఎ్‌సఈలో 51.31 శాతం ప్రీమియంతో రూ.115 వద్ద లిస్టయింది. ఒక దశలో 81.57 శాతం లాభంతో రూ.138 వద్దకు దూసుకెళ్లింది. దాంతో జొమాటో మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ (మార్కెట్‌ విలువ) తొలి రోజే రూ.లక్ష కోట్లు దాటింది. మార్కెట్‌ క్యాప్‌ పరంగా దేశంలోని టాప్‌-50 కంపెనీల జాబితాలోకి చేరింది. చివరికి కంపెనీ షేరు 65.59 శాతం లాభంతో రూ.125.85 వద్ద ముగియడంతో మార్కెట్‌ విలువ రూ.98,731.59 కోట్ల వద్ద స్థిరపడింది. ఎన్‌ఎ్‌సఈలో 52.63 శాతం ప్రీమియంతో రూ.116 వద్ద లిస్టయిన జొమాటో షేరు.. చివరికి 64.86 శాతం లాభంతో రూ.125.30 వద్ద ముగిసింది. బీఎ్‌సఈలో జొమాటోకు చెందిన 451.71 లక్షల షేర్లు ట్రేడవగా.. ఎన్‌ఎ్‌సఈలో 69.48 కోట్ల షేర్లు చేతులు మారాయి. 


4 రోజుల ముందే..

రూ.9,375 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో జొమాటో ఐపీఓకు వచ్చింది. ఐపీఓ ధర శ్రేణిని రూ.72-76గా నిర్ణయించిం ది. ఈ నెల 14-16 తేదీల్లో ఈ పబ్లిక్‌ ఇష్యూ కొనసాగింది. కంపెనీ ఐపీఓకు సైతం మార్కెట్లో అపూర్వ స్పందన లభించింది. ఇష్యూ సైజుతో పోలిస్తే, 38 రెట్ల బిడ్లు లభించాయి. మరోవైపు జొమాటో.. షేర్లను షెడ్యూలు కంటే నాలుగు రోజుల ముందే స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ చేసింది. తొలుత ప్రకటించిన షెడ్యూలు ప్రకారం 27న లిస్ట్‌ చేయాల్సింది.

 

కెఫెటేరియా నుంచి లిస్టింగ్‌!

సాధారణంగా కంపెనీలు షేర్ల లిస్టింగ్‌ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటాయి. బీఎ్‌సఈలో బెల్‌ మోగించడం, లైవ్‌ స్ట్రీమింగ్‌, ఫొటో షూట్‌ ఆర్భాటం కన్పిస్తుంటుంది. కానీ, జొమాటో మేనేజ్‌మెంట్‌ మాత్రం గురుగ్రామ్‌లోని తన ప్రధాన కార్యాలయం కెఫెటేరియాలో చాలా సాదాసీదాగా షేర్ల లిస్టింగ్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. జొమా టో వ్యవస్థాపకులు, ప్రధాన ఇన్వెస్టర్లు, రెస్టారెంట్‌ భాగస్వాములు సహా 50 మంది మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిజిటల్‌ బజర్‌ ద్వారా కేఫ్‌ నుంచే షేర్లను లిస్ట్‌ చేశా రు. ఆ తర్వాత జొమాటో యాజమాన్యం తిరిగి విధుల్లో నిమగ్నమైంది. శుక్రవారం విధులకు హాజరైన సిబ్బందికి మాత్రం కంపెనీ పిజ్జా ఆర్డర్‌ చేసింది. 


ఇది మాకు చాలా ముఖ్యమైన రోజు. సరికొత్త ప్రయాణానికి ఆరంభం. భారత్‌లో అద్భుతమై ఇంటర్నెట్‌ వ్యవస్థ లేనిదే ఈ రోజు మా కంపెనీ ఈ స్థితికి చేరుకోవడం సాధ్యపడేది కాదు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధిస్తాం.  

- జొమాటో వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్‌ గోయల్‌ 


ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి..? 

స్వల్పకాలిక వ్యూహంతో జొమాటో ఐపీఓలో పెట్టుబడులు పెట్టిన వారు వెంటనే లాభాలు స్వీకరించడమే మేలని మార్కెట్‌ విశ్లేషకులు సూచిస్తున్నారు. దీర్ఘకాల వ్యూహం కలిగిన వారు మాత్రం తమ పెట్టుబడులను కొనసాగిస్తూ, మున్ముందు రోజుల్లో షేరు బాగా క్షీణించినప్పుడల్లా కొనుగోళ్లు జరపడం ద్వారా తమ పొజిషన్స్‌ పెంచుకోవచ్చని వారంటున్నారు. షేరు ధర మళ్లీ రూ.70-80 స్థాయికి దిగివచ్చినప్పుడు కంపెనీలో పొజిషన్లు పెంచుకోవడానికి అనువైన సమయమని వారు అభిప్రాయపడ్డారు. 

Updated Date - 2021-07-24T06:47:38+05:30 IST