Share News

Weekend Comment By RK : చరమాంకంలో జగన్నాటకం..

ABN , Publish Date - Dec 31 , 2023 | 04:04 AM

‘‘వినాశకాలం సమీపించినప్పుడు బుద్ధి మలినమైపోగా న్యాయం వలె తోచు అన్యాయం హృదయమునందు స్థిరంగా నిలిచిపోవును!’’...

Weekend Comment By RK : చరమాంకంలో జగన్నాటకం..

‘‘వినాశకాలం సమీపించినప్పుడు బుద్ధి మలినమైపోగా న్యాయం వలె తోచు అన్యాయం హృదయమునందు స్థిరంగా నిలిచిపోవును!’’...

మహాభారతంలోని విదుర నీతిలో వ్యాసుడు చెప్పిన మాటలు ఇవి! జగన్మోహన్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు వ్యవహరించిన, వ్యవహరిస్తున్న తీరు పరిశీలిస్తే విదుర నీతిలోని ఈ మాటలు గుర్తుకొస్తాయి. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అండగా ఉన్న వారందరినీ వదులుకోవడంతో పాటు రాజకీయ ప్రత్యర్థులపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ ప్రజలందరూ తనతోనే ఉన్నారన్న భ్రమతో జగన్‌ రెడ్డి మోనార్క్‌లా వ్యవహరిస్తున్నారు. అవినీతి కేసులలో జగన్‌ జైలుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు... రాజకీయ అనుభవం లేకపోయినా ఉమ్మడి రాష్ట్రంలోనే కాళ్లకు బలపం కట్టుకొని తిరిగి వైసీపీని నిలబెట్టిన తల్లినీ చెల్లినీ కర్కశంగా పార్టీ నుంచి గెంటేశారు. తండ్రి రాజశేఖర రెడ్డికి ఆప్తులుగా మెలిగిన వారెవరినీ దరిదాపుల్లోకి రానివ్వలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ జెండాను మోసిన కార్యకర్తలు, శాసనసభ్యులు, మంత్రుల పట్ల ఇప్పుడు నిర్దయగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టి వేధించడంలో బిజీగా ఉంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒక పిచ్చి కేసు పెట్టించి జైలుకు పంపి తన అహాన్ని చల్లార్చుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు మళ్లీ కావాలంటే కప్పం కట్టాలన్న నిబంధన విధించారు. కనీస మానవత్వం లేకుండా, ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న స్పృహ లేకుండా నిరంకుశంగా వ్యవహరిస్తూ... తానకు తానుగా తన ప్రత్యర్థులు అందరినీ ఏకం చేస్తున్నారు.

ఎన్నికల ముందు ఇలా...

మరో రెండు నెలల తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ వెలువడనున్న వేళ జగన్మోహన్‌ రెడ్డి తన అహంకారంతో ఒంటరిగా మిగిలిపోయారు. రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే కాదు – సొంత పార్టీకి చెందిన వారు కూడా ఆయనపై ఇప్పుడు కత్తులు దూస్తున్నారు. వైఎస్సార్‌ కుటుంబంలో కూడా జగన్‌ ఒంటరివాడయ్యారు. రక్తం పంచుకొని పుట్టిన షర్మిల కూడా ఎన్నికల రణరంగంలో తనతో నేరుగా తలపడే పరిస్థితి తెచ్చుకున్నారు. సహోదరుడితో నేరుగా తలపడకూడదన్న ఉద్దేశంతో తెలంగాణలో తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న షర్మిలకు అక్కడా ఇబ్బందులు సృష్టించారు. ఫలితంగా విధిలేని పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టక తప్పని పరిస్థితిని ఆమెకు జగన్‌ కల్పించారు. జీవచ్ఛవంలా మారిన కాంగ్రెస్‌ పార్టీకి జవసత్వాలు సమకూరితే అందుకు జగన్‌ రెడ్డి కారణమవుతారు. మరోవైపు తనకు తెర వెనుక నుంచి అండదండలు అందిస్తున్న భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో ఎదగలేక పోవడానికి కూడా ముఖ్యమంత్రి పిచ్చి చేష్టలే కారణం అవుతున్నాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలలో కొందరికి టికెట్లు నిరాకరించడం, మరికొందరికి స్థాన చలనం కలిగిస్తానని చెప్పడం.. ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లకోసం ధరలు నిర్ణయించడంతో పలువురు సిట్టింగ్‌లు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారు. తాజా సమాచారాన్ని బట్టి ఏపీసీసీ అధ్యక్ష పదవిని షర్మిల చేపడితే కాంగ్రెస్‌లో చేరడానికి వైసీపీకి చెందిన దాదాపు పాతిక ముప్పై మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీలలో చేరినా ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కనిపించకపోవడంతో వారంతా కాంగ్రెస్‌ పార్టీని ఆశ్రయించబోతున్నారు. ఈ పరిణామం జగన్‌ రెడ్డి ఓటు బ్యాంకుకు ఎంతో కొంత గండి కొట్టకుండా ఉండదు కదా! ముఖ్యమంత్రులుగా ఉన్నవారు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు ఓడిపోవడానికి ప్రతిపక్షాలు పన్నే వ్యూహాల కంటె తమ స్వయంకృతాపరాధాలే కారణమవుతాయి. తెలంగాణలో కేసీఆర్‌ విషయంలో ఇది రుజువైంది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి అదృష్టం కలసి వచ్చిందంటే అందుకు కేసీఆర్‌ మాత్రమే కారణం. 2019లో జగన్‌ అధికారంలోకి రావడానికి చంద్రబాబు నిర్లక్ష్యమే కారణం. ఇప్పుడు... ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఓడిపోనుందన్న అభిప్రాయం బలంగా వ్యాపించడానికి జగన్‌ రెడ్డే కారణం. ఐదేళ్ల అధికారం తర్వాత, అది కూడా ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న వేళ జగన్‌ రెడ్డి స్థానంలో ఉన్నవారు కనీస జాగ్రత్తలు తీసుకొనే ప్రయత్నం చేస్తారు.

‘నా రూటే సెపరేటు’ అన్నట్టుగా వ్యవహరించే జగన్‌ జాగ్రత్తలు తీసుకోకపోగా.... ధన వ్యామోహంతో టికెట్లు అమ్ముకొనే ప్రయత్నం చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? టికెట్లు అమ్ముకుంటున్నారన్న వార్తలు విస్తృతంగా ప్రచారం కావడం 2014లో జగన్‌ ఓడిపోవడానికి ప్రధాన కారణంగా చెబుతారు. 2009కి ముందు ప్రజారాజ్యం పార్టీ విషయంలోనూ ఇటువంటి ప్రచారమే జరిగింది. దీంతో రాజకీయాల్లో చిరంజీవికి చేదు అనుభవమే మిగిలింది. గుంటూరు, ఒంగోలు, నంద్యాల వంటి స్థానాలు కావాలంటే రూ.180 కోట్ల వరకు చెల్లించాలని, చంద్రబాబు అండ్‌ కోను తిడుతూ ఉండాలని సిట్టింగ్‌ ఎంపీలకు జగన్‌ షరతులు విధించడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో, మీ పార్టీకో దండం, మీ టికెట్టుకో దండం అని ఇలాంటి వారందరూ జగన్‌కు దూరం కాబోతున్నారు. నిజానికి ఈ ఐదేళ్లలో ఇసుక, మద్యంతో పాటు గనులను చెరపట్టడం ద్వారా జగన్‌ రెడ్డి లెక్కలేనంత సొమ్ము పోగేసుకున్నారని, ఈ ఎన్నికల్లో అభ్యర్థులకు ఆయన పుష్కలంగా ఆర్థిక సహాయం చేయబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్‌ వ్యవహారాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. దళిత, గిరిజన అభ్యర్థులకు మాత్రమే అవసరాన్ని బట్టి కొంత ఆర్థిక సహాయం పార్టీ నుంచి అందుతుందని, మిగతా వారందరూ సొంతంగా ఖర్చులు పెట్టుకోవాలని చెబుతున్నారట! ఈ పరిణామాన్ని ఊహించకపోవడంతో పాటు ప్రజల్లో వ్యతిరేకతను కళ్లారా చూస్తున్న సిట్టింగ్‌లు పార్టీకి రాంరాం చెప్పడానికి సిద్ధమవుతున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు అభ్యర్థుల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకోవడం సహజం. అలాంటిది మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్న జగన్‌ రెడ్డి పార్టీ టికెట్లు కూడా అమ్ముకొని సొమ్ము చేసుకోవాలని అనుకోవడం విడ్డూరంగా ఉంది. తాడేపల్లి ప్యాలెస్‌కు పిలిపించుకుంటున్న సిట్టింగ్‌లను జగన్‌ రెడ్డి కనీసం కలవకుండా... పార్టీ కో–ఆర్డినేటర్ల వద్ద తేల్చుకోవాలని చెప్పడం పుండు మీద కారం చల్లినట్టుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో పార్టీ నాయకుల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కో–ఆర్డినేటర్లు కూడా బిక్కముఖం వేస్తున్నారు. ‘అధినాయకుడు చెప్పమన్నదే మేం చెబుతున్నాం, ఆ తర్వాత మీ ఇష్టం’ అని వారు చేతులెత్తేస్తున్నారు. జగన్‌ రెడ్డికి అత్యంత సన్నిహితులు అని అనుకుంటున్న వాళ్లే... ‘ముఖ్యమంత్రి చెప్పిన మాటలే మీకు చెబుతున్నాం. నిర్ణయం తీసుకోవలసింది మీరే’ అని చేతులు దులుపుకొంటూ ఉండటం గమనార్హం. పార్టీలో కీలక వ్యక్తి అనుకుంటున్న ఒక ఎంపీ సైతం.. ‘‘మళ్లీ గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. కప్పం కట్టడమా? లేదా? అన్నది మీరే నిర్ణయించుకోండి’’ అని టికెట్‌ కోసం వచ్చిన వాళ్లకు ముఖం మీదే చెబుతున్నారు.


వినాశ కాలే...

వినాశ కాలం సమీపించినప్పుడు హిత వాక్యాలు కూడా చెవికెక్కవు. ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ వంటి హితుల సలహాలు కూడా జగన్‌కు నచ్చడం లేదు. తాను అనుకున్న ప్రయోగాలకే ఆయన పరిమితమవుతున్నారు. రాజకీయ పార్టీలో నాయకులు, కార్యకర్తల పాత్ర కూడా ఉంటుందని జగన్‌ అంగీకరించడం లేదు. ఐ–ప్యాక్‌ సంస్థతో పాటు వలంటీర్లు ఉంటే చాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఐ–ప్యాక్‌ సంస్థ చెప్పినట్టుగా అభ్యర్థుల మార్పునకు సిద్ధపడుతున్నారు. గత ఎన్నికల్లో ప్రశాంత్‌ కిశోర్‌ నాయకత్వంలో ఈ ఐ–ప్యాక్‌ సంస్థ పన్నిన కుయుక్తుల వల్ల తాను అధికారంలోకి వచ్చానని నమ్ముతున్న జగన్‌ రెడ్డి ఇప్పుడు కూడా ఆ సంస్థ పైనే ఆధారపడుతున్నారు. అయితే నాడు జగన్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్‌ కిశోర్‌ ఇప్పుడు దూరమయ్యారు. ప్రశాంత్‌ కిశోర్‌ తాజాగా చంద్రబాబును కలిసి చర్చలు జరపడం విదితమే. ఐ–ప్యాక్‌ సంస్థను ఏర్పాటు చేసిన తనకు కొంతకాలంగా రాయల్టీ చెల్లించక పోవడంతో జగన్‌ రెడ్డి పట్ల ప్రశాంత్‌ కిశోర్‌ ఆగ్రహంగా ఉన్నారు. మొత్తం మీద అధికార వైసీపీలో ఇప్పుడు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ముంగిట పార్టీలో అసమ్మతి తలెత్తకుండా ఏ పార్టీ అయినా జాగ్రత్తలు తీసుకుంటుంది. జగన్‌కు ఇవేమీ పట్టవు. ‘‘ప్రజలు నాతో ఉన్నారు. మధ్యలో వలంటీర్లు, ఐ–ప్యాక్‌ సంస్థ ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు నిమిత్తమాత్రులు’’ అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఈ కారణంగా పలువురు సిట్టింగ్‌లు ప్రత్యామ్నాయ అవకాశాల వైపు చూస్తున్నారు. కొంత మంది సిట్టింగ్‌ ఎంపీలు తెలుగుదేశం పార్టీలో చేరి పోటీ చేయడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌ రెడ్డి సోదరి షర్మిల ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి అడుగిడబోతున్నారు.

అదే నిజమవుతోంది...

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతలను షర్మిల చేపట్టబోతున్నారని కొంత కాలం క్రితం నేను చెప్పినప్పుడు జగన్‌ రెడ్డి భక్తులు పిచ్చి కూతలు కూశారు. షర్మిలను కాంగ్రెస్‌ పార్టీ చేరదీయకుండా జగన్‌ రెడ్డి తనవంతు ప్రయత్నం కూడా చేశారు. అయితే తెలంగాణలో విజయం తర్వాత ఆంధ్రప్రదేశ్‌పై కూడా కాంగ్రెస్‌లో ఆశలు చిగురిస్తున్నాయి. 2024లో కాకపోయినా 2029 ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసుకోవచ్చునన్న నమ్మకం రాహుల్‌ గాంధీలో ఏర్పడింది. దీంతో ఏపీసీసీ అధ్యక్ష బాధ్యతలు షర్మిలకు అప్పగించాలన్న నిర్ణయానికి రాహుల్‌ గాంధీ వచ్చారు. ఈ విషయాన్ని ఆయన రాష్ట్ర నాయకుల వద్ద స్పష్టం చేశారు. ఏపీ కాంగ్రెస్‌ బాధ్యతలు చేపట్టడానికి తొలుత విముఖత వ్యక్తం చేసిన షర్మిల ఇప్పుడు సుముఖంగానే ఉన్నారు. మరికొద్ది రోజులలో ఆమెను ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమించే అవకాశం ఉంది. వైసీపీలో నిరాదరణకు గురవుతున్న వారందరూ రాష్ట్ర రాజకీయాలలోకి షర్మిల రాబోతున్నారన్న విషయం తెలుసుకుని కాంగ్రెస్‌ వైపు చూడటం మొదలుపెట్టారు. వైసీపీ టికెట్‌ దక్కదనుకుంటున్న వారిలో పలువురు ఇప్పటికే కేవీపీ రామచంద్రరావు వంటి కాంగ్రెస్‌ నాయకులతో టచ్‌లోకి వెళ్లారు. తాజా సమాచారం ప్రకారం దాదాపు పాతిక మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని ఇది వరకే నిర్ణయించుకున్నారు. కొంత కాలంగా ఆయన షర్మిలతో టచ్‌లో ఉన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓట్ల షేర్‌ను 15 శాతం వరకు పెంచుకోవాలని రాహుల్‌ గాంధీ లక్ష్యంగా పెట్టుకున్నారు. జగన్‌ రెడ్డి చర్యలు కూడా కాంగ్రెస్‌ పార్టీకి కలసి వచ్చేలా కనిపిస్తున్నాయి. అన్నతో ముఖాముఖి తలపడటానికి ఇంతకాలం విముఖంగా ఉన్న షర్మిల ఇప్పుడు శషబిషలకు తావులేకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. తాజా సమాచారం ప్రకారం... వచ్చే ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్‌ పార్టీ తరపున కడప ఎంపీ స్థానానికి పోటీ చేసే అవకాశం ఉంది. వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్‌ రెడ్డి ఇప్పుడు కడప ఎంపీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనే వైసీపీ అభ్యర్థి కావచ్చు. అయితే, కడప ఎంపీ స్థానం నుంచి జగన్‌ రెడ్డి భార్య భారతి రెడ్డి పోటీ చేయాలనుకుంటున్నట్టు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ తరఫున షర్మిల పోటీ చేస్తే భారతీ బరిలోకి దిగకపోవచ్చు. బాబాయ్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడుగా ఉన్న అవినాశ్‌ రెడ్డిని ఈ ఎన్నికల్లో ఓడించాలని వైఎస్‌ రాజశేఖర రెడ్డి కుటుంబంలో పలువురు పట్టుదలగా ఉన్నారు. షర్మిల పోటీకి దిగితే అవినాశ్‌ రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్‌ కుటుంబ సభ్యులతోపాటు వివేకా కుమార్తె డాక్టర్‌ సునీత కూడా ఆమె తరఫున ప్రచారం చేయవచ్చునని అంటున్నారు. షర్మిల ఎన్నికల బరిలోకి దిగితే అదొక సంచలనం అవుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి ఊపు వస్తుంది కూడా. ఈ పరిణామం జగన్మోహన్‌ రెడ్డికి అనుకూలమా? వ్యతిరేకమా? అంటే ఎవరికి వారు తమకు అనువైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఎవరికి చేటు...

షర్మిల రంగప్రవేశం వల్ల తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకుకే చిల్లు పడుతుందని కొందరు భ్రమిస్తున్నారు. అయితే వారు ఒక విషయం మర్చిపోతున్నారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌కు అండగా ఉన్న వర్గాలే ఇప్పుడు వైసీపీ ఓటు బ్యాంకుగా ఉంటున్నాయి. ఈ వర్గాలలో కూడా ఇప్పుడు జగన్‌ రెడ్డి పాలన పట్ల సంతృప్తి లేదు. కాంగ్రెస్‌ పార్టీ బలపడే అవకాశం ఉందన్న నమ్మకం కుదిరితే ఈ వర్గాలు మళ్లీ కాంగ్రెస్‌కు చేరువ అవుతాయి. అదే జరిగితే జగన్‌కు భారీ నష్టం తప్పదు. అంతే కాదు, జగన్‌ ఇప్పుడు టికెట్లు నిరాకరిస్తున్న వారిలో పలువురు కాంగ్రెస్‌లో చేరి పోటీ చేస్తే వారు చీల్చేది వైసీపీ ఓట్లు మాత్రమే. సిట్టింగ్‌లు ఐదు నుంచి పది వేల ఓట్లు చీల్చే అవకాశం ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే వరకు ప్రజలు గుంభనంగా ఉంటారు. షెడ్యూల్‌ వెలువడిన తర్వాత ప్రజలు బయటపడతారు. తెలంగాణలో ఇది రుజువైంది. ఎన్నికలకు మూడు నెలల ముందు వరకు ఎవరు సర్వే చేసినా భారత రాష్ట్ర సమితికే 90కి పైగా సీట్లు వస్తాయని లెక్క తేలేది. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన తర్వాత బీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంకు వేగంగా పడిపోయింది. ‘‘షెడ్యూల్‌ వెలువడక ముందు మాకంతా పచ్చగా కనబడింది. జనం మాతోనే ఉన్నట్టు కనిపించారు. షెడ్యూల్‌ వెలువడిన తర్వాత మాకు తత్వం బోధపడింది’’ అని పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఓటమి తర్వాత చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మాత్రం ఇందుకు మినహాయింపు ఎలా అవుతారు? తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో అణచివేత మరింత అధికంగా ఉన్నందున ప్రజలు ఇప్పుడు బయటపడక పోవచ్చు. రాష్ర్టాన్ని అన్ని విధాలా అధోగతిపాలు చేసిన జగన్‌ రెడ్డిని మాత్రం కేసీఆర్‌కు భిన్నంగా ప్రజలు ఎందుకు ఆదరిస్తారు?


బీజేపీ స్వయంకృతాలు...

ఈ విషయం అలా ఉంచితే, భారతీయ జనతా పార్టీ పెద్దల ఎత్తుగడలు తెలుగు రాష్ర్టాలలో వికటిస్తున్నాయి. ఉత్తరాది మోడల్‌ దక్షిణాదిలో ఫలించదన్న వాస్తవాన్ని గుర్తించక పోవడంవల్లనే తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ బోల్తా పడింది. నిజానికి తెలంగాణలో 30 నుంచి 40 సీట్లు గెలిచే అవకాశం బీజేపీకి ఉండేది. అయితే, బీజేపీ ఢిల్లీ పెద్దలు వేసిన తప్పటడుగుల వల్ల ఆ పార్టీ బలం 8 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ప్రజల్లో ఆ పార్టీకి ఆదరణ పెరగడం వల్ల కాదని, కేసీఆర్‌ పట్ల వ్యతిరేకత వల్లనే అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రెండు రోజుల క్రితం చెప్పిన మాట అక్షర సత్యం. కేసీఆర్‌కు ప్రత్యామ్నాయంగా కనబడినంత కాలం తెలంగాణలో బీజేపీ బలంగా ఉండింది. పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్‌ను తప్పించడంతోపాటు ఆ తర్వాత జరిగిన పరిణామాలతో బీజేపీపై ప్రజాభిప్రాయం మారిపోయింది. కేసీఆర్‌కు ప్రత్యామ్నాయంగా ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని చూసుకున్నారు. ఫలితంగా కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా బీజేపీ పెద్దల వ్యూహాలు వికటిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి పరోక్ష సహాయ సహకారాలు అందించడం ద్వారా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని బలహీనపరచి ఆ స్థానాన్ని ఆక్రమించుకోవాలని బీజేపీ పెద్దలు తలపోశారు. అయితే, తెలుగుదేశం పార్టీ అధినేత అనేక కష్టనష్టాలకు ఓర్చి, చివరకు జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చినా పార్టీని నిలబెట్టుకోగలిగారు. తెలంగాణలో కేసీఆర్‌తో లాలూచీ పడ్డారన్న అపవాదును భరించినట్టుగానే ఆంధ్రప్రదేశ్‌లో కూడా జగన్‌ రెడ్డిని కాపాడుతున్నారన్న అభిప్రాయం ప్రజల్లో బలపడటానికి బీజేపీ పెద్దలే కారణమయ్యారు. దీంతో రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్‌ పార్టీని సైతం ప్రజలు క్షమించగలిగారు కానీ బీజేపీని సహించలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ మళ్లీ బతికి బట్టకట్టదు... అని బీజేపీ పెద్దలు వేసుకున్న లెక్కలు తప్పుతున్నాయి. ప్రజల్లో తమ పార్టీ పట్ల ఏర్పడుతున్న అభిప్రాయాన్ని ఖాతరు చేయకపోవడంతో రాష్ట్రంలో బలపడాలనుకున్న కలలు కల్లలయ్యాయి. ఇప్పుడు ఎన్నికల వేళ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి అనుసరిస్తున్న అసంబద్ధ నిర్ణయాల ప్రభావం బీజేపీపై కూడా పడుతుంది. ఈ కారణంగానే కాంగ్రెస్‌ పుంజుకొనే పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి కారణం ఏమిటో గుర్తించిన అమిత్‌ షా వంటి వారు ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ పరిస్థితి దిగజారడానికి కారణాలను గుర్తించలేక పోవడం వింతగా ఉంది. 2024లో కూడా జగన్‌ రెడ్డి మళ్లీ గెలుస్తారన్న అంచనాతో బీజేపీ పెద్దలు ఇప్పటికీ ఉన్నట్టు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతే ఆ తర్వాత రాష్ట్రంలో బలపడిపోవచ్చునని, జగన్‌ రెడ్డిని ఫినిష్‌ చేయడం తమ చేతిలో పని అని బీజేపీ పెద్దలు లెక్కలు వేసుకున్నారు. అయితే తానొకటి తలస్తే దైవమొకటి తలచింది అన్నట్టుగా బీజేపీ లెక్కలు తప్పబోతున్నాయి. తెలంగాణలో కేసీఆర్‌ తాను మునిగి బీజేపీని కూడా ముంచినట్టుగా ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ రెడ్డి తాను మునిగి బీజేపీని కూడా ముంచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో జగన్మోహన్‌ రెడ్డి ఓడిపోతే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బలపడుతుంది. తెలంగాణలో ఇప్పుడు బీఆర్‌ఎస్‌ ఏ పరిస్థితుల్లో ఉందో అంతకంటే అధ్వాన పరిస్థితి వైసీపీకి ఎదురవుతుంది. అయితే జగన్‌ రెడ్డి దంపతుల అభిప్రాయం మరోలా ఉంది. రాష్ట్రంలో ఏ కారణం వల్లనైనా తాము ఓడిపోయినా, కేంద్రంలో నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తున్నందున తమకు, తమ పార్టీకీ పూర్తి రక్షణ ఉంటుందన్నది జగన్‌ దంపతుల భరోసాగా ఉంది. మరి కొద్ది గంటల తర్వాత కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. కొత్త సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎవరి జాతకం ఎలా ఉండబోతున్నదో స్పష్టమవుతుంది. ఎవరి అంచనాలు ఫలిస్తాయి– ఎవరి అంచనాలు తారుమారవుతాయో వేచి చూద్దాం!

ఆర్కే

Updated Date - Dec 31 , 2023 | 04:20 AM