Abn logo
Sep 25 2021 @ 02:09AM

నేడు జడ్పీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక

జడ్పీ మీటింగ్‌ హాల్లో చైర్మన్‌ ఎన్నిక ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరినారాయణన్‌ తదితరులు

ముందుగా సభ్యుల ప్రమాణ స్వీకారం


చిత్తూరు, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్తు చైర్మన్‌, ఇద్దరు వైస్‌ చైర్మన్ల ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్లతోపాటు జిల్లాలోని జడ్పీటీసీ సభ్యులంతా శనివారం చిత్తూరులోని జడ్పీ మీటింగు హాలులో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కలెక్టర్‌ హరినారాయణన్‌ ప్రిసైడింగ్‌ అధికారిగా వ్యవహరించనున్నారు. ఏర్పాట్లను కలెక్టర్‌తోపాటు ఆసరా జేసీ రాజశేఖర్‌, డీఆర్‌వో మురళి, జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి, డీపీవో దశరథరామిరెడ్డి శుక్రవారం పరిశీలించారు. జిల్లాలో 65 జడ్పీటీసీ స్థానాలుండగా.. 30 ఇదివరకే ఏకగ్రీవం అయ్యాయి. బంగారుపాళ్యం, కలకడ మండలాల్లో టీడీపీ అభ్యర్థులు మరణించడంతో అక్కడ ఎన్నికలు జరగలేదు. మిగిలిన 33 చోట్ల ఏప్రిల్‌ 8వ తేదీన ఎన్నికలు జరగ్గా.. కోర్టు ఆదేశాలతో 19వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలను విడుదల చేశారు. 63 స్థానాలను వైసీపీ అభ్యర్థులే దక్కించుకున్నారు. వందశాతం స్థానాలు అధికార పార్టీ కైవసం చేసుకోవడంతో జడ్పీ పీఠం వారికే దక్కింది. శనివారం జరిగే జడ్పీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ప్రమాణ స్వీకారానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.

చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల అభ్యర్థులు వీరే..


జడ్పీ చైర్మన్‌గా గత ఏడాదే వి.కోట జడ్పీటీసీ జి.శ్రీనివాసులు (బీసీ)ను వైసీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. వైస్‌ చైర్మన్లుగా తాజాగా యాదమరి, గుడిపాల జడ్పీటీసీలు ధనుంజయరెడ్డి (ఓసీ), పి.రమ్య (ఎస్సీ)లను ఖరారు చేశారు. వీరితో కలెక్టర్‌ శనివారం ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

ఎన్నిక షెడ్యూల్‌


 నామినేషన్ల స్వీకరణ: ఉదయం 10 గంటల్లోపు

 పరిశీలన: 10 నుంచి 12 గంటల్లోపు

అర్హుల జాబితా ప్రకటన: మధ్యాహ్నం 12 తర్వాత

ఉపసంహరణ గడువు: ఒంటి గంటలోపు

ప్రత్యేక సమావేశం: మధ్యాహ్నం 1 గంటకు

ఫలితాలు: ప్రత్యేక సమావేశం అనంతరం

జడ్పీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక: 3 గంటలకు

శుక్ర, శనివారం నుంచే ఐదేళ్ల పదవీ కాలం ప్రారంభం


చిత్తూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 24: జిల్లావ్యాప్తంగా గతంలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా ఏకగ్రీవమైనా ఐదేళ్ల  పదవీకాలం మాత్రం శుక్ర, శనివారం నుంచే ప్రారంభమవుతుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు 2020 మార్చి 7న నోటిఫికేషన్‌ జారీ చేయగా పోలింగ్‌ 2021 ఏప్రిల్‌  8న, కౌంటింగ్‌ ప్రక్రియ ఈనెల 19వ తేదీతో ముగిసింది. 2020 మార్చిలో  నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ అనంతరం 433మంది ఎంపీటీసీ సభ్యులుగా, 30 మంది జడ్పీటీసీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారంటు  అప్పటి ఎన్నికల అధికారి కోదండరామిరెడ్డి ప్రకటించారు. గెలుపొందిన విజేతలకు ధ్రువపత్రాలను కూడా అందించారు. కానీ కోర్టు కేసు విచారణ కారణంగా వీరిని అధికారికంగా ప్రకటించలేకపోయారు. ఆతర్వాత కౌంటింగ్‌కు ఆదేశాలు రావడంతో ఏకగ్రీవమైన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు శుక్ర, శనివారం నుంచి అధికారికంగా గుర్తించబడ్డారు. ఏకగ్రీవంతోపాటు కౌంటింగ్‌లో గెలుపొందిన  ఎంపీటీసీల ఐదేళ్ల పదవీ కాలం శుక్రవారం నుంచి, జడ్పీటీసీల పదవీకాలం శనివారం నుంచి ప్రారంభంకానుందని  ఎన్నికల  కమిషన్‌ జడ్పీ సీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది.