Share News

బడితో చెడుగుడు!

ABN , Publish Date - Aug 25 , 2024 | 05:29 AM

‘నాడు-నేడు’ పథకంతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తామని గత జగన్‌ ప్రభుత్వం ఆర్భాటం చేసింది. అయితే ఇందులో ప్రచారం తప్ప పనులేం చేయలేదని తేలింది.

బడితో చెడుగుడు!

నాడు-నేడుపై జగన్‌ సర్కారు చెప్పినవన్నీ అబద్ధాలే

ప్రచారం కోసం పథకాన్ని వాడుకున్న వైసీపీ పెద్దలు

చాలాచోట్ల ఎక్కడి పనులు అక్కడే నిలిపేసిన వైనం

మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిపెట్టని నేతలు

జగన్‌ ప్రభుత్వంలో మూడు వేల కోట్లు పక్కదారి

ఇప్పుడు వాటినేం చేయాలంటూ అధికారుల కసరత్తు

పథకం పేరు ‘మన బడి- మన భవిష్యత్తు’గా మార్పు

స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీల భాగస్వామ్యంతో పనులు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘నాడు-నేడు’ పథకంతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తామని గత జగన్‌ ప్రభుత్వం ఆర్భాటం చేసింది. అయితే ఇందులో ప్రచారం తప్ప పనులేం చేయలేదని తేలింది. చాలాచోట్ల ఎక్కడి పనులు అక్కడే వదిలేసినట్లు వెల్లడైంది. ప్రభుత్వ బడుల్లో అద్భుతాలు అంటూ రాజకీయ లబ్ధి కోసం విశ్వప్రయత్నాలు చేసిన వైసీపీ పెద్దలు... వాటిలో మౌలిక సదుపాయాల పురోగతిపై దృష్టి పెట్టలేదు. దీంతో నాడు-నేడు మధ్యలోనే ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంచనా వేయగా నాడు-నేడు రెండో దశలో కేవలం 7.88శాతం పనులే పూర్తిచేసిన విషయం బయటపడింది. 22,311 బడుల్లో రెండోదశ పథకం ప్రారంభించగా కేవలం 1,759 బడుల్లో మాత్రం పనులు పూర్తయ్యాయి. 20,552 పాఠశాలల్లో మధ్యలోనే నిలిచిపోయాయి. ఇప్పుడు వాటినెలా పూర్తిచేయాలన్న దానిపై ప్రభుత్వం దృష్టి సారించింది. తొలుత కాంట్రాక్టు విధానంలో పనులు చేయించాలని యోచించినా, తల్లిదండ్రుల భాగస్వామ్యం ఉండాలని నిర్ణయానికొచ్చింది. కొత్తగా ఎన్నుకున్న స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీల భాగస్వామ్యంతో పనులు పూర్తి చేయాలని భావిస్తోంది. పనులు ఏ దశల్లో ఉన్నాయి? ఇంకా ఏ మేరకు నిధులు అవసరం? అనేదానిపై పాఠశాల విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. కాగా ‘నాడు-నేడు’ పథకం పేరును ‘మన బడి-మన భవిష్యత్తు’గా ప్రభుత్వం మార్చింది.

పనుల ప్రారంభంపైనా ఆరా

పనులు మధ్యలో వదిలేయడం ఒకెత్తు అయితే అసలు ఏ ప్రాతిపదికన బడుల్లో పనులు మొదలుపెట్టారనే అంశంపై కూడా పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. నాడు- నేడు పథకం ప్రారంభం నాటి అధికారులతో ఇటీవల సమావేశం నిర్వహించారు. ఆ బాధ్యతల నుంచి తప్పుకొని వెళ్లిపోయిన వారిని కూడా పిలిపించారు. మొదటి, రెండో దశల్లో పనులు ప్రారంభానికి బడులను ఏ ప్రాతిపదికపై ఎంపిక చేశారో తెలుసుకుంటున్నారు. నాడు-నేడు పేరుతో భారీగా నిధులు ఖర్చు చేశాక కొన్ని ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి. తరగతుల విలీనం ప్రక్రియ చేపట్టడంతో కొన్ని బడుల్లో విద్యార్థుల సంఖ్య జీరోకు చేరింది. దీంతో అక్కడి టీచర్లను ఇతర పాఠశాలలకు పంపి, ఆ బడులకు తాళాలు వేశారు. అయితే విద్యార్థుల సంఖ్య అంతంతమాత్రంగా ఉన్న బడులను ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చిందో ఇప్పుడు వివరాలు సేకరిస్తున్నారు.

ప్రాథమిక పాఠశాలలపై దృష్టి

ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మెరుగ్గానే ఉన్నా ప్రాథమిక పాఠశాలల పరిస్థితి ఏటా దిగజారుతోంది. విద్యార్థులు లేక ఆ బడులు వెలవెలబోతున్నాయి. 20 మంది విద్యార్థులు కూడా లేని బడులు దాదాపు దాదాపు 12వేల వరకూ ఉన్నాయి. వీటిలో కేవలం ఒక్కరే టీచరు ఉన్నారు. దీంతో ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆ బడుల్లోనూ ఒక్కో తరగతికి ఒక టీచర్‌ను నియమించే ఆలోచన చేస్తోంది. దాంతోపాటు అన్ని బడుల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని, వచ్చే ఏడాది నాటికి టీచర్లను పెంచి విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రయత్నించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది.

ఎక్కడి పనులు అక్కడే

45వేల ప్రభుత్వ బడుల్లో మొత్తం మూడు దశల్లో మౌలిక సదుపాయాల కల్పన పూర్తిచేస్తామని జగన్‌ ప్రభుత్వం ప్రకటించింది. మొదటి దశలో 15,715 బడుల్లో పథకం ప్రారంభించగా, దాదాపుగా పూర్తయ్యాయి. రెండోదశ పనులు 2022లో ప్రారంభించారు. 22,311 బడుల్లో వసతులు అభివృద్ధి చేయడంతో పాటు అదనపు గదుల నిర్మాణం చేపట్టారు. రూ.8వేల కోట్ల అంచనాతో ప్రారంభించిన ఈ పనులకు ఇప్పటివరకూ రూ.4,107 కోట్లు ఖర్చు చేశారు. అయితే రూ.7వేల కోట్లకు పైగా నిధులను వివిధ రూపాల్లో సమీకరించినా వాటిని పథకానికి వినియోగించకుండా పక్కదారి పట్టించారు. నిధుల లేమితో వేల సంఖ్యలో బడుల్లో పనులు మధ్యలో నిలిచిపోయి ప్రాంగణాలన్నీ అస్తవ్యస్తంగా మారాయి. దీనిపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు, కడప, విజయనగరం, మన్యం మినహా ఏ జిల్లాలోనూ పది శాతం పనులు కూడా పూర్తికాలేదు.

Updated Date - Aug 25 , 2024 | 05:30 AM