అనవసర ఆలోచనలతో సతమతమవుతున్నారా?

కొందరు చాలా చిన్న విషయం గురించి కూడా గంటల కొద్దీ ఆలోచిస్తారు. లేనిపోని అనుమానాలు పెట్టుకుని గందరగోళానికి గురవుతుంటారు. దేని మీదా ఏకాగ్రత కుదరదు. ఆ సమయంలో ఏ పనీ చేయలేరు.

ఏదైనా పొరపాటు చేసినపుడు దాని గురించి పదే పదే ఆలోచించకూడదు. సరిదిద్దుకునే వీలుంటే ప్రయత్నించాలి. లేకపోతే ఆ విషయాన్ని అక్కడితో వదిలెయ్యాలి.

అతి ఆలోచనలు పరిష్కారాన్ని సూచించకపోగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. ఆందోళన పెరిగితే షుగర్, బీపీ వంటి లైఫ్ స్టైల్ వ్యాధులతో పాటు డిప్రెషన్ సమస్యలు కూడా వెంటాడతాయి.

ఏదైనా ఆలోచన మిమ్మల్ని దీర్ఘకాలంగా ఇబ్బంది పెడుతున్నదైతే దాని గురించి సన్నిహితులతో మాట్లాడడం మంచిది. బయటి వారు ఆ సమస్యను ఎలా చూస్తున్నారో తెలుసుకోవడం మంచిది

మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు సంగీతం వినాలి. పుస్తకాలు చదవాలి. ఏదైనా దూర ప్రదేశాలకు వెళ్లవచ్చు.

దైవభక్తి ఉంటే దేవాలయానికి వెళ్లడం మంచి మార్పును కలిగిస్తుంది. ఇష్టమైన దేవుణ్ని దర్శించుకున్నా, ఆధ్యాత్మిక ప్రవచనాలు విన్నా మనసు తేలికపడుతుంది.

ఆలోచనల మీద అదుపు సాధించేందుకు ధ్యానం మంచి మార్గం. శ్వాస వ్యాయామాలు కూడా మీ మనసును మీ నియంత్రణలోకి తీసుకొస్తాయి.

ఉదయాన్నే వ్యాయామం చేస్తే పాజిటివ్ ఫీలింగ్స్ కలిగించే హార్మోన్లు విడుదలవుతాయి. శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా మారతారు.