Abn logo
Sep 21 2021 @ 01:25AM

చైర్మన్‌ కుర్చీ ఎవరికో..!

  • అధికార వైసీపీలో జడ్పీ చైర్మన్‌ గిరీ ఎవరిని వరించేనో
  • అనుకూల ఫలితాలతో పీఠం కోసం జడ్పీటీసీల ప్రయత్నాలు
  • పి.గన్నవరం నుంచి విప్పర్తి వేణుగోపాల్‌ పేరు ప్రచారం
  • అధిష్ఠానాన్ని కలిసి వచ్చిన విప్పర్తి.. ఇటు విశ్వరూప్‌ ఆశీస్సులు
  • 2019లో అసెంబ్లీ సీటు త్యాగంతో చాన్స్‌ ఇవ్వాలని విజ్ఞప్తి
  • ఎస్సీ జనరల్‌ కావడంతో ఈసారి తగ్గిన ఆశావహుల సంఖ్య

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జిల్లా పరిషత్‌ పీఠం అధికార వైసీపీ దక్కించుకున్న నేపథ్యంలో చైర్మన్‌ కుర్చీపై ఆ పార్టీ ఎవరిని కూర్చోబెడుతుందనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అనేక జిల్లాల్లో అధికార పార్టీ ఇప్పటికే పలువురి చైౖర్మన్ల పేర్లను ముందుగానే ప్రకటిం చింది. జిల్లాలో మాత్రం ఎవరికి చైౖర్మన్‌ గిరీ కట్టబెడ తారనేది వెల్లడించకుండా సస్పెన్స్‌ కొనసాగిస్తోంది. వాస్తవానికి ఇక్కడ జడ్పీ చైౖర్మన్‌ ఎంపిక ప్రతిసారీ రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షిస్తోంది. వ్యూహ ప్రతి వ్యూహాలు, క్యాంపులతో రస కందాయంగా మారడం ఆనవాయితీగా వస్తుండడమే ఇందుకు కారణం. అయితే ఈసారి చైర్మన్‌ స్థానం ఎస్సీ జనరల్‌కు రిజర్వు కావడంతో ప్రధాన పార్టీల నుంచి పదవి కోసం పోటీపడే ఆశావహుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే చైర్మన్‌ స్థానం రిజర్వేషన్‌ ఖరారు తర్వాత ఎన్నికలపై జిల్లాలో కీలక సామాజికవర్గాలు పట్టుకోసం ప్రయత్నించడం తగ్గించుకున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో జడ్పీటీసీలకు ముందుగానే పెట్టుబడి పెట్టి తమ వర్గం కింద కాపాడు కుంటూ క్యాంపులు నిర్వహించే పరిస్థితి తలెత్తలేదు. ఈనేపథ్యంలో ఆదివారం నాటి ఫలితాల్లో 61 జడ్పీటీసీ స్థానాలకు 57 వైసీపీ దక్కించుకోవడంతో ఈనెల 25న చైర్మన్‌ ఎన్నికల్లో ఎవరిని అదృష్టం వరిస్తుందనేది చర్చనీయాంశమైంది.  కుర్చీ కోసం ఎస్సీ సామాజికవర్గానికి చెందిన పలువురు జడ్పీటీసీలు తెరవెనుక గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ తమ రాజకీయ గాడ్‌ఫాదర్‌లను కలిసి అవకాశం ఇవ్వాలని వేడుకుంటున్నారు. అయితే వీరిలో పి.గన్నవరం జడ్పీ టీసీ విప్పర్తి వేణుగోపాల్‌ పేరే ప్రధానంగా వినిపిస్తోంది. గతంలో ఈయన జల వనరులశాఖ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌గా పనిచేసి ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా టిక్కెట్‌ ఖాయం చేసుకున్నారనుకునే దశలో అవకాశం చేజారిపోయింది. 2014లోను ఇదే జరిగింది. ఈ నేపథ్యంలో సీటు త్యాగానికి ప్రతిఫలంగా ఇప్పుడు వేణుగోపాల్‌కు చైర్మన్‌ కుర్చీ కట్టబెట్టడం ఖాయం అని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే వేణుగోపాల్‌ వైసీపీ అధిష్ఠానాన్ని కలిసి కుర్చీ ఖాయం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అయ్యే ఆర్థిక ఒత్తిళ్లు తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు జిల్లా పార్టీ పర్యవేక్షకుడికి తెలిపి నట్టు తెలిసింది. మరోపక్క తనకు చైర్మన్‌ గిరీ ఖాయం చేయాలంటూ మంత్రి విశ్వరూప్‌ను విప్పర్తి సోమవారం కలిశారు. ఈనేపథ్యంలో ఈయన్నే అధిష్ఠానం ఖరారుచేయడం ఖాయమనే వాదన బలంగా వినిపిస్తోంది. మరోపక్క ఎస్సీ జన రల్‌ రిజర్వుడు కావడంతో జిల్లాలో మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఈసారి చైర్మన్‌ కుర్చీ ఎవరికివ్వాలనేదానిపై పెద్దగా ఆసక్తిచూపడం లేదని సమాచారం.

ఎంపీపీ ఎన్నికలకు వ్యూహాలెన్నో..!

ఎంపీటీసీల కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తికావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు మండలాధ్యక్ష పదవులపై దృష్టి సారించాయి. వ్యూహాత్మక ఎత్తుగడలతో ఎంపీటీసీ అభ్యర్థులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. కొన్ని మండలాల్లో ఉత్కంఠ భరితమైన రాజకీయ పరిణామాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీల నాయకులు గెలిచిన ఎంపీటీసీలతో సమావేశాలు ఏర్పాటుచేసి తమకు మద్ధతు ఇవ్వాలని అభ్యర్థించే పనిలో ఉన్నారు. మరికొన్నిచోట్ల క్యాంపు రాజకీయలకు తెర లేపనున్నారు.