Share News

ఆర్భాట యుద్ధమే తప్ప, ‘ఆత్మ’ ఎక్కడ?

ABN , First Publish Date - 2023-11-16T03:06:06+05:30 IST

అభ్యర్థుల తుది మోహరింపు జరిగిపోయాక, ఇక ప్రచారం ఉధృత దశలోకి ప్రవేశించింది. కూడగట్టుకునే ఓట్లన్నీ ఈవీఎంల మీద నొక్కుడుపోయే కీలక వ్యూహాలు రూపు దిద్దుకుంటాయి...

ఆర్భాట యుద్ధమే తప్ప, ‘ఆత్మ’ ఎక్కడ?

అభ్యర్థుల తుది మోహరింపు జరిగిపోయాక, ఇక ప్రచారం ఉధృత దశలోకి ప్రవేశించింది. కూడగట్టుకునే ఓట్లన్నీ ఈవీఎంల మీద నొక్కుడుపోయే కీలక వ్యూహాలు రూపు దిద్దుకుంటాయి. సవాళ్లతో ప్రతిసవాళ్లతో, వాగ్దానాలతో బెదిరింపులతో వాతావరణం బాగానే వేడెక్కుతోంది. సన్నగానో చిన్నగానో అనుకూల పవనాలు, ఎదురుగాలులు వీస్తూనే ఉన్నాయి. వాగాడంబరానికి, హడావిడికీ ఏ లోటూ లేదు కానీ, ఏదో ఒక్క లోపం మాత్రం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఈ సంరంభం అంతటిలోనూ ‘ఆత్మ’ ఏదీ కనిపించడం లేదు. కోటను కాపాడుకోవాలనుకునే శిబిరంలోనూ, కోటను పట్టుకోవాలనుకునే శ్రేణుల్లోనూ ఉండవలసినంత ‘సజీవత’ లేదు. ఓటర్లు నిర్లిప్తంగా ఉంటున్నారా, లేక, గుంభనంగా ఉంటున్నారా? ఉన్నవారినే కొనసాగిద్దాం, రిస్కెందుకు అన్న నిర్ణయం గానీ, రెండుసార్లయ్యాక మూడోసారి కూడా ఎందుకు, మార్చేద్దాం అన్న ఉత్సాహం కానీ స్పష్టంగా ఎందుకు కనిపించడం లేదు? నూటికి నూరు శాతం గెలిచితీరతాం అన్న విశ్వాసం ఏ శిబిరంలోనూ లేదు. అన్నిటికి మించి, రాజకీయ యుద్ధాన్ని రసవత్తరం, తీవ్రతరం చేయగలిగిన రణన్నినాదమేదీ ఏ పక్షానికీ ఇప్పటికీ చిక్కలేదు! ఎదుటివారిపై తామే పైచేయిగా మాట్లాడుతున్నారు కానీ, నికార్సయిన నైతికత ఎటువైపునా పలకడం లేదు!

అట్లాగని, తెలంగాణ ఎన్నికల ఘట్టం నీరసంగానే ముగియనున్నదని, అనాసక్తయోగంలో ఓటర్లు అత్తెసరు ఓట్లతో వారినో వీరినో గెలిపిస్తారని అనుకోవడానికి లేదు. పరిస్థితి ఇంకా రూపుదిద్దుకుంటున్నది. ఏదో ఒక కిటుకు వారికో వీరికో దొరకకపోదు. డబ్బూ హంగూ మాత్రమే పైచేయిగా నిలిస్తే ప్రతిపక్షానికి పెద్ద ఆశలుండవు. ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలతగా మలచుకుంటేనే ఫలితం దక్కుతుంది. ఈలోగా, మసకబారి ఉన్న తమ మనోఫలకాన్ని ఓటర్లు తామే శుభ్రపరచుకుంటే, స్పష్టత ఏర్పడవచ్చు. ఇదంతా ఆశావాదమే తప్ప, అందుకు తగ్గ మానవప్రయత్నాలు జరుగుతున్నాయా అన్నది మాత్రం సందేహం.

ఊదరగొట్టి, బెదరగొట్టి, ఓటర్లను ప్రభావితం చేయడమే తప్ప, రాజకీయ పార్టీలు జనంలో మంచిచెడుల వివేచన కలిగించే ప్రయత్నమేదీ చేయకపోవడమే విచారకరం. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నాయకులు అనునయంగా చెబుతున్నట్టే ఉంటుంది కానీ, తన కంటె చెడ్డ పాలన ఎదురవుతుంది జాగ్రత్త అన్న హెచ్చరిక కూడా అందులో మిళితమై ఉంటుంది. ఎవరిని ఎందుకు గెలిపించాలి, లేదా ఎందుకు ఓడించాలి అని ఓటర్లకు నచ్చచెప్పగలిగే పౌరసమాజం బలంగా ఉన్నప్పుడు వాగ్దానాలు అయినా బెదిరింపులు అయినా బాధ్యతారహితంగా చేయడానికి రాజకీయపక్షాలు సంకోచిస్తాయి.

తెలంగాణలో కూడా కొన్ని పౌరసమాజ వేదికలు ప్రజలను చైతన్యపరచడానికి ప్రయత్నిస్తున్నాయి. భారత రాష్ట్రసమితిని, భారతీయ జనతాపార్టీని రెంటినీ ఓడించాలని ఆ వేదికలు పిలుపునిచ్చి, ప్రచారం చేస్తున్నాయి. తప్పనిసరిగా ఓటుహక్కును వినియోగించుకోవాలన్న సందేశాన్ని కూడా ఇస్తున్నాయి. తెలంగాణ పీపుల్స్ జేఏసీ, జాగో తెలంగాణ, భారత్ బచావో, భారత్ జోడో అభియాన్, ముస్లిం సంఘాల జేఏసీ, తెలంగాణ సమాఖ్య మొదలయిన సంస్థలు ఈ ప్రచార కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్నాయి. ప్రొఫెసర్ హరగోపాల్, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఆకునూరి మురళి, రైతు ఉద్యమ ప్రతినిధి కన్నెగంటి రవి, ముస్లిం మైనారిటీల ఉద్యమకారుడు సలీంపాషా తదితరులు ఆయా సంఘాల తరఫున తెలంగాణ అంతటా పర్యటిస్తున్నారు, సభలలో ప్రసంగిస్తున్నారు. వీరు ఇస్తున్న రాజకీయ సందేశం కాంగ్రెస్‌కు ఓటువేయవలసిందిగా పరోక్షంగా సూచిస్తున్నప్పటికీ, దానిని నేరుగా చెప్పడం లేదు. ప్రస్తుత పరిస్థితులలో బీఆర్ఎస్‌ను, బీజేపీని ఓడించమని పిలుపునివ్వడానికి వారు కొన్ని కారణాలు చెబుతున్నారు. గత పదిసంవత్సరాల కాలంలో టీఆర్ఎస్/ బీఆర్ఎస్ రాష్ట్రంలో అందించిన అవినీతికర, అప్రజాస్వామిక దుష్పరిపాలనను, మతతత్వ శక్తిగా దేశానికి చేటు చేస్తున్న బీజేపీ ఫాసిస్టు పాలనను ఓడించాలన్నది వారి వాదన. ఆ పౌరసమాజ వేదికలకు క్షేత్రస్థాయిలో ఎంతటి ప్రభావశీలత ఉన్నదో స్పష్టంగా చెప్పలేము కానీ, తెలంగాణ సమాజంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో సహా అనేక పోరాటాలతో సానుభూతి కలిగిన శ్రేణుల ఆలోచనలకు ఈ వైఖరి దగ్గరగా ఉన్నది. ఉపాధ్యాయులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వ్యవసాయదారులు, ఉద్యోగార్థులు, వివిధ వృత్తి సంఘాలవారు, బీఆర్ఎస్ పాలనకు బాధితులుగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకత కలిగినవారు బీజేపీవైపు కాకుండా కాంగ్రెస్ వైపు మళ్లడానికి ఈ వైఖరి తోడ్పడుతుంది. అంటే ప్రభుత్వ వ్యతిరేకత చీలిపోయి, తమ ఓటు విఫలం కాకుండా ఉంటుంది. వచ్చే సాధారణ ఎన్నికలలో తాము ఆశిస్తున్న మతతత్వ శక్తుల ఓటమికి దోహదం జరుగుతుంది.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టినప్పుడు ఆయనను అనేక సామాజిక, ఉద్యమసంఘాల ప్రతినిధులు, బుద్ధిజీవులు కలిశారు. దేశవ్యాప్తంగా ప్రమాదకరమైన రీతిలో వ్యాపిస్తున్న సామాజిక విచ్ఛిన్నవాదం కలవరం కలిగిస్తూ ఉండడమే, రాహుల్ పర్యటనను ప్రగతిశీల శక్తులు స్వాగతించడానికి నేపథ్యం. ఇప్పుడు తెలంగాణ బుద్ధిజీవుల ప్రయత్నాలు కూడా ప్రధానంగా జాతీయస్థాయి దృక్పథం నుంచి భారతీయ జనతాపార్టీని దృష్టిలో పెట్టుకున్నవే. బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఆ పార్టీ రెండు దఫాల పాలన ఫలితం. దానికితోడు బీజేపీతో రహస్య అవగాహన ఉన్నదన్న అభిప్రాయం కూడా తోడయి, రెండు పార్టీలను కలిపి వ్యతిరేకించడంగా పరిణమించింది.

కర్ణాటకలో ‘ఎద్దెలు కర్ణాటక’ (మేలుకో కర్ణాటక!) పేరుతో పౌర, వృత్తి, సాహిత్య, కళా సంఘాలు కలిసి నిర్వహించిన ఉద్యమం అక్కడ బీజేపీని ఓడించడానికి ఎంతో సహాయపడింది. అక్కడ కూడా ఆ సంఘాలు కాంగ్రెస్‌కు ఓటు చేయమని నేరుగా చెప్పలేదు. బీజేపీని ఓడించమని మాత్రమే ప్రచారం చేశాయి. ఇరవై వేల మందికి పైగా వలంటీర్లు పనిచేశారు. వేలాది సభలు నిర్వహించారు. వందకుపైగా నియోజకవర్గాలలో కేంద్రీకరించి పనిచేశారు. స్పష్టమైన, నిశితమైన లక్ష్యాలతో, పనిపద్ధతులతో వారు ఓటర్లను చేరుకోగలిగారు. కర్ణాటకను కాపాడుకోవాలన్నది వారి నినాదం. ఓట్లు చీలిపోగూడదని, బీజేపీని ఓడించగలిగే అభ్యర్థి ఎవరైతే వారికి అనుకూలంగా ఓట్లు సమీకృతం కావాలని, ఓటింగ్ శాతాన్ని పెంచాలని వారు లక్ష్యాలుగా పెట్టుకున్నారు. తక్కువ ఆధిక్యంతో బీజేపీ గెలిచే నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని వాటి మీద దృష్టి పెట్టారు. ప్రతినియోజకవర్గంలోను ఐదు నుంచి ఇరవై వేల మంది ఓటర్లను లక్ష్యంగా పెట్టుకుని, వారి నిర్దిష్ట సమస్యల మీద, ఆకాంక్షల మీద పనిచేశారు. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే సంఘటనలు కానీ, పరిణామాలు కానీ జరిగినప్పుడు, వాటి మీద దృష్టి మళ్లకుండా, ప్రజలు అటు కొట్టుకుపోకుండా నివారించడం కూడా వారి ఆశయాలలో ఒకటి. ప్రజలలో ఉన్న వ్యతిరేకతకు తోడు, క్షేత్రస్థాయిలో ఈ సంఘాల ప్రభావం తోడయింది.

అయితే, సమస్య ఎక్కడంటే, తెలంగాణలో అధికారపార్టీ బీజేపీ కాదు. బీఆర్ఎస్ పరిపాలన మీద చాలా విమర్శ చేయవచ్చును కానీ, అది కర్ణాటక బీజేపీ పాలన అంతటి దుర్మార్గమైనది కాదు. ఇక్కడా అవినీతి ఉన్నది కానీ, అది 40 శాతం మాత్రం కాదు. ‘ఎద్దెలు కర్ణాటక’ ఉద్యమారంభానికి ముందే అక్కడి సమాజంలో ఉండిన తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకత తెలంగాణలో లేదు. మతతత్వంతో సమాజాన్ని భ్రష్టుపట్టిస్తున్నదని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిందించలేము కూడా. ఇక్కడ ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత స్థాయిలోనే, ఇక్కడి దుష్పరిపాలన స్థాయిలోనే ప్రతివ్యూహం కూడా రూపొందాలి. తెలంగాణ వాస్తవికత వేరు. అందుకు తగ్గ ఆచరణ అవసరం. అన్నిటి కంటె మించి, కర్ణాటకలో పౌరసమాజ ఉద్యమంతో కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత తనను తాను సమన్వయం చేసుకున్నది. తన స్థూలవ్యూహానికి అనుగుణంగా ఆయా సంఘాల వారితో సానుకూల సంబంధాలు కలిగి ఉండింది. తెలంగాణలో ఈ ప్రజాసంఘాలను పట్టించుకున్నవారు లేరు. జోడో యాత్ర తరువాత ఇక్కడి కాంగ్రెస్ పార్టీ ఆయా సంస్థలతో సంప్రదింపుల కోసం ప్రయత్నించలేదు. అయినప్పటికీ, తాము విశ్వసించే ఆదర్శాలను, తాము నివారించదలచిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని అనేకమంది సాంఘిక కార్యకర్తలు, ఆలోచనాపరులు స్వచ్ఛందంగా రంగంలోకి దిగి పనిచేస్తున్నారు. లక్ష్యం అది కాకపోయినప్పటికీ, వారు కాంగ్రెస్‌కు అనుకూలించే ప్రచారమే చేస్తున్నారు.


నిజానికి, ఇప్పుడు లోపిస్తున్న జీవాన్ని, ఆత్మను ఈ ఎన్నికల యుద్ధంలోకి ఆవాహన చేసుకోవాలంటే, ఈ చిన్న చిన్న ప్రజాసంఘాల నుంచి, పౌరవేదికల నుంచి స్ఫూర్తిని తీసుకోవాలి. సిద్ధాంతమే లేకుండా కేవలం ఆరోపణలు, ప్రత్యారోపణల ఆధారంగా సాగుతున్న ప్రచారపర్వంలోకి ఆదర్శాలకు కూడా స్థానం ఇవ్వాలి.

ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద విశ్వాసం ప్రకటించడం అంటే, ఆచరణలో వాటిని అమలుచేయించడానికి ప్రయత్నించడమే. ప్రజల అభిమతాన్ని నిష్ఫలం చేసే చెడుగులు అనేకం ప్రస్తుత ఎన్నికల వ్యవస్థలో ఉన్నాయి. ఎన్నికలు ధనమయం కావడం అందులో ప్రధానమైనది. ప్రజల ఆకాంక్షలనుంచి సాధికారతను, ప్రజాస్వామిక భాగస్వామ్యాన్ని తొలగించి, శుష్కమైన వాదప్రతివాదాలకే ఎన్నికల ప్రచారాన్ని పరిమితం చేయడం అవలక్షణం. ప్రజాస్వామ్య సాధకులు క్షేత్రస్థాయి నుంచి వీటికి వ్యతిరేకంగా పోరాడాలి. డబ్బు కంటె మించి పౌరచైతన్యం పైచేయి కాగలదని నిరూపించాలి. ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగించగలిగితే, అంతటితో విషయం పరిపూర్తి కాదు. రేపు అధికారంలోకి వచ్చే ప్రభుత్వం కూడా ప్రజల నుంచి వచ్చే ప్రజాస్వామిక ఒత్తిడికి లోబడి వ్యవహరించేట్టు చూడాలి. అందుకే ఎన్నికలలో ఎజెండాలు ప్రజలచేతిలో రూపొందాలి.

కె. శ్రీనివాస్

Updated Date - 2023-11-16T03:06:08+05:30 IST