Share News

న్యాయ వ్యవస్థకు మారుపేరు చిత్తూరు

ABN , Publish Date - Apr 28 , 2024 | 01:41 AM

న్యాయవాదులు అంకితభావంతో ముందుకెళ్లాలి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గవాయి

న్యాయ వ్యవస్థకు మారుపేరు చిత్తూరు
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న న్యాయమూర్తులు

చిత్తూరు లీగల్‌, ఏప్రిల్‌ 27: చిత్తూరు న్యాయ వ్యవస్థకు మారుపేరని, ప్రజలకు దానిపై నమ్మకం కలిగేలా న్యాయవాదులు అంకితభావంతో ముందుకెళ్లాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గవాయి అన్నారు. చిత్తూరులో రూ.40 కోట్లతో నిర్మించిన 15 కోర్టు భవనాల సముదాయాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ జిల్లా నుంచి ఎంతో మంది విశిష్టమైన వ్యక్తులు న్యాయ వ్యవస్థకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. న్యాయవాదులు నిజాయితీ, ధైర్యం, అంకితభావంతో కష్టపడి ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. జస్టిస్‌ ఎస్‌వీఎస్‌ భట్టి మాట్లాడుతూ న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ పెంచేలా న్యాయవాదులు పనిచేయాలన్నారు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాగూర్‌ మాట్లాడుతూ కోర్టు భవనాల ప్రారంభోత్సవానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రావడం ఆనందంగా ఉందన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు న్యాయమూర్తులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అంతకు ముందు కలెక్టర్‌ షన్మోహన్‌, ఎస్పీ మణికంఠ చందోలు, చిత్తూరు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో వారికి ఘనంగా స్వాగతం పలికారు. శాలువలు, గజమాలలు, పోలీసు గౌరవ వందనాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి, చిత్తూరు అడ్మినిస్ట్రేటివ్‌ జడ్జి జస్టిస్‌ రావు రఘునందరావు, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి తిరుపతి డివిజన్‌ విజయసారథిరాజు, చిత్తూరు, తిరుపతి, నగరి, మదనపల్లె, పుంగనూరు కోర్టుల న్యాయమూర్తులు, ఏపీ బార్‌కౌన్సిల్‌ చైర్మన్‌ నల్లారి ద్వారకనాథరెడ్డి, చిత్తూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాజేంద్రరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 01:41 AM