Share News

Weekend Comment By RK ; ఓటమి... ఆ ఇద్దరిదే!

ABN , Publish Date - Dec 24 , 2023 | 02:35 AM

పురాణాలలో పౌండ్రక వాసుదేవుడు అనే క్యారెక్టర్‌ ఒకటి ఉండేది. తానే అసలైన శ్రీకృష్ణుడిననీ, నిజమైన కృష్ణుడికి ఏ శక్తులూ లేవని పౌండ్రక వాసుదేవుడు ప్రచారం చేసుకున్నాడు. అమాయక ప్రజలు ఏ కాలంలోనైనా...

Weekend Comment By RK ; ఓటమి... ఆ ఇద్దరిదే!

పురాణాలలో పౌండ్రక వాసుదేవుడు అనే క్యారెక్టర్‌ ఒకటి ఉండేది. తానే అసలైన శ్రీకృష్ణుడిననీ, నిజమైన కృష్ణుడికి ఏ శక్తులూ లేవని పౌండ్రక వాసుదేవుడు ప్రచారం చేసుకున్నాడు. అమాయక ప్రజలు ఏ కాలంలోనైనా ఉంటారు. ఆ కాలంలో కూడా అతగాడి మాటలు నమ్మిన కొందరు భక్తజనంగా తయారయ్యారు. పౌండ్రక వాసుదేవుడి చేష్టలను గమనిస్తూ వచ్చిన శ్రీకృష్ణుడు చివరికి అతడికి బుద్ధి చెబుతాడు. ఇది ద్వాపర యుగం నాటి ముచ్చట! ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. ఈ కాలంలో కూడా పౌండ్రక వాసుదేవుళ్లను అప్పుడప్పుడూ చూస్తున్నాం. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని ఏసుప్రభువుతో పోల్చుతూ ఒక సంస్థ ప్రచారం మొదలెట్టింది. తనరూపంలో మారువేషగాళ్లు వస్తుంటారని బైబిల్‌లోనే ఏసు ప్రభువు చెప్పారంటారు! ఈ నేపథ్యంలో జగన్మోహన్‌ రెడ్డిని మారు వేషగాడు అనాలా? లేక ఏసుప్రభువుగా కొలవాలా? అన్నది తేలాల్సి ఉంది. జగన్‌రెడ్డిని ఏసుప్రభువుతో పోల్చడమే కాకుండా ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌లను గుంటనక్కలతో పోల్చుతూ ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లపై విమర్శలు రావడంతో అధికారులు వాటిని తొలగించారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తి పూజను అనుమతిస్తే ఇలాగే వెర్రి తలలు వేస్తుంది. వ్యక్తి పూజ పెరిగే కొద్దీ తామే అసలైన దేవుళ్లమని పూజలు అందుకునే వారు కూడా నమ్మే పరిస్థితి ఏర్పడుతుంది. ఏసుప్రభువును ఆరాధించే జగన్మోహన్‌ రెడ్డి తానే ఏసుప్రభువునని నమ్ముతున్నారేమో తెలియదు. క్రైస్తవ మతాన్ని ఆచరించే అధికారులు కొందరు జగన్‌ను దైవాంశ సంభూతుడిగా పోల్చడం చూశాం. ఆయన అధికారంలోకి వచ్చిన కొత్తలో ఒక సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ‘‘2019లో ఒక అద్భుతం జరిగింది. అదే జగన్‌ ముఖ్యమంత్రి కావడం’’ అని అధికారిక సమావేశంలోనే కీర్తించారు. ఈ పొగడ్తలు సహజంగానే ముఖ్యమంత్రిని మత్తులో ముంచుతాయి కదా! ఈ క్రమంలోనే జగన్‌రెడ్డిని పిచ్చిపిచ్చిగా అభిమానించే కొందరు క్రైస్తవులు ఆయనను ఏకంగా ఏసు ప్రభువుతో పోల్చుతూ పోస్టర్లు ముద్రించారు. ఈ ‘పౌండ్రక’ ఏసు ప్రభువు పాలన విషయానికి వద్దాం! తనని తాను దేవుడిబిడ్డగా ప్రచారం చేసుకునే జగన్మోహన్‌ రెడ్డి క్రైస్తవ బోధనలను ఆచరిస్తున్నారా? అంటే లేదనే చెప్పాలి. క్రైస్తవ మత బోధనల ప్రకారం సాటి వారిపట్ల ప్రేమ, దయ, క్షమ చూపాలి. జగన్‌లో ఈ లక్షణాలు మచ్చుకు ఒక్కటి కూడా లేవు. అయినా క్రైస్తవులలో అనేకులు ఆయనను తాము ఆరాధించే ఏసు ప్రభువు అవతారంగా భావించడమే ఈ కాలపు విషాదం. ఎవరు దేవుడో ఎవరు దెయ్యమో తేల్చుకోలేని పరిస్థితులలో ప్రజలు ఉండడం అన్ని యుగాల్లోనూ ఉంటుంది. అందుకే పౌండ్రక వాసుదేవుడి క్యారెక్టర్‌కి అంత ప్రచారం లభించింది.

మార్చి... ఏమార్చి...

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు వద్దాం! తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై బలంగా పడినట్టుంది. దాదాపుగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టికెట్లు ఇవ్వడం తెలంగాణలో కేసీఆర్‌ ఓడిపోవడానికి ఒక కారణంగా గుర్తించారు. దీంతో జగన్మోహన్‌ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలలో పలువురికి మళ్లీ టికెట్‌ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ‘సర్వేల ప్రకారం మీరు ఓడిపోతున్నారు. సారీ నో టికెట్‌’ అని జగన్‌ చెప్పేస్తున్నారు. పరీక్షా కేంద్రాలలో అనుసరించే జంబ్లింగ్‌ మాదిరిగా కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాలు మార్చుతున్నారు. ఈ చర్యలు చేపట్టినంత మాత్రాన జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తారా? అంటే వస్తారని చెప్పడానికి శాస్ర్తీయ ఆధారాలు లేవు. ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేల మీద మాత్రమే ప్రజలలో వ్యతిరేకత ఉందా? ముఖ్యమంత్రి జగన్‌ మీద లేదా? 2019 నుంచి ఇప్పటివరకు జగన్నామస్మరణతో రాష్ట్రం మారుమోగింది కదా! అలాంటప్పుడు నిమిత్తమాత్రులైన ఎమ్మెల్యేలు, మంత్రులపై ప్రజలకు వ్యతిరేకత ఏల? మంత్రులకు, ప్రజాప్రతినిధులకు అధికారాలే లేకుండా చేశారు. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి వచ్చే ఆదేశాలు, అందించే స్ర్కిప్ట్‌ ప్రకారం ఎవరిని తిట్టమంటే వారిని తిట్టడానికే మంత్రులను, శాసన సభ్యులను పరిమితం చేశారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయించే ఒక్క వెసులుబాటు కూడా వారికి లేకుండా చేశారు. జగన్మోహన్‌ రెడ్డి మాత్రమే బటన్లు నొక్కుతూ వచ్చారు. చప్పట్లు కొట్టడానికి, జగన్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేయించడానికి మాత్రమే మంత్రులు, శాసన సభ్యులు పరిమితం అయ్యారు.

అలా అని అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడిన ప్రజా ప్రతినిధులను ఈ నాలుగేళ్లలో ముఖ్యమంత్రి ఒక్కసారైనా మందలించారా? అంటే అదీ లేదు. ప్రజా ప్రతినిధులకు ముఖ్యమంత్రి దర్శనాన్నే దుర్లభం చేశారు. వాటికన్‌ సిటీలోకి ఎవరైనా వెళ్లి పోప్‌ను కలుసుకోవచ్చునేమో కానీ, తాడేపల్లి ప్యాలెస్‌లోకి మాత్రం ప్రవేశం ఉండదు. అయినా, కొంత మంది ఎమ్మెల్యేలపైన ప్రజల్లో వ్యతిరేకత ఉందని జగన్‌రెడ్డి ఎలా నిర్ధరణకు వచ్చారో తెలియదు. మరో రెండు మూడు నెలల్లో జరిగే ఎన్నికల్లో జగన్‌ మాత్రమే కీలకం. ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకొనేవారు ఒక వైపు, రాష్ట్రం బాగుపడాలంటే జగన్‌ పోవాలని కోరుకొనేవారు మరో వైపుగా ప్రజలు రెండు శిబిరాలుగా చీలిపోయారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థులు నిమిత్తమాత్రులే!

రాజకీయ... పరి‘భ్రమ’ణం..

తన పాలన చూసి ప్రజలు మురిసిపోతున్నారని జగన్‌రెడ్డి బలంగా నమ్ముతున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండేవారు అందరూ ఇదే విధంగా నమ్ముతారనుకుంటా! గతంలో చంద్రబాబు కూడా తన ప్రభుత్వ పనితీరు పట్ల 70 నుంచి 80 శాతం మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పుకొనేవారు. ఇప్పుడు జగన్‌ కూడా అలాగే చెప్పుకుంటున్నారు. తెలంగాణలో తాజాగా జరిగిన ఎన్నికల సందర్భంగా కేసీఆర్‌ అండ్‌ కో కూడా ఇలాగే భావించారు. శాసనసభ్యులపై వ్యతిరేకత ఉన్నప్పటికీ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌నే అత్యధికులు కోరుకుంటున్నారని చెప్పుకొన్నారు. అదే విషయాన్ని నమ్మి మళ్లీ అధికారంలోకి వస్తామని భ్రమించారు. అయితే ప్రజలు మరోలా ఆలోచించారు. కేసీఆర్‌ అహంభావానికి గుణపాఠం చెప్పాలనుకున్నారు. భారత రాష్ట్ర సమితి తరఫున ఎవరు పోటీ చేస్తున్నారు– కాంగ్రెస్‌–బీజేపీల తరఫున ఎవరు పోటీ చేస్తున్నారు అని చూడలేదు. కాంగ్రెస్‌ పార్టీకి అధికారం అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చిన ప్రజలు ఆ పార్టీ తరఫున పోటీచేసిన వారి ఆర్థిక స్తోమతను కూడా చూడలేదు. దళితబంధు పథకాన్ని తెచ్చానని కేసీఆర్‌ గొప్పగా చెప్పుకొన్నప్పటికీ దాదాపుగా అన్ని రిజర్వుడు నియోజక వర్గాలలో కాంగ్రెస్‌ అభ్యర్థులే గెలిచారు. కేసీఆర్‌ను వద్దనుకున్న వారు కాంగ్రెస్‌ను ఆదరించారు. ప్రజాభిప్రాయం అస్పష్టంగా ఉన్నప్పుడు పార్టీ అభ్యర్థులు కొంత మేరకు ప్రభావం చూపగలుగుతారు. సిట్టింగ్‌లపైన వ్యతిరేకత ప్రభావం కూడా ఉంటుంది.

ప్రజలు దృఢ నిర్ణయం తీసుకున్నాక ఈ లెక్కలేవీ పనిచేయవు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఓటమికి కేసీఆర్‌ ఒక్కరే కారణం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. జగన్‌రెడ్డి కేంద్ర బిందువుగానే ఎన్నికలు జరుగుతాయి. ఆయనే మళ్లీ ముఖ్యమంత్రి కావాలనుకొనేవారు అధికంగా ఉంటే వైసీపీ తరఫున ఎవరు పోటీ చేసినా గెలిపిస్తారు. రాష్ట్రం మాత్రమే గెలవాలనుకొనేవారు ఎక్కువగా ఉంటే జగన్‌రెడ్డి ఎంత మంది అభ్యర్థులను మార్చినా ఓడిస్తారు. తెలంగాణలో కేసీఆర్‌గానీ, ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌రెడ్డిగానీ వ్యక్తి పూజకు అలవాటు పడిపోయారు. తమ నాయకత్వాన్ని మాత్రమే ప్రజలు కోరుకుంటున్నారని భ్రమిస్తున్నారు. ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ఇష్టపడరు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ప్రారంభం కాకముందు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వద్ద కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన సభకు హాజరైన అశేష ప్రజానీకం ఆనాడే ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోయేదీ సంకేతాలు ఇచ్చారు. అది తెలుసుకోలేని కేసీఆర్‌ను ఎవరు మాత్రం కాపాడగలరు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో లోకేశ్‌ పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరైన అశేష ప్రజానీకం కూడా జగన్మోహన్‌ రెడ్డికి స్పష్టమైన సందేశమే ఇచ్చారని చెప్పవచ్చు.

లోకేశ్‌ ‘న్యూ అవతార్‌’

నారా లోకేశ్‌ ఈ పాదయాత్ర ద్వారా తన నాయకత్వ లక్షణాలపై ఉన్న అపోహలను తొలగించుకోగలిగారు. అతడిని పప్పుగా జగన్‌ అండ్‌ కో ఎంత అవహేళన చేశారో మనం చూశాం. అవమానాలనే సవాళ్లుగా స్వీకరించిన లోకేశ్‌, సుదీర్ఘ పాదయాత్ర చేపట్టడం ద్వారా ఒక మెచ్యూర్డ్‌ నాయకుడిగా పార్టీ శ్రేణుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు అంతులేని సాచివేత ప్రదర్శిస్తారు. లోకేశ్‌ ఇందుకు పూర్తి విరుద్ధం. అతను వేగంగా నిర్ణయాలు తీసుకుంటారన్న పేరు తెచ్చుకున్నారు. తండ్రిలా మొహమాటాలకు తావు లేకుండా తన అభిప్రాయాలను పార్టీ నాయకుల ముఖం మీదే చెప్పిన సందర్భాలు ఎన్నో! తన నాయకత్వంపై పార్టీ శ్రేణుల్లో నమ్మకం కలిగించగలిగారు. ఇవాళ లోకేశ్‌ పరిణితి చెందిన నాయకుడిగా గుర్తింపు పొందగలిగారంటే అందుకు జగన్మోహన్‌ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. పప్పు పప్పు.. అని అవహేళన చేసి ఉండకపోతే లోకేశ్‌లో ఇంత పట్టుదల ఏర్పడి ఉండేది కాదు. అధికారంలో ఉన్న వాళ్లు ఒక వ్యక్తిని టార్గెట్‌ చేసుకుంటూ పోతే ప్రతికూల ఫలితాలే వస్తాయి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జగన్‌రెడ్డి కేంద్ర బిందువుగా విమర్శలు చేసేవారు. లక్ష కోట్ల అవినీతి అని పదే పదే విమర్శించారు. దీంతో ప్రజలు ఎవరు మాత్రం అవినీతికి పాల్పడటం లేదంటూ జగన్‌ అవినీతిని పట్టించుకోలేదు. ఇప్పుడు జగన్‌ కూడా తన మనుషుల చేత లోకేశ్‌ను ఎగతాళి చేయించారు. ఫలితంగానే లోకేశ్‌లోని నాయకత్వ లక్షణాలు బయటకు వచ్చాయి. పాదయాత్రకు ముందు లోకేశ్‌ పట్ల ప్రజల్లోనూ చులకన భావం ఉండేది.


ఇప్పుడు తనను తాను ప్రజల ముందు ఆయన ఆవిష్కరించుకున్నారు. చంద్రబాబు తర్వాత పరిస్థితి ఏమిటి అని అనుకునేవారికి ఇప్పుడు లోకేశ్‌ రూపంలో ఒక ఆశాకిరణం లభించింది. లోకేశ్‌కు పూర్తిగా ప్రజామోదం లభించిందని చెప్పలేంగానీ అతడు తనను తాను రుజువు చేసుకోవడంలో సఫలీకృతులయ్యారు. చంద్రబాబు క్రియాశీలంగా ఉన్నంత వరకు లోకేశ్‌ తానేమిటో పూర్తిగా ఆవిష్కరించుకోలేరు. అయితే నిన్నటి వరకు లోకేశ్‌ను హేళన చేసిన జగన్‌ అండ్‌ కో ఇప్పుడు అతడిని గుర్తిస్తున్నారు. లోకేశ్‌ను తేలికగా తీసుకోకూడదని భావించడం వల్లనే అతడిని కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారుల పేర్లు రెడ్‌ బుక్‌లో రాసుకుంటున్నామని చెప్పినందుకుగాను లోకేశ్‌ను అరెస్టు చేయడానికి అనుమతివ్వాలని సీఐడీ అధికారులు న్యాయస్థానాన్ని కోరడం విడ్డూరంగా ఉంది. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న అధికారులను ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు హెచ్చరించడం సర్వసాధారణం. గతంలో ప్రతిపక్షంలో ఉన్న వాళ్లందరూ ఇలాగే హెచ్చరించేవారు. అంతెందుకు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌ కూడా ఇలాంటి హెచ్చరికలు చేశారు కదా! నిన్నగాక మొన్న ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా అధికార పక్షానికి కొమ్ము కాస్తున్న అధికారుల వివరాలు రెడ్‌ బుక్‌లో రాసుకున్నానని హెచ్చరించారు. అప్పుడు తెలంగాణ సీఐడీ అధికారులు పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే జగన్‌రెడ్డికి రక్షకులుగా సీఐడీ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి హెచ్చరికలకే లోకేశ్‌ను అరెస్టు చేయాలని సీఐడీ అధికారులు ఉబలాట పడుతున్నారంటేనే ఆయన నాయకత్వాన్ని తాడేపల్లి ప్యాలెస్‌ గుర్తించిందని భావించాలి. అయినా తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి వచ్చినా చంద్రబాబు యథావిధిగా మెతక వైఖరినే అవలంబిస్తారు. ఈ నమ్మకంతోనే కొంత మంది అధికారులు ఇప్పటికీ విశృంఖలంగా వ్యవహరిస్తున్నారు. లోకేశ్‌ సహచరుడైన రాజేశ్‌ కిలారును ఇటీవల సీఐడీ అధికారులు ప్రశ్నించారు. ఆ సందర్భంగా సీతారామాంజనేయులు, రఘురామ రెడ్డి అనే ఇద్దరు ఐపీఎస్‌ అధికారులు రాజేశ్‌ను పిలిపించుకొని తీవ్రంగా బెదిరించారు. ఈ విషయాన్ని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్న తెలుగుదేశం పార్టీ ఆ ఇద్దరు అధికారులు అలా హద్దుమీరి ఎలా బెదిరిస్తారని ఎండగట్టే సాహసం చేయలేక పోయింది. చంద్రబాబు హయాంలో ఇలా జరిగి ఉంటే జగన్‌ అండ్‌ కో నానా యాగీ చేసి ఉండేవారు. చంద్రబాబులో మాత్రమే కాదు – తెలుగుదేశం పార్టీ డీఎన్‌ఏలోనే పిరికితనం, భయం ఉందేమో? కేసుల మీద కేసులు పెడుతూ తెలుగుదేశం పార్టీని వణికించడంలో జగన్‌రెడ్డి సఫలీకృతులయ్యారు.

జగన్‌ పులి... పిల్లి...???

తెలుగుదేశం పార్టీని పట్టి పీడిస్తున్న ఈ భయం ఎప్పుడు పోతుందో తెలియదు. అవినీతి కేసులలో 16 నెలలపాటు జైలు జీవితం గడిపిన జగన్‌ కుంగిపోలేదే! జైల్లో ఉండే రాజకీయాలు చేశారు. అధికారంలోకి వస్తే ఏమి చేయాలో నిర్దేశించుకున్నారు. బెయిలుపై బయటకు రావడానికై ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో శక్తివంతుడిగా చలామణి అయిన అహ్మద్‌ పటేల్‌ను ఆశ్రయించినా, ఆ విషయం బయటకు పొక్కకుండా జగన్‌ జాగ్రత్తపడ్డారు. జగన్‌ అంటే పులి అని ప్రచారం చేయించుకున్నారు. తాజాగా సోదరి షర్మిలను కాంగ్రెస్‌ పార్టీ ఆదరించకుండా ఆ పార్టీతో రహస్య ఒప్పందం చేసుకోగలిగారు. ఈ తెరచాటు వ్యవహారాలు తెలియని అమాయక ప్రజలు జగన్‌రెడ్డిలో ఏసు ప్రభువును చూసుకుంటున్నారు. ప్రజల అమాయకత్వాన్ని, బలహీనతలను అధ్యయనం చేసిన జగన్‌రెడ్డి అందుకు అనుకూలంగా రాజకీయంగా పావులు కదుపుతుంటారు. భారతీయ జనతా పార్టీ పెద్దలతో రహస్య ప్రేమాయణం సాగిస్తూనే కాంగ్రెస్‌ పార్టీకి కన్ను కొడుతున్నారు. తన ఓటు బ్యాంకును కూడా కాపాడుకోగలుగుతున్నారు. బీజేపీతో జగన్‌ ప్రేమాయణం తెలిసినప్పటికీ ఆయనకే మద్దతుగా నిలుస్తున్న ముస్లింలు... తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే బీజేపీతో పొత్తు పెట్టుకోకూడదని బలంగా కోరుతుంటారు. ఎన్టీఆర్‌ హయాం నుంచి తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాలలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ మత సామరస్యానికి భంగం కలగకుండా దృఢత్వం ప్రదర్శించింది. అయినా కూడా ముస్లింలు జగన్మోహన్‌ రెడ్డిని మాత్రమే ఎక్కువగా నమ్ముతుండటానికి కారణం ఏమిటో తెలుగుదేశం పార్టీ తెలుసుకొనే ప్రయత్నం చేయాలి. ఆంధ్రప్రదేశ్‌లో సంప్రదాయ రాజకీయాలకు కాలం చెల్లింది.

హిందూ మత పరిరక్షకులుగా చెప్పుకొనే బీజేపీ అగ్ర నేతలు ఆంధ్రప్రదేశ్‌లో క్రైస్తవ మత వ్యాప్తిని పట్టించుకోరు. జగన్‌ పట్ల అంతులేని వాత్సల్యం ప్రదర్శిస్తారు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నట్టు ప్రకటించిన జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికీ బీజేపీ పట్ల మమకారాన్ని వదులుకోలేక పోతున్నారు. రానున్న ఎన్నికల్లో పొత్తు కుదరకపోయినా బీజేపీ ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నామని ఆయన తాజాగా చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో రెండు శాతం ఓట్లు కూడా ఉన్నాయో లేవో తెలియని బీజేపీ పట్ల తెలుగుదేశం – జనసేన పార్టీలకు ఇంత బేలతనం ఎందుకో తెలియదు. ఎన్నికలు సజావుగా సాగాలంటే బీజేపీ ఆశీస్సులు కావాలని ఈ రెండు పార్టీలూ భావిస్తున్నాయి. కర్ణాటక, తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ని ఓడించి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన విషయం మర్చిపోతున్నారు. ప్రజాతీర్పును అధికార దుర్వినియోగంతో మార్చడం సాధ్యమా? ఈ భయం కారణంగానే బీజేపీతో పొత్తు కుదుర్చుకొనే విషయంలో తెలుగుదేశం – జనసేన పార్టీలు డోలాయమానంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అభినవ ఏసుప్రభువుగా కీర్తింపబడుతున్న జగన్మోహన్‌ రెడ్డి మాత్రం తెరవెనుక రాజకీయం చేసుకుంటూ పోతున్నారు. జగన్‌ ఎజెండా ఒక్కటే– అది అధికారంలో కొనసాగడం! ఈ క్రమంలో రాష్ట్రం ఏమైపోయినా ఆయనకు పట్టదు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం – జనసేన కూడా ప్రజలను ఆకర్షించుకోవడానికి పోటీ పడాల్సిన పరిస్థితి. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్‌ను ఆ దేవుడే కాపాడాలి. ఆరు గ్యారంటీలు అంటూ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ నెల గడవక ముందే గ్యారంటీల అమలు ఎలా? అని దిక్కులు చూస్తోంది. కర్ణాటకలో ఆ పార్టీ ప్రభుత్వం ఇప్పటికే గుడ్లు తేలేస్తోంది. కర్ణాటకకు బెంగళూరు, తెలంగాణకు హైదరాబాద్‌ రూపంలో ఆదాయ మార్గాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు కనీసం రాజధాని కూడా లేదు ఆదాయం రావడానికి! అప్పుల మీద ఎంతకాలం బతుకుతారు? ఈ పరిస్థితుల్లో ప్రజలే విజ్ఞత ప్రదర్శించాలి. క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా ఆ ఏసు ప్రభువైనా ఆంధ్రప్రదేశ్‌ను కాపాడాలనీ, ప్రజలకు వివేకాన్ని అందించాలనీ కోరుకుందాం!

ఆర్కే

Updated Date - Dec 24 , 2023 | 04:00 AM