Share News

వెంకన్నా... ఇదేం విచారణ?

ABN , Publish Date - Aug 25 , 2024 | 05:40 AM

అసలు సూత్రధారులను వదిలేసి... ఉద్యోగులపై విజిలెన్స్‌ ఉరిమి పడుతోంది! నోటీసులతో బెంబేలెత్తిస్తోంది. టీటీడీలో ఇప్పుడు ఇదో సంచలనంగా మారింది.

వెంకన్నా... ఇదేం విచారణ?

సూత్రధారులను వదిలేసి ఉద్యోగులపై విజిలెన్స్‌!

నాటి చైర్మన్లు సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి అదనపు ఈవో ధర్మారెడ్డిపై ఆరోపణలు

ఇంజనీరింగ్‌ విభాగంలో వేలకోట్లు కేటాయింపు వెనుక కమీషన్ల దందా

అవసరం లేకున్నా గోవిందరాజస్వామి సత్రాలు.. దర్శనాల్లోనూ ఇష్టారాజ్యం

శ్రీవాణి ట్రస్టు నిధుల దుర్వినియోగం.. రెవెన్యూ, మార్కెటింగ్‌ విభాగాల్లో అక్రమాలు

కూటమి సర్కారులో విజిలెన్స్‌ విచారణ.. పెద్దలను వదిలేసి ఉద్యోగులకు నోటీసులు

ఇలాగైతే అక్రమార్కులను గుర్తించేదెలా?.. విచారణ తీరుపై సర్వత్రా విమర్శలు

(తిరుపతి-ఆంధ్రజ్యోతి)

అసలు సూత్రధారులను వదిలేసి... ఉద్యోగులపై విజిలెన్స్‌ ఉరిమి పడుతోంది! నోటీసులతో బెంబేలెత్తిస్తోంది. టీటీడీలో ఇప్పుడు ఇదో సంచలనంగా మారింది. అప్పటి పాలక మండలి చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డితో పాటు అదనపు ఈవో ధర్మారెడ్డిపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ ముగ్గురిపై పలు ఫిర్యాదులు అందాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో పాటు సీఎస్‌, డీజీపీ, సీఐడీ, ఏసీబీ, విజిలెన్స్‌ విభాగాల అధిపతులకు పలువురు నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో జగన్‌ ప్రభుత్వంలో టీటీడీలో జరిగిన అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్‌ అధికారులు అక్రమాల నిగ్గు తేలుస్తారని అంతా భావిస్తే... కొత్త సమస్య పుట్టుకొచ్చింది. గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన టీటీడీ ముఖ్యులకు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. పెద్దలను విచారించకుండా విజిలెన్స్‌ విచారణలో ఏమి తేలుస్తుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆరోపణలు ఎదుర్కొన్న ముఖ్యుల జోలికి వెళ్లకుండా విచారణ పేరిట తమను వేధిస్తున్నారంటూ ఉద్యోగులు రగిలిపోతున్నారు.

ఇవీ ఆరోపణలు

గత ఐదేళ్ల పాటు కొండపై చక్రం తిప్పిన అదనపు ఈవో ధర్మారెడ్డి టీటీడీ పాలనలో కీలక పాత్ర పోషించారు. పలు విషయాల్లో ఆయన నిర్ణయాలే ప్రభుత్వ ఆదేశాలుగా చెలామణి అయ్యాయి. అలాగే బోర్డు చైర్మన్లుగా వ్యవహరించిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి గతంలో ఏ చైర్మన్‌ వ్యవహరించని రీతిలో అధికారం చెలాయించారు. ఈ ముగ్గురూ నిబంధనలకు విరుద్ధంగా అనేక నిర్ణయాలు తీసుకుని, విభాగాల అధికారులతో బలవంతంగా అమలు చేయించారనే ఆరోపణలున్నాయి. ఉదాహరణకు ఇంజనీరింగ్‌ పనులకు ఏటా బడ్జెట్‌లో రూ.300 కోట్లకు మించి కేటాయింపులు జరిపిన దాఖలాలు టీటీడీ చరిత్రలోనే లేవు. అలాంటిది వైసీపీ హయాంలో రూ.3 వేల కోట్లకు పైగా నిధుల కేటాయింపులు జరిగాయి. తిరుపతిలో గోవిందరాజ స్వామి సత్రాలను అంతకుముందే ఆధునీకరించినా వాటిని కూలదోసి కొత్తగా నిర్మించేందుకు రూ.600 కోట్లు కేటాయించడం వెనుక సొంత ప్రయోజనాలున్నాయనే ఆరోపణలున్నాయి. స్విమ్స్‌ భవనాలు చాలా దృఢంగా ఉన్నా వాటి స్థానంలో కొత్త భవనాల నిర్మాణం చేపట్టడం వెనుక కూడా ముడుపుల కథ ఉన్నట్టు విమర్శలు వచ్చాయి. మొత్తమ్మీద అవసరం లేకపోయినా రూ.1800 కోట్ల నిధులు కేటాయించి, కమీషన్లు దండుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటన్నింటికీ ఈ ముగ్గురే మూల కారకులనే విమర్శలు వచ్చాయి. ధర్మారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి తమకున్న విచక్షణాధికారాలను అడ్డు పెట్టుకుని దర్శనాల కేటాయింపులో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. శ్రీవాణి ట్రస్టు నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వచ్చాయి. రెవెన్యూ విభాగంలో షాపులు, తట్టల (హాకర్స్‌) విషయంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని పోస్టుల నియామకాల్లో నిబంధనలు పాటించలేదని, కొండపై మఠాలకు సంబంధించి ఆక్రమణలు జరిగితే వాటిని క్రమబద్ధీకరించారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఇదీ విచారణ తీరు..

టీటీడీ ముఖ్యులపై వచ్చిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం గత జూన్‌ చివరిలో విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. 45 రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక అందజేయాలని స్పష్టంచేసింది. గుంటూరు నుంచి విజిలెన్స్‌ ఎస్పీ కరీముల్లా షరీఫ్‌ నేతృత్వంలో 47 మందితో భారీ విచారణ బృందాన్ని నియమించింది. వీరిలో 25 మంది ప్రధానంగా విచారణ బాధ్యతలు చేపట్టారు. ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐలు, ఈఈ, డీఈ స్థాయి అధికారులు ఆరుగురు, జిల్లా కమర్షియల్‌ టాక్స్‌ అధికారి ఒకరు, డీసీటీవో స్థాయి అధికారులు నలుగురు ఈ బృందంలో ఉన్నారు. నిర్దేశించిన 45రోజుల గడువు దాటిపోయినా విచారణ పూర్తికాలేదు. అంతేగాక ఈ బృందం విచారణ తీరు వివాదాస్పదం అవుతోంది. ఆరోపణలు ఎదుర్కొన్న ధర్మారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిని విచారించకపోగా కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. ఈలోగా టీటీడీ పరిపాలనా భవనంలో కొన్ని ఫైళ్లు దగ్ధం కావడం విమర్శలపాలైంది. టీటీడీ వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునే హోదాలో ఉన్నవారిని విస్మరించిన విజిలెన్స్‌ అధికారులు... విభాగాల అధికారులు, ఉద్యోగులపై దృష్టి సారించారు. ఇంజనీరింగ్‌ విభాగంలో ఏకంగా 51మంది అధికారులకు నోటీసులు జారీచేశారు. ఇతర విభాగాలకు చెందిన మరో ఏడుగురికి కూడా ఇదే విధంగా నోటీసులు జారీ చేశారు. విజిలెన్స్‌ బృందం అదనపు ఈవో కార్యాలయంలో పలు రికార్డులు పరిశీలించి కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. ఇంజనీరింగ్‌ విభాగంలో నిధుల కేటాయింపులు, చేపట్టిన పనుల వివరాలు సేకరించారు. మార్కెటింగ్‌ విభాగంలో నాసిరకం ముడిసరుకులు కొనుగోలు చేశారన్న ఆరోపణలపైనా విచారణ జరిపారు. కొన్ని మఠాలు కేటాయించిన భూమి కంటే ఎక్కువగా ఆక్రమించుకుని, అనధికారిక నిర్మాణాలు చేపట్టాయన్న దానిపైనా దృష్టి పెట్టారు. శ్రీవాణి ట్రస్టు టికెట్ల జారీమీద కూడా లోతుగా విచారణ సాగలేదని అంటున్నారు. మిగిలిన అంశాల్లో విజిలెన్స్‌ అధికారులు పెద్దగా సాధించింది ఏమీ లేదని తెలుస్తోంది.

అధికారులపై నిఘా

విజిలెన్స్‌ అధికారుల విచారణ తుది దశకు చేరుకోవడంతో నివేదిక రూపొందించడంలో వారు బిజీగా ఉన్నారు. బృందంలో ఖాళీగా ఉన్న సిబ్బందిని తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో విభాగాల అధికారులపై నిఘాకు నియమించారనే ప్రచారం జరుగుతోంది. ఆయా విభాగాల్లోకి ఎవరెవరు వస్తున్నారు? ఎవరిని కలుస్తున్నారు? దేని గురించి చర్చిస్తున్నారు? అన్నదానిపై దృష్టి సారించినట్టు సమాచారం.

Updated Date - Aug 25 , 2024 | 05:40 AM