Advertisement
Advertisement
Abn logo
Advertisement

తూర్పు గోదావరి: జడ్పీ చైర్మన్‌గా విప్పర్తి వేణుగోపాల్‌?

రేపే ఎన్నిక

నేతలందరి మద్దతు ఆయనకేనంటూ ప్రచారం

జిల్లాలో ఎస్టీ 12, ఎస్సీ 12, బీసీ 16, ఓసీ 21 జడ్పీటీసీలు

మహిళలు 34.. పురుషులు 27 మంది

ఉన్నత విద్యావంతులే ఎక్కువ


(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా పి.గన్నవరం జడ్పీటీసీ సభ్యుడు విప్పర్తి వేణుగోపాల్‌ పేరు ఖరారైనట్టు ప్రచారం జరుగుతోంది. ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి అనే సమాచారం వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. ధవళేశ్వరం ఇరిగేషన్‌ శాఖలో ఈఈగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఆయన కొంతకాలంగా వైసీపీలో పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లోనే పి.గన్నవరం నియోకవర్గం ఎమ్మెల్యే టిక్కెట్‌ ఆశించారు. కానీ ఆయన కంటే ముందు నుంచి వైసీపీ కోసం పనిచేసిన కొండేటి చిట్టిబాబుకు టిక్కెట్టు దక్కడం, విజయం సాధించడం తెలిసిందే.


కానీ పార్టీ వర్గాల్లో పేరు తెచ్చుకున్న వేణుగోపాల్‌ను ఇప్పుడు చైర్మన్‌ అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతోంది. శనివారం జడ్పీ చైర్మన్‌ ఎన్నిక జరగనుంది. రేపోమాపో అభ్యర్థి పేరును అధికారికంగా ఖరారు చేస్తారు. జిల్లాలో 61 జడ్పీటీసీలు ఉన్నాయి. అందులో వైసీపీకి 59 స్థానాలు రాగా, తెలుగుదేశం పార్టీకి 1, జనసేనకు 1 వచ్చాయి. గత ఏడాది జరిగిన ఈ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ బహిష్కరించిన సంగతి తెలిసిందే. అయినా ఓటర్లు అన్ని కొంతవరకూ ఓట్లు వేశారు. 59 స్థానాలు రావడంతో జడ్పీ చైర్మన్‌ పదవి వైసీపీకే దక్కినట్టు అయింది. ఈసారి ఈ పదవిని ఎస్సీ వర్గాలకు కేటాయించారు. గెలిచిన 61 మం దిలో ఎస్టీలు 12 మంది, ఎస్సీలు 12 మంది బీసీలు 16 మంది, ఓసీలు 21 మంది ఉన్నారు. కానీ మహిళలే అధికం. 34 మంది ఎన్నికయ్యారు. ఈసారి దాదాపుగా అందరూ అక్షరాస్యులే. ఐదుగురికి విద్యార్హత అందుబాటులో లేదు.


20 మంది బీఏ. బికాం, బీఎస్సీ, బీఈడీ వంటి ఉన్నత విద్యావంతులే. ఒకరు బీఎల్‌ చేయగా, చైర్మన్‌ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న వేణుగోపాల్‌ బీటెక్‌ చేశారు. ఒకరు 4వ తరగతి, మరొకరు 5 తరగతి చదివారు. ఎస్‌ఎస్‌సీ కంటే తక్కువ మరో ఇద్దరు ఉన్నారు. 17 మంది ఎస్‌ఎస్‌సీ చదవగా, ఒకరు ఎస్‌ఎస్‌సీ ఫెయిలయ్యారు. ఒకరు ఎం.ఫార్మసీ చదివారు. గెలిచిన మహిళల్లో గృహుణిలు 32 మంది ఉన్నారు. ఇక గెలిచిన వారిలో 11 మంది వివిధ వ్యాపారాలు చేస్తున్నారు. కొందరు రైతులు కూడా ఉన్నారు. ఒక స్కూల్‌ కరస్పాండెంట్‌, ఒక స్కూల్‌ టీచర్‌ కూడా ఉన్నారు.

Advertisement
Advertisement