Share News

కిక్కిరిసిన కుప్పం

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:41 AM

కుప్పం జనసంద్రమైంది.టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులతో కుప్పం వీధులు కిక్కిరిశాయి.

కిక్కిరిసిన కుప్పం
టీడీపీ శ్రేణులకు భువనేశ్వరి అభివాదం

కుప్పం, ఏప్రిల్‌ 19 : కుప్పం జనసంద్రమైంది.టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులతో కుప్పం వీధులు కిక్కిరిశాయి.నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచే కాకుండా చిత్తూరుతోపాటు ఇతర జిల్లాల నుంచి అభిమానులు వేలాదిగా కుప్పం తరలివచ్చారు. లక్ష్మీపురంలోని వరదరాజస్వామి ఆలయంలో ఉదయం 10.45 గంటలకు నామినేషన్‌ పత్రాలను స్వామివారి పాదాల చెంత ఉంచిన భువనేశ్వరి ఆయన విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం మసీదు, చర్చిల్లో ప్రార్థనలు జరిపారు. ఆయా ప్రార్థనాలయాల్లో పూజారులు, మతపెద్దలు ఆమెకు ఆశీర్వచనం పలికి దీవించారు. అక్కడి నుంచి ఆమె కుప్పం చెరువుకట్ట వద్దకు ఉదయం 11.15 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. అప్పటికే నియోజకవర్గంలోని టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు వేచి చూస్తున్నాయి. డప్పులు, కోలాటాలు, డీజే శబ్దాల మధ్య నామినేషన్‌ కేంద్రానికి భారీ ఊరేగింపు బయలుదేరింది. ఓపెన్‌ టాప్‌ వాహనం ఎక్కిన భువనేశ్వరి దారి పొడవునా ప్రజలకు, అభిమానులకు అభివాదం చేస్తూ, చిరునవ్వులు చిందిస్తూ ర్యాలీలో సాగారు. మిట్టమధ్యాహ్నం 12 గంటల వేళ ఎర్రడి ఎండ మాడ్చేస్తున్నా ఏమాత్రం లెక్కచేయని జనం ర్యాలీలో ఆమె వాహనం వెంట పరుగులు పెట్టారు. యువత కేరింతలు కొట్టారు. డ్యాన్సులు వేశారు. ఆర్టీసీ బస్టాండు కూడలి వద్దకు ర్యాలీ చేరుకునే సరికి మధ్యాహ్నం ఒంటి గంటయింది. ఇక్కడ భువనేశ్వరి ఎన్టీఆర్‌, అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. పార్టీ శ్రేణులు, అభిమానులు, జన సమూహాన్ని ఉద్దేశించి 15 నిముషాలు ప్రసంగించారు. కుప్పం గడ్డ టీడీపీ అడ్డా అని, ఇక్కడ పసుపు జెండాకు తప్ప మరో జెండాకు స్థానం లేదని గర్జించారు. చంద్రబాబు సీఎం అయితేనే కుప్పంతోపాటు రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని నమ్మడం వల్లే అన్ని వర్గాల ప్రజలు ఆయన నామినేషన్‌ ఫీజు సొమ్మును విరాళాలుగా అందించారని, కుప్పం ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటానని ప్రకటించారు.అనంతరం మధ్యాహ్నం 1.27 గంటలకు భువనేశ్వరి నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి జి.శ్రీనివాసులుకు అందించారు.నామినేషన్‌ కేంద్రానికి వంద మీటర్ల దూరంలోనే వాహనం నుంచి దిగి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, టీడీపీ నియోకవర్గ ఇన్‌ఛార్జి పీఎ్‌స.మునిరత్నం వెంటరాగా నామినేషన్‌ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

నామినేషన్‌ ఫీజుకు అభిమానుల విరాళాలు

చంద్రబాబు నామినేషన్‌ ఫీజుకు సంబంధించిన నగదు అభిమానుల నుంచి విరాళాలుగా సమకూరింది. ర్యాలీ ప్రారంభించడానికి ముందుగా భువనేశ్వరిని కలిసిన దివ్యాంగులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు నామినేషన్‌కు కావాల్సిన మొత్తాన్ని ఆమెకు విరాళంగా అందించారు. తమ భవిష్యత్తుకు చంద్రబాబు ద్వారానే భరోసా లభిస్తుందన్న నమ్మకంతో ఆయన గెలిచి తీరాలన్న ఆకాంక్షతో ఈ మొత్తం అందిస్తున్నట్లు ఈ సందర్భంగా వారు ఆమెతో చెప్పారు.

Updated Date - Apr 20 , 2024 | 01:41 AM