Share News

మణిపూర్ పాపాల భైరవులు

ABN , First Publish Date - 2023-11-04T02:14:24+05:30 IST

గత పక్షం రోజులుగా వార్తా జగత్తులో రెండు అంశాలకు ఎనలేని ప్రాధాన్యం లభిస్తోంది.

మణిపూర్ పాపాల భైరవులు

గత పక్షం రోజులుగా వార్తా జగత్తులో రెండు అంశాలకు ఎనలేని ప్రాధాన్యం లభిస్తోంది. ఒకటి ప్రపంచ కప్ క్రికెట్; రెండు హమాస్ భీకర దాడికి ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయిల్ పాల్పడుతున్న అమానుషాలు. మొదటిదానికి ఆనందపడుతూ రెండో దానికి బాధపడుతూ కొనసాగుతున్న విషాదం నొకదాన్ని మనం మరచిపోయాము. మణిపూర్‌లో ఆరు నెలల క్రితం ప్రారంభమైన జాతుల ఘర్షణ గురించి నేను ప్రస్తావిస్తున్నాను. అక్కడ జాతుల సంక్షోభం ప్రజ్వరిల్లిన కొద్ది వారాల అనంతరం ఇదే కాలమ్‌లో నేను దాని గురించి రాశాను. ఆ ఈశాన్య భారత రాష్ట్రంలో పరిస్థితి తీవ్రతను మనం గుర్తించాలని నేను వ్యాఖ్యానించాను. నా వ్యాఖ్యపై ఒక పరిశీలకుడు ఇలా ప్రతిస్పందించాడు: ‘బీజేపీతో సమస్యేమిటంటే మణిపూర్‌ను ఒక జాతీయ సంక్షోభంగా అది పరిగణించడం లేదు; ఫ్రాన్స్‌లో నిరసనలను ఒక జాతీయ సంక్షోభంగా వారు విశ్వసిస్తున్నారు; పాకిస్థానీ మహిళ ఒకరు ఒక భారతీయుడిని వివాహం చేసుకోవడాన్ని ఒక జాతీయ సంక్షోభంగా భావిస్తున్నారు; బీజేపీ నాయకులు ఎవరూ సందర్శించని ఒక కుగ్రామంలో ముస్లిం యువకుడు ఒకరు ఒక హిందూ యువతిని పెళ్లి చేసుకోవడాన్ని జాతీయ సంక్షోభంగా కలవరపడుతున్నారు; ఒప్పెన్ హైమర్ సినిమా ఒక జాతీయ ఉపద్రవమని ఆందోళన చెందుతున్నారు’.

ఇప్పుడు ఏడవ నెలలోకి ప్రవేశించిన మణిపూర్ సంక్షోభంపై మన దృష్టిని మళ్లీ కేంద్రీకరించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఒక చరిత్రకారుడుగా నేను తొలుత మణిపూర్‌పై శ్రద్ధచూపాను. 1949లో ఆ రాష్ట్రం భారత్‌లో ఎలా విలీనమయిందీ, ఆ తరువాత దాని పురోగతి గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. కొన్ని సంవత్సరాల క్రితం మణిపూర్‌ను స్వయంగా సందర్శించిన అనంతరం ఆ రాష్ట్రంపై నా శ్రద్ధాసక్తులు మరింత మిక్కుటమయ్యాయి. మణిపూర్ ప్రాకృతిక శోభలు, మణిపురీల సంగీత, నాట్య సంప్రదాయాలు, మణిపురి మహిళల స్వతంత్ర వ్యక్తిత్వాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. అదే సమయంలో ఆ రాష్ట్రంలోని మూడు ప్రధాన జాతులు అయిన మైటీలు, నాగాలు, కుకీల మధ్య పరస్పర సంబంధాలలోని వాస్తవాలు కూడా నా దృష్టికి వచ్చాయి. ఒక చరిత్రకారుడుగా, ఒక పర్యాటకుడుగా మైటీలు, కుకీల మధ్య ఉద్రిక్తతలు నాకు స్పష్టంగా కనిపించాయి. అయితే ఇప్పుడు ఆ ఉభయ తెగల మధ్య ఎడతెగకుండా సాగుతున్న ఘర్షణల స్థాయి, తీవ్రత మున్నెన్నడూ లేనివి. ఈ కలహాలు అనూహ్యమైనవి కూడా.

ఈ ఏడాది మే మాసానికి పూర్వం కుకీలు, మైటీల మధ్య సంపూర్ణ సామరస్య సంబంధాలు ఉన్నాయని, ఇరు వర్గాలు శాంతియుత సహజీనం చేస్తున్నాయని చెప్పగలిగే పరిస్థితులు కచ్చితంగా లేవు. కుకీలు మతపరంగా క్రైస్తవులు కాగా మైటీలలో అత్యధికులు హిందువులు. కుకీలు ఎక్కువగా కొండ ప్రాంతాలలో నివశిస్తుండగా ఇంఫాల్ లోయలో మైటీలే అత్యధికంగా ఉన్నారు. మైటీ రాజకీయవేత్తలు తమ పట్ల పోషకుల వైఖరితో వ్యవహరించడాన్ని కుకీలు తీవ్రంగా వ్యతిరేకించారు. కుకీలకు ఎస్‌టీలుగా గుర్తింపు ఉన్నందువల్ల ప్రభుత్వోద్యోగాలలో అత్యధిక శాతాన్ని వారు కైవసం చేసుకుంటున్నారనే ఫిర్యాదును మైటీలు ఎప్పటినుంచో చేస్తున్నారు. జాతుల మధ్య, మతాల మధ్య ఘర్షణలు మనకు కొత్త ఏమీ కాదు. నిజానికి అవి మన స్వతంత్ర భారతదేశ చరిత్రలో నిత్య పరిణామాలుగా ఉంటున్నాయి. అయినప్పటికీ ప్రస్తుతం కొనసాగుతున్న మైటీ–కుకీల ఘర్షణలు ఇంతకు ముందెన్నడూ మనం కన్నవీ విన్నవీ కావు అనడంలో సందేహం లేదు. ఇరువర్గాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగతెంపులయిపోయాయి. ఈ ఘర్షణల్లో కుకీలు కొంతమేరకు తీవ్ర ప్రతికూల పరిస్థితుల నెదుర్కొంటున్నారని స్వతంత్ర పరిశీలకులు గట్టిగా అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర అధికార పగ్గాలు చాలవరకు మైటీల చేతుల్లో ఉండడమే ఈ పరిస్థితికి కారణమని మరి చెప్పనవసరం లేదు.

మే 2023కు పూర్వం మైటీలు, కుకీల మధ్య కొంత అపనమ్మకం ఉండేది; దరిమిలా ఇరు వర్గాల మధ్య సంబంధాలు పూర్తిగా విషమించాయి. ఒకప్పుడు మైటీలు, కుకీల మధ్య పరస్పర సుహృద్భావం వర్ధిల్లేది. ఆ మంచి రోజుల్లో కుకీలు ఇంఫాల్ లోయలో నివశిస్తూ తమ బతుకులను శోభితం చేసుకునేవారు; మైటీలు పర్వత ప్రాంతాలలో పరిశ్రమిస్తుండేవారు. ఇప్పుడు ఉభయ తెగలు ఎడముఖం పెడ ముఖం అయిపోయాయి. కుకీలు లోయ ప్రాంతాల నుంచి వెళ్లిపోతున్నారు; మైటీలు కొండల నుంచి వెనక్కి వచ్చేస్తున్నారు. మణిపురి బతుకులు ఛిద్రమైపోయాయి. ఈ విషాదానికి (చాలా తక్కువ మాట!) ప్రధాన బాధ్యత ముగ్గురు వ్యక్తులది. మొదటి వ్యక్తి మణిపూర్ ముఖ్యమంత్రి. సమ దృక్పథంతో పాలించవలసిన ఈ పెద్ద మనిషి మైటీల పక్షపాతి. తన సొంత వర్గం పట్ల ఆయనకు వల్లమాలిన అభిమానం. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ నాయకత్వంలోని మణిపూర్ ప్రభుత్వ భావజాల పాక్షికత్వానికి సరిసమానమైనది ఆ సర్కార్ పాలనా అసమర్థత.

మణిపూర్‌లో కొనసాగుతోన్న బీభత్సానికి రెండో బాధ్యుడు కేంద్ర హోం మంత్రి. హింసాకాండ ఉధృతమైన వేళ ఈ అమాత్య మహాశయుడు మణిపూర్‌కు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. అరాచకాలను అరికట్టేందుకు ఆయన చేసిన దేమిటి? స్వల్పం, చాలా చాలా స్వల్పం. తన సమయాన్ని, శక్తియుక్తులను పూర్తిగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల ఓటర్ల మధ్య చీలికలు సృష్టించి, విపక్షాలను చిత్తుచేయడంపైనే కేంద్రీకరించారు.

సరే, మూడో బాధ్యుడు ప్రధానమంత్రి. ఈ మహా పెద్ద మనిషి మణిపూర్‌ను ఇంతవరకు సందర్శించనే లేదు! సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఏం చేయకుండా ఉండాలో అది చేసేందుకు ముఖ్యమంత్రి, కేంద్ర హోం మంత్రికి పూర్తి స్వేచ్ఛనిస్తున్నారు. మణిపురీలు మన సహోదర భారతీయులు కాదూ? మరి, కనీవినీ ఎరుగని సంక్షోభంలో మైటీలు, కుకీలు కొట్టుమిట్టాడుతున్నవేళ వారి పట్ల ప్రధానమంత్రికి ఎందుకీ ఉదాసీనత భారత ప్రధానమంత్రికి ఇది తగునా? నరేంద్ర మోదీ తక్షణమే మణిపూర్ వెళ్లాలి. ఇంఫాల్ లోయను, కొండ ప్రాంతాలను సందర్శించాలి. ఆయన అలా చేస్తే ప్రధానమంత్రి తమ శ్రేయస్సు పట్ల శ్రద్ధ చూపుతున్నారనే భరోసా మణిపురీలకు కలుగుతుంది. ప్రధానమంత్రి చొరవ, మైటీల, కుకీల నాయకుల మధ్య చర్చలకు ఆస్కారం కల్పిస్తుంది. సంభావ్య సామాజిక సామరస్య సాధనకు అది మొదటి అడుగు అవుతుంది.

మైటీల ప్రయోజనాల పరిరక్షణకే ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఎందుకు ప్రాధాన్యమిస్తున్నారు? తన పదవిని కాపాడుకోవడమే, బహుశా, ఆయన లక్ష్యమై ఉంటుంది. అయితే అమిత్ షా, నరేంద్ర మోదీలు మణిపురీల శ్రేయస్సును ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? తమ నైతిక బాధ్యతను అనైతికంగా విస్మరించడమెందుకని? ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌కు ఉద్వాసన చెప్పడం–సంక్షోభ పరిష్కారానికి విధిగా చేపట్టవలసిన మొదటి చర్య–పై తాత్సారం చేయడం తమ రాజకీయ దౌర్బల్యాన్ని అంగీకరించడమే కాదూ? కుకీల ప్రయోజనాలను కాపాడడంపై శీత కన్ను వేయడం ద్వారా 2024 సార్వత్రక ఎన్నికలలో హిందూ ఓటును మరింత సంఘటితం చేసుకోవడానికేనా? లేక పాలనాపరమైన అసమర్థతా అది? మోదీ, షాలకు సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ ఆదర్శప్రాయుడు. ఆ ఉక్కుమనిషి అడుగుజాడల్లో తాము నడుస్తున్నామని ఇరువురు తరచు చెప్పుకుంటారు. అయితే సర్దార్ పటేల్ పాలనా దక్షత, ప్రజల పట్ల ఆయన సహానుభూతి నరేంద్ర మోదీ, అమిత్ షాలలో పూర్తిగా కొరవడలేదూ?

ఆరెస్సెస్ సర్ సంఘ్ చాలక్ తన వార్షిక విజయదశమి ప్రసంగంలో మణిపూర్ అంశాన్ని ప్రస్తావించారు. ‘సుదీర్ఘ కాలంగా కలసిమెలసి జీవిస్తున్న మైటీలు, కుకీలు ఇప్పుడు ఎందుకు పరస్పర అంతానికి కత్తులు దూసుకుంటున్నారు? ఈ ఘర్షణల నుంచి లబ్ధి పొందేది ఎవరు? మణిపూర్ చిచ్చుకు బాహ్య శక్తులే కారణమా? శక్తిమంతమైన ప్రభుత్వమున్నది. కేంద్ర హోం మంత్రి ఆ రాష్ట్రాన్ని సందర్శించారు. అయినప్పటికీ అక్కడ తరచు ఏదో ఒక విషాద ఘటన చోటుచేసుంటోంది. అగ్నిని రగిలించిందెవరు? ఆ అగ్నికి ఆజ్యం పోస్తున్నదెవరు?’

మోహన్ భాగవత్ ప్రసంగానికి ముందు, తరువాత కూడా మణిపూర్ సంక్షోభంలో విదేశీ శక్తుల ప్రమేయమున్నదన్న మాటను సామాజిక మాధ్యమాలలో హిందూత్వ శక్తులు బాగా ప్రచారం చేశాయి. కుకీలు క్రైస్తవులు అయినందున నిజమైన భారతీయులు కాదని, హిందూ మతస్థులు అయిన మైటీలే విశ్వసనీయమైన దేశభక్తులు అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇవి పూర్తిగా తప్పుడు వాదనలు. అంతేకాదు, హానికరమైనవి. ఇంఫాల్, న్యూఢిల్లీలోని తమ నాయకుల తప్పులను కప్పిపుచ్చేందుకే హిందూత్వవాదులు కుకీలను నానా నిందలతో అపఖ్యాతిపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

అనేక నెలలుగా మణిపూర్‌లో సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అది ఇప్పట్లో ఉపశమించే సూచనలు ఏ మాత్రం కన్పించడం లేదు. ఈ పరిస్థితి సూచిస్తున్నదేమిటి? ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ ఘోర వైఫల్యాన్నే కాదూ? తన సహచర ఆరెస్సెస్ ప్రచారక్‌లు నడుపుతున్న ప్రభుత్వం చాలా ‘శక్తిమంతమైనది’ అని మోహన్ భాగవత్ అభివర్ణించారు. నిజానికి అది పాలనా సమర్థత లేని, అపకార బుద్ధితో వ్యవహరించే ప్రభుత్వమని చెప్పడమే సరియైనదిగా ఉంటుంది. శాంతిభద్రతల బాధ్యతలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడాన్ని నిరోధించడంలో వైఫల్యం ప్రభుత్వ అసమర్థతను స్పష్టంగా చాటి చెప్పుతోంది. తదుపరి సార్వత్రక ఎన్నికలలో విజయావకాశాలను పెంపొందించుకునేందుకై ఒక సరిహద్దు రాష్ట్రంలో మెజారిటేరియన్ ఎజెండాను ప్రోత్సహించడం ప్రభుత్వ అపకార బుద్ధిని, కాపట్యాన్ని స్పష్టం చేస్తోంది.

రామచంద్ర

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - 2023-11-04T02:14:29+05:30 IST