వీడియో కాన్ఫరెన్సింగ్‌ మార్కెట్‌ కోసం జూమ్‌-జియో యుద్ధం!

ABN , First Publish Date - 2020-07-10T07:02:30+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ భయం ఆవహించింది. భౌతిక దూరం తారకమంత్రమైంది. స్కూల్లో విద్యార్థులను కూర్చోబెట్టి పాఠాలు చెప్పడానికి, ఆఫీసుల్లో ఉద్యోగులతో మీటింగులు పెట్టుకోవడానికి ఎవరూ సాహసించడం లేదు...

వీడియో కాన్ఫరెన్సింగ్‌ మార్కెట్‌ కోసం జూమ్‌-జియో యుద్ధం!

  • జూమ్‌లాగే ‘జియోమీట్‌’ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌
  • కాపీ కొట్టారంటూ దావాకు జూమ్‌ యోచన
  • ఏటా 30వేల కోట్ల వ్యాపారం

న్యూఢిల్లీ, జూలై 9: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ భయం ఆవహించింది. భౌతిక దూరం తారకమంత్రమైంది. స్కూల్లో విద్యార్థులను కూర్చోబెట్టి పాఠాలు చెప్పడానికి, ఆఫీసుల్లో ఉద్యోగులతో మీటింగులు పెట్టుకోవడానికి ఎవరూ సాహసించడం లేదు. భౌతికదూరం పాటించాలంటే తరగతి గదులు, బోర్డు రూములు సరిపోవు. అందుకే, అందరూ ఆన్‌లైన్‌ బాట పడుతున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలన్నీ సాధ్యమైనంత మేరకు వర్క్‌ఫ్రం హోం ద్వారా లాగించేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ సమావేశాలకు డిమాండ్‌ పెరిగింది. సాఫ్ట్‌వేర్‌ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్‌, గూగూల్‌ అప్పటికే వీడియో కాన్ఫరెన్సింగ్‌ సాఫ్ట్‌వేర్‌లో ఆరితేరి ఉన్నాయి. అయితే మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌, గూగుల్‌ మీట్‌ల పెయిడ్‌ వర్షన్లకు ఉన్న సదుపాయాలు ఫ్రీ వర్షన్లలో లేవు. రెండింటి పెయిడ్‌ వర్షన్ల సదుపాయాలతో ఉచితంగా అందుబాటులోకి వచ్చిన ‘జూమ్‌’ యాప్‌ కరోనా కష్ట సమయలో జనం మదిని దోచింది.


లాక్‌డౌన్‌ సమయంలో మార్చిలో ఒక వారంలోనే 6.2 కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. కాలేజీలు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఎవరినోట విన్నా ‘జూమ్‌’ పేరే. స్టాక్‌ మార్కెట్లో షేర్లు జూమ్‌ అని దూసుకుపోయాయి. వర్క్‌ఫ్రం హోం శాశ్వతం అవుతుందన్న నమ్మకాలతో వీడియో కాన్ఫరెన్సింగ్‌ వ్యాపారం భవిష్యత్తు అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే జూమ్‌పై ప్రత్యర్థుల దాడి మొదలైంది. మొదట చైనా కంపెనీ అన్నారు. నిజానికి అది కాలిఫోర్నియాలో రిజిస్టర్‌ అయిన అమెరికన్‌ కంపెనీ. వ్యవస్థాపకుడు ప్రవాస చైనీయుడు కావడంతో అందులో ఎక్కువ మంది డెవలపర్లు చైనా వాళ్లే ఉన్నారు. పైగా ప్రైవసీ, సెక్యూరిటీ విషయంలో లొసుగులు ఉన్నాయి కాబట్టి, చైనాలో ఉన్న 700 మంది డెవలపర్ల సాయంతో  వినియోగదారుల సమాచారాన్ని చైనా సర్కారు తస్కరించే వీలుందని కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే గత ఏప్రిల్లో భారత ప్రభుత్వం జూమ్‌ ప్రతినిధులను పిలిచి పలు ప్రశ్నలు వేసింది. తమది అమెరికన్‌ కంపెనీ అని, భారత్‌కు సంబంధించిన డేటా భారత్‌లోనే స్టోర్‌ అవుతోందని కంపెనీ వివరణ ఇచ్చింది. 


ప్రపంచంలోని 17 డేటా సెంటర్లలో హైదరాబాద్‌, ముంబయిల్లో రెండు ఉన్నాయని వివరించింది. తమది చైనా కంపెనీ కాదని, జూమ్‌ డేటాను ఆ దేశానికి షేర్‌ చేయాల్సిన పరిస్థితి తలెత్తదని చెప్పింది. జూమ్‌ యాప్‌ ద్వారా పిల్లలపై అఘాయిత్యాలకు అవకాశం ఉంటుందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తమ డేటాను భారత ప్రభుత్వానికి యాక్సెస్‌ ఇవ్వడానికి అంగీకరించింది. గల్వాన్‌ ఘటన తర్వాత భారత ప్రభుత్వం 59 చైనా యాప్‌లను నిషేధించినపుడు జూమ్‌ జోలికి పోకపోవడంతో దానిపై ఉన్న చైనా ముద్రను తొలగించుకొనే అవకాశం కంపెనీకి లభించింది. అప్పటికే లక్షల మంది భారతీయులు చైనా యాప్‌ అనే అనుమానంతో జూమ్‌ను తమ మోబైళ్లు/ల్యా్‌పటా్‌పల నుంచి తొలగించేశారు. ఒకవైపు జూమ్‌ చైనా ముద్రతో కష్టాల సాగరాన్ని ఈదుతున్న తరుణంలోనే భారతీయ ఇంటర్నెట్‌ సేవల దిగ్గజం జియో(రిలయన్స్‌ అనుబంధ సంస్థ) వేల కోట్ల ఆదాయం అవకాశం ఉన్న వీడియో కాన్ఫరెన్సింగ్‌ వ్యాపారం మీద దృష్టి సారించింది. ఆగమేఘాల మీద ‘జియో మీట్‌’ యాప్‌ను రూపొందించింది. సరిగ్గా వారం క్రితమే శుక్రవారం రోజు భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. మిగతా వీడియోకాన్ఫరెన్సింగ్‌ యాప్‌లన్నీ పెయిడ్‌ సర్వీసులు విడిగా ఇస్తుంటే, జియో మీట్‌ అన్ని ఫీచర్లను పూర్తిగా ఉచితంగా ఇస్తోంది. 

అయితే, ‘జియో మీట్‌’ యాప్‌ యూజర్‌ ఇంటర్‌ ఫేస్‌ అచ్చం జూమ్‌ లాగే ఉందని ట్విటర్లో విమర్శలు వెల్లువెత్తాయి. భారతీయ టెలికం దిగ్గజం కాపీ కొట్టడమేంటనే వ్యాఖ్యానాలు వినిపించాయి. ఈ అంశంపై ‘జూమ్‌ వీడియో కమ్యూనికేషన్స్‌ ఇండియా’ విభాగం అధిపతి సమీర్‌ రాజె స్పందిస్తూ, అచ్చం తమ యాప్‌ను పోలి ఉండే విధంగా ‘జియో మీట్‌’ రూపొందించారని అన్నారు. దావా వేసే విషయమై చర్చిస్తున్నామన్నారు.


ఏడాదికి 30 వేల కోట్లు

2019లో జరిగిన వీడియో కాన్ఫరెన్సింగ్‌ వ్యాపారం విలువ అక్షరాలా 30 వేల కోట్లు. 2027 వరకు ఏటా పది శాతం చొప్పున ఈ వ్యాపారం పెరుగుతుందని అంచనా వేశారు. ఇక కరోనా వచ్చాక ప్రపంచవ్యాప్తంగా బడాబడా సంస్థలన్నీ ఈ వ్యాపారం మీద కన్నేశాయి. మెయిళ్ల కన్నా వీడియో కాన్ఫరెన్సింగే ఉత్తమ మార్గమని కార్పొరేట్లు నమ్ముతున్న నేపథ్యంలో డిమాండ్‌ భారీగా పెరుగుతోంది.

Updated Date - 2020-07-10T07:02:30+05:30 IST