Share News

156 ఔషధాలపై కేంద్రం నిషేధం!

ABN , Publish Date - Aug 25 , 2024 | 05:33 AM

ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని 156 రకాల ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌(ఎ్‌ఫడీసీ) మందులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.

156 ఔషధాలపై కేంద్రం నిషేధం!

8 జాబితాను విడుదల చేసిన ఔషధ నియంత్రణ శాఖ

గుంటూరు(మెడికల్‌), ఆగస్టు 24: ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని 156 రకాల ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌(ఎ్‌ఫడీసీ) మందులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. తక్షణం వీటి తయారీ, పంపిణీ, విక్రయాలు నిలిపివేయాలని కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నిషేధించిన మందుల్లో పలు యాంటీ బయోటిక్‌ , యాంటీ అలర్జీ, అధిక రక్తపోటు, నొప్పి నివారణ మందులు, మల్టీ విటమిన్‌ ట్యాబ్లెట్లు తదితరాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నియమించిన డ్రగ్‌ టెక్నికల్‌ అడ్వైజరీ బోర్డ్‌ (డీటీఏబీ) సూచనల మేరకు ఈ మందులపై కేంద్ర ఆరోగ్య శాఖ నిషేధం విఽధించింది. ఈ మేరకు ఈనెల 12వ తేదీన గెజిట్‌ నోటిఫికేషన్‌ను వెలువరించింది. నిషేధ మందుల జాబితాను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. తాజాగా గుంటూరు జిల్లా ఔషధ నియంత్రణ శాఖ అధికారులు శనివారం ఆ నిషేఽధిత మందుల జాబితాను విడుదల చేశారు. వీటిని తక్షణం దుకాణాల నుంచి తొలగించాలని ఆదేశిస్తూ జిల్లాలోని హోల్‌సేల్‌, రిటైల్‌ మందుల దుకాణాదారులకు సర్క్యులర్‌ జారీ చేశారు. ఈ మందుల కాంబినేషన్‌లో హేతుబద్ధత లేదని, పైగా రోగుల చికిత్సల్లో ఈ మందుల వినియోగం వల్ల ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఉందని డీటీఏబీ నిపుణులు పేర్కొన్నారు. బాగా ప్రాచుర్యంలో ఉన్న పలు ప్రముఖ కంపెనీల ఉత్పత్తులు నిషేధిత మందుల జాబితాలో ఉండటం విశేషం. మెఫనమిక్‌ యాసిడ్‌, పారా సిటమాల్‌ కాంబినేషన్‌ ఇంజెక్షన్లను సాధారణంగా నొప్పి నివారణకు వినియోగిస్తారు. ఈ కాంబినేషన్‌ మందు వల్ల రోగుల్లో తీవ్రమైన దుష్ఫలితాలు తలెత్తుతున్నట్లు నిపుణులు గుర్తించారు. అదేవిధంగా ఎసిక్లోఫెనాక్‌, పారాసిటమాల్‌ కాంబినేషన్‌ చాలా సాధారణంగా వైద్యులు ప్రిస్ర్కైబ్‌ చేస్తుంటారు. ఈ కాంబినేషన్‌పైనా ప్రభుత్వం నిషేధం విధించింది. మొటిమల చికిత్స, ముక్కు దిబ్బడ, చర్మవ్యాధుల చికిత్సల్లో వాడే ఔషధాలు కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయి. గతంలో 2018లో కేంద్ర ప్రభుత్వం 328 ఎఫ్‌డీసీ మందులపై నిషేధం విధించింది. ఆరేళ్ల తర్వాత మరోసారి పెద్ద సంఖ్యలో మందులపై నిషేధం విధిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేయడం విశేషం.

Updated Date - Aug 25 , 2024 | 05:34 AM