Share News

అతి కష్టమే! అసాధ్యం మాత్రం కాదు!!

ABN , Publish Date - Dec 28 , 2023 | 02:19 AM

అయోధ్య రామమందిరం ప్రతిష్ఠ సమీపిస్తోంది. మరోపక్క దేశంలో సాధారణ ఎన్నికల కోలాహలం మొదలయింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దేశం తూర్పుపడమరల మధ్య...

అతి కష్టమే! అసాధ్యం మాత్రం కాదు!!

అయోధ్య రామమందిరం ప్రతిష్ఠ సమీపిస్తోంది. మరోపక్క దేశంలో సాధారణ ఎన్నికల కోలాహలం మొదలయింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దేశం తూర్పుపడమరల మధ్య న్యాయయాత్ర ప్రకటించారు. భారతీయ జనతాపార్టీ తన స్థూల వ్యూహాన్ని, సూక్ష్మస్థాయి యంత్రాంగాన్ని దేశవ్యాప్తంగా రంగంలోకి దింపుతోంది. తెలంగాణలో నిన్నటి పోలింగ్ ఇంక్ ఆరిపోకముందే రేపటి ఎన్నికల సందడి ఆరంభమయింది. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రప్రభుత్వ వ్యతిరేకత అతి వేగంగా సమీకృతమవుతోంది.

అయోధ్య వివాదం మీద తుది తీర్పు ప్రస్తుత లోక్‌సభ హయాం ప్రారంభంలో జరిగింది. 2019 ఎన్నికలు జరిగిన ఆరుమాసాల్లోనే 370 ఆర్టికల్ రద్దు నిర్ణయం, అయోధ్య చివరి తీర్పు ప్రకటన రెండూ జరిగాయి. 2024 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ రెండింటి ‘ఫలితాలు’ చేతికి వచ్చాయి. ఒకటి, కశ్మీర్‌పై నిర్ణయాలకు అత్యున్నత న్యాయస్థానం ఆమోదముద్ర, రెండు, న్యాయవివాదం ముగిసిన దరిమిలా రామాలయ నిర్మాణంపూర్తయి 2024 జనవరి 22న ప్రారంభం కావడం. వీటితో, భారతీయ జనతాపార్టీ రెండు ముఖ్యమైన రాజకీయ లక్ష్యాలు నెరవేరినట్టు అయింది. ఉమ్మడి పౌరస్మృతి ఇంకా జరగవలసిన పని. అందుకు కావలసిన సన్నాహక వాతావరణం అయితే ఏర్పడింది. బహుశా, వచ్చే పదవీకాలం కోసం దాన్ని పక్కనపెట్టి ఉంటారు.

భారతీయ జనతాపార్టీ మూడో నాలుగో ముఖ్యమైన లక్ష్యాలను చెబుతూ ఉండవచ్చును కానీ, అది చేయదలచుకున్న పనుల జాబితా పెద్దది. దేశాన్ని సమూలంగా మార్చేయడం ఆ పార్టీ సంకల్పం. సామాజిక, నైతిక విలువలను, విశ్వాసాలను, భావాలను, చరిత్ర గురించిన అవగాహనలను, అన్నిటినీ తన దారిలోకి తెచ్చుకోవడం ఆ పార్టీ కార్యక్రమం. అన్ని రంగాలలో కఠినమైన, కర్కశమైన వైఖరులను సాధారణం చేసి, తాను విశ్వసించే విలువలను, సిద్ధాంతాలను అమలులోకి తేవాలన్నది ఆ పార్టీ ఆశయం. తగిన జనాదరణ పొంది, జనమే ఇష్టపడుతూ ఉంటే, ఆ పార్టీకి అడ్డేమిటి?

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో మూడింటిని గెలుచుకున్నందున బీజేపీలో కలిగిన ఉత్సాహం సామాన్యమైనది కాదు. సుదీర్ఘకాలంగా పాలిస్తున్న మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి గెలవగలగడం ఒకటి అయితే, కాంగ్రెస్ చేతి నుంచి రెండు రాష్ట్రాలను స్వాధీనం చేసుకోవడం మరొక విశేషం. తనతో కాంగ్రెస్ పార్టీ ముఖాముఖి ప్రత్యర్థిగా ఉన్న మూడు రాష్ట్రాలలో బీజేపీ విజయం, సాధారణ ఎన్నికలలో తన పరిస్థితి నల్లేరు నడక అన్న అ‌భిప్రాయం కలిగించింది. అయినా, తన గట్టి ప్రయత్నాలు కొనసాగించవలసిందేనని ఆ పార్టీ అనుకుంటున్నది. విజయాన్ని ఖాయపరచుకోవడానికే కాదు, 400 స్థానాలను గెలుచుకోవడానికి ప్రయత్నించాలన్నది ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నది.

‍ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, 2024 ఫలితాలు కూడా ముందే వెల్లడైన ఫీలింగ్ కలిగించాయి, కానీ, ప్రతిపక్ష కూటమిలో పూర్తి నిరాశ కానీ, అధికారపక్షంలో పూర్తి ధీమా కానీ కనిపించడం లేదు. మొన్నటి ఫలితాలు వచ్చిన వెంటనే కాంగ్రెస్ శిబిరం నుంచి, 2003 ఎన్నికలప్రస్తావన వినిపించింది. విశ్లేషకులు యోగేంద్ర యాదవ్ కూడా ఆ ఎన్నికలతో పోలిక తెచ్చారు. ఆ నాటి ఎన్నికలలో బీజేపీ (ఎన్డీయే) గెలిచినప్పటికీ, ఆరునెలల్లో జరిగిన సాధారణ ఎన్నికలలో ఓడిపోయి కాంగ్రెస్ (యూపీఏ) అధికారంలోకి వచ్చింది. నిరాశపడకుండా, ఆ పోలిక బాగానే ఉంది కానీ, చరిత్ర ఎప్పుడూ ఒకేరకంగా తిరిగి రాదు కదా? తెలంగాణతో కూడా కలుపుకొని ఇటీవలి నాలుగు రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు బీజేపీ కంటె ఎక్కువ అనేది మరో లెక్క. తెలంగాణలో బీజేపీ ప్రధాన పక్షంగా రంగంలో లేదు. దాన్నెలా లెక్కిస్తారు? హిందీరాష్ట్రాలలో సీట్ల సంఖ్యలో చాలా అంతరం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ఓట్ల శాతం దగ్గరగానే ఉన్నదని, రాజస్థాన్‌లో అయితే దాదాపుగా ఓట్లను నిలుపుకున్నదని మరో వ్యాఖ్యానం. ఇవన్నీ ఆకాంక్షలకు అనుగుణమైన వ్యాఖ్యానాలు. తెలంగాణలో విజేత కాంగ్రెస్‌కు, ఓడిపోయిన బీఆర్‌ఎస్‌కు మధ్య ఓట్ల తేడా 2 శాతం కూడా లేదు. మొన్నటి కర్ణాటక ఎన్నికలలో ఓడిపోయిన బీజేపీకి ఓట్ల శాతం చెక్కుచెదరలేదు. గణాంక ఆధిక్యాలు అధికారాన్ని ఇవ్వవుకదా? కాకపోతే, ఒక విషయాన్ని సానుకూల అంశంగా చెప్పుకోవచ్చు. అతికష్టమైన ఎదురీతలో కాంగ్రెస్ పార్టీ నిలబడగలుగుతున్నది. అతి ప్రభావశాలిగా, బలశాలిగా మారిన బీజేపీకి ప్రతిస్పర్థిగా రూపొందడానికి ప్రయత్నిస్తున్నది.

ఇప్పటిలో దేశస్థాయిలో బీజేపీకి ఏకైక ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ రూపుదిద్దుకోజాలదు కానీ, ఆ పని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి చేయగలదు. అయితే, ఆ కూటమికి ఇరుసుగా నిలబడి నడిపించే నాయకస్థానంలో ఒక జాతీయపార్టీ ఉండాలి, ఆ అవసరాన్ని కాంగ్రెస్ నెరవేర్చగలదు. వచ్చే సాధారణ ఎన్నికలలో దక్షిణాది రాష్ట్రాల నుంచి తాను సొంతంగా కనీసం 45 స్థానాలు గెలవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకున్నదట. దేశం మొత్తం మీద ఆ పార్టీ 120 సంఖ్య చేరితే గొప్పే. తక్కిన బలాన్ని కూటమిలోని పార్టీలే సమకూర్చాలి. చింత చచ్చినా పులుపు మిగిలినట్టు, అరవై స్థానాలపార్టీగా మారినప్పటికీ, జాతీయపార్టీ అన్న ఆభిజాత్యం కాంగ్రెస్‌లో తగ్గలేదు. కూటమిలో తనదే పై చేయి కావాలన్న పంతమూ తగ్గలేదు. మూడు హిందీరాష్ట్రాలలో ఒంటరిగా పోటీ చేయడం పొత్తులేవీ సాధ్యపడక కాదు, తన సత్తా నిరూపించుకుని, కూటమిలో పెద్దన్న కావాలన్న ఆశతోటే. ఈ అవలక్షణాన్ని వదులుకోవాలి. బీజేపీని ఓడించడానికి లేదా కనీసం బలహీనపరచడానికి ఏయే సర్దుబాట్లు చేసుకోవాలో వాటన్నిటికీ కాంగ్రెస్ సిద్ధపడాలి. ముఖ్యంగా సమాజ్‌వాదీ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీపార్టీ, ఈ నాలుగు పార్టీలతో, కాంగ్రెస్ తన సమస్యలను పరిష్కరించుకోవాలి.

పరిస్థితి పూర్తిగా చేయిదాటిపోలేదు, ఆఖరి ఓవర్లలో అన్నీ సిక్సర్లే కొట్టేసి, ఎన్నికల్లో గెలవగలం అని ఆశపడడంలో తప్పులేదు. సాంకేతికంగా అటువంటి గెలుపు సాధ్యం కూడా. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి 2024లో విజయావకాశాలు పూర్తిగా లేకుండా పోలేదు. కూటమికి ఒక నాయకుడు లేదా నాయకురాలు ఉండవలసిన అవసరమేమీ లేదని శరద్ పవార్ అన్నదాంట్లో వాస్తవం ఉన్నది. ఏ ఒక్కరినో కూటమికి నేతగా, నరేంద్రమోదీకి ప్రత్యర్థిగా నిలబెడితే, అది తారతమ్య చర్చకు దారితీస్తుంది. నాయకత్వం సమష్టిగా నిలిచి పోరాడవచ్చు. తెలంగాణలో కేసీఆర్‌ ప్రతిష్ఠ పెద్దది. అయినా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరినీ చెప్పకుండానే రాష్ట్ర కాంగ్రెస్ ఉమ్మడిగా పోరాడింది. మూడు హిందీ రాష్ట్రాలలో ముఖ్యమంత్రి అభ్యర్థిని బీజేపీ ప్రకటించలేదు. ముఖ్యమంత్రుల విషయంలో సాధ్యపడింది, ప్రధాని పదవి విషయంలో ఎందుకు కుదరదు? పార్టీ, విధానాలు, ఉమ్మడి నాయకత్వం వంటివి వ్యక్తినాయకత్వానికి ప్రత్యామ్నాయంగా నిలపవచ్చు, ఇప్పుడున్న పరిస్థితిలో ఇండియా కూటమికి అదే ఉత్తమమార్గం.

అన్నిటికంటె ముఖ్యమైనది, రాజకీయ వాదనను నిర్మించడం. తెలంగాణ ఎన్నికలలో అత్యంత ప్రభావం కలిగించినది కాంగ్రెస్ ప్రచారం చేసిన రాజకీయ వాదన. ప్రతిపక్షాలను జాతి వ్యతిరేకులని, విచ్ఛిన్నకులని ప్రచారం చేయడంలో జాతీయస్థాయిలో బీజేపీ విజయవంతంగా ముందుకు వెడుతోంది. మతపరమైన అంశాలు సరేసరి. అందుకు ప్రతిగా కాంగ్రెస్, దాని మిత్రులు ఏ వాదనలతో ప్రజల ముందుకు వెడతారు? ధరల పెరుగుదల, నిరుద్యోగం, నియంతృత్వం వంటి అంశాలతో బీజేపీని ఢీకొనగలరా? ఆ ప్రచారాంశాలను బలంగా, ప్రభావవంతంగా ప్రజలలోకి తీసుకువెళ్లగలరా? మార్పు అవసరమనే సందేశాన్ని ఇవ్వగలరా? రాహుల్ గాంధీ ఇప్పుడు చేపట్టనున్న భారత్ న్యాయయాత్రలో సామాజిక, ఆర్థిక న్యాయాలు ప్రధానాంశాలుగా ఉంటాయట. మునుపటి జోడో యాత్ర, విభజన వాదాన్ని, మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ జరిపినది. తన రాజకీయ వాదనలో కాంగ్రెస్ మార్పులు చేసుకుంటున్నది. బీజేపి ఏయే అంశాల మీద సమాజంలో విభజన, సమీకరణ జరగాలని కోరుకుంటున్నదో అటువంటి అంశాల మీద పెద్దగా స్పందించగూడదని కూడా నిర్ణయించుకున్నట్టు కనిపిస్తున్నది. ఎత్తుగడల రీత్యా అది అనుసరించదగ్గదే. కానీ, కొన్ని అంశాల మీద తప్పనిసరిగా సూత్రబద్ధ వైఖరులు ప్రకటించవలసి ఉంటుంది. అధికారపక్షం చేసే కవ్వింతలకు రెచ్చిపోకుండా, అదే సమయంలో కనీస వైఖరుల విషయంలో రాజీపడకుండా ముందుకు వెళ్లవలసి ఉంటుంది.

ఇప్పుడున్న 303 స్థానాల బలానికే ప్రతిపక్షాన్ని మొత్తంగా సస్పెండ్ చేసి, అత్యంత వివాదాస్పదమైన, ప్రమాదకరమైన బిల్లులను చట్టాలు చేయగలిగిన ప్రభుత్వం రేపు 400 స్థానాల బలంతో మరేమి చేయగలదో ఆలోచించి, తమ మనుగడ కోసమే, తమ ఉనికి కోసమే సంఘటితంగా ముందుకు నడవడం ప్రతిపక్షాల బాధ్యత.

కె. శ్రీనివాస్

Updated Date - Dec 28 , 2023 | 02:19 AM