కార్టూన్‌ కళలో ఒకే ఒక్కడు...!

ABN , First Publish Date - 2023-02-11T02:30:05+05:30 IST

జీవిత చరిత్రలు ఆసక్తిదాయకంగా ఉంటాయి. ఒక రంగంలో మహత్తర కృషి చేసిన ఒక ఉదాత్తుని గురించి అదే రంగంలోని మరో ప్రముఖుడు రాసిన పుస్తకాలు మరింత ఆసక్తికరమైనవి.

కార్టూన్‌ కళలో ఒకే ఒక్కడు...!

జీవిత చరిత్రలు ఆసక్తిదాయకంగా ఉంటాయి. ఒక రంగంలో మహత్తర కృషి చేసిన ఒక ఉదాత్తుని గురించి అదే రంగంలోని మరో ప్రముఖుడు రాసిన పుస్తకాలు మరింత ఆసక్తికరమైనవి. (నేను చదివిన) రాయ్ హరోడ్ రాసిన జాన్ మేనార్డ్ కీన్స్ జీవిత చరిత్ర; యాష్లే మల్లెట్ విరచిత క్లెర్రీ గ్రిమ్మెట్ జీవిత కథ, రిచర్డ్ ఈవాన్స్ లిఖించిన ఎరిక్ హాబ్స్ బామ్ చరిత్ర, వి.ఎస్ నైపాల్‌తో పాల్ థెరూ స్వానుభవాల వృత్తాంతం అందుకు మంచి ఉదాహరణలు. ఇతివృత్తం, కథన పద్ధతి, సాహిత్య గుణశీలతలో ఇవి చాలా విభిన్నమైనవి. అయితే వాటి మధ్య మూడు ఉమ్మడి లక్షణాలు ఉన్నాయి. అవి: జీవిత చరిత్రకారుడు తన కథానాయకుడు కంటే చిన్నవాడు అయి ఉండడం; అతనితో వ్యక్తిగత పరిచయం కలిగి ఉండడం; రచయిత తన రంగంలో ప్రజ్ఞావంతుడయినప్పటికీ, తాను రాస్తున్న వ్యక్తి కంటే తక్కువ ప్రముఖుడై ఉండడం. ప్రస్తావిత నాలుగు పుస్తకాలూ అసాధారణ ప్రతిభావంతుల గురించి రాసినవే కాకుండా వాటి రచయితల రచనా సామర్థ్యానికి నిదర్శనాలు. ఈ కోవకు చెందినదే ప్రముఖ కార్టూనిస్ట్ ఇ.పి. ఉన్నీ రాసిన

ఆర్‌కె లక్ష్మణ్ జీవిత చరిత్ర. 1954లో జన్మించిన ఉన్నీ, లక్ష్మణ్ కంటే 30 సంవత్సరాలు చిన్నవాడు. ఇరువురూ ఎప్పుడైనా కలుసుకున్నారో లేదో నాకు తెలియదుగానీ ఉత్తమ జీవిత చరిత్ర అని ఉన్నీ పుస్తకం గురించి నిస్సందేహంగా చెప్పవచ్చు. వ్యంగ చిత్ర కళా రంగంలోని సర్వోత్కృష్ట ప్రతిభావంతుడికి అదే రంగంలోని ఒక ప్రతిభావంతుడు అర్పించిన నివాళి అది.

రాశిపురం కృష్ణస్వామి అయ్యర్‌ లక్ష్మణ్ మైసూరు నగరంలో పుట్టి పెరిగారు. ఉపాధ్యాయుడు అయిన తండ్రి రూపచిత్రణ ఆయన గీసిన తొలి రేఖా చిత్రం. చిన్నారి లక్ష్మణ్ ఆ నక్షాను తమ ఇంటిలోని నేలపై చిత్రించారు. బొంబాయిలోని జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో చిత్రకళాభ్యాసం చేయాలని యువ లక్ష్మణ్ ఆకాంక్షించారు. అయితే ఆ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో ఆయనకు ప్రవేశం లభించలేదు! దీంతో మైసూర్‌లోనే తన పట్టభద్ర విద్యను ముగించారు. తీరిక సమయాల్లో నగర దృశ్యాలను ఎంతో మక్కువతో చిత్రిస్తుండేవారు. తండ్రి, అన్నలు తీసుకువచ్చే వార్తాపత్రికలు, మ్యాగజైన్లలోని బొమ్మలను శ్రద్ధగా చూసి, ఆకళింపు చేసుకునేవాడు. న్యూజిలాండ్‌కు చెందిన ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు డేవిడ్‌లో కార్టూన్లను లక్ష్మణ్ విశేషంగా అభిమానించేవారు. సమకాలీన రాజకీయాలపై డేవిడ్‌లో కార్టూన్లు చాలా కటువుగా ఉండేవి. లండన్‌లోని ‘ఈవెనింగ్ స్టాండర్డ్’లో ప్రచురితమైన ఆ వ్యంగ్య చిత్రాలను మద్రాసు నుంచి ప్రచురితమయ్యే ‘ది హిందూ’ పునర్ముద్రిస్తుండేది.

దశాబ్దాల అనంతరం తాము నిర్వహించే ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయాలని లక్ష్మణ్‌ను బొంబాయిలోని జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఆహ్వానించింది. తానే గనుక అక్కడ చదువుకుని ఉంటే, ఆ విద్యా సంస్థ విద్యార్థులు చాలా మంది వలే తానూ కేవలం ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో మంచి జీతభత్యాలు లభించే డైరెక్టర్‌ని మాత్రమే అయివుండేవాడినని ఆ ఆహ్వానం సందర్భంగా లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. లక్ష్మణ్‌కు ప్రవేశాన్ని నిరాకరించడం ద్వారా జెజె స్కూల్ భారతీయ కార్టూనింగ్ కళకు ఎనలేని మేలు చేసిందని చెప్పితీరాలి. చిత్రకళా అభ్యాసానికి లక్ష్మణ్ అయోగ్యుడని నిర్ణయించిన ఆ విద్యా సంస్థకు మనం కృతజ్ఞతలు చెప్పవలసి ఉన్నది.

1947లో మనకు స్వాతంత్ర్యం సిద్ధించనున్న తరుణంలో బొంబాయిలోని ‘ఫ్రీ ప్రెస్ జర్నల్’లో లక్ష్మణ్ కార్టూనిస్ట్‌గా చేరారు. ఇదే ఆయన తొలి ఉద్యోగం. అయితే స్వల్ప కాలంలోనే ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రికకు మారారు. ‘టైమ్స్’లోనే ఆయన వృత్తి జీవితం సంపూర్ణంగా సాగింది. లక్ష్మణ్ టెక్నిక్ గురించి ఉన్ని ఇలా అభివర్ణించారు.: ‘లక్ష్మణ్ తన కుంచెను చాలా నేర్పుగా కదిలించేవారు. ముద్రణకు సిద్ధం చేసినప్పుడు ఆ బొమ్మపై ఎక్కడా ఎటువంటి మరకలు ఉండేవి కావు’.

ఉన్ని రాసిన లక్ష్మణ్ జీవిత చరిత్రలో లక్ష్మణ్‌తో పాటు మరో ముఖ్యమైన పాత్ర ‘ది కామన్ మ్యాన్’. ఈ ‘సామాన్య మానవుడు’ ద్వారా భారతదేశంలో నిత్య జీవిత వైరుధ్యాలు, సంక్లిష్ట పరిస్థితులను లక్ష్మణ్ చాలా ప్రతిభావంతంగా కళ్లకు గట్టించేవారు. ఆర్‌కె లక్ష్మణ్, కె. శంకర్ పిళ్ళై (లక్ష్మణ్ ముందుతరానికి చెందిన ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు. సుప్రసిద్ధ ‘శంకర్స్ వీక్లీ’ పత్రిక సంస్థాపకుడు, సంపాదకుడు) మధ్య ఒక అసక్తిదాయకమైన పోలికను ఉన్ని పేర్కొన్నారు. శంకర్, లక్ష్మణ్ లిరువురూ ప్రగతిశీల దేశీయ రాజ్యాలలో పుట్టి పెరిగినవారే. ఇరువురూ అగ్రకుల హిందువులు. మంచి పాఠశాలల్లో చదువుకున్నవారు. ఇరువురికీ తొలినాటి నుంచీ మంచి గ్రంథాలయాలు అందుబాటులో ఉన్నాయి. ఈ అసాధారణ ప్రతిభావంతులు రెండు విభిన్న కార్టూనింగ్ సంప్రదాయాలను ప్రభావితం చేశారని ఉన్ని వాదించారు. ‘లక్ష్మణ్ మృదు హాస్యశీలత వెర్సెస్ శంకర్ ఉద్రేకపూరిత శైలి’ అని ఉన్ని ఆ తారతమ్యాన్ని అభివర్ణించారు. అయితే లక్ష్మణ్ వ్యంగ్య చిత్రాల వ్యాసంగం సైతం చాలా చోట్ల తీవ్ర రాజకీయ వాడితో కూడుకుని ఉన్నదని ఉన్ని కథనమే పేర్కొంది. శంకర్ తన సైద్ధాంతిక విశ్వాసాలను దాపరికం లేకుండా వ్యక్తం చేయగా లక్ష్మణ్ పక్షపాత రహితంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే ఎప్పుడూ ఒక రాజకీయేతర వ్యక్తిగా ఆయన వ్యవహరించలేదు. ఇదే ఆ మహా ప్రతిభావంతుల మధ్య ఉన్న నిజమైన విశిష్టత. శంకర్ వలస పాలకులను తీవ్రంగా వ్యతిరేకించిన జాతీయవాది. స్వాతంత్ర్యోద్యమ ఆశయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని అభిలషించారు. ఇరువురూ అవకాశం లభించినప్పుడల్లా రాజకీయ నాయకులపై తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించేవారు. ఏ భావజాలానికీ, రాజకీయ పక్షానికి చెందిన నాయకులనూ తమ విమర్శలు, నిష్కర్షల నుంచి మినహాయించేవారు కాదు.

భారతీయ కార్టూనింగ్ కళలో, బహుశా, శంకర్ సంప్రదాయం అనేది ఒకటి ఉన్నదని చెప్పవచ్చు. మరి లక్ష్మణ్‌కు శిష్యులు, అనుయాయులు ఎవరూ లేరు. ఆయన తనదైన ఒక నిర్దిష్ట సంప్రదాయాన్ని సృష్టించలేదు. లక్ష్మణ్ తనకు తానే సాటి. ఆయన విశిష్టత విలక్షణమైనది. లక్ష్మణ్ సమకాలిక కార్టూనిస్టులు ఎవరూ ఆయన వలే వ్యంగ్య చిత్రాలను గీయలేదు. ఉల్లాసకరమైన ఏక పంక్తి హాస్తోక్తులను సృష్టించగల సామర్థ్యం వారెవరికీ లేదు. ఆయనదొక స్ఫుటమైన శైలి. హాస్యం, అసంబద్ధత గురించిన ఆయన వైఖరి మరెవ్వరికీ లేదు. వర్ణించలేని, విశ్లేషించలేని ఎన్నో ప్రత్యేకతలు లక్ష్మణ్ ప్రతిభాపాటవాలకు ఉన్నాయి. ఒకటి మాత్రం స్పష్టం: ఆయన కళను పునః సృష్టించలేము, అనుకరించలేము. క్రికెట్ జగత్తులో గ్యార్ ఫీల్డ్ సోబర్స్ వలే కార్టూనింగ్ కళలో ఆర్‌కె లక్ష్మణ్ ఒకే ఒక్కడు. అలాంటి వారు మరొకరు ఉండరు, ఉండబోరు.

లక్ష్మణ్ తన జీవిత కాలంలో ఒక డజన్ మంది భారత ప్రధానమంత్రులను చూశారు. సందర్భం వచ్చిన ప్రతీసారి ఆయన తన కళ ద్వారా వారిని వేళాకోళం చేశారు, పరిహసించారు. ఆయన వేసిన అసంఖ్యాక కార్టూన్లు అన్నీ మన్నికైనవి. తరతరాలకూ అవి హాస్య సంజీవనులు. అయితే, ఇందిరాగాంధీ నిర్ణయాలు, చర్యలను మాటల్లోనో లేదా బొమ్మల్లోనో విమర్శించినప్పుడే, ఆక్షేపించినప్పుడే బహుశా, ఆయన నిశిత మేధ, కార్టూన్ కళా ప్రతిభాపాటవాలు పరమోత్కృష్టంగా వ్యక్తమయ్యాయన్న ఉన్ని సూచనతో మనం తప్పక ఏకీభవిస్తాం. ఇందిరపై ఆయన కార్టూన్లను వ్యాఖ్యానంతో సంకలనం చేస్తే, అదొక ఉత్తమ రాజకీయ జీవిత చరిత్ర అవుతుంది. అంతేకాదు, మరెవరూ దాని కంటే ప్రశస్తమైన ఇందిర జీవిత కథను రాయలేరని కూడా చెప్పవచ్చు. ఇందిర విలక్షణతలను అంత వ్యంగ్య వైభవంతో మరెవరూ చూపలేదు. విప్పారిన కళ్లతో ఆశ్చర్యంగా చూస్తున్న కొత్త పరిపాలకురాలు, ఆర్థిక మందుపాతరలపై నియమ విరుద్ధ నృత్యకారిణి, పార్టీలోని వృద్ధ నాయకులపై రాళ్లు విసరుతున్న వీథి రాజకీయవేత్త, న్యాయదేవత ప్రతిమపై కత్తి జళిపిస్తున్న మూర్తి, ఎన్నికలలో పరాజయం అనంతరం కుమారుడు సంజయ్‌ను చిన్న పిల్లలను కూర్చోబెట్టే బండిలో నగర శివారులకు తీసుకు వెళ్లడం మొదలైన దృశ్యాలను చూపిన లక్ష్మణ్ వ్యంగ్య చిత్రాలు అత్యంత ప్రతిభావంతమైనవి’.

లక్ష్మణ్ కర్మభూమి ముంబై. ఆ మహానగరంతో లక్ష్మణ్ అనుబంధం గురించి ఉన్ని ఇలా వ్యాఖ్యానించారు: ‘నగరాలతో వృద్ధి చెందిన చరిత్ర వ్యంగ్య చిత్రాలకు ఉన్నది. తన వైవిధ్య భరిత జీవిత గమనంపై నిశిత దృక్కులు సారించగల వ్యంగ్య చిత్రకారుని కోసం ముంబై వేచివున్న తరుణంలో లక్ష్మణ్ రంగప్రవేశం చేశారు. నిత్య జీవిత సమస్యలతో పోరాడుతున్న సామాన్య మానవులను పరిపరి విధాల తన కార్టూన్లలో చూపారు. సమాజంలోని అస్తవ్యస్తత అందరినీ బాధిస్తోందని, ఆ బాధాకర అనుభవాలు ఉమ్మడివేగానీ వ్యక్తిగతమైనవి కావని లక్ష్మణ్ స్పష్టం చేశారు. నగర జీవితంలోని ఆ అస్తవ్యస్తతకు కారకులు సుదూరాన ఉన్న న్యూఢిల్లీ పాలకులేనని కూడా ఆయన తేటతెల్లంగా చెప్పారు. లక్ష్మణ్ పాఠకులు ఆయన సృష్టి అయిన ‘‘కామన్ మ్యాన్‌’’లో తమను తాము చూసుకున్నారు. జనసమ్మర్థంతో నిండిపోయిన, ఇబ్బంది కలిగించే భారతీయ నగరంలో ఎల్లప్పుడు సుఖప్రదంగా లేని జీవితాన్ని గడుపుతున్న సగటు మనుషులు వారు’.

సముద్ర తీర ప్రాంతాలు, కార్టూనిస్టుల మధ్య ఉన్న బాంధవ్యం గురించి ఆలోచించేలా ఉన్ని పుస్తకం నన్ను ప్రేరేపించింది. ఆధునిక భారతదేశంలోని ప్రభావశీల కార్టూనిస్టులలో అత్యధికులు కేరళ రాష్ట్రం నుంచి ప్రభవించినవారే కావడం ఒక విస్మరించలేని విశేషం. శంకర్, అబూ అబ్రహమ్, ఓవీ విజయన్, మంజులా పద్మనాభన్‌లతో పాటు ఉన్ని కూడా కేరళీయులే. మేరియో మిరండా గోవాకు చెందినవారు, యువ కార్టూనిస్టు సతీశ్ ఆచార్య కర్ణాటక కోస్తా ప్రాంతానికి చెందినవారు. లక్ష్మణ్ సొంత ఊరు మైసూరు. సముద్రతీరానికి చాలా దూరంగా ఉన్న నగరమది. అదృష్టవశాత్తు ఆయన బొంబాయికి వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. లక్ష్మణ్ వృత్తి జీవితం కొన్ని విధాలుగా ఆయన తొలినాటి హీరో డేవిడ్‌లో వృత్తి జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. న్యూజిలాండ్‌కు చెందిన డేవిడ్‌లో, ప్రపంచంలోనే అత్యంత ఆసక్తికరమైన నగరం లండన్‌కు వలస వెళ్లాడు. ఒక కివీ లండన్‌కు వలస వెళ్లగా ఒక మైసూరియన్ బొంబాయిలో జీవితాన్ని సార్థకం చేసుకున్నారు.

రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - 2023-02-11T02:30:06+05:30 IST