టైం మిషన్ ఎక్కండి..  యవ్వనం పొందండి

టైం మిషన్ పేరుతో ఓ జంట ఘరానా మోసానికి పాల్పడింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌కు చెందిన రాజీవ్‌, రష్మీ దంపతులు.. వృద్ధాప్యం తొలగించే టైం మిషిన్ ఉందని చెబితే అక్కడి పెద్ద మనుషుల్లో చాలామంది నమ్మేశారు. 

రివైవల్‌ వరల్డ్‌ అనే ఫిజియో థెరపీ కేంద్రాన్ని తెరిచారు. లోపల.. ‘టైం మెషిన్‌’ పేరుతో కళ్లు చెదిరేలా ఓ యంత్రాన్ని పెట్టారు. ఈ టైం మెషిన్‌ ఇజ్రాయెల్‌లో తయారైందని, ప్రత్యేకంగా తెప్పించామంటూ కరపత్రాలు పంచిపెట్టారు. 

నగరంలో పలుచోట్ల హోర్డింగ్‌లు పెట్టించారు. రూ.6వేల నుంచి రూ.90వేల దాకా రకరకాల ప్యాకేజీలు పెట్టారు.

స్కీంలో చేరాలనుకున్నవారు.. ఇతరులను చేర్పిస్తే డిస్కౌంట్లు ఇస్తామని ఆఫర్‌ ఇచ్చారు. పెద్ద సంఖ్యలో చేరిన వృద్ధులను వైద్య పరీక్షల పేరుతో కొంతకాలం మభ్యపెడుతూ వచ్చారు.

బాధితుల్లో ఒకరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిజియో థెరపీ సెంటర్‌కొచ్చి ఆ టైం మిషన్‌ను పరిశీలించారు. 

అయితే టైం మెషిన్‌ ప్రక్రియ విశ్వసనీయతపై బాధితుల్లో అనుమానాలు మొదలయ్యాయని గుర్తించగానే.. రాజీవ్‌, రష్మీ కలిసి విదేశాలకు చెక్కేశారు. చివరకి డబ్బులు పోయాయని బాధితులు లబోదిబోమంటున్నారు.