విశాఖ ఆంధ్ర హాస్పిటల్స్‌లో చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు
ABN , Publish Date - Aug 07 , 2024 | 03:30 AM
విశాఖపట్నంలోని ఆంధ్ర హాస్పిటల్‌లో చిన్నపిల్లలకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్టు డైరెక్టర్ పి.వి.రామారావు తెలిపారు.
రెండు, మూడు నెలలకు ఒకసారి మెడికల్ క్యాంపులు
ఆసుపత్రి డైరెక్టర్ పీవీ రామారావు
విశాఖపట్నం (మహారాణిపేట), ఆగస్టు 6: విశాఖపట్నంలోని ఆంధ్ర హాస్పిటల్‌లో చిన్నపిల్లలకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్టు డైరెక్టర్ పి.వి.రామారావు తెలిపారు. కలెక్టరేట్ జంక్షన్‌లోని ఆసుపత్రిలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హీలింగ్ లిటిల్ హర్ట్స్-యూకే చారిటీ సంస్థ సహకారంతో విశాఖలో ఈ నెల ఐదు నుంచి ఏడో తేదీ వరకు ఉచిత గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రముఖ హృద్రోగ వైద్య నిపుణుడు రేవంత్, డాక్టర్ విక్రమ్‌తోపాటు ఆంధ్ర హాస్పిటల్ కార్డియాలజీ విభాగం, బ్రిటన్ నుంచి విచ్చేసిన ప్రముఖ కార్డియాలజీ నిపుణుల బృందం తొలిరోజు ఏడుగురు చిన్నారులకు శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించినట్టు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తమ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఇటువంటి శస్త్ర చికిత్సలు ప్రతి నెలా సుమారు 60 వరకు ఉచితంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకూ 30 మెడికల్ క్యాంపులు నిర్వహించి, నాలుగు వేల మంది పిల్లలకు గుండె శస్త్రచికిత్సలు చేసినట్టు ఆయన వివరించారు. తొలిసారిగా విశాఖలో ఉచిత క్యాంపును ప్రారంభించినట్టు రామారావు తెలిపారు. రానున్న రోజుల్లో రెండు, మూడు నెలలకొకసారి క్యాంపులు ఏర్పాటు చేస్తామన్నారు. గుండెజబ్బులు ఎదుర్కొంటున్న పిల్లల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిన్న పిల్లల వైద్య నిపుణులు విక్రమ్, డాక్టర్లు రేవంత్, సుబ్రహ్మణ్యం, రమేష్, రవీంద్రదేవ్, మురళీకృష్ణ, చికిత్స పొందిన చిన్నారులతోపాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.