Abn logo
Sep 21 2021 @ 01:12AM

ఎవరికి దక్కేనో..?

జడ్పీ చైర్‌పర్సన్‌ రేసులో నలుగురు

కులాల లెక్కల్లో అధికార పార్టీ నేతలు

ప్రజాప్రతినిధుల మద్దతు కూడగట్టే 

పనిలో భర్తలు నిమగ్నం

రంగంలోకి దిగిన కులసంఘాల నేతలు

తమ సామాజికవర్గానికే పదవి ఇవ్వాలని ఒత్తిళ్లు

ఆ  వర్గాల పదవులను లెక్కలోకి 

తీసుకుంటున్న వైనం

అనంతపురం,సెప్టెంబరు20(ఆంధ్రజ్యోతి) : జడ్పీ చైర్మన్‌ పదవి కోసం అధికార పార్టీ బీసీ సామాజిక వర్గాల్లో తీవ్ర పోటీ నెలకొంది. జిల్లాలో 62 జడ్పీటీసీలకు ఎన్నికలు జరగ్గా 60 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులే ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్‌ చైౖర్‌పర్సన్‌ పదవిని బీసీ మహిళకు రిజర్వు చేశారు. ఈ క్రమంలో తమ సామాజికవర్గానికే పదవి ఇవ్వాలని ఆయా కులసంఘాలు ఆ పార్టీ ప్రజాప్రతినిధుల మద్దతు కూడగట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు. ఇంకోవైపు మీడియా ద్వారా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ప్రధానంగా బీసీ సామాజిక వర్గాల్లోని జనాభా ప్రాతిపదికన బలమైన సామాజిక వర్గాలు నువ్వా...నేనా అంటూ పీఠం కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో చైర్‌పర్సన్‌ పదవి రేసులో ఉన్న జడ్పీటీసీ సభ్యుల భర్తలు ఆ వర్గాల నేతలతో కలిసి ప్రజాప్రతి నిధులను ప్రసన్నం చేసుకోవడంలో తలమునకలయ్యారు. మరోవైపు ఆ పార్టీలోని కొందరు ప్రజాప్రతినిధులు తమ సామాజికవర్గం వారిని జడ్పీ పీఠంపై కూర్చోబెట్టేందుకు పావులు కదుపుతున్నారు. ఇలా ఎవరికి వారు చాపకింద నీరులా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆ క్రమంలో పార్టీ పెద్దల ఆశీస్సులు పొందేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ పీఠం కోసం వాల్మీకి, కురుబ, యాదవ, ఈడిగ సామాజికవర్గాలు పోటీపడుతున్నాయి. ఆ సామాజిక వర్గానికి చెందిన వారిలో ఎవరినో ఒకరిని జడ్పీ చైౖర్‌పర్సన్‌గా ఎంపిక చేసేందుకు అధిష్టానం నుంచి స్పష్టమైన సంకేతాలు వెలువడిన నేపథ్యంలోనే... పోటీ తీవ్రమవుతోంది. 


రేసులో ఆ నలుగురు....

జడ్పీ చైర్‌పర్సన్‌ రేసులో ప్రధానంగా నలుగురు పోటీలో ఉన్నారు. ఆత్మకూరు జడ్పీటీసీ సభ్యురాలు బోయ గిరి జమ్మ(వాల్మీకి), రాప్తాడు జడ్పీటీసీ సభ్యురాలు పసుపుల హేమావతి (కురుబ), గుత్తి జడ్పీటీసీ సభ్యురాలు నారావేణి రాధిక(యాదవ్‌), తనకల్లు జడ్పీటీసీ సభ్యురాలు జక్కల జ్యోతి(ఈడిగ)లు జడ్పీ చైర్‌పర్సన్‌ కుర్చీ కోసం పోటీపడుతున్న వారిలో ఉన్నారు. వీరిలో ఆత్మకూరు జడ్పీటీసీ బోయ గిరిజమ్మకు పదవి ఇప్పించేందుకు హిందూపురం పార్లమెంటు నియోజకవ ర్గంలోని ఓ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. పసుపుల హేమావతి విషయంలోనూ ఆ సామాజికవర్గం ప్రజాప్రతినిధులు పట్టుబడుతున్నారు. జక్కల జ్యోతి భర్త జక్కల ఆదిశేషు తన భార్యకు జడ్పీ చైర్‌పర్సన్‌ పదవి ఇవ్వాలని ప్రజాప్రతినిధుల మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఆ మేరకు పార్టీలో తనకున్న పరిచయాలతో కడప జిల్లా నేతలతో పాటు జిల్లాలోని కొందరు ముఖ్య నాయకులను కలుస్తున్నట్లు తెలుస్తోంది. నారావేణి రాధిక భర్త, మాజీ జడ్పీటీసీ సభ్యుడు ప్రవీణ్‌కుమార్‌ యాదవ్‌ జిల్లాలోని ప్రజాప్రతినిధులందర్నీ కలుస్తూ యాదవ సామాజికవర్గానికి ప్రాధాన్యతనివ్వాలని కోరుతున్నట్లు సమాచారం. ఈ నెల 25న జడ్పీ చైౖర్‌పర్సన్‌ ఎన్నిక ఉన్న నేపథ్యంలో ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. 


ఆ సామాజిక వర్గాల పదవులను లెక్కలోకి తీసుకుంటున్న వైనం..

జడ్పీ చైర్‌పర్సన్‌ పీఠం దక్కించుకునేందుకు బోయ, కురుబ, యాదవ, ఈడిగ సామాజికవర్గాల జడ్పీటీసీ అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా సామాజికవర్గాలు ఇప్పటి వరకూ పొందిన పదవులను లెక్కలోకి తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం. జిల్లాలో బోయ సామాజికవర్గం నుంచి ఒకరు ఎంపీ, నలుగురు మున్సిపల్‌ చైర్మన్లు, మరొకరు ఏడీసీసీ బ్యాంకు చైర్‌పర్సన్‌, ఒకరు పుడా చైర్మన్‌ పదవుల్లో ఉన్నారు. కురుబ సామాజికవర్గం నుంచి ఒకరు రాష్ట్ర మంత్రి, ఒకరు ఎంపీ, ఒకరు కురుబ కార్పొరేషన్‌ చైౖర్మన్‌తో పాటు మరికొందరు డైరెక్టర్లుగా ఉన్నారు. కాగా జిల్లాలో ఇ ప్పటి వరకూ యాదవ సామాజికవర్గానికి ఆ పార్టీ నామినేటెడ్‌ పదవుల్లోగానీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పించలేదు. పార్టీ పదవుల్లోనూ ప్రాతినిథ్యం దాదాపుగా లే దనే చెప్పాలి. ఈడిగ సామాజికవర్గం నుంచి తనకల్లు జడ్పీటీ సీ సభ్యురాలు జక్కల జ్యోతి చైర్‌పర్సన్‌ పదవిని ఆశిస్తున్నారు. 


అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమంటూనే...

జడ్పీ చైర్‌పర్సన్‌ పీఠం కోసం ఆయా సామాజికవర్గాల నాయకుల నుంచి ప్రజాప్రతినిధులపై ఒత్తిళ్లు తార స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఎవరి మాట వారికి చెబుతూ చివరకు అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమంటూనే జిల్లాలో ఆయా సామాజికవర్గాలకు పదవుల్లో ప్రాధాన్యతను బేరీజు వేస్తున్నట్లు సమాచారం. ఒకట్రెండు సామాజికవర్గాలకే పదవుల్లో ప్రాధాన్యతనిస్తే మిగతా సామాజికవర్గాల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలను అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులు, నామినేటెడ్‌, పార్టీ పదవుల్లోనూ ఆయా సామాజికవర్గాలకు కల్పించిన ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఇక్కడే ఆయా సామాజికవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు పార్టీలోని మిగిలిన ప్రజాప్రతినిధుల మద్దతు కూడగట్టడంతో పాటు వారికి పార్టీ పెద్దలతో ఉన్న సాన్నిహిత్యం ద్వారా చెప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్ల ఎంపికలో ముందుగా కొందరి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే చివరికి వారికి ఆ పదవులు దక్కలేదు. జడ్పీ చైర్‌పర్సన్‌ ఎంపిక విషయంలోనూ అదే పునరావృతమయ్యే అవకాశాలు లేకపోలేదని ఆ పార్టీ ప్రజాప్రతినిధుల నుంచే వినిపిస్తోంది. మరి అధిష్టానం ఏ సామాజికవర్గానికి జడ్పీ చైర్‌పర్సన్‌ పీఠాన్ని కట్టబెడుతుందో మరో నాలుగు రోజులు వేచి చూడాల్సిందే.