Share News

అహంకారమే అసలు కారణం!

ABN , First Publish Date - 2023-12-05T01:42:58+05:30 IST

రాజకీయాలలో హత్యలుండవు ఆత్మహత్యలే! నిష్క్రమించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ఎన్నికల్లో ఇదే వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిపడేసి ...

అహంకారమే అసలు కారణం!

రాజకీయాలలో హత్యలుండవు ఆత్మహత్యలే! నిష్క్రమించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ఎన్నికల్లో ఇదే వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిపడేసి జాతీయ రాజకీయాలకు ఎగబాకాలనుకున్న కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు తత్వాన్ని బోధించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌, మెదక్‌ జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ఉత్తర తెలంగాణలో కూడా ఘోర పరాజయానికి కారణం కేసీఆర్‌ ప్రభుత్వం పనితీరు అధ్వానంగా ఉండటం కాదు.. ఆయన అహంభావపూరిత వైఖరి వల్లనే తెలంగాణ ప్రజలకు ఆయనపై వ్యతిరేకత ఏర్పడింది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిట్టనివారిపై అలిగి కూర్చున్న కేసీఆర్‌, ఇప్పుడు ఓటమి తర్వాత ఏకంగా ప్రజలపై కూడా అలిగారు. అందుకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామాను గవర్నర్‌కు పంపిన వెంటనే ఎవరికీ చెప్పాపెట్టకుండా ప్రైవేట్‌ కారులో ఫాంహౌజ్‌కు వెళ్లిపోయారు. తెలంగాణ అంటే కేసీఆర్‌ కుటుంబమే అన్న భావం ప్రజల్లో ఏర్పడిందన్న విషయాన్ని గుర్తించకపోగా ప్రజలను కలవడం ఎందుకూ.. అనే కుతర్కానికి తెగబడ్డారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించినప్పటికీ అది ఆ పార్టీ గొప్ప అని కూడా చెప్పలేం. భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలు వ్యూహాత్మకంగా చేసిన తప్పిదాల వల్ల రెండు పార్టీలూ మునిగిపోయాయి. రాజకీయాల్లో ఆత్మహత్య చేసుకోవడం అంటే ఇదే. భారతీయ జనతా పార్టీ దీర్ఘకాలిక వ్యూహంతో వ్యవహరించి ఉండవచ్చు. అదే నిజమైతే బీజేపీ ఉచ్చులో చిక్కుకున్న కేసీఆర్‌ పరాజయాన్ని కొని తెచ్చుకున్నారు. బండి సంజయ్‌కు పార్టీ రాష్ట్ర బాధ్యతలు అప్పగించాక బీజేపీ పుంజుకుంది. గ్రేటర్‌ మున్సిపల్‌ ఎన్నికల సమయంలోనే ఆ పార్టీ తన సత్తా రుజువు చేసుకుంది. అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా చతికిలపడి ఉండింది. కేసీఆర్‌కు వ్యతిరేకంగా క్షేత్ర స్థాయిలో సంజయ్‌ నాయకత్వంలో బీజేపీ ప్రజాభిప్రాయాన్ని మార్చగలిగింది. మరోవైపు పీసీసీ అధ్యక్షుడిగా నియమితుడైన రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి జవసత్వాలు కల్పించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కేసీఆర్‌ కూడా ప్రధాని మోదీపై కత్తులు దూస్తూ వచ్చారు. ఇదే పరిస్థితి కొనసాగి ఉంటే త్రిముఖ పోటీ జరిగి ఉండేది. కేసీఆర్‌కు పరాజయం తప్పి ఉండేది. ఈ దశలోనే బీఆర్‌ఎస్‌–బీజేపీ ఆత్మహత్యకు పాల్పడ్డాయి. తెర వెనుక ఏం జరిగింది అనేది పక్కన పెడితే ఢిల్లీ లిక్కర్‌ కేసులో కవితను అరెస్టు చేయబోతున్నారన్న వార్తలు వచ్చిన వెంటనే ప్రధాని మోదీ విషయంలో కేసీఆర్‌ వైఖరి మారిపోయింది. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను ఆ పార్టీ అధిష్ఠానం తప్పించింది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య లోపాయికారీ అవగాహన కుదిరిందన్న భావం తెలంగాణ సమాజంలో ఏర్పడింది. ఈ పరిణామం కాంగ్రెస్‌ పార్టీకి కలసివచ్చింది. బీజేపీ గ్రాఫ్‌ పడిపోవడం మొదలైంది. కేసీఆర్‌ కుటుంబంపై అప్పటికే ఏర్పడిన వ్యతిరేకత వల్ల కాంగ్రెస్‌ వైపు ప్రజల దృష్టి మరలింది. కేసీఆర్‌కు బలమైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే అని ప్రజలు నమ్మారు. టైం బాగోలేనప్పుడు అన్నీ ప్రతికూలంగానే మారతాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలు తెలంగాణ రాజకీయాలపై పడడం కూడా కేసీఆర్‌కు ప్రతికూలంగా పరిణమించింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తెలంగాణ ఎన్నికల వేళ ప్రతిపక్ష నేత చంద్రబాబును జైలుకు పంపడంతో తెలుగుదేశం అభిమానులు కాంగ్రెస్‌ వైపు మళ్లారు. జగన్‌, మోదీ, కేసీఆర్‌పై కోపంతో మాత్రమే వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్‌ అహంభావాన్ని వీడి చంద్రబాబు అరెస్టును ఖండించి ఉన్నా, తెలుగుదేశం అభిమానుల నిరసనలపై మంత్రి కేటీఆర్‌ నోరు పారేసుకొని ఉండకపోయినా, ఖమ్మం వంటి జిల్లాల్లో ఫలితాలు ఇంత ఏకపక్షంగా వచ్చి ఉండేవి కావు. వీటన్నింటికీ తోడు దళితబంధు, డబుల్‌ బెడ్‌రూమ్‌ వంటి అరకొర పథకాలు ఉండనే ఉన్నాయి. ఏ పథకాన్ని అయినా అర్హులందరికీ అందజేయలేనప్పుడు ఫలితం ప్రతికూలంగానే ఉంటుంది. హితవాక్యాలు చెవికెక్కించుకోని కేసీఆర్‌ ఈ విషయంలో కూడా ఎవరి మాటనూ ఖాతరు చేయలేదు. అంతా నాకే తెలుసు– నాకు చెప్పేవాడు ఉన్నాడా? అన్న అహంభావంతో వ్యవహరించడం వల్లనే కేసీఆర్‌కు ఈ దుస్థితి దాపురించింది. ఇంతకూ కేసీఆర్‌ను కాంగ్రెస్‌ పార్టీ ఓడించిందా? లేక కేసీఆర్‌ తనను తానే ఓడించుకున్నారా? అన్న ప్రశ్న వేసుకుంటే కాంగ్రెస్‌ పార్టీ ఆయనను ఓడించలేదు. కేసీఆర్‌ తనను తానే ఓడించుకున్నారు. ఈ మాట కాంగ్రెస్‌ పార్టీకి నచ్చక పోవచ్చును గానీ వాస్తవం అదే. ప్రజాస్వామ్యంలో నియంతృత్వానికి తావు లేదని గుర్తించి కేసీఆర్‌ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించి ఉంటే ఆయన పట్ల, ఆయన కుటుంబం పట్ల తెలంగాణ సమాజంలో ఇంత వ్యతిరేకత ఏర్పడి ఉండేది కాదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు పుంజుకున్నప్పుడే కేసీఆర్‌ విజ్ఞతతో ఆలోచించి దిద్దుబాటు చర్యలు తీసుకొని ఉంటే ప్రస్తుత ఓటమి తప్పేది. దక్షిణాదిన హ్యాట్రిక్‌ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ రికార్డు నెలకొల్పి ఉండేవారు. ఈ అంశాలకు తోడు అతి కొద్ది మందిని మినహాయిస్తే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు అందరికీ మళ్లీ టికెట్లు ఇవ్వడం కూడా కేసీఆర్‌ కొంప ముంచింది. 2014లో గెలిచిన వారికే 2018లో మళ్లీ టికెట్లు ఇచ్చినప్పటికీ ప్రజలు గెలిపించారు కదా అన్న భావనతో ఇప్పుడు వారికే మళ్లీ టికెట్లు ఇచ్చి ఆయన బోల్తా పడ్డారు.

2018–2023 మధ్య కాలంలో అనేక మంది ఎమ్మెల్యేలు బరితెగించారు. భూ కబ్జాలకు పాల్పడ్డారు. ప్రజలను పీడించారు. అనేక అరాచకాలకు పాల్పడ్డారు. దీంతో ఈ ఎన్నికల్లో ప్రజలు తమ కసి తీర్చుకున్నారు. ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలని అనుకుంటున్నారని వివిధ సంస్థల ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు కేసీఆర్‌ పేరునే అత్యధికులు సూచించారు. అయినా ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గుర్తించడంలో విఫలమవడంతో కేసీఆర్‌ భారీ మూల్యం చెల్లించుకున్నారు. బీజేపీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారన్న అభిప్రాయం వ్యాప్తి చెందుతున్న దశలోనే కేసీఆర్‌ దిద్దుబాటు చర్యలు తీసుకొని ఉండి ఉంటే త్రిముఖ పోటీ జరిగి ఆయన హ్యాట్రిక్‌ సాధించి ఉండేవారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవిత పేరు బయటకు వచ్చినప్పుడు ఆయన భిన్నంగా వ్యవహరించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కన్నబిడ్డపై మమకారాన్ని వదులుకోలేక ఆయన బీజేపీతో తెరవెనుక ఒప్పందం చేసుకున్నారన్న అభిప్రాయం బలపడటానికి కారణం అయ్యారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా లిక్కర్‌ కుంభకోణంలో అందరినీ అరెస్టు చేసి కవితను మాత్రం వదిలివేయడంతో కేసీఆర్‌ కొంపనే కాకుండా తన కొంపను కూడా ముంచుకుంది. కవితను అరెస్టు చేయకపోగా, బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి అదే సమయంలో హఠాత్తుగా తప్పించడంతో కేసీఆర్‌ కోరిక మేరకే ఆయనను తప్పించారన్న ప్రచారం కూడా జరిగింది. దీంతో ఆ రెండు పార్టీలూ ఆత్మహత్యకు పాల్పడినట్టయింది. భారతీయ జనతా పార్టీ పూర్వపు జోరునే కొనసాగించి ఉంటే తెలంగాణలో తొలిసారిగా ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పడినా ఏర్పడి ఉండేది. బీజేపీ గెలిచిన ఎనిమిది స్థానాలలో ఒకటి మినహా మిగతావన్నీ ఉత్తర తెలంగాణలోనే లభించాయి. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఆ పార్టీ అనూహ్య ఫలితాలు సాధించింది. అరువు తెచ్చుకున్న నాయకులు ఎన్నికల వేళ పార్టీ వదిలి వెళ్లిపోవడం కూడా బీజేపీకి నష్టం చేసింది. కేసీఆర్‌ తన అహంభావాన్ని తగ్గించుకొని ఉన్నా, కవిత కోసం రాజీ పడకుండా ఉన్నా, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలలో 30 శాతం మందిని మార్చినా, చంద్రబాబు వ్యవహారంలో మరోలా వ్యవహరించి ఉన్నా, దళితబంధు వంటి పథకాలను పునఃసమీక్షించి ఉన్నా కేసీఆర్‌కు పరాజయం తప్పి ఉండేది. మా ముఖ్యమంత్రి దళితబంధు తెచ్చి మమ్మల్ని బొంద పెట్టారు అని ఎన్నికల్లో పోరాడి ఓడిన అనేక మంది అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు.


కాంగ్రెస్‌, బీజేపీ నుంచి సవాళ్లు!

‘అహం బ్రహ్మస్మి’ నుంచి ఎన్టీఆర్‌ అంతటి వారే తప్పించుకోలేకపోయారు. కేసీఆర్‌ ఎంత? కేసీఆర్‌తో పాటు భారత రాష్ట్ర సమితి ఇకపై అసలైన పరీక్ష ఎదుర్కోబోతున్నది. ఉద్యమ పార్టీగా ఆటుపోట్లను ఎదుర్కోవడం ఆ పార్టీకి గానీ, కేసీఆర్‌కు గానీ కొత్త కాదు. అయితే కోరుకున్న ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో కొనసాగిన బీఆర్‌ఎస్‌ నేతలు అనేక అవలక్షణాలను సంతరించుకున్నారు. అధికారం రుచి మరిగారు. సంపాదనకు అలవాటుపడ్డారు. ఉద్యమ సమయంలో ఉండిన స్ఫూర్తి ఇప్పుడు మచ్చుకు కూడా లేదు. ఈ నేపథ్యంలో పార్టీని కాపాడుకొని వచ్చే ఎన్నికల నాటికి సిద్ధంచేయడం కేసీఆర్‌కు విషమ పరీక్ష అనే చెప్పాలి. 2014, 2018 ఎన్నికల తర్వాత ప్రతిపక్షాలకు చెందిన అనేక మంది ఎమ్మెల్యేలను కేసీఆర్‌ తన పార్టీలో కలుపుకొన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అదే పని చేయకుండా ఉంటుందా? కాంగ్రెస్‌ పార్టీకి దక్కినవి 64 స్థానాలే కనుక ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన వారిని తనవైపు తిప్పుకోవడానికి కచ్చితంగా ప్రయత్నిస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రతీకారం తీర్చుకోకుండా ఉంటుందా? ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి ఎంపిక లాంఛనమే అన్న అభిప్రాయం ఉంది. రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తన స్థానాన్ని పటిష్ఠం చేసుకోవడం కోసం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై దృష్టి కేంద్రీకరించకుండా ఉండరు. కాంగ్రెస్‌ పార్టీ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు లొంగకుండా నిలబడిన వారితో పార్టీని బతికించుకోవడం కేసీఆర్‌కు కత్తి మీద సాము అవుతుంది. ప్రస్తుతానికి ఆయన తనను ఓడించిన జనంపై అలిగి ఫాంహౌజ్‌కు వెళ్లిపోయారు కనుక పార్టీ వ్యవహారాలను ఇప్పట్లో పట్టించుకోరు. ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించలేదని అలిగిన కేసీఆర్‌, పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకొంటానని మారాం చేయడం చూశాం. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించడం వేరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని నడపడం వేరు. అధికారం, డబ్బు లేకుండా రాజకీయాలు చేయలేని పరిస్థితి ఇపుడుంది. కేసీఆర్‌ మౌనంలోకి వెళ్ళారు కనుక పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై ఇప్పుడు పార్టీని నడిపే భారం పడుతుంది. ప్రతిపక్ష రాజకీయాలు నడపడంలో కేటీఆర్‌కు బొత్తిగా అనుభవం లేదు. ఈ నేపథ్యంలో పార్టీని బతికించుకోవడమే కేసీఆర్‌, కేటీఆర్‌లకు సవాలు అవుతుంది. ఇదంతా ఒక ఎత్తయితే బీఆర్‌ఎస్‌కు అసలైన ప్రమాదం భారతీయ జనతా పార్టీ నుంచి ఎదురుకాబోతోంది. ఉత్తరాదిన అద్భుత ఫలితాలు సాధించిన బీజేపీ, ఇప్పుడు తెలంగాణపై కచ్చితంగా దృష్టి సారిస్తుంది.

ఓటమి పాలైన బీఆర్‌ఎస్‌పై ఆ పార్టీ కన్ను పడకుండా ఉంటుందా? తెలంగాణలో ప్రతిపక్ష పాత్రను పోషించడానికి బీజేపీ కచ్చితంగా ప్రయత్నిస్తుంది. అలా జరగాలంటే ముందుగా బీఆర్‌ఎస్‌ను కబళించాలి. కాంగ్రెస్‌ పార్టీ తన్నుకుపోయే ఎమ్మెల్యేలు పోగా మిగిలిన వారితో పార్టీని కాపాడుకోవడానికి కేసీఆర్‌ అండ్‌ కో ప్రయత్నించాల్సి ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు తమకు కనీస గౌరవం ఇవ్వలేదన్న భావన అనేక మంది బీఆర్‌ఎస్‌ నాయకుల్లో ఉంది. ఈ కారణంగా వారిలో ఎంత మంది పార్టీ నాయకత్వానికి విధేయులుగా ఉంటారో తెలియదు. భారతీయ జనతా పార్టీ దీర్ఘకాలిక వ్యూహంతో ముందుగా బీఆర్‌ఎస్‌ను దెబ్బతీసింది. కవిత జోలికి వెళ్లకుండా ఆ పార్టీతో తమకు తెర వెనుక అవగాహన ఏర్పడిందని ప్రజలు భావించడానికి ఆస్కారం కల్పించింది. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ ఓడిపోతే ఆ పార్టీ బలహీనపడిపోతుందని, అప్పుడు ఆ గ్యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నది బీజేపీ పెద్దల వ్యూహంగా కొందరు చెబుతున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినందున పార్టీని సంస్థాగతంగా పటిష్ఠం చేయడానికి రేవంత్‌ రెడ్డి కచ్చితంగా ప్రయత్నిస్తారు. కాంగ్రెస్‌–బీఆర్‌ఎస్‌ బలంగా ఉన్నంత కాలం తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాలేదు. తెలంగాణలో అధికారం దక్కాలంటే ఇప్పుడు ఓడిపోయిన బీఆర్‌ఎస్‌ను మరింత బలహీనపర్చడం, ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమించుకోవడమే బీజేపీ ముందు ఉన్న కర్తవ్యం. ఉద్యమ పార్టీగా ఇప్పటివరకు తెలంగాణలో తిరుగులేకుండా రాజకీయం చేసిన బీఆర్‌ఎస్‌ ఇప్పుడు తొలిసారిగా రెండు జాతీయ పార్టీల నుంచి సవాళ్లను ఎదుర్కోబోతున్నది. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. కేసీఆర్‌ వద్ద మిగిలింది అహంభావం మాత్రమే. అధికారంలో ఉన్నప్పుడు సంపాదించిన డబ్బు ఎంత మిగిలిందో తెలియదు. తన తర్వాత కుమారుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కేసీఆర్‌ భావించారు. ఈ ఎన్నికల్లో గెలిచి ఉంటే కేటీఆర్‌ ముఖ్యమంత్రి అయివుండేవారు. ఇప్పుడు ఓడిపోయినందున కేటీఆర్‌ రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారింది. కేసీఆర్‌ తొమ్మిదిన్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన వయసు 70 ఏళ్లు. వచ్చే ఎన్నికల నాటికి ఆయన వయసు 75 ఏళ్లకు చేరుతుంది. ఈ లెక్కన ఆయన రాజకీయ జీవితం చరమాంకానికి చేరినట్టే. ఈ పరిస్థితులలో కుమారుడు కేటీఆర్‌ రాజకీయ భవిష్యత్తు కోసమైనా కేసీఆర్‌ మరికొంత కాలం రాజకీయంగా క్రియాశీలంగా ఉండటం అవసరం. ఒకవేళ కేసీఆర్‌ అస్త్రసన్యాసం చేస్తే మాత్రం పార్టీని నిలబెట్టుకోవడం కేటీఆర్‌కు శక్తికి మించిన పనే అవుతుంది. పార్టీలో ట్రబుల్‌ షూటర్‌గా పేరొందిన హరీశ్‌రావు ఇక మీదట ఎటువంటి పాత్ర పోషించబోతున్నారన్నది కూడా కీలకం. ఎన్నికల ప్రచారం సందర్భంగా కృష్ణార్జునుల వలె కలసి తిరిగిన హరీశ్‌, కేటీఆర్‌ ఇకపై కూడా అదే ఐకమత్యం ప్రదర్శిస్తే కేసీఆర్‌ మార్గదర్శకత్వం తీసుకుంటూ పార్టీని బతికించుకోవడం కష్టమేమీ కాదు.

ఆ అవలక్షణాన్ని వదిలించుకుంటేనే!

ఈ విషయం అలా ఉంచితే భారతీయ జనతా పార్టీని వెనక్కు నెట్టి బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ పార్టీని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయనకు ప్రజామోదం కూడా ఉన్నందున పార్టీ అధిష్ఠానం ఆయనకే ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టవచ్చు. అయితే పార్టీ తరఫున ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న అనేక మంది ఎమ్మెల్యేలుగా గెలిచినందున వారితో సమన్వయం చేసుకోవడం రేవంత్‌ రెడ్డితో పాటు పార్టీ అధిష్ఠానానికి కూడా కత్తి మీద సామే అవుతుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 24 స్థానాలలో కాంగ్రెస్‌ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేక పోవడం ఆ పార్టీ విజయంలో అతి పెద్ద మచ్చ. హైదరాబాద్‌ ఓటర్లలో కేసీఆర్‌ ప్రభుత్వం పట్ల ఫీల్‌ గుడ్‌ ఫ్యాక్టర్‌ ఉండటం వల్లనే మొత్తం 24 స్థానాలలో 16 స్థానాలను బీఆర్‌ఎస్‌ గెలుచుకోగలిగింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే గ్రేటర్‌ పరిధిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం దెబ్బతింటుందని, పెట్టుబడుల జోరుకు బ్రేకు పడుతుందని, శాంతిభద్రతల పరిస్థితి ప్రశ్నార్థకం అవుతుందన్న భయం ఉండటం వల్ల గ్రేటర్‌ ఓటర్లు కాంగ్రెస్‌ను ఆదరించలేదు. ప్రజల్లో ఉన్న ఈ అపోహలు తొలగించుకొని గ్రేటర్‌లో కూడా పాగా వేయడానికి ప్రయత్నించాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఇప్పుడు ఉంటుంది. అంతర్గత కుమ్ములాటలకు కాంగ్రెస్‌ పార్టీ పెట్టింది పేరు. ఇప్పుడు ఆ లక్షణాన్ని వదిలించుకోని పక్షంలో కాంగ్రెస్‌పై ప్రజలకు ముఖం మొత్తడానికి ఎంతో సమయం పట్టదు. అదే పరిస్థితి ఏర్పడితే కేసీఆర్‌ అహంభావాన్ని సహించడానికి కూడా ప్రజలు సిద్ధపడతారు. అంతర్గత కుమ్ములాటలు లేని తొమ్మిదిన్నరేళ్ల కేసీఆర్‌ పాలనను ప్రజలు చూసి ఉండటం, ఆయన ప్రభుత్వ పనితీరుపై తీవ్ర వ్యతిరేకత లేకపోవడం వల్ల కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు బాధ్యతతో వ్యవహరించాలి. లేని పక్షంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుత జోష్‌ మూన్నాళ్ల ముచ్చటే అవుతుంది.

ఇక జగన్‌ వంతు!

ఇక తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై కూడా పడుతుందన్న అభిప్రాయం బలంగా ఉంది. జగన్మోహన్‌ రెడ్డి పాలనతో పోల్చితే కేసీఆర్‌ పాలనకు నూటికి నూరు మార్కులు వేయవచ్చు. అయినా తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను ఓడించినప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అక్కడి ప్రజలు జగన్‌ను ఓడించకుండా ఉంటారా? అన్న భావన వ్యాపిస్తోంది. సంక్షేమం–అభివృద్ధి మధ్య జగన్‌ ప్రభుత్వం సమతుల్యం పాటించకపోవడం తెలిసిందే. ఏ పార్టీ అయినా మళ్లీ అధికారంలోకి రావాలంటే ఆ పార్టీ ప్రభుత్వంపై ప్రజల్లో ఫీల్‌ గుడ్‌ ఫ్యాక్టర్‌ ఉండాలి. జగన్‌ పాలనపై అత్యధికుల్లో ఫీల్‌ గుడ్‌ భావన లేదు. తెలంగాణ ఫలితాలు వెలువడగానే ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ పని అయిపోయిందన్న వ్యాఖ్యలు విస్తృతంగా వినిపించాయి. ప్రభుత్వ యంత్రాంగం వైఖరిలో మార్పు వచ్చిందన్న మాటా వినబడుతోంది. 2019 ఎన్నికల్లో తన విజయానికి సహకరించిన కేసీఆర్‌కు ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డి ప్రత్యుపకారం చేయకపోగా చంద్రబాబును ఎన్నికల వేళ జైలుకు పంపి నష్టం చేశారు. ఈ విషయంలో కేసీఆర్‌ అండ్‌ కో కూడా జగన్‌ పట్ల ఆగ్రహంతో ఉన్నారు. వైసీపీకి చెందిన చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి వంటి ఎమ్మెల్యేలు కొంతమంది గత కొంత కాలంగా హైదరాబాద్‌లో మకాం వేసి బీఆర్‌ఎస్‌ విజయం కోసం తమ వంతు ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. కేసీఆర్‌ అండ్‌ కో ఇష్టపడే జగన్‌.. ఈ ఎన్నికల్లో ఉపయోగపడకపోగా నష్టం చేశారు. టైం బాగోలేనప్పుడు ఏం చేసినా ప్రతికూల ఫలితాలనే ఇస్తుంది. ప్రస్తుతానికి కేసీఆర్‌కు టైం బాగోలేదు. జగన్‌ టైం ఎలా ఉందో తెలియాలంటే మరో నాలుగైదు నెలలు వేచి చూడాలి!

ఆర్కే

Updated Date - 2023-12-05T01:43:02+05:30 IST