సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో సెప్టెంబర్ 12న కన్నుమూశారు.
ఆయన పూర్తిపేరు ఏచూరి సీతారామరావు. 1952 ఆగస్టు 12 చెన్నైలో సర్వేశ్వర సోమయాజులు ఏచూరి, కల్పకం దంపతులకు జన్మించారు.
ఏచూరి బాల్యం ఎక్కువగా హైదరాబాద్‌లోనే సాగింది. అల్ సెయింట్స్ హైస్కూల్లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీకి వెళ్లి ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్లో చేరారు.
1970లో సీబీఎస్సీ సెకండరీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంకర్‌గా నిలిచారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఎకనామిక్స్‌లో బీఏ పూర్తి చేశారు. జేఎన్‌యూ నుంచి ఎంఏ పట్టా పొందారు.
అనంతరం అక్కడే పీహెచ్‌డీలో చేరారు. అయితే అప్పటికే దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించడం.. ఏచూరీని అరెస్ట్ చేయడంతో పీహెచ్‌డీని కొనసాగించలేకపోయారు.
మొదటి భార్య ఇంద్రాణి మజుందార్. జర్నలిస్టు సీమా చిత్తీ.. ఏచూరి రెండో భార్య. మొదటి భార్యకు ఒక కుమార్తె, కుమారుడు సంతానం. కాగా.. 2021 ఏప్రిల్ 22న కొవిడ్‌తో కుమారుడు ఆశిష్ మరణించారు.
విద్యార్థిగా ఉన్నప్పుడే ఎస్ఎఫ్ఐ నేతగా 1974లో సీతారాం ఏచూరి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది.1975లో జేఎన్‌యూ విద్యార్థిగా ఉన్నప్పుడు సీపీఎంలో చేరారు. ఎమర్జెన్సీ సమయంలో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
జేఎన్‌యూ విద్యార్థి సమాఖ్యకు ఏచూరి మూడుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
1984లో సీపీఎం కేంద్ర కమిటీలో చేరారు. 1990లో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, 2005లో వెస్ట్ బెంగాల్ నుంచి తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2015లో విశాఖపట్నంలో జరిగిన 21వ సీపీఎం మహాసభల్లో పార్టీ ఐదో ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కోసం కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ ముసాయిదాను రూపొందించడంలో మాజీ కేంద్ర మంత్రి చిదంబరంతోపాటు ఏచూరి కీలక భూమిక పోషించారు.