Share News

వేలిపై చుక్క: వీడ్కోలో వన్స్‌ మోరో !?

ABN , First Publish Date - 2023-11-30T01:23:26+05:30 IST

కర్ణభేరులన్నీ బద్దలైపోయిన తెలంగాణ సమాజం మంగళవారం సాయంకాలానికి గప్ చుప్ అయిపోయింది. నిశ్శబ్దం అడుగున మరొక సందడి. గుట్టుచప్పుడు కాని అలజడి...

వేలిపై చుక్క: వీడ్కోలో వన్స్‌ మోరో !?

కర్ణభేరులన్నీ బద్దలైపోయిన తెలంగాణ సమాజం మంగళవారం సాయంకాలానికి గప్ చుప్ అయిపోయింది. నిశ్శబ్దం అడుగున మరొక సందడి. గుట్టుచప్పుడు కాని అలజడి. మరొకవైపు, ఆకలితో నకనకలాడుతూ ఈవీఎంలు పోలింగ్ కేంద్రాల్లో నిద్రచేస్తున్నాయి. గురువారం పొద్దున్నే వాటి కడుపు నిండడం మొదలవుతుంది. సాయంత్రానికల్లా ఎవరిదో పంట పండుతుంది. మూడోతారీకు కోతలు.

ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు మాత్రమే కాదు కానీ, ప్రజల అనుభవంలోకి వచ్చే అతి తక్కువ ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ ఒకటి. ఒకరిని కొనసాగించి లేదా మరొకరిని ఎక్కించి కింగ్ మేకర్లమయ్యామన్న ఆత్మసంతృప్తి ఓటర్లకు కలిగే సందర్భం. కానీ, ఎన్నిక అన్నది, ఒక్కరోజు ముచ్చట, ఒక్కతీరు ముచ్చట కాదు. మనసులో మాట ఎగిరివెళ్లి మీట మీద నొక్కుకుపోవడానికి నడుమ, అగాధాలు అగడ్తలు బెదిరింపులు లాలింపులు ఎన్నో దాటుకుని వెళ్లాలి. పెనానికీ పొయ్యికీ, గొయ్యికీ నుయ్యికీ నడుమ ఎంచుకోవాల్సి వచ్చే స్వేచ్ఛ డొల్లది. ఓటు వేసిన మరుక్షణం బోడిమల్లన్నలము అవుతామని జనానికి తెలుసు. అయినా సరే, ఓట్ల పండగ అంటే అనామకత్వంలోనూ లభించే అందలం. ఏక్ దిన్ కా సుల్తాన్ గిరీ.

ఎన్నికల హంగామా సామాన్యం కాదు. తినబోతూ రుచులేమిటో తెలుసుకోవాలని అందరికీ ఆత్రం. గాలివాటం ఎటు ఉందో తెలుసుకోవడానికి పతంగులు ఎగరేయాలి. కూడలిలో సమ్మర్దంలో ఇంటింట్లో జనం నాడిని పట్టుకోవాలి. సర్వేల మీద సర్వేలు చేసి ఉక్కిరిబిక్కిరి చేయాలి. జనహృదయాలను చిలికిచిలికి గాలివాన చేయాలి. బహిరంగ వీరంగాలన్నీ అయ్యాక, మౌన పర్వంలో కూడా సామదాన ఉపాయాలు సంధించాలి. చెల్లాచెదురైన పల్లె జనాన్ని అంజనం వేసి మరీ పోలింగ్ సెంటర్లకు రప్పించుకోవాలి.

చివరి రెండు రోజులు జరిగేదాన్ని పోల్ మేనేజ్‌మెంట్ అని అందంగా పిలుస్తారు. రాజకీయాలలో ధనప్రమేయం నశించాలని, ప్రజలు బుద్ధిమంతులై డబ్బుకు ఓటు దాసోహం చేయకూడదని నీతులు చెప్పేవారు కూడా నిస్సంకోచంగా పోల్ మేనేజ్‌మెంట్ జపం చేస్తారు. తమ నాయకుడి సత్పరిపాలన వల్లనే, అతని అరివీర భయంకర ఉద్యమత్వం వల్లనే జనం మరొక్కసారి తమ పార్టీకి మీట నొక్కుతారని భావించేవారు కూడా, ఆఖరి రెండురోజుల ‘ఏర్పాట్ల’ గురించి ఆందోళనగానూ, అవసరంగానూ వాకబు చేస్తుంటారు. దురహంకారాన్ని గద్దె దించి తీరాలని, ప్రతిపక్షానికి పట్టం కట్టాలని కోరుకునేవారు కూడా, ధన ప్రసారంలో వెనుకబడిపోతున్నందుకు కలవరపడుతూ ఉంటారు. ప్రచారపర్వంలో కండపుష్టిని చూపించినవారు బోరవిరుచుకుంటే, తూతూమంత్రం అనిపించినవారు బీదగా మిగిలిపోతారు. ప్రజలు ఈ అట్టహాసపు ఆడంబరపు యుద్ధంలో, నిరాడంబరత వైపు, నిజాయితీ వైపు నిలబడాలని, అండర్ డాగ్‌లనే గెలిపించాలని ఆదర్శవాదులు ఆశిస్తూ ఉంటారు.

జుగుప్స కలిగించేంత మదిరాధన ప్రవాహాలు, ప్రచారసభలలో నిస్సారమైన అధికప్రసంగాలు వీటి మధ్య ఎన్నికలకు ఏమైనా అర్థం ఉందా? ప్రజల అభిమతం ఎన్నికలలో ఏ మాత్రం వ్యక్తం కాదా? ఒక ప్రభుత్వాన్ని అధికారంలో కొనసాగించాలని కానీ, తొలగించి మరొకరిని కూర్చోబెట్టాలని కానీ వ్యక్తమయ్యే ఫలితంలో ప్రజల సాధికారత ఏ మాత్రం పెరగదా? ప్రజాస్వామ్యం ఉనికిని, ఎన్నికల ప్రక్రియను నిరాకరణ వాదులు పూర్తిగా తీసిపారేస్తారు కానీ, ఇసుకలో కూడా తీయగలిగే తైలం మీద ఆశగా ఉంటుంది.

ఎంపిక చేయగలగడం స్వేచ్ఛకు గుర్తే కానీ, ఎరుకలేని ఎంపికలు అంతిమంగా స్వేచ్ఛను హరిస్తాయి. పరిస్థితుల పరిజ్ఞానం, సమస్యల అవగాహన, విధానాల తెలివిడి కలిగిన ఎంపికలలో విచక్షణ అధికంగా ప్రతిఫలిస్తుంది. మన ఓటర్లందరికీ ఈ విచక్షణ అసలే లేదని, లేదా, పరిమితమని చెప్పలేము కానీ, వారిని గందరగోళపరిచే, దృష్టి మళ్లించే శక్తులు బలంగా ఉంటాయి. పరిపాలనలోని అవినీతి అవకాశాలు, వాటిని అందుకోవడానికి అనైతికంగా మారిపోయిన రాజకీయాలు, అధికారసోపానంగా మారిన ఎన్నికల ప్రక్రియ కలిసి ఓటర్లకు నిజమైన ఎంపిక అవకాశాలను అందించడం లేదు. ఎన్నికల రంగంలో నూటికి 99 మంది అవాంఛనీయ వ్యక్తులే ఉన్నప్పుడు, పళ్లూడగొట్టుకోవడానికి ఏ రాయి అయితేనేమి అన్న సందేహం కలుగుతుంది. చీలికలు, కలయికలు, కూడికలు, తీసివేతలుగా మారిన ఎన్నికల లెక్కలలో, ఇతరుల కంటె అధికంగా ఓట్లు సంపాదించినవారే విజేత అవుతున్నారు కానీ, సగానికి ఎక్కువ ఓట్లు రావడం షరతు కాకుండా పోయింది. తమకు అనుకూలం కాదు కాబట్టి, దామాషా ప్రాతినిధ్యం వంటి ప్రత్యామ్నాయాల కోసం ఎవరూ వాదించరు. ఫలితంగా, గెలుపు కోసం అనుసరించే అక్రమపద్ధతులతో ప్రజల ఎంపికలు హైజాక్ అవుతున్నాయి.

జనం కేవలం అధికారంలోకి వచ్చే పార్టీనే, అభ్యర్థులనే ఎన్నుకుంటారా? ప్రతిపక్షాన్ని ఎన్నుకోరా? జనం మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు అంటూ కొత్త విజేతలు పరాజితులను గేలిచేస్తూ ఉంటారు. సరైన ప్రతిపక్షం లేకపోవడం అంటే ఏమిటో తెలంగాణ ప్రజలు తొమ్మిదిన్నరేండ్లుగా అనుభవించారు. అధికారపక్షం ప్రతిపక్ష సభ్యులను కొనేసింది, పదవులిచ్చి ఆకర్షించింది నిజమే, కానీ, ప్రభుత్వం చేసే తప్పిదాల గురించి మాట్లాడే గట్టి శక్తి లేకుండా పోయింది కదా? కాబట్టి, ప్రజలకు అధికార, ప్రతిపక్షాలు రెండూ కావాలి. ఒక పక్షాన్ని అధికారంలోకి తెస్తారు, లేదా, మరో పక్షం పదవీకాలం కొనసాగిస్తారు. తమదే ఘనకార్యం అని ప్రజలు అనుకుంటారు. కానీ ఎన్నాళ్లు ఆ ముచ్చట? 2014 తరువాత, ఎంత కాలం ఉండింది ఆ సంబరం? ప్రభుత్వంలోకి వచ్చినవారు, నెమ్మదిగా తమ కోరలనూ కత్తులనూ బయటపెడతారు. ఇప్పటి ఎన్నికలలో కూడా అదే జరగవచ్చు. ప్రజలు మరో పార్టీకి అవకాశం ఇచ్చారనుకుందాం. తొందరలోనే కలలు విరిగిపోవచ్చు. అతి త్వరలోనే, ప్రజలకు మళ్లీ ప్రతిపక్షం అండ అవసరం కావచ్చు. అయినా సరే, ప్రభుత్వాలను దింపి, ఎక్కించడం ఓటరు చేయగలిగిన పని, చేసి తీరవలసిన పని. రెండు దఫాలు పాలించి, మంచి దక్షతను చూపించింది అనుకుంటున్న పార్టీ, ప్రతిపక్షంగా బాగా రాణిస్తుందేమో? అధికారంలో ఉండగా, అందుబాటులో ఉండకుండా మొహం చాటు చేసినవారు, ప్రతిపక్షంలో ఉండగా ప్రజలకు సన్నిహితం అవుతారేమో? అదే పనిగా, ప్రభుత్వాన్ని తప్పుపట్టడమే పనిగా పెట్టుకున్న ప్రతిపక్షం చేతికి అధికారం వస్తే, పరిపాలనలో ఉండే కష్టం నష్టం తెలిసివస్తాయేమో? ఇన్ని గందరగోళాల మధ్య కూడా ప్రజలు కొన్ని తెలివితేటలు ప్రదర్శిస్తారు. బహుశా, అధికార, ప్రతిపక్షాల పాత్రలను తారుమారు చేయాలనుకుంటారేమో?


ప్రజాస్వామిక పరిగణనలు కాకుండా, అనేక ఇతర కారణాలతో ఎంపికలు జరిగినా వాటిలో ఒక సందేశం మాత్రం తప్పకుండా ఉంటుంది. ఒక రాజకీయ సమాజానికి, దానిలో భాగమైన ఓటర్లకు వ్యక్తిగతమైన ప్రాధాన్యాలే కాకుండా, సామూహిక చేతన కూడా ఉంటుంది. వ్యక్తిగతమైన ఎంపికలు ప్రలోభాలకు, దౌర్జన్యాలకు, ప్రభావాలకు లోనుకావచ్చును కానీ, సామూహిక చేతన కొంత పవిత్రంగానే ఉంటుంది. పోలింగ్‌కు ముందు కూడా రాజకీయ వాతావరణంలో ఈ సామూహిక చేతన, జనమనోభావాల రూపంలో కనిపిస్తూ ఉంటుంది. ఒక పెదవి విరుపు కానీ, మార్పు కావాలనే కోర్కె కానీ, ప్రస్తుతపాలన మీద విమర్శ కానీ చాలా సూచనప్రాయంగా చిరు చిరు పవనాలుగా సంచరిస్తూ ఉంటాయి. వాటిని ఒక హోరుగాలిగానో, ప్రభంజనంగానో తీర్చిదిద్దడం మార్పు కోరుకునే శక్తుల పని.

ఈవీఎం మీద మీట నొక్కడం వరకే ఓటరు ప్రమేయం. లెక్కింపు తరువాత జరిగే పరిణామాలలో కూడా అతని/ ఆమె పాత్ర ఉండదు. పోలింగ్‌కు ముందు జరిగినట్టే, ఫలితాల చుట్టూ కూడా ధనమూ అధికారమూ అవినీతీ రాబందుల్లా మూగుతాయి. ప్రజల తీర్పును భంగపరుస్తాయి కూడా. చూస్తూ ఉండండి, మూడోతారీకు ఓట్ల లెక్కింపు నాటికే పార్టీల అభ్యర్థులందరూ ఆయా కేంపులకు చేరుకుంటారు. తమ వాళ్లు అమ్ముడుపోకుండా నేతలు కాపలా కాస్తారు. తమకు ఎంత రేటు పలుకుతుందో అని కొందరు కొత్త ఎమ్మెల్యేలు ఉవ్విళ్లూరుతుంటారు.

పోలింగ్ రోజున, ఓటరు సాధ్యమైనంత స్పష్టతతో, అవగాహనతో కేంద్రానికి వెళ్లాలి. ఉన్నది ఉన్నట్టే కొనసాగించాలా, మార్పు కావాలా అని రాష్ట్ర స్థాయిలో ఆలోచించాలి, దేశరాజకీయాలలో ఏది మంచి ఏది చెడు, ఈ ఎన్నికలకు ఆ మంచిచెడులకు సంబంధం ఏమిటి అని చూడాలి, అభ్యర్థి మంచిచెడ్డలను బేరీజు వేసుకోవాలి. ఏ పార్టీ గెలిచినా ఏ అభ్యర్థి గెలిచినా ప్రజలకు కలిగే సాధికారత పెద్దగా ఉండకపోవచ్చును కానీ, ఏ పార్టీ గెలుపు వల్ల, ఏ అభ్యర్థి గెలుపు వల్ల కొంతలో కొంత స్వేచ్ఛ, నిర్ణయాధికారం, తక్కువ హాని, తక్కువ హింస జరుగుతాయో తెలుసుకుని అందుకు తగ్గ ఎంపిక చేసుకోవాలి.

ఒకే పక్షం నిరంతరం పాలించకుండా మార్పును కోరుకోవడం ప్రజాస్వామికహక్కు. ప్రజల చేతిలో మార్పు ఆయుధం ఉన్నదన్న భయం పాలకులలో ఉండాలి. అమోఘమైన సత్పరిపాలన అందిస్తున్నదని అనుకున్నప్పుడు ఒకే ప్రభుత్వానికి కొనసాగింపు కూడా ఇవ్వవచ్చు. తప్పేమీ లేదు. అయితే, ఒక్కొక్క పదవీకాలానికి పాలకుల అతిశయం పెరుగుతూ పోతుంది. అటువంటప్పుడు, తగిన హెచ్చరికలతో పొడిగింపులు ఇవ్వవచ్చు.

అన్నిటి కంటె ముఖ్యం, తన ఓటు కీలకమన్న స్పృహ ఓటరులో ఉండడం. ముందురోజు రాత్రి లభించే నోటు కాదు, ఓటు అంటే! లక్షల కోట్ల రాజకీయ, పరిపాలనా ఆదాయాల ఖజానాకు అది తాళపు చెవి. జనజీవిత సౌభాగ్య దౌర్భాగ్యాలకు ప్రామిసరీ నోటు!

కె. శ్రీనివాస్

Updated Date - 2023-11-30T01:23:30+05:30 IST