Arab Countries: అరబ్‌ల ఆదర్శ సంక్షేమం

ABN , First Publish Date - 2023-06-14T07:32:05+05:30 IST

సంపద ఎంత ముఖ్యమో, దాన్ని వినియోగించే విధానం కూడా అంతే ముఖ్యం. కుటుంబం, రాష్ట్రం లేదా దేశం ఏదీ ఇందుకు మినహాయింపు కాదు.

Arab Countries: అరబ్‌ల ఆదర్శ సంక్షేమం

సంపద ఎంత ముఖ్యమో, దాన్ని వినియోగించే విధానం కూడా అంతే ముఖ్యం. కుటుంబం, రాష్ట్రం లేదా దేశం ఏదీ ఇందుకు మినహాయింపు కాదు. నిర్మాణాత్మక కార్యక్రమాలపై డబ్బును ఖర్చు చేస్తే భవిష్యత్తు బంగారమవుతుంది. స్వార్థ, తక్షణ ప్రయోజనాల కొరకు ఖర్చు చేస్తే ముందున్నది కష్టకాలమే అవుతుంది.

ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించడం పాలకుల బాధ్యత. అందరినీ అభివృద్ధిలో భాగస్వాములుగా చేయడం ద్వారా జాతి సంపదను సమతుల్యంగా అభివృద్ధి చేస్తే సత్ఫలితం ఉంటుంది. ఈ విషయంలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నికయిన మన ప్రజాప్రతినిధులు గల్ఫ్ అరబ్బు దేశాల రాచరిక పాలకుల నుంచి చాలా విషయాలు నేర్చుకోవల్సి ఉంది. అర్ధ శతాబ్ది క్రితం వరకు తినడానికి సరైన తిండి లేక పేదరికం అనుభవించిన అరబ్బు రాజ్యాలు నేడు సంపన్న దేశాలుగా వర్ధిల్లుతున్నాయి. కారణమేమిటి? పాలకులు అనుసరిస్తోన్న నిర్మాణాత్మక అభివృద్ధి, సంక్షేమ విధానాలే, సందేహం లేదు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ అధికార సాధనకు ఏకైక మార్గం ఎన్నికలు. ఈ దృష్ట్యా అధికారంలో ఉన్న రాజకీయ నేతలు ప్రజల సొమ్ముతో అమలుపరుస్తోన్న సంక్షేమ పథకాలు దశ, దిశ తప్పుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలలో సంక్షేమం పేరిట ప్రకటిస్తున్న వివిధ పథకాల తీరుతెన్నులను పరిశీలించండి. కలవరం కలిగించడం లేదూ?! విదేశాలలో నివసిస్తున్న సంపన్న ప్రవాసులకు కూడా వర్తిస్తున్న రైతుబంధు, ధార్మిక యాత్రలకు వెళ్ళే ధనికులకు సైతం ఆర్థిక సహాయం చేయడం మొదలైన వాటిని గమనిస్తే మన సంక్షేమ విధానాలు ఏ విధంగా దుర్వినియోగమవుతున్నాయో అవగతమవుతుంది.

అప్పులు చేసి లేదా భూములు విక్రయించి ‘అభివృద్ధి’ పనులు, ‘సంక్షేమ’ కార్యక్రమాలు అమలుపరుస్తున్నారు. నిజానికి ఇవి ప్రజల్లో సోమరితనాన్ని పెంపొందిస్తున్నాయి. అయినా పాలకులు ఆ ‘సంక్షేమ’ కార్యక్రమాలను కొనసాగిస్తుండడం దిగ్ర్భాంతి కలిగిస్తుంది. ప్రజలు సైతం క్రమేణా అలాంటి సంస్కృతికి అలవాటుపడడం అంతకంటే ఎక్కువ బాధాకరం. ఇంతకూ అభివృద్ధి అయినా, సంక్షేమం అయినా ఎవరి కోసం? ప్రజల కోసమే కదా. మరి అవి ప్రజాహితంగా ఉండొద్దూ? ఈ అంశాన్ని అర్థం చేసుకోవాలంటే గల్ఫ్ దేశాలలో వాటి పూర్వపరాలను పరిశీలించాలి. ఈ దేశాలలో ప్రభుత్వాలు రాయితీగా అందించే ఒక్క దినార్ కూడా దుర్వినియోగం కాదు. ఇది వాస్తవం, అతియోశక్తి కాదు.

గల్ఫ్ దేశాలలో వివాహాలకు నిధుల లేమి ఒక ప్రధాన సమస్య. ఇస్లాంలో మహెర్ అనే ఒక వైవాహిక సంప్రదాయం ఉన్నది. దాని ప్రకారం పెళ్ళి చేసుకొనే సందర్భంగా వరుడు, కాబోయె తన భార్యకు మహెర్ అంటే కన్యాశుల్కం చెల్లించవల్సి ఉంటుంది. స్వంత ఇల్లును సమకూర్చుకోవడం అనేది అన్ని దేశాలలో ఉన్న సమస్యే. ఈ సమస్య గల్ఫ్ దేశాలకు వచ్చేసరికి భారత్‌లో కంటే తీవ్ర స్థాయిలో ఉంది. జనాభాలో అత్యధిక శాతం మందికి స్వంత ఇళ్ళు లేవు. మహెర్‌కు, సొంత గృహాన్ని ఏర్పాటు చేసుకునేందుకు సహాయం చేయమని అరబ్బులు తమ పాలకులను అడగడం పరిపాటి. అదే విధంగా రుణమాఫీ. ప్రపంచంలో కెల్లా అత్యధికంగా చమురు ఉత్పత్తి చేసే కువైత్ దేశంలో రుణ మాఫీ కొరకు ప్రజలు చాలా ఏళ్ళుగా కోరుతున్నారు. వారి చిరకాల అభ్యర్థనను కువైత్ ప్రభుత్వం అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదు. పొరుగున ఉన్న సౌదీ అరేబియాలోని మక్కాకు హజ్ లేదా ఉమ్రా యాత్ర చేయడానికి వెళ్ళే భక్తులకు సైతం అరబ్ ప్రభుత్వాలు ఒక్క పైసా సహాయం చేయవు.

గల్ఫ్ దేశాలు తమ అపార చమురు సంపాదనతో ప్రపంచ అగ్ర రాజ్యాల ఆర్థిక వ్యవస్థలను పరోక్షంగా శాసిస్తున్నాయి. కనుక, ఈ ధనిక దేశాలకు తమ ప్రజల సాధారణ చిరు కోరికలు తీర్చడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే వాటిని పాలకులు ప్రోత్సహించరు. ఆ అభీష్టాలను తీర్చితే ప్రజలలో సోమరితనం పెరిగి, ఇంకా ఎక్కువగా విదేశీ ఉద్యోగులు, కార్మికులపై ఆధారపడతారని గల్ఫ్ రాజ్యాల రాచరిక పాలకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో చమురు ఆదాయం తగ్గిన తర్వాత కూడ ప్రజలలో ఆర్థిక క్రమశిక్షణకు ప్రజలు కట్టుబడి ఉండాలని గల్ఫ్ పాలకులు ప్రగాఢంగా ఆకాంక్షిస్తున్నారు. ఎవరికి వారు స్వంతంగా ఎదగాలని కోరుకుంటున్నారు. తమంతట తామే అన్నిటినీ సమకూర్చుకునే విధంగా తమ ప్రజలను సంసిద్ధులను చేసేందుకే గల్ఫ్ పాలకులు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ దిశగా వారిని వ్యూహాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు.

కాబోయే భార్యకు కన్యాశుల్కం చెల్లించే స్తోమత లేని యువకుడు ఉన్నత విద్యనభ్యసించడానికి అమెరికాకు వెళ్లదలుచుకుంటే అతడికి తక్షణమే ప్రభుత్వం నుంచి అన్ని విధాల ఆర్థిక సహాయమందుతుంది. ఆ విద్యార్థులు వివాహితులు అయితే కుటుంబ సమేతంగా వారు పాశ్చాత్య దేశాలలో తమ విద్యనభ్యసించే కాలంలో అక్కడ వారికి నివాస వసతి కల్పిస్తారు. సెలవులలో స్వదేశానికి వచ్చి వెళ్ళడానికి ఉచిత విమాన టిక్కెట్లు, ఫోన్ రోమింగ్ సదుపాయం సైతం కల్పిస్తారు. ప్రపంచ స్థాయి అగ్రశ్రేణి వైద్య సేవలను ప్రజలకు అందిస్తారు. ఒకవేళ స్థానికంగా చికిత్స అందుబాటులో లేకుంటే ప్రభుత్వ ఖర్చుతో వారికి విదేశాలలో వైద్య సేవలు సమకూరుస్తారు. ఉద్యోగ కల్పనలో యువతకు ప్రాధాన్యమిస్తారని మరి చెప్పనవసరం లేదు. తరతమ భేదాలు లేకుండా తమ ప్రజలు అందరికీ విద్యా, వైద్య సదుపాయాలు సమకూర్చుతూ ఉపాధి, ఉద్యోగ కల్పనకు గల్ఫ్ దేశాల పాలకులు ప్రథమ ప్రాధాన్యమిస్తారు. రైతు బంధు, దళిత బంధు, బిసి బంధు లేదా జగనన్న అమ్మ ఒడి తరహా ఉచిత తాయిలాలకు ఈ దేశాలలో ఆస్కారం లేదు. మరి అరబ్ ప్రజల ఆర్థిక స్థితిగతులు చాలా మెరుగ్గా ఉండడంలో ఆశ్చర్యమేముంది?

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Updated Date - 2023-06-14T07:32:05+05:30 IST