Share News

నరేంద్రమోదీ నిర్దేశిస్తున్న రాజనీతి

ABN , First Publish Date - 2023-12-13T02:28:49+05:30 IST

‘మీరు నేతగా ఎన్నికయ్యారు. ముందు వరుసలోకి వెళ్లండి’ అని 2021 సెప్టెంబర్‌లో గుజరాత్‌ లో జరిగిన బీజేపీ శాసనసభా పార్టీ సమావేశంలో చివరి వరుసలో ఉన్న...

నరేంద్రమోదీ నిర్దేశిస్తున్న రాజనీతి

‘మీరు నేతగా ఎన్నికయ్యారు. ముందు వరుసలోకి వెళ్లండి’ అని 2021 సెప్టెంబర్‌లో గుజరాత్‌ లో జరిగిన బీజేపీ శాసనసభా పార్టీ సమావేశంలో చివరి వరుసలో ఉన్న భూపేంద్ర భాయి పటేల్‌కు ఒక ఎమ్మెల్యే చెప్పారట. ‘నేనిప్పుడు నేతనే కదా’ అని భూపేంద్ర భాయి అంటే, ‘మీరు మొత్తం శాసనసభా పార్టీకే నేతగా ఎన్నికయ్యారు.. అంటే మీరే ముఖ్యమంత్రి..’ అని ఆ ఎమ్మెల్యే చెప్పడంతో ఆయన ఉబ్బితబ్బిబ్బయ్యారు. చప్పట్ల మధ్య తేరుకుని ముందుకు వెళ్లారు. ‘అరే, ముందే తెలిసి ఉంటే కనీసం మంచి షర్టైనా తొడుక్కుని వచ్చే వాడిని కదా..’ అని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ లలో కూడా ఇప్పుడు ఇలాంటి సీన్‌లే కనపడ్డాయి.. మధ్యప్రదేశ్ శాసన సభా పార్టీ సమావేశంలో మొదటి వరుసలో శివరాజ్ సింగ్ చౌహాన్, కైలాష్ విజయ్ వర్గీయ, ప్రహ్లాద్ సింగ్ పటేల్ లాంటి హేమాహేమీలు కూర్చుని ఉన్నారు. మూడో వరుసలో కూర్చుని ఉన్న మోహన్ యాదవ్‌కు తననే శాసన సభా పార్టీ నేతగా ఎన్నుకుంటారని ఏ మాత్రం అంచనా లేదు. ‘అసలు మా ఇంట్లో కనీసం చర్చ కూడా లేదు’ అని ఆయన కుటుంబ సభ్యులు మీడియాతో చెప్పారు. మధ్యప్రదేశ్‌లో పార్టీని బలోపేతం చేసి, లాడ్లీ యోజన వంటి అనేక పథకాలను సమర్థంగా అమలు చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్‌కు తనకు ఈ సారి ముఖ్యమంత్రి పదవి లభించదని రెండు రోజుల ముందే తెలిసింది. ‘అందరికీ రామ్ రామ్’ అంటూ చేతులు జోడించి ఉన్న తన ఫోటోతో ఆయన ట్వీట్ చేసి వీడ్కోలు చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న రమణ్ సింగ్‌ను శాసనసభలో స్పీకర్‌గా వెళ్లమని చెబితే ఆయన కిమ్మనకుండా సరేనన్నారు. ఆ రాష్ట్రంలో ఎవరూ ఊహించని విధంగా ఒక ఆదివాసీ నేత విష్ణుదేవ్ సాయిని సిఎంగా ప్రకటించడంతో నేతలంతా ఆశ్చర్యపోయారు. అన్నిటికన్నా ఆశ్చర్యకరంగా రాజస్థాన్‌లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన భజన్‌లాల్ శర్మను ముఖ్యమంత్రి పదవి వరించింది. అక్కడ బలమైన నేతగా అందరూ పరిగణించే వసుంధరా రాజే నోటి ద్వారానే భజన్‌లాల్ పేరును చెప్పించారు! మంగళవారం ఉదయం వరకూ వసుంధరా రాజే ముఖ్యమంత్రి పదవి కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు ఫోన్ చేసి తనకు కనీసం ఒక ఏడాది వరకైనా ముఖ్యమంత్రి పదవి ఇప్పించాలని కోరారు. కాని నడ్డా తానేమీ చేయలేనని నిస్సహాయత వ్యక్తం చేశారని సమాచారం. కావాలంటే స్పీకర్ పదవి చేపట్టమని నడ్డా కోరితే రాచకుటుంబానికి చెందిన వసుంధర అందుకు నిరాకరించారు. నిజానికి ఆమెకు గత ఏడాది ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చేందుకు బీజేపీ అధిష్ఠానం సుముఖత వ్యక్తం చేసింది కాని వసుంధరా రాజే అందుకు ఒప్పుకోకుండా రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటానని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒకసారి తప్పించాలని నిర్ణయించిన తర్వాత హరిహర బ్రహ్మాదులైనా అడ్డుకోగలరా? మోదీ మాట విని ఉంటే వసుంధరా కనీసం రాజ్యసభ చైర్మన్‌గా నైనా కాలక్షేపం చేసి ఉండేవారు. ఇప్పుడు తన భవిష్యత్ ఏమిటో ఆమెకే తెలియదు.

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కొత్త ముఖాలు వచ్చిన తర్వాత బీజేపీలో ఆడ్వాణీ హయాంలో వెలుగులోకి వచ్చిన నేతల తరం దాదాపు ముగిసినట్లే. వసుంధరా రాజే, శివరాజ్ సింగ్ చౌహాన్, రమణ్ సింగ్ ముగ్గురూ ఆడ్వాణీ హయాంలో పార్టీలో ఎదిగినవారే. ఇప్పుడు మోదీ మంత్రివర్గంలో ఉన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భవిష్యత్ ఏమిటో 2024 ఎన్నికల తర్వాత తేలుతుంది. మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగిన ఈ పరిణామం బీజేపీలో జరుగుతున్నదేమిటో మరింత స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి పదవుల్లో నరేంద్రమోదీ ఎవర్ని కావాలంటే వారినే కూర్చోపెట్టగలరని, ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చునే కీలుబొమ్మనే ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారని, ఎలాంటి హేమాహేమీలనైనా తీసి పారేయగలరని తేలిపోయింది. ‘భృత్యస్య భృత్య ఇతిమాం స్మరలోక నాథ’ అని కులశేఖర ఆళ్వార్ ముకుంద మాలలో భగవంతుడిని కీర్తించినట్లే తనను ఆమోదించిన వారినే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తిస్తారన్న విషయం పార్టీ నేతలకు తెలిసిపోయింది. బహుశా కేంద్రం నుంచే రాష్ట్రాల్లో పరిపాలన సాగించడానికి తనకు అనుకూలమైన యంత్రాంగాన్ని రాష్ట్రాల్లో ఏర్పర్చుకోవాలని మోదీ నిర్ణయించినట్లు కనపడుతోంది. పైకి డబుల్ ఇంజన్ సర్కార్ అని ప్రధానమంత్రి ఎంతగా చెబుతున్నప్పటికీ ఒకరకంగా దేశమంతటా ఒకే ఇంజన్ సర్కార్ సాగేందుకు ఆయన చర్యలు తోడ్పడుతున్నాయి. మోదీ అనుసరిస్తున్న ఈ వ్యవహార శైలి ఆయనకు లోక్ సభ ఎన్నికల్లో ఉపయోగపడుతుందా? తానొక్కడే సర్వం తానై అన్నట్లుగా అరివీర భయంకరుడిలా దేశంలో ప్రచారం చేస్తుంటే మిగతా నేతలంతా చప్పట్లు కొడుతూ తాను మూడోసారి ప్రధాని అయ్యేందుకు దోహదం చేస్తారా అన్నది వేచి చూడాల్సి ఉన్నది. ప్రజాస్వామ్యంలో అతి ఆధిపత్య ధోరణి బెడిసికొట్టే అవకాశాలు కూడా లేకపోలేదని అనేక సందర్భాల్లో రుజువైంది. కాంగ్రెస్ అలా వ్యవహరించే మొదటికే మోసం తెచ్చుకున్నది.

అయినప్పటికీ మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుతో దేశంలో రాజకీయ పరిణామాలు మోదీకి అనుకూలంగా మారుతున్నాయనుకుంటే మరో రెండు పరిణామాలు కూడా దేశంలో మోదీ అనుకూల వాతావరణాన్ని ఏర్పర్చే అవకాశాలు ఉన్నాయి. జమ్ము–కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దును సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమర్థించడం మోదీ నిర్ణయాలకు తిరుగులేదన్న విషయాన్ని మరింత స్పష్టం చేసింది. కశ్మీర్‌లో జరిగిన హింసాకాండను, మానవ హక్కుల ఉల్లంఘనను సత్యపూర్వకంగా అంగీకరించి, వాటిని సరిదిద్ది సుహృద్భావ వాతావరణం ఏర్పర్చేందుకు సత్య శోధన, సమన్వయ కమిషన్ ఏర్పర్చాలని జస్టిస్ కౌల్ స్వతంత్రంగా ఇచ్చిన తీర్పు చెప్పుకోదగ్గదే కాని దాన్ని మోదీ ప్రభుత్వం అమలు చేసే అవకాశాలు లేవు. ఈ దేశంలో కులం పేరిట, మతం పేరిట జరిగిన అత్యాచారాలు, మారణ హోమాలు ఎన్నో. పాత గాయాల్ని గెలికి, సత్యపూర్వకంగా అంగీకరించే ప్రాయశ్చిత్తం చేసుకునే ధైర్యం అధికారంలో ఉన్న వర్గాలకు ఉంటుందా?


ఏమైనా కశ్మీర్ తీర్పును తమ విధానాల పట్ల తీర్పుగా ప్రచారం చేసేందుకు బీజేపీ నేతలు వెంటనే రంగంలోకి దిగారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా ఆగమేఘాలపై వ్యాసం రాసి ఇది ప్రతీ భారతీయుడు గర్వించే తీర్పుగా అభివర్ణించారు, దేశంలోని అన్ని భాషలకు, ప్రాంతాలకు చెందిన దాదాపు అన్ని పత్రికలు ఈ వ్యాసాన్ని ప్రచురించడం సాధారణమైన విషయం కాదు. బీజేపీకి సంబంధించి మరో ముఖ్యపరిణామం జనవరి 22న అయోధ్యలో రామాలయాన్ని ప్రారంభించడం. ఈ ప్రారంభోత్సవానికి ముఖేశ్ అంబానీ, రతన్ టాటా, గౌతమ్ అదానీ, సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లీలతో పాటు పలువురు సినీతారలను, న్యాయమూర్తులను, శాస్త్రవేత్తలను, సాహితీవేత్తలను, కనీసం 50 దేశాల ప్రతినిధులను ఆహ్వానించి బృహత్తర ఘట్టంగా నిర్వహించబోతున్నారు. 2024 ఎన్నికలకు కశ్మీర్, రామమందిరం అంశాలు తమకు ఎనలేని ప్రయోజనాలు చేపట్టేందుకు వీలుగా బీజేపీ వాటిని మార్కెటింగ్ చేసుకోబోతున్నదన్న విషయంలో సందేహం లేదు.

ఈ నేపథ్యంలో బీజేపీని ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ ఎదుర్కోగలదా అన్నది చర్చనీయాంశం. మూడు రాష్ట్రాల్లో పరాజయం తర్వాత బీజేపీతో ముఖాముఖి తలపడే స్థానాలపై కాంగ్రెస్ తన శక్తియుక్తులను మరింత బలంగా కేంద్రీకరించాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో బీజేపీతో ముఖాముఖి తలపడిన 190 లోక్‌సభ సీట్లలో బీజేపీ 175 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 15 సీట్లు మాత్రమే సొంతం చేసుకోగలిగింది. ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్‌కూ మధ్య ఓట్ల శాతంలో పెద్ద తేడా లేదని, 2018–19లో జరిగినట్లుగా అసెంబ్లీ ఎన్నికలకూ, లోక్‌సభ ఎన్నికలకూ ప్రజలు వేర్వేరుగా ఓటు వేస్తారని యోగేంద్ర యాదవ్ లాంటి సామాజిక శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నప్పటికీ ప్రజల ఆలోచనా విధానాన్ని గణాంకాల ఆధారంగా అంచనా వేయడం సాధ్యం కాదు.

మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ దెబ్బతిన్న తర్వాత ఆ పార్టీకి దేశంలో ఇతర పార్టీల అవసరం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఇతర ప్రతిపక్షాలు కూడా ఈ పరిణామాలతో ఆత్మ రక్షణలో పడ్డాయి. కాంగ్రెస్, ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు అహాన్ని వదిలి కలిసికట్టుగా పనిచేయకపోతే మోదీ సారథ్యంలోని బీజేపీని అంత అవలీలగా ఎదుర్కోలేమన్న విషయం అవి గ్రహించినట్లు కనపడుతోంది.

మూడు రాష్ట్రాల్లో గెలుపు తర్వాత వచ్చిన మోదీ మరింత కసితో ప్రతిపక్షాలను తొక్కేసేందుకు, విమర్శించిన వారిని ఏరివేసేందుకు ప్రయత్నిస్తారనడంలో సందేహం లేదు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రాను పార్లమెంట్ నుంచి బహిష్కరించిన తీరు మోదీ ప్రభుత్వ ఆధిపత్య ధోరణికి, విమర్శలను సహించలేని తత్వానికి నిదర్శనంగా అనేకమంది భావిస్తున్నారు. గతంలో ఎంపీలను పార్లమెంట్ నుంచి బహిష్కరించినప్పటికీ వారు డబ్బు తీసుకున్న దృశ్యాలు ప్రజల ముందుకు వచ్చాయి. ఇక్కడ అలాంటిదేమీ రుజువు కాలేదు. ఎంపి పోర్టల్ లాగిన్, పాస్‌వర్డ్‌ను ఇతరులతో పంచుకునే విషయంలో పార్లమెంట్ ఎలాంటి నిబంధనలనూ రూపొందించలేదు. ఆమెకు వ్యతిరేకంగా ఎథిక్స్ కమిటీ 480పేజీల నివేదికను సమర్పించడం, దానిపై పెద్దగా చర్చ లేకుండానే అరగంటలోనే ఆమెను బహిష్కరించాలని నిర్ణయించడం ఒక కక్షసాధింపునే సూచి స్తున్నాయి, దానివల్ల ఆమె తప్పు చేసిందనే అభిప్రాయం ఏర్పడడం కన్నా సానుభూతినే కలిగించేందుకు అవకాశాలు ఉన్నాయి. దీనిపై కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావడం వారి ఐక్యతకు సంబంధించి సరైన పరిణామమే అని భావించవచ్చు. కాని ఈ ఐక్యత సరిపోదు. బీజేపీని, ముఖ్యంగా మోదీని ఎదుర్కోగల సైద్ధాంతిక బలం, నాయకత్వ శక్తి తమకున్నదని, కొత్త ఆలోచనలతో, కొత్త నాయకత్వంతో ముందుకు రాగలమని కాంగ్రెస్, ప్రతిపక్షాలు నిరూపించుకోగలవా అన్నదే చర్చించాల్సి ఉన్నది.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2023-12-13T02:28:53+05:30 IST