విదేశీ విస్తరణపై జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఫోకస్
ABN , Publish Date - Aug 25 , 2024 | 05:43 AM
దేశంలో రెండో అతిపెద్ద విమానాశ్రయాల నిర్వహణ సంస్థ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్.. విదేశీ విస్తరణపై దృష్టిసారించింది. సౌదీ అరేబియా, కువైట్‌కు చెందిన...
సౌదీ, కువైట్ ప్రాజెక్టుల కోసం బిడ్డింగ్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): దేశంలో రెండో అతిపెద్ద విమానాశ్రయాల నిర్వహణ సంస్థ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్.. విదేశీ విస్తరణపై దృష్టిసారించింది. సౌదీ అరేబియా, కువైట్‌కు చెందిన రెండు ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టులను దక్కించుకునేందుకు పోటీపడుతోంది. కువైట్ ఎయిర్‌పోర్ట్‌లో టెర్మినల్ 2 కోసం బిడ్‌తో పాటు సౌదీ అరేబియాలోని అబా ఎయిర్‌పోర్ట్ కోసం రెక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ (ఆర్‌ఎ్‌ఫక్యూ) డాక్యుమెంట్‌ను సమర్పించింది. కువైట్ ఎయిర్‌పోర్ట్ విషయానికొస్తే, 10 ఏళ్ల కార్యకలాపాల నిర్వహణ బాధ్యతలకు సంబంధించిన కాంట్రాక్టు అని, తమతో పాటు మరో ఇద్దరూ ఈ ప్రాజెక్ట్ కోసం పోటీపడుతున్నారని జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ సీఈఓ (బిజినెస్ డెవల్‌పమెంట్ అండ్ కమర్షియల్) రాజేశ్ అరోరా తెలిపారు. సౌదీ ప్రాజెక్టు కోసం ఆర్‌ఎ్‌ఫక్యూ సమర్పించామని, అందులో అర్హత లభించాక తదుపరి దశలోకి ప్రవేశిస్తామన్నారు. ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టామని ఈ మధ్య జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాల విడుదల అనంతరం ఇన్వెస్టర్లతో నిర్వహించిన ఎర్నింగ్స్ కాల్‌లో అరోరా వెల్లడించారు.
2014లోనే అంతర్జాతీయ మార్కెట్లోకి..
జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ దేశీయంగా ఢిల్లీ, హైదరాబాద్, గోవా విమానాశ్రయాలను నిర్వహిస్తుండటంతోపాటు ఆంధ్రప్రదేశ్, విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను నిర్మిస్తోంది. ఏటా 60 లక్షల మందికి సేవలందించగలిగే సామర్థ్యంతో నిర్మిస్తున్న భోగాపురం ఎయిర్‌పోర్ట్ 2026 మార్చికల్లా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా, ఫిలిప్పీన్స్‌లోని మక్టన్-సెబూ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి, నిర్వహణ ప్రాజెక్టును ఉమ్మడి భాగస్వామ్యం ద్వారా చేజిక్కించుకోవడం ద్వారా జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ 2014లో తొలిసారిగా అంతర్జాతీయ మార్కెట్లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఇండోనేషియాలోని కౌలానము ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను సైతం జాయింట్ వెంచర్ ద్వారా దక్కించుకుంది. గ్రీస్‌లోని క్రీట్ ఎయిర్‌పోర్ట్ జీఎంఆర్‌కు లభించిన మూడో విదేశీ ప్రాజెక్టు.
కాగా గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో జీఎంఆర్ నిర్వహణలోని విమానాశ్రయాల్లో ప్రయాణికుల రద్దీ వార్షిక ప్రాతిపదికన 20 శాతం పెరిగి 12.08 కోట్లకు చేరకుంది. కాగా, విమానాల ట్రాఫిక్ 12 శాతం పెరుగుదలతో 7,81,500గా నమోదైంది. అంతేకాదు, 2023-24లో స్థూల ఆదాయం 27 శాతం వృద్ధితో రూ.9,210 కోట్లకు పెరిగింది.
రూ.5,000 కోట్ల సమీకరణ
జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ మార్కెట్ నుంచి ఒకేసారి లేదా పలు విడతల్లో రూ.5,000 కోట్లు సమీకరించనుంది. సెక్యూరిటీల జారీ, క్యూఐపీ లేదా ఫారిన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్ జారీ ద్వారా ఈ నిధులను సేకరించాలని భావిస్తోంది. వ్యాపార విస్తరణతో పాటు ప్రస్తుత విమానాశ్రయాల కార్యకలాపాల సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు ఈ నిధులను వినియోగించుకోవాలని యోచిస్తోంది.