క్రికెట్ మాంత్రికులకు దక్కని గౌరవం!

ABN , First Publish Date - 2023-09-23T00:36:19+05:30 IST

అదొక పచ్చని యవ్వన స్మృతి. నేను నా 16వ వసంతంలోకి ప్రవేశించనున్న రోజులవి (మార్చి 1974). బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఒక క్రికెట్ మ్యాచ్‌కు నేను ప్రప్రథమంగా వెళ్లిన...

క్రికెట్ మాంత్రికులకు దక్కని గౌరవం!

అదొక పచ్చని యవ్వన స్మృతి. నేను నా 16వ వసంతంలోకి ప్రవేశించనున్న రోజులవి (మార్చి 1974). బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఒక క్రికెట్ మ్యాచ్‌కు నేను ప్రప్రథమంగా వెళ్లిన శుభ తరుణం కూడా అదే. ఆ నాటినుంచి ఆ క్రీడాంగణంలో క్లబ్‌ల, రాష్ట్రాల, దేశాల జట్ల మధ్య జరిగిన ఎన్నో, ఎన్నెన్నో మ్యాచ్‌లను వీక్షించాను, ఇప్పటికీ చూస్తున్నాను. మరెన్నో ఆనంద క్షణాలను సొంతం చేసుకొంటున్నాను. చిన్నస్వామి స్టేడియం అంత సుందరమైనదేమీ కాదు. సమస్త సదుపాయాలు ఉన్న క్రీడాక్షేత్రం కూడా కాదు. అయినప్పటికీ క్రికెట్‌ను చూడడానికై వెళ్లేందుకు ఇప్పటికీ నేను ఎంతగానో ఇష్టపడే ఆటస్థలమది. నాటికీ నేటికీ నేను కర్ణాటక రంజీ ట్రోఫీ టీమ్‌కు ప్రగాఢ అభిమానిని. మరి ఆ టీమ్ సొంత క్రీడాస్థలి చిన్నస్వామి స్టేడియమే.

ఈ సుప్రసిద్ధ స్టేడియం ఉనికిలోకి రావడానికి ప్రధాన కారకుడు అయిన వ్యక్తి పేరిట ఆ క్రీడాంగణానికి పేరు పెట్టారు. ఆ ఉదాత్తుడు ఎమ్. చిన్నస్వామి. వృత్తిరీత్యా న్యాయవాది. ప్రవృత్తి రీత్యా క్రికెట్ పిపాసువు. ఒక గొప్ప, ఆదర్శప్రాయ క్రికెట్ నిర్వాహకుడు. అవినీతి అంటని, ఆశ్రిత పక్షపాతం లేని సజ్జనుడు. క్రికెట్‌ను శ్వాసించడమే ఆయన జీవితం; అందునా కర్ణాటక క్రికెట్‌ను ఘనంగా నిలిపేందుకు జీవితాన్ని అంకితం చేసిన చరితార్థుడు. 1960వ దశకం తొలినాళ్ల నుంచి కర్ణాటక (అప్పట్లో దీనిని మైసూరు రాష్ట్రంగా వ్యవహరించేవారు), టీమ్ ఇండియాకు ఎంతో మంది ప్రతిభాన్విత బౌలర్లు, బ్యాటర్స్‌ను సమకూరుస్తూ వస్తోంది. అయితే తమిళనాడు, బాంబే, ఢిల్లీ, బెంగాల్ రంజీ టీమ్‌లకు ఉన్న విధంగా సొంత ఆటస్థలం లేదు. బెంగళూరులోని సెంట్రల్ కాలేజ్‌లో కర్ణాటక రంజీ టీమ్ ఆడుతుండేది. రంజీ టీమ్‌కు సొంత స్టేడియం కొరతను తీర్చేందుకు చిన్నస్వామి పూనుకున్నారు. మరెవ్వరి సహాయం అడగకుండానే తన సంకల్ప సాధనకు రంగంలోకి దిగారు. నగరం నడిబొడ్డున ఖాళీగా ఉన్న ఒక సువిశాల స్థలాన్ని మైసూరు క్రికెట్ అసోసియేషన్ (దీనికి ఆయనే కార్యదర్శి)కు కేటాయింపచేయడంలో ప్రభుత్వ కటాక్షాన్ని సాధించారు. ఒకవాస్తు శిల్పిని నియమించుకున్నారు. ఒక కాంట్రాక్టర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. చిన్నస్వామి పర్యవేక్షణలోనే ఆ స్టేడియం నిర్మాణమయింది.

గుజరాత్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ సొంత స్టేడియంకు నరేంద్ర మోదీ పేరు పెట్టారు! ఎటువంటి మినహాయింపు లేకుండా గర్హించాల్సిన విషయమది. అదలా ఉంచుదాం. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కెఎస్‌సిఎ) సొంత ఆటస్థలం చిన్నస్వామి పేరుతో ఉన్నది. ఈ గౌరవానికి ఆ సౌజన్యుడు పూర్తిగా అర్హుడు. అయితే ఈ స్టేడియంలో ప్రేక్షకులు కూర్చునే వివిధ మెట్ల వరుసల నిర్మాణాలకు కర్ణాటకకు పేరు ప్రఖ్యాతులు సమకూర్చిన విఖ్యాత క్రికెటర్ల పేర్లు ఇప్పటికీ పెట్టకపోవడం అమితాశ్చర్యం కలిగిస్తోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలోని ప్రేక్షకుల గ్యాలరీలకు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, విజయ్ మర్చంట్, వినూ మన్కడ్ మొదలైన వారిపేర్లు పెట్టారు. అలాగే ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానం (ఇటీవల దీనికి ఒక రాజకీయవేత్త పేరు పెట్టడం విచారకరం)లోని ప్రేక్షకుల గ్యాలరీలకు బిషన్ సింగ్ బేడీ, మొహిందర్ అమర్‌నాథ్, వీరేంద్ర సెహ్వాగ్ మొదలైన ప్రతిభాన్విత క్రికెటర్ల పేర్లు పెట్టారు. ఇలా మన దేశంలోనే కాదు, క్రికెట్ ఆడే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్ మొదలైన దేశాలలోని సుప్రసిద్ధ స్టేడియాలలోని ప్రేక్షకుల గ్యాలరీలకు తమ తమ మహోన్నత క్రికెటర్ల పేర్లు పెట్టి వారిని గౌరవించుకుంటున్నారు. మరి భారతీయ, కర్ణాటక క్రికెట్‌కు విశేష కీర్తిని సముపార్జించిన గుండప్ప విశ్వనాథ్, ఇ. ప్రసన్న, భగవత్ చంద్రశేఖర్‌లను అదే రీతిలో గౌరవించడంలో బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియం ఉపేక్షిస్తోంది. ఇది సరికాదు.


భారతీయ క్రికెట్‌ను మహోన్నత కీర్తి శిఖరాలకు తీసుకువెళ్లిన కర్ణాటక క్రీడాకారులను గౌరవించుకోవడంలో అలక్ష్యం చాలా కాలంగా నన్నే కాదు, ఆ రాష్ట్రంలోని క్రికెట్ అభిమానులు అందరినీ మానసిక క్షోభకు గురి చేస్తోంది. కెఎస్‌సిఎ పాలనా బాధ్యతల్లో ఉన్న బ్రిజేష్ పటేల్ (రంజీ ట్రోఫీని మొట్టమొదటిసారి గెలుచుకున్న కర్ణాటక టీమ్‌లో ఈయనా ఉన్నారు)ను ఒకసారి నేను ఆ విషయం గురించి ప్రశ్నించాను. ప్రేక్షకుల గ్యాలరీలకు విశ్వనాథ్, ప్రసన్న, చంద్రశేఖర్‌ల పేర్లు పెట్టాలని కోరాను. రంజీ ట్రోఫీని కర్ణాటక తొలిసారి గెలుచుకోవడంలోను, అంతకు ముందు 1971లో వెస్టిండీస్, ఇంగ్లాండ్‌లలో భారత్ జట్టు విజయాలలోనూ ఆ ముగ్గురి పాత్ర కీలకమైనది. వారిని గౌరవించుకోవడం అంటే కర్ణాటక క్రికెట్ తనను తాను గౌరవించుకోవడమే. నా సూచనను బ్రిజేష్ స్వాగతించలేదు. ప్రతీ ఒక్కరు తమ పేరుపెట్టాలని ఒత్తిడి తెస్తారని అభ్యంతరం తెలిపారు. ఏ ఒక్కరూ, ముఖ్యంగా అద్వితీయులు అయిన రాహుల్ ద్రవిడ్, అనీల్ కుంబ్లే, జవగళ్‌ శ్రీనాథ్‌లు ఎటువంటి అభ్యంతరం చెప్పబోరని నేను వివరించాను. విశ్వనాథ్, ప్రసన్న, చంద్రశేఖర్‌లను స్ఫూర్తిగా తీసుకుని ఆ ముగ్గురూ తమ ప్రతిభాపాటవాలను తీర్చిదిద్దుకున్నవారని, తమవంతు వచ్చేదాకా వారు వేచివుంటారని చెప్పాను.

ఈ ఏడాది తొలినాళ్లలో ఒకనాటి కర్ణాటక రంజీ టీమ్ సభ్యుడు, బ్రిజేష్ వలే కెఎస్‌సిఎ పాలనాధికారి అయిన మరో కన్నడ క్రికెటర్‌తో కూడా ఇదే విషయమై మాట్లాడాను. రోజర్ బిన్నీ గురించి నేను ప్రస్తావిస్తున్నాను. చిన్నస్వామి స్టేడియంలోని ప్రేక్షకుల గ్యాలరీలకు కర్ణాటక కీర్తి శిఖరాలు అయిన క్రికెటర్ల పేర్లు పెట్టే ప్రతిపాదనకు మద్దతు ఇస్తారా అని అడిగాను. బిన్నీ గంభీరంగా సమాధానమిచ్చారు. ఏమని? తాను బీసీసీఐ అధ్యక్షుడినని, భారతీయ క్రికెట్ మొత్తానికే కాని, ఒక నిర్దిష్ట రాష్ట్ర క్రికెట్ వ్యవహారాలకు తాను బాధ్యుడిని కానని బిన్నీ అన్నారు. గతంలో మీరూ కెఎస్‌సిఎ అధ్యక్షుడుగా ఉన్నారు కదా అని గుర్తు చేశాను. అప్పట్లో ఈ విషయమై మీరు ఏమైనా చొరవచూపారా అని కూడా ప్రశ్నించాను. మౌనమే ఆయన సమాధానం. విశ్వనాథ్, ప్రసన్న, చంద్రశేఖర్‌తో పాటు కర్ణాటకకే చెందిన ప్రప్రథమ ప్రఖ్యాత భారతీయ మహిళా క్రికెటర్ శాంతా రంగస్వామి పేరు కూడా చిన్నస్వామి స్టేడియంలోని ప్రేక్షకుల గ్యాలరీలకు పెట్టి తీరాలని సూచించాను. బిన్నీ మౌనంగానే ఉండిపోయారు. చివరగా ఒక మాట చెప్పాను. సల్మాన్ రష్దీ తన ఇటీవలి నవలలో మూడు పాత్రలకు ఎరాపల్లి (ప్రసన్న), గుండప్ప (విశ్వనాథ్), భగవత్ (చంద్రశేఖర్) పేర్లు పెట్టారని పేర్కొన్నాను. క్రికెట్‌లో పెద్దగా శ్రద్ధాసక్తులు లేని ఒక ఆంగ్లో–అమెరికన్ సాహితీవేత్త కర్ణాటక గురించి రాసినప్పుడు విశ్వనాథ్, ప్రసన్న, చంద్రశేఖర్‌లను అలా గౌరవించారని వివరించాను.


కెఎస్‌సిఎ అధ్యక్షులుగా పనిచేసిన బ్రిజేష్ పటేల్, రోజర్ బిన్నీలకు తమ సీనియర్లు, తమ కంటే గొప్ప క్రికెటర్లు అయినవారిని గౌరవించే అవకాశాలు సమృద్ధంగా ఉన్నాయనడంలో సందేహం లేదు. అయినా వారు అలాంటి గౌరవప్రదమైన నిర్ణయాలు తీసుకోలేదు. ఎందుకని? స్థానిక ఐపీఎల్ ఫ్రాంఛైజీ, ఇతర వాణిజ్య ప్రాయోజితుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవలసివస్తుందని భయపడ్డారా? లేక పాలనాధికారాల అతిశయంతో ఇతర క్రికెటర్లును బహిరంగంగా గౌరవించడానికి నిరాకరించారా? ఈ విషయమై ఇంతకు మించి నేను ఎటువంటి ఊహాగానం చేయదలుచుకోలేదు.

రంజీ ట్రోఫీని కర్ణాటక మొట్టమొదటిసారి గెలుచుకున్న మహత్తర సంఘటన వజ్రోత్సవం వచ్చే ఏడాది జరగనున్నది. ఆ విజయం నిజంగా భారతీయ క్రికెట్ చరిత్రలో ఒక నవ యుగానికి నాంది. బాంబే ఆధిపత్యాన్ని కూలదోసిన కర్ణాటకను అనుసరించి తదనంతర సంవత్సరాలలో ఢిల్లీ, హైదరాబాద్, తమిళనాడు, బరోడా, రైల్వేస్, పంజాబ్‌ –హర్యానా, బెంగాల్, మధ్యప్రదేశ్, సౌరాష్ట్ర, గుజరాత్ టీమ్‌లు రంజీ ట్రోఫీపై తమ పేరును లిఖించుకున్నాయి.

భారతీయ క్రికెట్ వికేంద్రీకరణ, ప్రజాస్వామ్యీకరణ 1974 వసంతకాలంలో చిన్నస్వామి స్టేడియంలో ప్రారంభమయింది. ఆ మహా మార్పు సంభవించినప్పుడు నేను అక్కడే ఉన్నాను. బాంబేను చిత్తు చేసిన కన్నడ క్రికెట్ మాంత్రికుల బ్యాటింగ్, బౌలింగ్ విన్యాసాలను వీక్షించాను. ఎట్టకేలకు రంజీ ట్రోఫీ విజేతగా నిలిచి కర్ణాటక తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నది. ఏమా ఆట! తెగిన జ్ఞాపకాలను తెలియజేసేందుకు నేనీ కాలమ్ రాయడం లేదు. అద్భుత క్రీడా నైపుణ్యాలతో క్రికెట్ అభిమానులను అలరించిన ఆనాటి కర్ణాటక క్రికెట్ హీరోలకు చిన్నస్వామి స్టేడియంలో దక్కవలసిన గౌరవం నేటికీ దక్కలేదు! భారతీయ క్రికెట్ ప్రతిభా వైభవాన్ని అభిమానించే ప్రతీ ఒక్కరికీ (కన్నడ భూమిలో నివశించని వారితో సహా) ఎంతో మనస్తాపం కలిగిస్తున్న విషయమిది. ఇదెలా తీరుతుంది? కెఎస్‌సిఏ ఇప్పటికైనా మేల్కోవాలి. నాటి ఘన క్రికెటర్లకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించాలి. చేసిన పొరపాటును సరిదిద్దుకోవాలి. ఇందుకొక శుభ సమయమూ సమీపించింది. 20 అక్టోబర్, 2023న, ఐదు ప్రపంచ కప్ మ్యాచ్‌లలో మొదటిది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోనే జరగనున్నది. ఈ శుభ సందర్భాన్ని మరింత శోభాయమానం చేసేలా ఆ క్రీడాంగణంలోని ప్రేక్షకుల గ్యాలరీలకు చంద్రశేఖర్, ప్రసన్న, శాంత, విశ్వనాథ్‌ల గౌరవార్థం నామకరణోత్సవాన్ని నిర్వహించాలి.

రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - 2023-09-23T00:36:19+05:30 IST