తన కోపమే తన శత్రువు అన్నాడు సుమతీ శతకకర్త. అయితే కోపం చాలామందికి ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని నియంత్రించుకుంటే జీవితంలో చాలా నష్టాలు నివారించవచ్చు. కోపాన్ని కొన్ని పద్దతులు ఫాలో అవ్వడం ద్వారా అదుపు చేసుకోవచ్చు.
కోపం వచ్చినప్పుడు కొద్దిసేపు సైలెంట్ అయిపోవాలి. లోతుగా, నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. దీనివల్ల హృదయ స్పందన రేటు, నరాలు శాంతం అవుతాయి. కోపం తగ్గుతుంది.
చాలామంది కోపంలో ఏదేదో మాట్లాడి ఆ తర్వాత అయ్యో అలా మాట్లాడకుండా ఉండాల్సింది అంటుంటారు. కానీ మాట్లాడేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తే ఆ తరువాత బాధపడాల్సిన అవసరం ఉండదు.
కోపం ఎక్కువగా ఉన్నప్పుడు కోపాన్ని వ్యక్తం చేయకుండా మనసులో ఉన్న ఆందోళనను వ్యక్తం చేయాలి. ఆందోళన వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో వివరించాలి. కోపం వెనుక కారణం ఎదుటివారికి అర్థం అవుతుంది.
కోపంలో ఇతరులను నిందించడం, ఇతరులను దోషులను చేయడం మానుకోవాలి. కోపంగా ఉన్నప్పుడు పరిస్థితులు ఎలా ప్రభావితం చేస్తున్నాయో గమనించుకుంటే ప్రతిదానికి కోపం రాదు.
ఎవరైనా కోపం తెప్పిస్తే వారిమీద పగ పెంచుకోకూడదు. క్షమించడం వల్ల కోపం తగ్గడమే కాదు మనసులో భారం కూడా తగ్గుతుంది. ప్రశాంతత లభిస్తుంది.
ఏదైనా విషయంలో కోపం పెరిగి పోతున్నట్టు అనిపిస్తే కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఇది మనసు అదుపులో ఉంచుకోవడానికి, పరిస్థితుల గురించి ఆలోచించడానికి సహాయపడుతుంది.
కోపం అధికంగా ఉన్నప్పుడు నవ్వడానికి మార్గాలను వెతకాలి. నచ్చినవాళ్లతో మాట్లాడటం, కామిక్స్, కార్టూన్స్ చూడటం వంటివి తొందరగా మూడ్ ఛేంజ్ కావడానికి సహాయపడతాయి.