250 కోట్లు ఇచ్చినట్లే ఇచ్చి!

ABN , First Publish Date - 2022-01-28T08:59:37+05:30 IST

250 కోట్లు ఇచ్చినట్లే ఇచ్చి!

250 కోట్లు ఇచ్చినట్లే ఇచ్చి!

  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిధుల విడుదలకు ఉత్తర్వులు
  • ముగిశాక స్కూళ్లకు వాడేందుకు ఆదేశాలు.. 
  • సర్కారు తీరుపై జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల అసంతృప్తి
  • చిన్నపాటి పనులూ చేయలేని స్థితిలో ఉన్నాం.. 
  • తమకు గౌరవం లేకుండా పోతోందని ఆవేదన


హైదరాబాద్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు గ్రామీణ ప్రగతిలో ప్రత్యేకతను చాటుకున్న జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌లు ఇప్పుడు అలంకార ప్రాయంగా మారాయి.   తమ పరిధిలోని గ్రామాల్లో చిన్నపాటి అభివృద్ధి పని కూడా చేయలేని స్థితిలోకి చేరుకున్నామని జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తమకు నిధులను కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో లాగేసుకుంటూ.. ఆయా పదవుల్లో ఉత్సవ విగ్రహాలుగా మార్చిందని ఆరోపిస్తున్నారు. ఆ కోవలోనే ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో హడావుడిగా నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చిందని, ఆ తర్వాత వాటిని ఉపయోగించుకునే వీల్లేకుండా తాళం వేసిందని జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌లకు రాష్ట్ర బడ్జెట్లో ప్రకటించిన రూ.500 కోట్లు నిధులు విడుదల చేయాలంటూ ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్‌ వచ్చింది. ఎన్నికల సమయంలో ఈ సమస్య తీవ్రమవకుండా ఉండేందుకు ప్రభుత్వం రూ.250 కోట్లు విడుదల చేస్తూ గత డిసెంబరు 3న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా పరిషత్‌లకు రూ.125.88 కోట్లు, మండల పరిషత్‌లకు రూ.124.12 కోట్లు కలిపి మొత్తం రూ.250 కోట్లు విడుదల చేశారు. అందులో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు జనరల్‌ ఫండ్‌ కింద రూ.188 కోట్లు, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో పనుల కోసం ఎస్‌సీఎ్‌సపీ కింద రూ.38.63కోట్లు, టీఎ్‌సపీ కింద రూ.22.7 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఎన్నికలు  ముగిశాక ఇచ్చిన ఆ నిధులను పాఠశాలల్లో మౌలిక సదుపాయల కల్పనకు వినియోగిస్తామంటూ అధికారులు మౌఖికంగా పేర్కొన్నారు. ఇది జెడ్పీటీసీలు,  ఎంపీటీసీలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సర్కారు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఒకలా... ఇప్పుడు మరోలా వ్యవహరిస్తోందని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్‌ ప్రకారం జెడ్పీటీసీలకు రూ.252కోట్లు, మండల పరిషత్‌లకు రూ.248కోట్లు రావాల్సి ఉందని, తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఉపయోగపడే పనులు చేసే అవకాశం లేకుండా పోయిందని, విడుదల చేసిన నిధులను పక్కదారి పట్టించడం సరికాదని అంటున్నారు. బడ్జెట్‌లో ప్రకటించిన నిధులను విడుదల చేయాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు. 


రూ.2వేల కోట్లు వాడొచ్చు కదా

రాష్ట్రంలోని సర్కారు బడుల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన రూ.2వేల కోట్లు వాడొచ్చు కదా! జెడ్పీటీసీ, ఎంపీటీసీల నిధులు దారి మళ్లించడం సరికాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక స్థానిక సంస్థల్లో భాగమైన జిల్లా పరిషత్‌ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చారు. స్థానిక ప్రజాప్రతినిధులుగా ప్రజలకు ఏ పనులూ చేయలేని స్థితిలో ఉన్నాం. ప్రభుత్వ చర్యల వల్ల మాకు గౌరవం లేకుండా పోతోంది. 

- బెల్లం శ్రీనివాసరావు, జెడ్పీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు


నిధులిచ్చి తాళం వేశారు 

గతనెల ప్రభుత్వం రూ.250కోట్లు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత వాటిని వాడుకునేందుకు అవకాశం లేకుండా తాళం వేశారు. జిల్లా పరిషత్‌ పరిధిలో చిన్న చిన్న పనులు ఏవైనా చేసినా వాటికి సంబంధించి నెల ల తరబడి చెల్లింపులు జరగవు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 15వ ఫైనాన్స్‌ నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వడంలేదు. లేక లేక విడుదల చేసిన నిధులనూ స్కూళ్లలో మౌలిక వసతులకు వినియోగిస్తామంటున్నారు. రాష్ట్ర బడ్జెట్లో పెట్టిన రూ.500 కోట్లలో ఒక్క పైసా ఇవ్వలేదు.  

- రాజేంద్రప్రసాద్‌ యాదవ్‌, జెడ్పీటీసీల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు 


Updated Date - 2022-01-28T08:59:37+05:30 IST