Share News

సామ్యవాది, సాహిత్యాభిలాషి

ABN , Publish Date - Mar 28 , 2024 | 01:24 AM

ప్రముఖ పారిశ్రామికవేత్త, సామాజిక కార్యకర్త, కళాపోషకుడు, సాహితీ పోషకుడు, ప్రజా ప్రతినిధి, దాత, మార్వాడీ కుటుంబానికి చెందిన బద్రీ విశాల్ పిత్తి పూర్వీకులు...

సామ్యవాది, సాహిత్యాభిలాషి

ప్రముఖ పారిశ్రామికవేత్త, సామాజిక కార్యకర్త, కళాపోషకుడు, సాహితీ పోషకుడు, ప్రజా ప్రతినిధి, దాత, మార్వాడీ కుటుంబానికి చెందిన బద్రీ విశాల్ పిత్తి పూర్వీకులు రెండు వందల ఏళ్ల క్రితం హైదరబాద్‌కు చేరుకుని స్థిరపడ్డారు. తండ్రి పన్నాలాల్ పిత్తి నిజాం గౌరవ ఆర్థిక సలహాదారుగా వ్యవహరించారు. బద్రీ విశాల్ కలకత్తాలో 1928 మార్చ్ 28న పన్‌బాయి – పన్నాలాల్ పిత్తి దంపతులకు జన్మించారు. విద్యాభ్యాసం అలహాబాదులో సాగింది.

బద్రి విశాల్ ఇరవయ్యొక్క ఏళ్ళ వయసులోనే హైదరాబాదులో 1949 ఆగస్టులో ప్రముఖ హిందీ సాహిత్య పత్రిక 'కల్పన' ప్రారంభించారు. అది స్వల్పకాలంలో హిందీ సాహిత్వంలో ఉన్నతమైన పత్రికగా పేరు తెచ్చుకుని 1978 వరకు నిరంతరాయంగా వెలువడింది. ఎం.ఎఫ్. హుస్సేన్ చిత్రాలు తరచూ 'కల్పన' పత్రిక ముఖచిత్రంగా కనిపించేవి. ఆనాటి హిందీ రచయితలు కల్పన పత్రికలో రచనలను ప్రచురితం కావడం గొప్ప విషయంగా భావించేవారు.

సోషలిస్టు నాయకుడు రామ్ మనోహర్ లోహియాతో పరిచయం ఏర్పడిన తర్వాత బద్రీ విశాల్‌ ఆయన భావాలకు ప్రభావితుడై జీవితాంతం సోషలిష్టుగా ఉండిపోయారు. 1955లో సోషలిష్టు పార్టీ స్థాపనలో కీలకపాత్ర పోషించారు. 1960లో లోహియా పిలుపునిచ్చిన పౌర నిరాకరణోద్యమంలో పాల్గొని జైలుకి వెళ్ళారు. బద్రీ విశాల్‌ 1969లో ప్రారంభమైన ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌‍కు గట్టి మద్దతు ప్రకటించారు. నిజాంతో తన కుటుంబానికున్న సాన్నిహిత్యాన్ని కూడా లెక్క చేయకుండా హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ తొలి సమావేశంలో పాల్గొని ప్రజాస్వామ్యం కోసం పిలుపునిచ్చారు. అప్పుడు కొత్తగా ఏర్పడిన మహారాజ్‌ గంజ్ శాసనసభ నియోజకవర్గం నుంచి బద్రీ విశాల్‌ 1967లో సంయుక్త సోషలిష్టు పార్టీ అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 1972లో సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థిగా, 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా ఇదే నియోజకవర్గం నుండి రెండు సార్లు పోటీచేసి పరాజితుడయ్యారు. బద్రీ విశాల్‌ సోషలిష్ట్ అయినా తన రాజకీయాలకు అతీతంగా కళలను, కళాకారులను పోషించారు. ఎం.ఎఫ్.హుస్సేన్ తన ప్రసిద్ధ రామాయణం, మహాభారతం చిత్రాలను సోమాజీగూడలోని బద్రీ విశాల్‌ ఇంట్లో ఉంటూనే చిత్రీకరించారు. ఎం.ఎఫ్.హుస్సేన్ 1940దశకం చివరి నుండి 1970వ దశకం చివరి వరకు చిత్రించిన నాలుగు వందలకు పైగా చిత్రాలను బద్రి విశాల్ సేకరించారు. 2003 డిసెంబర్ 6న బద్రీ విశాల్ మరణానంతరం ఆయన సేకరణలో ఉన్న ఎం.ఎఫ్. హుస్సేన్ చిత్రాలు, 2013లో వేలంలో దాదాపు రూ.18కోట్లకు అమ్ముడు పోయాయి.

బద్రి విశాల్ పిత్తి జయంతి సందర్భంగా ఈ మార్చ్ 28 గురువారం 'బద్రి విశాల్ పన్నాలాల్ పిత్తి' ట్రస్ట్ నిర్వహణలో 18వ స్మారకోపన్యాసం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కోహినూర్ హాలులో నిర్వహిస్తున్నారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ సభలో సుప్రీం కోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ప్రధాన వక్తగా పాల్గొంటున్నారు.

నందిరాజు రాధాకృష్ణ

Updated Date - Mar 28 , 2024 | 01:24 AM