రాత్రివేళల్లో ఉద్యోగమా.. జర జాగ్రత్త.. ఈ విషయాలు మరిచారో ...
రాత్రివేళ వృత్తుల్లో కొనసాగే వారి శరీరాలు ప్రతికూల ప్రభావాలకు లోనవుతూ ఉంటాయి. విదేశాల సమయవేళలకు తగ్గట్టు రాత్రివేళ మేలుకుని ఉద్యోగాలు చేసే వాళ్లు ముంచుకొచ్చే ఈ ఆరోగ్య ముప్పులను దృష్టిలో పెట్టుకోవాలి.
మెటబాలిజం: ఆహారాన్ని శక్తిగా మలిచే ఈ ప్రక్రియ దెబ్బతింటుంది. శరీర జీవగడియారంలో అవకతవకల వల్ల హార్మోన్ల విడుదల క్రమం తప్పుతుంది. దీనికి తోడు వేళ కాని వేళల్లో ఆహారం తినడం, వ్యాయామం లోపించడం, దురలవాట్లు సమస్యను మరింత క్లిష్టం చేస్తాయి.
నిద్ర సమస్యలు: మన శరీరం వెలుగుకు, సూర్యరశ్మికి స్పందించేలా పరిణామం చెందింది. కానీ రాత్రివేళ మేలుకునే ఉద్యోగాల వల్ల, నిద్రపట్టకపోవడం లేదా నిద్రను కొనసాగించలేకపోవడం అనే రెండు సమస్యలు వేధిస్తాయి.
జీర్ణ సమస్యలు: పొట్టలో అసౌకర్యం, మలబద్ధకం, వాంతులు, విరోచనాలు, ఇర్రిటబుల్ బోవెల్ సిండ్రోమ్ లాంటి జీర్ణాశయ సమస్యలు మొదలవుతాయి.
గుండె జబ్బులు: పగటి ఉద్యోగాలు చేసే వాళ్లతో పోలిస్తే, ఐదు నుంచి ఆరేళ్ల పాటు రాత్రివేళ విధుల్లో కొనసాగేవాళ్లలో గుండె జబ్బులు ఎక్కువ అని పరిశోధనల్లో తేలింది.
క్యాన్సర్:జీవగడియారంలో అవకతవకలు కణాల పనితీరును ప్రభావితం చేస్తాయి. దాంతో డీఎన్‌ఏ మరమ్మతు, కణ చక్రాలు, కణ మరణాలకు అంతరాయం ఏర్పడుతుంది. ఫలితంగా క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది.
ఇలా సరిదిద్దాలి: ఇతర దేశాల సమయాలకు అనుగుణంగా పని చేసే ఉద్యోగులు, ఆరోగ్యం దెబ్బతినకుండా చూసుకోవడం కోసం కొన్ని నియమాలను పాటించాలి.
పగటివేళ 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి
నిద్రకు రెండు గంటల ముందు కాఫీ, కెఫిన్ ఆధారిత పానీయాలకు దూరంగా ఉండాలి
ఆహారవేళలను పాటించాలి, వ్యాయామం చేయాలి
వృత్తిలో తీసుకునే అల్పాహారాల్లో భాగంగా మాంసకృత్తులు, పీచు సమృద్ధిగా ఉండే పదార్థాలు తినాలి.