Share News

పేలాలతో రోగాలు ఆగాలి!

ABN , Publish Date - Dec 17 , 2023 | 12:28 PM

‘పథ్యాపథ్య’ అనే గ్రంథంలో పండిత గణనాథసేన్‌ అమీబియాసిస్‌ వ్యాధి తగ్గటానికి ‘రాత్రిళ్లు ఎక్కువ సేపు మేల్కోకుండా కమ్మగా నిద్రపోవాలి....

పేలాలతో రోగాలు ఆగాలి!

‘‘నిద్రా చ్ఛర్దనలంఘనం చిరభవా యే శాలయష్షష్టికాః మణ్డో లాజకృతో మసూర తువరీ ముద్గ ప్రసూతారసాః’’

‘పథ్యాపథ్య’ అనే గ్రంథంలో పండిత గణనాథసేన్‌ అమీబియాసిస్‌ వ్యాధి తగ్గటానికి ‘రాత్రిళ్లు ఎక్కువ సేపు మేల్కోకుండా కమ్మగా నిద్రపోవాలి. ఒకపూట భోజనం మానాలి. పాత బియ్యం అన్నమే తినాలి. ‘లాజ’ అంటే పేలాల్ని విసిరిన పిండికి 14 రెట్లు నీళ్లు పోసి చిక్కపడేదాకా ఉడికించిన గంజిని ‘లాజ మండం’ అంటారు, ఇది అమీబియాసిస్‌, పేగుల్లో వచ్చే వ్యాధుల్లో పనిచేస్తుంది. మసూరపప్పు (ఎర్రకందిపప్పు), కందిపప్పు, పెసరపప్పుల్ని వేగించి కాచిన కట్టు మేలు చేస్తుంది...’ ఇలా చాలా ఆహార పదార్థాల వివరాలను రాశారు.

తెలుగులో పేలాలు అనేది ధ్వన్యనుకరణ పదం. ధాన్యపు గింజల్ని మంగలంలో వేయిస్తే అవి పేలి, పువ్వుల్లా విచ్చుకొంటాయి. కాబట్టి ‘పేలాలు’ అన్నారు.

పొరివిళంగాయలు: ఆముక్తమాల్యదలో రాయ లవారు పొరివిళంగాయ లనే ఒక భక్ష్యాన్ని పేర్కొన్నాడు. వరిపేలాల్ని, పెసర పేలాల్ని చెరి సగంగా తీసుకొని పిండి విసిరి బెల్లం పాకం పట్టిన ఉండల్ని పురివిళం గాయలని 11వ శతాబ్దినాటి మానసోల్లాస గ్రంథంలో ఉంది.

ధాన్యం ఎందుకు పేల్తాయి?: 400 డిగ్రీల వేడిమీద ధాన్యపు గింజల్ని వేగించినప్పుడు గింజలో 14ు వరకూ ఉండే నీరు ఆవిరై వత్తిడి ఏర్పడి గింజలోపలి పిండిపదార్థం పేలి, పువ్వులా విచ్చుకుని, దాని అసలు పరిమాణా నికన్నా40% వరకూ పెరుగుతుంది.

వరి పేలాలు: తియ్యగా, చలవ చేసేవిగా ఉంటాయి. అతిమూత్రాన్ని ఆపుతాయి. వాంతులు, విరేచనాలు, దప్పిక, శోషల్ని నివారిస్తాయి. రక్తదోషాల్ని పోగొడతాయి. వీటిని విసిరిన పిండిని ‘సక్తుపిండి’ అంటారు. దీనితో కాచిన జావ బలకరం. చలవ.

మరమరాలు: బొరుగులంటారు. వడ్లను ఉప్పు నీళ్లలో నానించి పేలుస్తారు. తృప్తినిస్తాయి. జీర్ణశక్తినిస్తాయి. బలకరం. శోషనునివారిస్తాయి.

గోథుమ పేలాలు: కొద్దిగా వేడిచేస్తాయి. ఆకల్ని పుట్టిస్తాయి.

మక్కజొన్న పేలాలు: మక్కజొన్నలు బ్రిటిష్‌ పాలనాకాలంలో అమెరికా నుండి మనకు చేరాయి. రెడ్డిండియన్లు వీటికి బెల్లం పాకం పట్టి ఉండలు చేసుకొంటారు. వీటిలోఫైబర్‌ ఎక్కువ,కేలరీలు తక్కువ.బి-విటమినూ,ఇతర ప్రొటీన్లూ అధికం.

శనగ పేలాలు: వేయించిన శనగపప్పు (పుట్నా లపప్పు - చట్నీపప్పు) ఆరోగ్యానికి మంచిది కాదు. వాతాన్ని, చర్మ వ్యాధుల్ని పెంచుతుంది.

బఠాణీ పేలాలు:బాగా వాతం చేస్తాయి. ఉబ్బరాన్ని తెస్తాయి. అతిగా తింటే, ‘ఖంజత్వ ఫంగుత్వకారీ’ అంటే, నడవలేని స్థితి తెస్తుంది.

జొన్న పేలాలు:‘పాప్‌ సోర్ఘం’అంటారు.తొలి ఏకాదశినాడు జొన్నపేలాల పిండి తిని ఉప వాసం చేస్తారు. షుగర్నీ, కొవ్వునీ తగ్గిస్తుంది.

రాగి పేలాలు:ఒక కప్పు రాగులకు నాలుగు చెంచాలు పెరుగు కలిపి నాననిచ్చి పేల్చిన రాగి పేలాల పిండిలో కొబ్బరి తురుము, పాలు, పంచదార, నెయ్యి కలిపి కట్టిన ఉండల్ని రాగి హురిహుట్టు అంటారు.

బార్లీ పేలాలు: చలవచేసి, జీర్ణశక్తినిస్తాయి. మలమూత్రాల్ని పెంచుతాయి. కఫ, పైత్యాల్ని తగ్గిస్తాయి. వీర్యకణాల్ని పెంచి, తక్షణ శక్తినిస్తాయి.

ఏ ధాన్యాన్నయినా తేలికగా వేగించి వండు కుంటే ఆరోగ్యానికి మంచిది. ఉడికినవాటికన్నా కాలిన/పేలిన ధాన్యమే మేలు చేస్తాయి!

- డా. జి వి పూర్ణచందు, 94401 72642

Updated Date - Dec 17 , 2023 | 12:47 PM