Abn logo
Sep 25 2021 @ 00:17AM

జడ్పీ చైర్‌పర్సన్‌ ఎన్నికకు సర్వం సిద్ధం

జడ్పీ చైర్‌పర్సన్‌ ఎన్నిక సందర్భంగా జరుగుతున్న సభ ఏర్పాట్లు (ఇన్‌సెట్లో) ఏర్పాట్ల గురించి కలెక్టర్‌తో చర్చిస్తున్న బూచేపల్లి శివప్రసాదరెడ్డి

వేదికగా పాత జడ్పీ సమావేశమందిరం

ఎన్నిక అనంతరం బహిరంగసభకు ఏర్పాట్లు 

ఒంగోలు(జడ్పీ), సెప్టెంబరు 24: జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. శనివారం జరగబోయే పాలకవర్గ ప్రమాణస్వీకారానికి జడ్పీ పాత సమావేశమందిరం వేదిక కానుంది. ఇద్దరు కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికతో పాటు ఇద్దరి వైస్‌ చైర్మన్ల ఎన్నిక కూడా జరగనుంది. ఇందుకు కావలసిన అన్ని ఏర్పాట్లను యంత్రాంగం పూర్తిచేసింది. హాలులోపల జడ్పీటీసీ సభ్యులతోపాటు, జిల్లాకు చెందిన వివిధ పార్టీల ప్రతినిధులకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మొత్తం 300 మంది వరకు కూర్చునే విధంగా ఏర్పాట్లను యంత్రాంగం పూర్తిచేసింది. జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు.

ప్రక్రియ ఇలా...

ఉదయం పది గంటలకు ఇద్దరు కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక కోసం నామినేషన్లు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12గంటలకు పరిశీలన, అర్హత ప్రకటన ఉంటుంది. ఒంటి గంటకు జరిగే ప్రత్యేక సమావేశంలో సభ్యుల ప్రమాణస్వీకారం జరుగుతుంది. అనంతరం కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎన్నికతో ప్రక్రియ ముగియనుంది.

అనంతరం బహిరంగ సభ

ఎన్నిక అనంతరం పాత జడ్పీ సమావేశ మందిరం బయట భారీ బహిరంగ సభ నిర్వహించడానికి పార్టీ తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం సభాస్థలిని కూడా ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలు, స్వాగతతోరణాలతో ఆ పరిసర ప్రాంతాలను ముస్తాబు చేశారు. జడ్పీ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ చాంబర్‌ను కూడా అన్ని హంగులతో మస్తాబు చేస్తున్నారు