Share News

అపోలో 24/7లో అడ్వెంట్‌ పెట్టుబడులు

ABN , Publish Date - Apr 27 , 2024 | 05:33 AM

దేశ ఫార్మా రిటైల్‌ రంగంపైనా అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. అపోలో 24/7 పేరుతో హెల్త్‌కేర్‌ రిటైల్‌ రంగంలో ఉన్న అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ సంస్థ అపోలో హెల్త్‌ కంపెనీ లిమిటెడ్‌

అపోలో 24/7లో అడ్వెంట్‌ పెట్టుబడులు

రూ.2,475 కోట్లతో 12.1% వాటా కొనుగోలు

హైదరాబాద్‌: దేశ ఫార్మా రిటైల్‌ రంగంపైనా అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. అపోలో 24/7 పేరుతో హెల్త్‌కేర్‌ రిటైల్‌ రంగంలో ఉన్న అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ సంస్థ అపోలో హెల్త్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఏహెచ్‌ఎల్‌) ఈక్విటీలో ప్రముఖ పీఈ సంస్థ అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ 12.1 శాతం వాటా తీసుకుంటోంది. ఇందుకోసం రూ.2,475 కోట్లు చెల్లించనుంది.అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ రెండు విడతలుగా కన్వర్టబుల్‌ డిబెంచర్ల ద్వారా ఈ వాటా కొనుగోలు చేయనుంది. దీనికి తోడు అపోలో 24/7 హోల్‌సేల్‌ ఫార్మా డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ కీమెడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను వచ్చే 24-30 నెలల్లో మాతృసంస్థలో వి లీనం చేయాలని అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ షరతు విధించింది.


ఎవరి వాటా ఎంత?

విలీనం తర్వాత అపోలో హెల్త్‌ కంపెనీ లిమిటెడ్‌ (అపోలో 24/7) ఈక్విటీలో అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌కు 12.1 శాతం, కీమెడ్‌ వాటాదారులకు 25.7 శాతం, ప్రధాన ప్రమోటర్‌ అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (ఏహెచ్‌ఈఎల్‌)కు 59.2 శాతం వాటా ఉంటుంది. విలీనానికి ముందు రెండు కంపెనీల విలువను రూ.22,481 కోట్లుగా లెక్కించారు. ఇందులో అపోలో 24/7 విలువను రూ.14,478 కోట్లుగా, కీమెడ్‌ విలువను రూ.8,003 కోట్లుగా లెక్కకట్టారు.

విలీనం భేష్‌..

అపోలో 24/7లో కీమెడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ విలీనాన్ని అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ డాక్టర్‌ సీ ప్రతాప్‌ రెడ్డి స్వాగతించారు. ‘ప్రతి భారతీయుడికి అందుబాటు ధరల్లో విశ్వసనీయమైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే మా లక్ష్యం. అపోలో 24/7 ఈ లక్ష్యాన్ని సాధించింది. కొద్ది కాలంలోనే 3.3 కోట్ల మంది భారతీయులకు తన సేవలు అందించింది. అడ్వెంట్‌ పెట్టుబడులు, కీమెడ్‌ విలీనంతో రిటైల్‌ హెల్త్‌ కంపెనీల్లో అపోలో 24/7లో ప్రఽధాన కంపెనీగా నిలుస్తుంది’ అని ఒక ప్రకటనలో తెలిపారు. ‘అపోలో 24/7 చరిత్రలో ఇదో మైలురాయి. ఈ విలీనంతో 140 కోట్ల మంది భారతీయులకు వారంలో అన్ని రోజులూ అసలు సిసలు ఔషధాలను 24 నిమిషాల నుంచి 24 గంటల్లో అందిస్తాం’ అని అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ శోభనా కామినేని అన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 05:33 AM