Abn logo
Oct 22 2021 @ 02:16AM

కార్పొరేట్‌కు దోచిపెడుతున్న బీజేపీ

  • వావిలాలను మండలం చేస్తా.. 
  • ఈటలకు ఓటమి భయం: హరీశ్‌ రావు

జమ్మికుంట రూరల్‌, హుజూరాబాద్‌, అక్టోబరు 21 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల ఆస్తులను కార్పొరేట్‌ కంపెనీలకు దోచిపెడుతోందని మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. గురువారం కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం వావిలాలలో ధూం ధాం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌ రావు మాట్టాడుతూ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ఓటమి భయం పట్టుకుందని, ఓడిపోతాననే ఫ్రస్టేషన్‌లో బొంద పెడుతా, ఘోరీ కడుతా అంటూ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. సానుభూతి పొందేందుకు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారన్నారు. ఇల్లందకుంటలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులు ఇస్తే ఈటల రాజేందర్‌ అవి చెల్లవని చెప్పారన్నారు. వావిలాల మండలం కావాలని ఈ ప్రాంత వాసులు 36 రోజులు దీక్షలు చేపట్టారని, ఎంపీటీసీ మల్లేశం ఆమరణ దీక్ష చేస్తే అరెస్ట్‌ చేయించిన ఘనత ఈటలది అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళ్లు మొక్కైనా వావిలాలను మండలం చేస్తా అని హామీ ఇచ్చారు. గతంలో వావిలాల నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సు నడిచేదని, ఈటల రాజేందర్‌ మంత్రి అయిన తర్వాత ఆ బస్సు బంద్‌ అయిందని గుర్తు చేశారు. 


సొంత జాగ ఉన్న వాళ్లందరికీ ఇళ్లు కట్టుకునేందుకు రూ.5ఐదు లక్షలు ఇస్తామన్నారు. నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ గెలిస్తే మూడు నెలల్లో పసుపు బోర్డు తీసుకు వస్తా అని రైతులకు బాండ్‌ పేపర్‌ రాసిచ్చారని, మూడేళ్లవుతున్నా ఇప్పటి వరకు పసుపు బోర్డు ఊసే ఎత్తడం లేదన్నారు. కేంద్రంలోని  బీజేపీ ప్రభుత్వం బీసీల కోసం ఢిల్లీలో ఒక్క భవనమైనా కట్టిందా? అని మంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్‌ హుజూరాబాద్‌లో ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కంటే ఏదైనా రాష్ట్రం అభివృద్ధిలో ముందుందా అని ప్రశ్నించారు. సీఎంగా కేసీఆర్‌ ఉన్నారు కాబట్టే తెలంగాణలో అన్ని కులాలకు రక్షణ ఉందన్నారు. హుజూరాబాద్‌లో బీజేపీ గెలిచి ఉద్యోగాలు, ప్రాజెక్టులు ఇస్తుందా? అధికారంలోకి వస్తుందా? అని ప్రశ్నించారు. అందుకే ప్రజలు ఎవరికి, ఎందుకు ఓటు వేయాలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో కేసీఆర్‌ బొమ్మే తమ గెలుపు మంత్రమని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. హుజూరాబాద్‌లో నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం తెచ్చింది, తెలంగాణ ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నది టీఆర్‌ఎస్‌ పార్టీనేనన్నారు. బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదన్నారు.