Share News

ఆల్‌ ఇన్‌ వన్‌ బీమా పాలసీ

ABN , Publish Date - Apr 28 , 2024 | 01:59 AM

ఇకపై జీవిత, ఆరోగ్య, ప్రమాద, స్థిరాస్తి బీమా పథకాలను విడివిడిగా కొనుగోలు చేయాల్సిన బెడద తప్పనుంది. వీటన్నింటికీ కవరేజీ కల్పించే ఆల్‌ ఇన్‌ వన్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ ‘బీమా విస్తార్‌’ త్వరలో...

ఆల్‌ ఇన్‌ వన్‌ బీమా పాలసీ

బీమా విస్తార్‌ పేరుతో త్వరలో విడుదల

వార్షిక ప్రీమియం రూ.1,500!?

హైదరాబాద్‌: ఇకపై జీవిత, ఆరోగ్య, ప్రమాద, స్థిరాస్తి బీమా పథకాలను విడివిడిగా కొనుగోలు చేయాల్సిన బెడద తప్పనుంది. వీటన్నింటికీ కవరేజీ కల్పించే ఆల్‌ ఇన్‌ వన్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ ‘బీమా విస్తార్‌’ త్వరలో అందుబాటులోకి రాబోతోంది. భారత బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) ఇందుకు సంబంధించిన విధివిధానాలను ప్రకటించనుంది. ఈ పాలసీ ప్రీమియం, విధివిధానాలపై నిర్ణయం తీసుకునేందుకు ఈ శుక్రవారంతో ముగిసిన రెండు రోజుల మేథోమధన కార్యక్రమం బీమా మంథన్‌లో బీమా కంపెనీల సారథులు, ఐఆర్‌డీఏఐ అధికారుల మధ్య చర్చ జరిగింది. ఈ వ్యక్తిగత బీమా పథకం వార్షిక ప్రీమియంను అందరికీ అందుబాటులో ఉండేలా రూ.1,500 స్థాయిలో నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీమా విస్తార్‌ పాలసీలో రూ.2 లక్షల చొప్పున జీవిత, వ్యక్తిగత ప్రమాద, ప్రాపర్టీ కవరేజీని ప్రతిపాదించినట్లు సమాచారం.

వైద్య చికిత్స విషయానికొస్తే, ఎలాంటి బిల్లులు, పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేకుండానే రోజుకు రూ.500 చొప్పున పది రోజులకు, గరిష్ఠంగా రూ.5,000 కవరేజీ అందించే అవకాశం ఉంది. అయితే, క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ ప్రక్రియ మాత్రం కవరేజీని బట్టి మారనుంది. దేశంలో అందరికీ బీమా కవరేజీని కల్పించడమే బీమా విస్తార్‌ ముఖ్యోద్దేశం. అందుకోసం ఈ పథకానికి గ్రామీణ స్థాయి వరకు ప్రాచుర్యం కల్పించాలని ఐఆర్‌డీఏఐ భావిస్తోంది. అందులో భాగంగా ఈ పాలసీని విక్రయించే ఏజెంట్లకు 10 శాతం కమీషన్‌ చెల్లించే అవకాశం ఉంది.

Updated Date - Apr 28 , 2024 | 01:59 AM