కుటుంబ కంపెనీలూ ఆరాధనా గణాలూ!

ABN , First Publish Date - 2023-01-14T00:47:11+05:30 IST

భారత ప్రజాస్వామ్యమా, కుశలమా? ఈ ప్రశ్నను మనం అడగలేము. ఎందుకని? ఇటీవలి సంవత్సరాలలో మన ప్రజాస్వామ్య ఆరోగ్యం...

కుటుంబ కంపెనీలూ ఆరాధనా గణాలూ!

భారత ప్రజాస్వామ్యమా, కుశలమా? ఈ ప్రశ్నను మనం అడగలేము. ఎందుకని? ఇటీవలి సంవత్సరాలలో మన ప్రజాస్వామ్య ఆరోగ్యం బాగా కృశించిపోయింది. దేశీయ ప్రాజ్ఞులే కాదు, విదేశీ విజ్ఞులూ వక్కాణిస్తున్న సత్యమిది. ఈ మహాపతనానికి సంబంధించిన ఒక అంశంపై చూపవలసిన శ్రద్ధను బహుశా, ఎవరూ చూపడం లేదేమో?! పార్టీ వ్యవస్థ కూలిపోవడమనే దృష్టి కోణం నుంచి మన విషాద భారతాన్ని పరిశీలించవలసి ఉంది. నిజానికి పత్రికా స్వేచ్ఛపై దాడులు, స్వతంత్ర రాజ్యాంగ సంస్థల నిర్వీర్యత, ఎన్నికల నిధులపై గోప్యత మొదలైన వాటి కంటే పార్టీ వ్యవస్థ అనారోగ్యమే భారత ప్రజాస్వామ్య దుస్థితికి బలమైన సంకేతం, స్పష్టమైన ఆనవాలు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఇటీవల తన మంత్రిమండలిలోకి సొంత కుమారుడిని తీసుకోవడమే అందుకొక దృష్టాంతం. యువ పాఠకులకు ఇదొక సాధారణ విషయమనిపించవచ్చుగానీ, సుదీర్ఘ జ్ఞాపకాలు ఉన్నవారికి స్టాలిన్ చర్య, ద్రవిడ మున్నేట్ర కఝగం సంస్థాపక ఆదర్శాలకు పూర్తిగా విరుద్ధమైనదని తప్పక తోస్తుంది. తమిళ అస్తిత్వాన్ని ఎలుగెత్తి చాటిన ఒక మహోద్యమం నుంచి ప్రభవించిన పార్టీ డిఎంకె. హిందీ భాషా రాష్ట్రాల రాజకీయ, సాంస్కృతిక పెత్తనాన్ని విజయవంతంగా ఢీకొన్న ఉద్యమ పార్టీ అది. తమిళ సంస్కృతీ వైభవానికి ప్రత్యేక గౌరవ మన్ననలు, తమిళ ప్రజల ఆత్మగౌరవ పరిరక్షణ అనేవి ఆ మహోద్యమ ప్రాథమిక లక్ష్యాలు. కులం, జెండర్‌పై ఉత్తరాది నేతల ప్రాబల్యంలో ఉన్న కాంగ్రెస్ కంటే భిన్న, ప్రగతిశీల దృక్పథం డిఎంకె పురోగతికి ఇతోధికంగా తోడ్పడ్డాయి. 1967లో అధికారంలోకి వచ్చిన డిఎంకె, అప్పటి వరకు ఉన్న రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల కంటే మరింత సంక్షేమ ఆధారిత పాలనను అందించింది.

సాంస్కృతిక స్వాభిమానానికి ప్రతీకగా, సాంఘిక సంస్కరణల అగ్రగామిగా తమిళ ప్రజల గౌరవాదరాలను డిఎంకె సముపార్జించుకుంది. కుటుంబ వ్యాపార సంస్థ అయ్యే ఆలోచన దానికి ఏ కోశానా లేదు. సంస్థాపకుడు సిఎన్ అన్నాదురై అకాల మరణానికి గురి కాకుండా ఉన్నట్టయితే డిఎంకె అటువంటి ఒక ఆదర్శప్రాయ ప్రజాస్వామిక పార్టీగా వెలుగొందుతుండేదేమో?! ఆ ద్రావిడ పార్టీని ఒక కుటుంబ సంస్థగా మార్చివేసిన ‘ఘనత’ అన్నాదురై తరువాత ముఖ్యమంత్రి అయిన ముత్తువేల్ కరుణానిధిదే. కుమారుడు స్టాలిన్‌ను తన రాజకీయ వారసుడుగా ఆయన తీర్చిదిద్దారు. పార్టీ సంస్థాపకులు ఊహించని రీతిలో కరుణానిధి ఆ పార్టీని కొత్త మార్గంలో ముందుకు తీసుకు వెళ్లారు.

వంశపారంపర్య పాలనను ప్రోత్సహించిన ప్రధాన ప్రాంతీయ పార్టీ డిఎంకె ఒక్కటే కాదు. పంజాబ్‌లో అకాలీదళ్ కూడా అదే పని చేసింది. ఈ పంజాబీ పార్టీకి డిఎంకె కంటే కూడా చాలా పూర్వ చరిత్ర ఉన్నది. సిక్కుల అస్తిత్వ సంరక్షణ అనే ప్రధాన లక్ష్యంతో అకాలీదళ్ ఆవిర్భవించింది. వ్యవస్థాపకుల ఆశయాలకు భిన్నంగా ప్రకాష్ సింగ్ బాదల్ నాయకత్వంలో అకాలీదళ్ ఒక కుటుంబ పార్టీగా మారిపోయింది. శివసేన, తెలంగాణ రాష్ట్ర సమితి కూడా అదే మార్గంలో సాగుతున్నాయి. కుమారుడిని మంత్రిని చేయడంలో స్టాలిన్ నిస్సందేహంగా ఉద్ధవ్ ఠాక్రే, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుల నుంచి ప్రేరణ పొంది ఉంటారు. ఇక ఉత్తరాది పార్టీలు ఎస్‌పి, ఆర్జేడి, ఆర్‌ఎల్‌డి మొదలైన వాటిని చూద్దాం. ‘సామాజిక న్యాయ’ సాధనకు నిబద్ధమైన పార్టీలివి. అయితే పార్టీ నాయకత్వం తండ్రి నుంచి కుమారుడికే దక్కడంతో ఇవి తమ తొలినాటి లక్ష్య స్ఫూర్తిని కోల్పోయాయి.

మహోన్నత చరిత్ర గల భారత జాతీయ కాంగ్రెస్ ఇందిరాగాంధీ నాయకత్వంలో ఒక కుటుంబ పార్టీగా మారిపోకుండా ఉన్నట్టయితే పైన ప్రస్తావించిన పార్టీలు కుటుంబ వారసత్వ రాజకీయాలలో ఘనాపాటీలుగా పరిణమించేవి కావేమో? నేటి కాంగ్రెస్‌కు, స్వాతంత్ర్యోద్యమానికి సారథ్యం వహించిన నాటి కాంగ్రెస్‌కు సాదృశ్యం ఏమైనా ఉంటే పేరులో మాత్రమే సుమా! మిగతా అన్ని విషయాలలోనూ చాలా చాలా వ్యత్యాసమున్నది. ఆ తేడాలు పూడ్చలేని అగాధాలే. నాటి కాంగ్రెస్ మహోన్నత నాయకుడి కటుంబ చరిత్రను చూస్తే ఆ వాస్తవం విశదమవుతుంది. మహాత్మా గాంధీకి నలుగురు కుమారులు. స్వాతంత్ర్య పోరాటంలో నలుగురూ జైలుకు వెళ్లారు. అయితే ఏ ఒక్కరూ స్వతంత్ర భారతదేశంలో మంత్రులు కాదుకదా పార్లమెంటు సభ్యులు కూడా కాలేదు. కావాలని ఆరాటపడలేదు. రాజకీయాలలోకి రావాలని గాంధీ ఆఖరి కుమారుడు దేవదాస్ గాంధీని జవహర్ లాల్ నెహ్రూ ఆహ్వానించారు. దేవదాస్ తిరస్కరించారు. ‘హిందుస్థాన్ టైమ్స్’ ఎడిటర్ గానే ఉండిపోయారు. 1949లో సోవియట్ యూనియన్‌కు భారత రాయబారిగా దేవదాస్‌ను పంపాలని నెహ్రూ ప్రతిపాదించారు. దేవదాస్ ఆసక్తి చూపలేదు. ఆ మరుసటి సంవత్సరం కేంద్ర కేబినెట్ లోకి దేవదాస్‌ను తీసుకునేందుకు నెహ్రూ సంసిద్ధమయ్యారు. అది ఒక అనారోగ్యకరమైన సంప్రదాయాన్ని నెలకొల్పుతుందని మహాత్మా గాంధీ కుమారుడు భావించారు.

స్వీయ ప్రాభవానికి కాకుండా జాతి హితానికి ప్రాధాన్యమిచ్చే ఆలోచన, నియమ నిష్ఠ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏ కోశానా లేవు. ఆ మాటకొస్తే కాంగ్రెస్‌లో మాత్రమే కాదు, వర్తమాన భారత రాజకీయాలలోనే అవి పూర్తిగా లుప్తమయ్యాయి. ఇందిరాగాంధీ తన రాజకీయ వారసులుగా కుమారులు సంజయ్, రాజీవ్‌ను ప్రోత్సహించినందునే డిఎంకె, అకాలీదళ్ అధినేతలు తమ తనయులకూ అధికార ప్రాభవం కల్పించారు. సరే, ఈ తరం విషయానికి వస్తే, కాంగ్రెస్‌కు నాయకత్వం వహించగల యోగ్యత కుమారుడు రాహుల్ గాంధీకి మినహా మరెవ్వరికీ లేదని సోనియా గాంధీ విశ్వసిస్తున్నారు. దేశ రాజకీయాలలో వంశపారంపర్యత మరింతగా వర్ధిల్లేందుకు సోనియా వైఖరి దోహదం చేస్తోంది.

మన దేశంలో చాలా వృత్తులలో కుటుంబాల ప్రాబల్యం వర్ధిల్లుతున్న మాట నిజమే. తండ్రి వృత్తిలోకి ప్రవేశించిన కుమారుడికి తొలుత కొన్ని సానుకూలతలు ఉంటాయనడంలో సందేహం లేదు. అయితే అంతిమంగా అతడు తన సొంతంగా ఏమి సాధించాడన్నదే లెక్కలోకి వస్తుంది. రోహన్ గవాస్కర్ తన తండ్రి సునీల్ గవాస్కర్ కారణంగానే క్రికెటర్ అయ్యాడు. తండ్రిలా విజేత కాలేక పోయాడు.

రాజకీయాలలో వంశీయ క్రమమనేది చాలా హానికరమైనది. ఎందుకంటే అది ప్రజాస్వామిక సూత్రాన్ని ఉల్లంఘిస్తుంది. అసంఖ్యాక ప్రజలపై ప్రతికూల ప్రభావాన్ని నెరపుతుంది. మరింత ముఖ్యమైన విషయమేమిటంటే రాజకీయేతర రంగాలలో ఎంతో కొంత జవాబుదారీతనముంటుంది. ఒక న్యాయవాది తన తండ్రి కంటే తక్కువ సమర్థుడు అయితే అతని సేవలు కోరే కక్షిదారుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. తండ్రిలా వృత్తి నిపుణుడు కాలేని వైద్యుడి వద్దకు వచ్చే రోగుల సంఖ్య పెద్దగా ఉండదు. రాజకీయాలలో ఇటువంటి జవాబుదారీతనం చాలా అరుదు.

రాజకీయ పార్టీలు కుటుంబ ఆధిపత్య సంస్థలుగా మారిపోవడం మన ప్రజాస్వామ్య పతనాన్ని ప్రతిబింబిస్తున్నది. ఒక నాయకుడిపైనే పూర్తిగా ఆధారపడడం కూడా మన ప్రజాస్వామ్య దౌర్భాగ్యానికి హేతువు. భారతీయ జనతా పార్టీయే ఇందుకు మొదటి సాక్ష్యం. ఉదాహరణకు నరేంద్ర మోదీ ఉత్థానానికి పూర్వం బీజేపీలో వ్యక్తి పూజ, కనీసం ప్రస్తుతమున్న రీతిలో లేదు. నిజానికి ఆ పార్టీ అప్పట్లో ‘వ్యక్తి పూజ’ను తీవ్రంగా వ్యతిరేకించేది. తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యమున్నదని, వ్యక్తి ఆరాధనకు తావు లేదని, సమష్టి నాయకత్వమే తమ విశిష్టత అని బీజేపీ సగర్వంగా చెప్పుకునేది. తమది పూర్తిగా భిన్నమైన పార్టీ అని పదే పదే ప్రకటించుకునేది. మోదీలా, వాజపేయి తన కేబినెట్‌పై పెత్తనం చేసేవారు కాదు. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిరంగంగా మోదీని విపరీతంగా కొనియాడుతున్నారు. వాజపేయి హయాంలో ఏ బీజేపీ ముఖ్యమంత్రీ అలా ప్రధానమంత్రి ముఖస్తుతికి పాల్పడేవాడు కాదు.

మన పార్టీ వ్యవస్థ సంపూర్ణంగా భ్రష్టుపట్టి పోయింది. అనేక పార్టీలు కుటుంబ వ్యాపార సంస్థలుగా మారిపోగా మరి కొన్ని పార్టీలు మత నిష్ఠతో తమ అధినేతను నడయాడే దైవంగా ఆరాధించే గుడ్డి భక్త సమూహాలుగా పరిణమించాయి. మన రాజకీయాలలో ఇదొక నిరుత్సాహకరమైన ధోరణి. దీని పర్యవసానాలను నిశితంగా పరీక్షించవలసి ఉంది. ఆధునిక సమాజంలో రాజకీయ పార్టీ అనేది నిస్సందేహంగా ఒక కీలక సంస్థ. అది ఆరోగ్యవంతంగా పని చేయడంపైనే ప్రజాస్వామ్యం ప్రధానంగా ఆధారపడి ఉంది. మితిమీరిన వినయ విధేయతల, అణకువతో కూడిన వీరారాధన సంస్కృతిలో మునిగి తేలుతున్న పార్టీలు ఒక కుటుంబాన్ని నెత్తికెక్కించుకోవడం అనేది విస్తృత రాజకీయ సంస్కృతిపై ఎటువంటి ప్రభావాన్ని నెరపుతుంది? పార్టీ సహచరుల నుంచి ఎనలేని పొగడ్తలను మాత్రమే కోరుకుంటున్న నాయకుడు పత్రికా స్వాతంత్ర్యం సంపూర్ణంగా వర్ధిల్లేందుకు తోడ్పడుతాడా? పార్టీ సభ్యుల నుంచి ఎటువంటి మినహాయింపులు లేని విధేయతను ఆశించే నేత అధికారానికి వస్తే జరిగేదేమిటి? తన అసంబద్ధ నిర్ణయాలు, అనుచిత చర్యలకు సైతం బ్యూరాక్రసీ, పోలీస్, మీడియా, న్యాయవ్యవస్థ మద్దతును తప్పక డిమాండ్ చేస్తాడు.

రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - 2023-01-14T00:47:14+05:30 IST