Share News

సింగరేణి ‘విద్యుత్‌’కు డిమాండ్‌

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:08 AM

బొగ్గు ఉత్పత్తి సంస్థ అయిన సింగరేణి జైపూర్‌ విద్యుత్‌ ప్లాంట్‌తో విద్యుత్‌ ఉత్పత్తి రంగంలోకి కూడా విస్తరించింది. దీంతో సింగరేణి సంస్థ ద్వారా విద్యుత్‌ ఉత్పత్తిని పెంచాలనే ఆలోచనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చాయి.

సింగరేణి ‘విద్యుత్‌’కు డిమాండ్‌

- సంస్థ ముంగిట కొత్తగా విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటు ప్రతిపాదనలు

- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 800/2 యూనిట్లకు ఒత్తిడి

గోదావరిఖని, ఏప్రిల్‌ 19: బొగ్గు ఉత్పత్తి సంస్థ అయిన సింగరేణి జైపూర్‌ విద్యుత్‌ ప్లాంట్‌తో విద్యుత్‌ ఉత్పత్తి రంగంలోకి కూడా విస్తరించింది. దీంతో సింగరేణి సంస్థ ద్వారా విద్యుత్‌ ఉత్పత్తిని పెంచాలనే ఆలోచనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చాయి. దేశవ్యాప్తంగా క్రమంగా విద్యుత్‌ డిమాండ్‌ పెరగడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్‌టీపీసీ, జెన్‌కో లాంటి విద్యుత్‌ సంస్థలను నిర్వహిస్తున్నప్పటికీ విద్యుత్‌ రంగంలో మంచి ఫలితాలు సాధిస్తున్న సింగరేణిపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 15వేల మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ కొనసాగుతున్నది. అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నది. అయితే మరో ఐదేళ్లలో అంటే 2029 వరకు రాష్ట్రంలో 27వేల మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ ఉత్పత్తి పెంచే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. దేశవ్యాప్తంగా కూడా గత సంవత్సరం వరకు ఒకరోజు 175మెగావాట్ల నుంచి 200మెగవాట్ల విద్యుత్‌ అవసరాలు ఉంటే, ఈ సంవత్సరం అత్యధికంగా రోజుకు 247మెగావాట్ల విద్యుత్‌ అవసరాలు నమోదు అయ్యాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భవిష్యత్‌ విద్యుత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా ఎక్కడికక్కడ విద్యుత్‌ ఉత్పత్తిపై దృష్టి సారించాయి. ఈ ఒత్తిడి సింగరేణిపై పడింది. ఇప్పటికే జైపూర్‌ ప్లాంట్‌లో సింగరేణి సంస్థ 600/2 యూనిట్లతో 12మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నది. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న క్రమంలో సూపర్‌ క్రిటికల్‌ పవర్‌ స్టేషన్లు వస్తున్నాయి. అంటే విద్యుత్‌ ఉత్పత్తి 680మెగావాట్లకు పైబడిన విద్యుత్‌ ప్లాంట్లను మాత్రమే ప్రతిపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థ ఇప్పటికే జైపూర్‌లో 3వ యూనిట్‌గా మరో 800మెగావాట్ల ఉత్పత్తికి అన్ని అనుమతులు తీసుకుని టెండర్‌ ప్రక్రియను కూడా పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో పీపీఏకు సింగరేణి ప్రతిపాదనలు సమర్పించింది. అలాగే కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి నుంచి జైపూర్‌లో 800మెగావాట్ల 4వ యూనిట్‌ నిర్మాణాన్ని చేపట్టాలని సింగరేణి సంస్థకు ఈ మధ్యనే సూచన చేసింది. ఈ అంశంపై సింగరేణి యాజమాన్యం పరిశీలన చేస్తున్నది. ఇదిలా ఉండగా రామగుండంలో జెన్‌కో ద్వారా 800మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌ కోసం ప్రభుత్వం ముందు ప్రతిపాదన ఉన్నది. రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ ఒత్తిడితో రాష్ట్ర ప్రభుత్వం రామగుండంలో 800మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలనే సంకల్పానికి వచ్చింది. అయితే ఈ విద్యుత్‌ ప్లాంట్‌ జెన్‌కో ద్వారా ఏర్పాటు చేయాల్సి ఉండగా, ప్రభుత్వం ఈ ప్లాంట్‌ను కూడా సింగరేణి ద్వారా ఏర్పాటు చేయాలని యోచనకు వచ్చినట్టు సమాచారం. ప్రభుత్వం నుంచి అనధికారికంగా సింగరేణి ముందుకు ఈ ప్రతిపాదన వెళ్లింది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇప్పటికే సింగరేణికి ఈ మేరకు ప్రతిపాదనలు చేయాలని సూచించినట్టు సమాచారం. దీంతో సింగరేణి ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 1600మెగావాట్ల కొత్త విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటు ప్రతిపాదనలు ఉన్నాయి.

ఫ కలిసివచ్చే అంశాలు ఎక్కువ..

ఒక మెగావాట్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్‌ నిర్మాణానికి సుమారు రూ.9కోట్ల ఖర్చు కానుండగా, 800మెగావాట్ల విద్యుత్‌ యూనిట్‌ ఏర్పాటుకు రూ.7వేల కోట్లు అవసరం ఉంటుంది. విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణం ప్రారంభమయ్యాక నాలుగు సంవత్సరాల్లో ఆ యూనిట్‌ నుంచి విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. అంటే రూ.7వేల కోట్ల ఖర్చును నాలుగేళ్లలో సింగరేణి వెచ్చించాల్సి ఉంటుంది. ఇలా రెండు యూనిట్లు 800మెగావాట్లవి నిర్మాణం చేయాల్సి ఉంటే సింగరేణి సంస్థ మరో నాలుగేళ్లలో రూ.15వేల కోట్ల బడ్జెట్‌ను వెచ్చించేందుకు సన్నద్ధం కావాల్సి ఉంటుంది. ఇప్పటికైతే టెండర్‌ ప్రక్రియలో ఉన్న జైపూర్‌ 3 యూనిట్‌కు రూ.7వేల కోసం సింగరేణి వెచ్చించాల్సిన అవసరం ఉంటుంది. అయితే బడ్జెట్‌ విషయంలో జైపూర్‌ స్టేషన్‌లో ప్లాంట్ల ఏర్పాటుకు ఎలాంటి సమస్య గానీ, కొరత గానీ లేదని సింగరేణి వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే 1200మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్న సింగరేణి ఈ విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణానికి సిద్ధమైతే బొగ్గుతో పాటు సింగరేణి సంస్థ విద్యుత్‌ రంగంలో కూడా ప్రధాన పాత్ర పోషించే స్థాయికి ఎదుగుతుంది. విద్యుత్‌ ఉత్పత్తిలో జెన్‌కో లాంటి ఇతర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల కంటే సింగరేణికి కొన్ని అదనపు సానుకూతలు ఉన్నాయి. గోదవారినది పక్కనే ఉన్న జైపూర్‌ ప్లాంట్‌కు నీటి సౌలభ్యత పుష్కలంగా ఉంది. దీనికి తోడు ప్లాంట్‌కు నీరు తరలించే వ్యవస్థ కూడా నిర్మించబడి ఉన్నది. మరో ముడిసరుకు అయిన బొగ్గును సింగరేణియే ఉత్పత్తి చేస్తుంది కనుక ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైగా శ్రీరాంపూర్‌, బెల్లంపల్లి ప్రాంతాల్లో ఉత్పత్తి అవుతున్న బొగ్గు సరఫరాకు కూడా ఖర్చు తగ్గుతుంది. ఇప్పటికే జైపూర్‌ ప్లాంట్‌కు రైల్వే మార్గాలు కూడా ఏర్పాటు చేయబడి ఉన్నాయి. రామగుండంలో ప్లాంట్‌ ఏర్పాటు చేస్తే కూడా సింగరేణి సంస్థకు ఇతరుల కంటే ఎన్నో కలిసివచ్చే భౌగోళిక అంశాలు ఉన్నాయి. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై కూడా భారం పడకుండా జెన్‌కోకు సంబంధించిన 570ఎకరాల భూములు కూడా అందుబాటులోనే ఉన్నాయి. ఇదిలా ఉండగా సింగరేణి సంస్థ థర్మల్‌ విద్యుత్‌ కాకుండా ఇప్పటికే సోలార్‌ రంగంలో అడుగుపెట్టింది. మొదటి ఫేస్‌ కింద 350మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌ను ఏర్పాటుచేసి విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నది. ఫేస్‌-2 కింద మరో 232మెగావాట్ల ఉత్పత్తికి కార్యాచరణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు మానేరుపై కూడా 300మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు కూడా సానుకూలత వ్యక్తం చేసి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. మొత్తంగా సింగరేణి ముందు 800/2మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రతిపాదనలు ఉన్నాయి.

Updated Date - Apr 20 , 2024 | 01:08 AM