Share News

కాంగ్రెస్‌లో చేరికల జోరు

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:57 AM

లోక్‌సభ ఎన్నికల సందడి మొదలైంది. అదే వరుసలో స్థానిక సంస్థల ఎన్నికలు జూన్‌లో నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీంతో సిరిసిల్ల, వేములవాడ రెండు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరడానికి ముందు వరుసలో నిలుస్తున్నారు.

   కాంగ్రెస్‌లో చేరికల జోరు

- వరుసకట్టిన బీఆర్‌ఎస్‌ నాయకులు

- స్థానిక సంస్థల కోసమే చేరికలా?

- అసంతృప్తులపై కాంగ్రెస్‌ దృష్టి

- పార్టీ వీడుతున్న బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు

- సిరిసిల్ల, వేములవాడలో మారుతున్న రాజకీయ పరిణామాలు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

లోక్‌సభ ఎన్నికల సందడి మొదలైంది. అదే వరుసలో స్థానిక సంస్థల ఎన్నికలు జూన్‌లో నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీంతో సిరిసిల్ల, వేములవాడ రెండు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరడానికి ముందు వరుసలో నిలుస్తున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో తమ ఉనికి చాటుకొని స్థానిక సంస్థలో పోటీకి దిగాలనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులు, తాజా మాజీ సర్పంచులు, ముఖ్య నాయకులు వరుస పెట్టి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. జడ్పీటీసీస్థాయి నుంచి మాజీ సర్పంచులు, కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు ఆ పార్టీలో చేరుతున్నారు. వేములవాడ నియోజకవర్గంలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, సిరిసిల్ల నియోజకవర్గంలో కేకే మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే వివిధ మండలాల్లో బీఆర్‌ఎస్‌లోని ముఖ్యుల్లో కొందరు కాంగ్రెస్‌లో చేరారు. బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు గతంలో పార్లమెంట్‌ సభ్యుడిగా పనిచేసిన సమయంలో సిరిసిల్ల, వేములవాడ రెండు నియోజకవర్గాల్లో నాయకులతో ఎక్కువగా సంబంధాలు ఉన్నాయి. వారిలో కొందరు కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో రాజకీయ భవిష్యత్‌ నేపఽథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ నేతృత్వంలో కూడా తిరిగి సొంతగూటికి చేరుతున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల వేళ వలస రాజకీయాలు ఫలితాలపై ప్రభావం చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఫ గులాబీ శ్రేణుల్లో అయోమయం

సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో లోక్‌సభ అభ్యర్థి వినోద్‌కుమార్‌ ఇప్పటికే ప్రచారం చేపట్టారు. వినోద్‌కుమార్‌ ఒక వైపు ప్రచారం చేస్తున్నా ఆయనతో కింది స్థాయి నాయకులు కలిసి పనిచేస్తున్నట్లుగా కనిపించడం లేదు. కాంగ్రెస్‌లో చేరే క్రమంలోనే బీఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటున్నారనే చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌కు ఓట్ల శాతం భారీగా పడిపోతుందనే చర్చ కూడా మొదలైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌కు 70,482 ఓట్లు, బీజేపీకి 64,769 ఓట్లు, కాంగ్రెస్‌కు 18,733 ఓట్లు, వేములవాడ సెగ్మెంట్‌లో బీజేపీకి 73,290 ఓట్లు, బీఆర్‌ఎస్‌కు 47,399 ఓట్లు, కాంగ్రెస్‌కు 15,606 ఓట్లు లభించాయి. ఈ సారి బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యనే ఓటు బ్యాంక్‌ ఉంటుందని భావిస్తున్నారు. మోదీ హవాతో యువత అటు మొగ్గు చూపితే, ఆరు గ్యారంటీల ప్రభావంతో ఓటు బ్యాంక్‌ పెరుగుతుందని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ నాయకులు బీఆర్‌ఎస్‌లో ఉన్న అసంతృప్త నేతలపై దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది.

ఫ నాయకా.. చేరిక

సిరిసిల్ల, వేములవాడ రెండు నియోజకవర్గాల్లో కొద్ది రోజులుగా జరుగుతున్న చేరికల్లో ఇతర నాయకులను కలుపుకొని బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఎల్లారెడ్డిపేట మేజర్‌ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచులు, దంపతులైన నేవూరి వెంకట్‌రెడ్డి, నేవూరి మమతతోపాటు మాజీ సర్పంచులు మందాటి దేవేందర్‌యాదవ్‌, పొన్నాల మంజుల, గొల్లపల్లి మల్లేశం, కదిలే రజిత, దాసరి సుజాత, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బాల్‌రెడ్డి, సింగిల్‌ విండో వైస్‌ చైర్మన్‌ బుగ్గ కృష్ణమూర్తి, మాజీ ఎంపీటీసీలు రవీందర్‌రెడ్డి, ఓగ్గు బాలరాజు, పొన్నం బాలకిషన్‌, ఎల్లారెడ్డిపేట బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు బండారి బల్‌రెడ్డితోపాటు మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు రామచంద్రం, బీజేపీ ఎస్టీ సెల్‌ మండల ఉపాధ్యక్షుడు అనిల్‌కుమార్‌, మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు నందికిషన్‌, బీఎస్పీ నాయకుడు ఎడ్లరాజు కాంగ్రెస్‌లో చేరారు. తంగళ్లపల్లి మండలంలో బీఆర్‌ఎస్‌ నుంచి చీర్లవంచ ఎంపీటీసీ నలువాల రేణుక, లింగాపూర్‌ ఎంపీటీసీ బైరినేని రాము, సింగిల్‌ విండో వైస్‌ చైర్మన్‌ శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచులు మంజుల, పొన్నం లక్ష్మణ్‌గౌడ్‌, సిరిసిల్ల అర్బన్‌ మండలం నుంచి మాజీ ఎంపీటీసీ చల్ల హరికృష్ణ, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు సుంకరి సాయికుమార్‌, సిరిసిల్ల మున్సిపల్‌ కౌన్సిలర్లు భూక్య రెడ్డి నాయక్‌, గుండ్లపల్లి రామానుజం, జాగీరు శైలు, కుడిక్యాల రవి, వేముల రవి, అర్బన్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ నేరేళ్ల శ్రీకాంత్‌గౌడ్‌, పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు గోలి వెంకటరమణతోపాటు ఇటీవల నుంచి బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పిట్టల భూమేష్‌ కాంగ్రెస్‌లో చేరారు. కోనరావుపేట మండలం నుంచి వెంకట్రావుపేట ఎంపీటీసీ పల్లె మంజుల, కోనరావుపేట ఎంపీటీసీ దేవరకొండ చారి, కొలనూర్‌ మాజీ సర్పంచ్‌ అబ్దుల్‌ రషీద్‌, పల్లి మక్త మాజీ సర్పంచ్‌ నందగిరి అంజయ్య, బోయినపల్లి నుంచి స్థంబంపల్లి ఎంపీటీసీ ఉపేందర్‌, జెగ్గారావుపల్లి ఎంపీటీసీ శీరీష, మాజీ సర్పంచ్‌ సౌందర్య, మాజీ ఎంపీటీసీ సంపత్‌, మాజీ సర్పంచ్‌ కనకమ్మ బీఆర్‌ఎస్‌ను వీడితే, బీజేపీ నుంచి మానువాడ మాజీ సర్పంచ్‌ శ్రీనివాస్‌, విలాసాగర్‌ మాజీ సర్పంచ్‌ రవీందర్‌ కాంగ్రెస్‌లో చేరారు. ముస్తాబాద్‌లో జడ్పీటీసీ గుండం నర్సయ్య, మాజీ జడ్పీటీసీ యాదగిరిగౌడ్‌, మాజీ ఎంపీపీ లక్ష్మీ కిషన్‌రావు, మాజీ సర్పంచులు కిషన్‌రావు, కళ్యాణి, యారటి లక్ష్మీ, రేసు లక్ష్మీ, భూక్య దేవేందర్‌, కరుణాల కళ చేరారు. బీజేపీ నుంచి సింగిల్‌ విండో మాజీ చైర్మన్‌ కనమేని ఛక్రధర్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. రుద్రంగి మండలంలో బీఆర్‌ఎస్‌ నుంచి జడ్పీటీసీ గట్ల మీనయ్య, లక్ష్మీనర్సింహా స్వామి దేవస్థానం చైర్మన్‌ శంకర్‌, సింగిల్‌ విండో డైరెక్టర్‌ నర్సిరెడ్డి, మాజీ సర్పంచులు నారాయణ, ఎంపీటీసీ మోతె నర్సయ్య, వేములవాడ అర్బన్‌ నుంచి సింగిల్‌ విండో చైర్మన్‌ సల్మాన్‌రెడ్డి, డైరెక్టర్‌ పోచవేని నాగరాజు, చిలువేరి సత్తయ్య, ఎంపీటీసీలు వనపర్తి దేవరాజు, గాలిపెల్లి సువర్ణ కాంగ్రెస్‌లో చేరారు. గంభీరావుపేటలో గతంలోనే ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం కాంగ్రెస్‌లో చేరారు. అదే బాటలో ఆయన తనయుడు బీఆర్‌ఎస్‌ నుంచి గంభీరావుపేట మాజీ సర్పంచ్‌ కటకం శ్రీధర్‌పంతులు, కొత్తపల్లి మాజీ సర్పంచ్‌ సరళ, సింగిల్‌ విండో మాజీ చైర్మన్‌ రాజనర్సింహారెడ్డి, దమ్మనపేట ఉపసర్పంచ్‌ అంజిరెడ్డి, వీర్నపల్లిలో ముదిరాజ్‌ సంఘం అధ్యక్షుడు నాగరాజు కాంగ్రెస్‌లో చేరారు. సిరిసిల్ల, వేములవాడలో మరో వారం రోజుల్లో ఎక్కువ సంఖ్యలో ప్రజాప్రతినిధులు కాంగ్రెస్‌లో చేరనున్నట్లుగా తెలుస్తోంది.

ఫ దృష్టంతా ‘స్థానికం’ పైనే

జిల్లాలో లోక్‌సభ ఎన్నికల తర్వాత వరుసగా సర్పంచ్‌, జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలతోపాటు మున్సిపల్‌ ఎన్నికలు రానున్నాయి. ఈ క్రమంలోనే సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతోపాటు గ్రామాల్లో బీఆర్‌ఎస్‌లో అసంతృప్త, ఆదరణ లేక నిరాశతో ఉన్నవారు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా బీఆర్‌ఎస్‌ను నుమ్ముకొని ఆ పార్టీలో పనిచేస్తూ స్థానిక ఎన్నికల్లో భంగపడుతూ వస్తున్న వారు ఈ సారి కాంగ్రెస్‌లో చేరి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడంపై దృష్టిసారించినట్లు చెప్పుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పనితీరు ఆధారంగానే అవకాశాలు లభిస్తాయని చెబుతున్న నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Apr 20 , 2024 | 12:57 AM