ప్రగతిపొద్దు పొడిచింది ఇప్పుడేనా?

ABN , First Publish Date - 2023-06-17T01:01:08+05:30 IST

నేను అమితంగా గౌరవించే ఇద్దరు వృద్ధ భారతీయులు గత నెలలో కీర్తిశేషులు అయ్యారు. ఒకరు ముంబైలోను, మరొకరు బెంగళూరులోను మరణించారు.

ప్రగతిపొద్దు పొడిచింది ఇప్పుడేనా?

నేను అమితంగా గౌరవించే ఇద్దరు వృద్ధ భారతీయులు గత నెలలో కీర్తిశేషులు అయ్యారు. ఒకరు ముంబైలోను, మరొకరు బెంగళూరులోను మరణించారు. నూరేళ్ల సంపూర్ణ జీవితానికి చేరువవుతూ మరలి రాని సుదూర తీరాలకు సాగిపోయారు. వారిలో మొదటి వ్యక్తి ఉదయ్‌పూర్ సంస్థానంలోనూ, రెండవ వారు మద్రాస్ ప్రెసిడెన్సీలోని పట్టణాలలోను పెరిగారు. బ్రిటిష్ రాజ్ అంతిమ సంవత్సరాలలో ఆ ఇరువురూ యుక్త వయస్సుకు వచ్చారు. నవ యవ్వనంనుంచే శాస్త్ర, సాంకేతిక రంగాలలో విశేష శ్రద్ధాసక్తులు చూపారు. మొదట బ్రిటిష్ ఇండియాలోను పిదప యునైటెడ్ కింగ్‌డమ్ లోనూ ఇంజనీర్లుగా శిక్షణ పొందారు. పాశ్చాత్య దేశాలలోనే స్థిరపడి, జీవితాన్ని మరింత సంపద్వంతమూ, సౌఖ్య పూరితమూ చేసుకునే అవకాశమున్నప్పటికీ ఇరువురూ 1947లో స్వదేశానికి తిరిగి వచ్చారు. కొత్తగా స్వాతంత్ర్యం పొందిన తమ జన్మభూమి భారత్ సర్వతోముఖ వికాసానికి తమ వంతు తోడ్పాటునందించాలన్నదే ఆ విద్యావంతుల ఆకాంక్ష. స్వదేశానికి తిరిగివచ్చిన ఆ యువ ఇంజనీర్లు, భారత్‌లో ఉన్న ‍బహుళ జాతి కంపెనీలలో గానీ లేదా టాటాలు, కిర్లోస్కర్ల యాజమాన్యంలో ఉన్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కంపెనీలలో కానీ చేరలేదు. అంతగా లాభప్రదం కాని (అయితే వారిదృష్టిలో విశేష గౌరవప్రదమైన) ప్రభుత్వ రంగ సంస్థలలోనే చేరారు.

ఇటీవలే మరణించిన ఈ భారతీయులు ఇరువురూ పరస్పరం పూర్తిగా అపరిచితులు. వారితో నాకు పరిచయ భాగ్యమున్నది. ఒకరు మా నాన్నగారి చిన్న తమ్ముడు, మరొకరు ఒక సన్నిహిత మిత్రుని తండ్రి. ఇరువురివీ ఒకే విధమైన జీవితాలు. వృత్తి ధార్మికులు. మన మాతృభూమిగా మనం చెప్పుకుంటున్న ఈ దేశంలో ఒక మానవతా పరిపూర్ణ సమాజ నిర్మాణానికి ఆనాటి జాతి పెద్దల స్ఫూర్తితో తమ తోడ్పాటు నందించిన స్వార్థరహితులు. ఉదయ్‌పూర్ ఇంజనీర్ తన వృత్తి జీవితమంతా భారతీయ రైల్వేలలో గడిపారు. కోట్లాది భారతీయులకు రైల్వేలే ముఖ్య ప్రయాణ సాధనాలు. రైల్వేవ్యవస్థ సమర్థత, విశ్వసనీయతపైనే కొత్తగా ఆవిర్భవించిన భారత గణ తంత్ర రాజ్య సమస్త జీవితమూ ఆధారపడి ఉంది. రైల్వేల సమర్థత, విశ్వసనీయతను ఇతోధికంగా పెంపొందించేందుకు నా స్నేహితుని తండ్రి విశేష కృషి చేశారు. ముంబై–వడోదర రైలు మార్గంలో విద్యుత్ రైళ్లను ప్రవేశపెట్టడంలో ఆయన కీలకపాత్ర వహించారు. తద్వారా లక్షలాది ప్రజలు రోజూ వేగవంతంగా, సౌఖ్యంగా ప్రయాణించేందుకు ఆయన తోడ్పడ్డారు.

మా నాన్నగారి చిన్న తమ్ముడు, దక్షిణాదికి చెందిన ఇంజనీర్ తన వృత్తి జీవితంలో తొలి సంవత్సరాలను భారత వాయుసేనలో గడిపారు. ఆ తరువాత హిందుస్థాన్ ఎయిరో నాటిక్స్ లిమిటెడ్‌లో వివిధ హోదాలలో పని చేశారు. రక్షణ ఉత్పత్తులలో దేశం స్వావలంబన సాధించేందుకు హెచ్‌ఏఎల్ ఇంజనీర్‌గా ఆయన నిర్ణయాత్మక కృషి చేశారు. తొలుత దేశీయ విమానాల రూపకల్పన, నిర్మాణ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ తరవాత మిగ్ 21 లాంటి విదేశీ యుద్ధ విమానాలను దేశీయంగా ఉత్పత్తి చేయడంలో కీలక పాత్ర వహించారు. ఆయన ఉత్పత్తి చేసిన యుద్ధ విమానాలు మన జాతీయ భద్రతకు విశేషంగా తోడ్పడ్డాయి. భారత ప్రజలను స్వావలంబన పథంలో వడిగా ముందుకు నడిపించాయి. మా బాబాయి నాకు గర్వకారణం. స్వదేశంలోనే నివశిస్తూ వృత్తి జీవితం లేదా విద్వత్ కృషిని ఇక్కడే నిర్వహించాలన్న నా నిబద్ధతకు స్ఫూర్తి మా బాబాయే. హెచ్‌ఏఎల్ నుంచి ఉద్యోగ విరమణ అనంతరం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఆయన బోధించారు. ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియాను అభివృద్ధి పరచడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

సామాజిక, మానవీయ శాస్త్రాల విద్యార్థినైన నాకు మా బాబాయి ఇంజనీరింగ్ కృషిపై అంతగా అవగాహన ఉండేది కాదు. అయితే ఆయనలో కుల పరమైన ఆభిజాత్యం, మత సంకుచితత్వం ఏ కోశానా ఉండేవి కావు. ఆయనలోని ఈ గుణం నాకు బాగా నచ్చింది. ఆయన పినతండ్రులలో ఒకరు సంఘసంస్కర్త ఆర్. గోపాలస్వామి అయ్యర్. మైసూరు సంస్థానంలో దళితుల అభ్యున్నతికి ఆయన కృషి చేశారు. గోపాలస్వామి ప్రభావం మా బాబాయిపై ఉన్నది. అలాగే భారత వాయుసేనలో ఉద్యోగ జీవితం మా బాబాయిలో మత భావాలను విశాలం చేసింది. భారతదేశ సాంస్కృతిక వైవిధ్యం పట్ల ఆయనకు అపార అవగాహన ఉండేది. ఆ వైవిధ్యాన్ని ఆయన అమితంగా గౌరవించేవారు. మంగళూరులో పెరిగిన బాలుడు తన మొదటి డిగ్రీని బెనారస్‌లో తీసుకున్నాడు. ఉద్యోగ జీవితం తుదినాళ్లలో ఒడిషాలోని ఒక గిరిజన ప్రాంతంలో గల హెచ్‌ఏఎల్ ఫ్యాక్టరీలో మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉండేవారు. నా పరిశోధనల నిమిత్తం నేను ఆ గిరిజన ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడ ప్రతి ఒక్కరూ మా బాబాయి గురించి అత్యంత గౌరవంగా మాట్లాడడాన్ని గమనించాను.

ఉదయ్‌పూర్ ఇంజినీర్‌తో నాకు స్వల్ప పరిచయం మాత్రమే ఉన్నది. అయితే ఆయన కూడా భారతదేశంపై విశాల దృక్పథంతో ఉండేవారు. ఎటువంటి సంకుచితత్వాలూ ఆయనలో ఉండేవి కావు. లలితకళలు, చేతి వృత్తులకు ప్రాధాన్యమిచ్చిన విద్యాభవన్ అనే ప్రగతిశీల పాఠశాలలో ఆయన చదువుకున్నారు. రైల్వేలలో చేరడం ద్వారా ఆయన సామాజిక అవగాహనలు విశాలమూ ప్రగాఢమూ అయ్యాయి. భారత ప్రజలలోని అపార వైవిధ్యం సాయుధ బలగాలలో కంటే భారతీయ రైల్వేల సిబ్బందిలోనే ఎక్కువగా ప్రతిబింబించేది. రాజస్థాన్‌కు సాంస్కృతికంగా, భౌగోళికంగా చాలా దూరంలో ఉన్న ప్రాంతాలలోనే ఈ ఇంజనీర్ జీవితం గడిచింది. ఈ ఇంజినీర్లు ఇరువురూ తమ వృత్తి ధర్మ నిర్వహణలో ప్రజలకు ఇతోధిక మేలు చేశారు. వ్యక్తిగత జీవితాలలోనూ వారు ఆదర్శ ప్రాయులే. తండ్రిగా, భర్తగా తమ బాధ్యతలను ఇరువురూ విశాల భావాలతో నిర్వహించారు. తోబుట్టువుల శ్రేయస్సును కాంక్షించారు. సహచరుల, స్నేహితుల సంక్షేమంపై శ్రద్ధ చూపారు. ఇరువురూ ఎటువంటి పురుష దురహంకార వైఖరులు లేని విశాలహృదయులు. మా బాబాయి చనిపోయినప్పుడు ఆయనతో నలభై ఏళ్ల పరిచయమున్న నా సతీమణి, గాంధీ గురించి జార్జి ఆర్వెల్ అన్న మాటలను గుర్తు చేసుకున్నారు ‘మహాత్ముడు స్వచ్ఛమైన మానవతా పరిమళాలను వెనుక వదిలివెళ్ళారు’ అని ఆర్వెల్ వ్యాఖ్యానించాడు. నా స్నేహితుని తండ్రి విషయంలో కూడా ఇది పూర్తిగా వర్తిస్తుంది.

ఇంతకూ ఈ ఉదాత్త వ్యక్తులు ఎవరో నేను చెప్పలేదు కదూ! ఆ విషయానికే వస్తున్నాను. కర్ణాటకకు చెందిన ఇంజినీర్ సుబ్రమణియమ్ చెన్నకేశు; రాజస్థాన్ ఇంజినీర్ పేరు శ్రీగోపాల్ త్రివేది. స్నేహితులు, కుటుంబమూ, సహచరులూ ఆ ఇరువురినీ ఎంతగానో అభిమానించేవారు. ఎన్నో మధుర స్మృతులను వారు దాచుకున్నారు. ఇరువురి జీవితాలూ అర్థవంతమైనవి. ఇరువురూ నిజమైన జాతి నిర్మాతలు. మన చారిత్రక గతాన్ని గురించిన వర్తమాన దృక్పథాలు వారిని అలా గౌరవించడానికి ఒప్పుకోక పోవడం ఎంతైనా శోచనీయం.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల తన ప్రసంగాలలో, గత ఎనిమిది–తొమ్మిది సంవత్సరాలలో, అంటే తాను ప్రధానమంత్రిగా వచ్చిన తరువాత, జాతి సాధించిన పురోగతి గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు. అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని గత ఎన్‌డిఏ ప్రభుత్వం నిర్వహించిన నిర్మాణాత్మక కృషి (మౌలిక సదుపాయాల రంగం ఇందుకొక ఉదాహరణ)ని సైతం మోదీ అంగీకరించకపోవడం విస్మయం కలిగిస్తోంది. తన పర్యవేక్షణలో జాతి ‘ప్రగతి’ గురించిన మోదీ బడాయి మాటలను ఆయన కేబినెట్ మంత్రులు, అధికార పార్టీ సామాజిక మాధ్యమాల విభాగం వారు మరింతగా విపులీకరిస్తారు. వాటిని విన్న లేదా చదివిన ఆలోచనాపరులకు మే 2014కు పూర్వం ఆర్థిక, సాంకేతికతా వెనుకబాటుతనంలో భారత్ కునారిల్లిపోయిందా ఏమిటి అన్న విస్మయకర సందేహం తప్పకుండా వస్తుంది.

జాతి జాగృతి గురించి ఒక ప్రత్యామ్నాయ కథనం కచ్చితంగా ఉంది. మే 2014కి చాలా సంవత్సరాల పూర్వమే ఆ పురోగతి ప్రారంభమయిందని ఈ భిన్న చరిత్ర నొక్కి చెప్పుతుంది. 1991 వేసవి అనంతరమే భారత్ అభివృద్ధి బాటలోకి ప్రవేశించి వడివడిగా ముందుకు సాగి ఆర్థికాభివృద్ధి శిఖరాలను అధిరోహించించిందన్నదే ఆ ప్రత్యామ్నాయ కథనం. సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టిన తరువాతనే భారత్ ఒక ఆర్థిక శక్తిగా ప్రభవించిందని స్వేచ్ఛావిపణివాదులు విశ్వసిస్తున్నారు. నరేంద్ర మోదీ ఆత్మస్తుతి కథనాల కంటే స్వేచ్ఛా విపణివాదుల కథనాలలో కొంత సత్యం లేక పోలేదు. అయితే ఇవి కూడా స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచీ పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా, మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి వచ్చే దాకా గడచిన 44 సంవత్సరాల కాలంలో దేశ సర్వోముఖాభివృద్ధికి భారత ప్రజల సంక్షేమానికి విశేష కృషి చేసిన ఉదాత్త భారతీయులను చులకన చేస్తున్నాయి, అగౌరవపరుస్తున్నాయి.

1947లో భారత్ ఏమిటి? ఒక నిరుపేద దేశం. మతతత్వ కల్లోలాలతో కొట్టుమిట్టాడుతున్న సమాజం. ప్రజలు చాల వరకు నిరక్షరాస్యులు. ఈ స్వతస్సిద్ధ బలహీనతలు, వైరుధ్యాలతో భారత్ ఒక ప్రజాస్వామిక దేశంగా ఎంతోకాలం మనలేదని ఇంటా బయటా ఎంతో మంది విశ్వసించేవారు. అంతర్యుద్ధం, కరువు కాటకాలు, సైనిక నియంతృత్వంతో భారత్ మరింతగా పతనమవడం ఖాయమని ఆనాడు ఎంతో మంది భావించారు. ఈ భయానక అంచనాలు నిజం కాలేదు. భారత్ సమైక్యంగా నిలిచింది. పటిష్ఠ ప్రజాస్వామిక వ్యవస్థను నిర్మించుకుంది. ఆహారోత్పత్తిలో స్వావలంబన సాధించింది. ఆర్థిక వ్యవస్థకు దృఢమైన సాంకేతికతల, పారిశ్రామిక పునాదులను ఏర్పాటు చేసుకున్నది. ఆ సేతు హిమాచలాన్ని అపూర్వంగా ఏకీకృతం చేసిన సంస్థాగత, మౌలిక సదుపాయాలు అన్నీ 1947–91 సంవత్సరాల మధ్యే నిర్మాణమయ్యాయి. మరి ఆ అద్భుత పురోగతి లేకపోతే దేశంలో ఐటీ లేదా బీటీ విప్లవం సంభవించేదేనా? స్టార్టప్ సంస్కృతి ప్రభవించేదేనా? శ్రమశక్తికి, పెట్టుబడులకు దేశవ్యాపిత మార్కెట్ డిమాండ్ పెరిగేదేనా? ఇంతెందుకు, ప్రస్తావితమైనవన్నీ లేకపోయిన పక్షంలో అసలు భారత్ అనేదే ఉండేది కాదేమో?! ఇదుగో ఇక్కడే, ఈ కాలమ్‌లో నేను స్మృత్యంజలి ఘటించిన ఇద్దరు ఉదాత్తుల విశాల ప్రాసంగికత ఉన్నది. సుబ్రమణియమ్ చెన్నకేశు, శ్రీగోపాల్ త్రివేది స్వాతంత్ర్య యుగోదయంలోని లక్షలాది ఆదర్శప్రాయ భారతీయులకు ప్రతినిధులు. సివిల్ సర్వీసెస్, సాయుధ బలగాలు, భారత రైల్వేలు, రక్షణ పరిశ్రమలలో ఉద్యోగులుగా ఉన్నా, పొలాలు, ఫ్యాక్టరీలు, పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు, పరిశోధనా ప్రయోగశాలల్లో పని చేసినా వారు ఒక సమున్నత లక్ష్యంతో తమ తరువాతి తరాలకు ఒక ఉజ్వల భారత్‌ను అందించారు. భావి తరాలు దాన్ని మరింత మహోజ్వలంగా నిర్మించుకోవాలని ఆకాంక్షించారు. మరి మనం వారి అభీష్టానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నామా లేక విరుద్ధంగా ప్రవర్తిస్తున్నామా?

రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - 2023-06-17T01:01:08+05:30 IST