Share News

రైతులపై బీఆర్‌ఎస్ మొసలి కన్నీరు!

ABN , Publish Date - Mar 28 , 2024 | 01:30 AM

అధికారం పోతేగాని కేసీఆర్ కు రైతులు గుర్తుకు రాలేదు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకోని కేసీఆర్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోసం కొత్త డ్రామా మొదలు పెట్టిండు...

రైతులపై బీఆర్‌ఎస్ మొసలి కన్నీరు!

అధికారం పోతేగాని కేసీఆర్ కు రైతులు గుర్తుకు రాలేదు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకోని కేసీఆర్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోసం కొత్త డ్రామా మొదలు పెట్టిండు. పదేళ్ల కేసీఆర్ నియంతృత్వ, దోపిడీ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేసి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కుదురుకునే సమయం ఇవ్వకుండా, అధికారం కోల్పోయిన మరుసటి రోజు నుంచే విమర్శలు చేయడం కేసీఆర్ అధికార దాహానికి నిదర్శనం.

పదేళ్లు కేసీఆర్ దోపిడీకి ఆగమైన తెలంగాణను చక్కదిద్దటానికి; గడీల పాలనలో గాడి తప్పిన తెలంగాణను గాడిలో పెట్టడానికి; భూమి, నీరు, ఇసుక, లిక్కర్ కాదేదీ అవినీతికి అనర్హం అన్నట్టు కేసీఆర్ అండ్ కో చేసిన లూటీ నుంచి తెలంగాణను కోలుకొనేట్టు చేసి ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలంగాణ ప్రజలు, రైతులు పెద్దమనసుతో అర్థం చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై సభలో మా ప్రభుత్వం శ్వేత పత్రాన్ని ప్రవేశపెట్టింది. బంగారు తెలంగాణ ముసుగులో 2014నాటికి 60ఏళ్ళలో రూ.60వేల కోట్ల అప్పులున్న తెలంగాణ రాష్ట్రాన్ని, 2024లో కేవలం 10ఏళ్ళలో దిగిపోయేనాటికి 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి దించిన కేసీఆర్ బడా మోసాల నుంచి తేరుకొని పాలన మొదలుపెట్టినం. కానీ, ఏ మాత్రం రాజకీయ విలువలు లేని బీఆర్‍ఎస్ పార్టీ, ప్రజాపాలన కనీసం వందరోజులు కూడా పూర్తి చేసుకోకముందే, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై విషం చిమ్ముతుంది.

ఎండిన పంట పొలాల పరిశీలన పేరుతో రైతులపై కపట ప్రేమలు ఒలుకబోస్తున్నారు. కానీ కేసిఆర్ కాసులకు కక్కుర్తిపడి అవినీతితో కట్టిన డ్యాములు కుంగడం వల్లనే రైతులకు నీళ్లు ఇవ్వలేక పోతున్నాం. తాము నిర్మించిన నాణ్యతలేని డ్యాములు నిరుపయోగంగా మారిన పరిస్థితులలో తప్పు ఒప్పుకొని తెలంగాణ ప్రజల ముందు ముక్కు నేలకు రాయాల్సింది పోయి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మొండి వాదనలకు దిగడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. ప్రపంచంలో అతిపెద్ద అవినీతి స్కాం కాళేశ్వరం. రైతులకు నీళ్లు ఇస్తున్నామనే పేరుతో ధన దోపిడీ చేసిండు కేసీఆర్. ఈ ప్రాజెక్టు పేరు మీద వివిధ మార్గాల ద్వారా 1 లక్ష 41 వేల కోట్ల అప్పు చేస్తే, కనీసం 40 వేల ఎకరాల అదనపు ఆయకట్టుకు నీరు ఇవ్వలేని పరిస్థితి. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయి, పర్రెలు పాసి నీటిని తోడుకోలేని దుస్థితికి ఆ బ్యారేజ్ పడిపోయింది. అన్నారం బ్యారేజ్‍లో బుంగలు పడ్డాయి. కేసీఆర్ డిజైన్ చేసిన అద్భుత కట్టడం అభాసుపాలవుతుంటే, కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే కాదు ఎన్నో కెనాల్స్, ఎన్నో డ్యాములు అని సుద్దులు చెప్తున్నారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ గుండెకాయ లాంటిది. అక్కడినుంచి నీళ్లు ఎత్తి అన్నారం సుందిళ్ల బ్యారేజిలకు పోయాలి. మరి అదే మేటిగడ్డ పనికిరాకుండా పోతే నీళ్లు ఎట్లా ఎత్తిపోయమంటారో ఈ మేధావులు చెప్పాలి. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన నాగార్జునసాగర్, కడెం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు 50ఏళ్లు దాటినా ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయంటే అందుకు కారణం వాటి నిర్మాణంలో, నాణ్యతలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చూపిన చిత్తశుద్ధి.

కేసీఆర్ పాలనలో రైతుబంధు పేరుతో ధన దోపిడీ జరిగింది. ఆ పేరు మీద బీఆర్‍ఎస్ నాయకులు జాతీయ రహదారి భూమికి, రియలెస్టేట్ వెంచర్లకు, ప్రభుత్వ భూములకు, చెరువులు కుంటలు చివరికి స్మశానాలకు కూడా రైతుబంధు డబ్బులు పంచిపెట్టారు. వందల ఎకరాలున్న బడా కాంట్రాక్టర్లకు సైతం కోట్ల రూపాయల డబ్బు పంచిపెట్టిన దాఖలాలు ఉన్నాయి. మా ప్రజా ప్రభుత్వం వచ్చాక ఈ లెక్కలన్నిటినీ తేల్చి అర్హులైన రైతులకు మాత్రమే రైతు భరోసా అందిస్తుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ 50శాతానికి పైగా పూర్తయింది.

పంట నష్టపరిహారం విషయంలో కేసీఆర్ మాటలు రైతులను నమ్ముతారా? వాళ్ల పదేళ్ళ పాలనలో ఏనాడూ పంట నష్టం అంచనాలు వేయలేదు. రైతులకు పంట నష్టపరిహారం పరిహారం ఇవ్వలేదు. 2014 నుంచి 2017 వరకు రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం కేంద్రానికి కరువు నివేదికలు కూడా సమర్పించలేదు. ఆ తర్వాత అకాల వర్షాలు వరదలతో రైతులు పంట నష్టపోయారు. కనీసం అధికారులను క్షేత్రస్థాయిలో పరిశీలించమని గాని నివేదికలు రూపొందించమని గాని నష్టపరిహారం ఇద్దామని గాని ఏనాడు ఆలోచించలేదు. 2023 ఏప్రిల్‍లో జరిగిన పంట నష్టానికి రూ.10వేల నష్టపరిహారం ఇస్తామని చెప్పి హడావుడి చేశారు కానీ అది రైతులకు అందలేదు. ఇప్పుడు అధికారం కోల్పోగానే ఎకరానికి రూ.20వేల చొప్పున పంట నష్టపరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నరు. కానీ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను కలెక్టర్లు పరిశీలించారు. ప్రభుత్వానికి నివేదికలు అందించారు. బీఆర్‌ఎస్ నాయకులు ఓట్ల కోసం రైతులతో రాజకీయ ఆటలు ఆడటం మాని పంట పొలాలకు వెళ్లి పదేళ్ళ కేసీఆర్ పాలనలో ఆగమైన తెలంగాణను కళ్ళనిండా చూసి రావాలి.

ధరణి పోర్టల్ కేసీఆర్‌కు, వారి అనుయాయిలకు బంగారుగని. ప్రభుత్వ భూములు, అటవీ భూములు, భూదాన్ భూముల దోపిడీకి కేసీఆర్ అండ్ కో రచించిన పథకమే ఈ ధరణి. ఎన్నికల ముందు కాంగ్రెస్ గెలిస్తే ధరణి రద్దు అవుతుందని, ధరణి రద్దు ఐతే రైతుబంధు ఆగిపోతుందని అబద్ధపు ప్రచారాలు చేసిన కేసీఆర్‍ను ప్రజలు నమ్మలేదు. ఇప్పుడు ధరణి పోలేదు, రైతుబంధు ఆగలేదు. కేసీఆర్ పాలనలో దాదాపు 6000 ఎకరాల అటవీ భూములు మాయమయ్యాయి. నిషేధిత జాబితాలో ఉన్న భూములు కేసీఆర్ కుటుంబ సభ్యుల పేరు మీద ధరణిలో నమోదయ్యాయి. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఇవన్నీ సవరిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భూ సమస్యల పరిష్కారం త్వరితగతిన చేస్తూ సత్వరం రైతులకు ప్రయోజనంచేకూర్చే విధంగా ధరణి స్పెషల్ డ్రైవ్‍లు నిర్వహిస్తున్నాం.

రైతుల ఆత్మహత్యల పేరుతో బీఆర్‍ఎస్ నేతలు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. వాళ్ళ పదేళ్ల పాలనలో దాదాపు 12వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం మర్చిపోయారా? కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న గ్రామంలోనే 40 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పదేళ్లలో ఒక్క రోజు సెక్రటేరియట్‌కు రాకుండా 365 రోజులు ఫామ్‍హౌస్ లోనే ఉండే కేసీఆర్, ఒక్క నాడైనా వాళ్ల గురించి మాట్లాడాడా? వాళ్లను పరామర్శించాడా? వాళ్లకి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చాడా? అధికారం కోల్పోయిన మూడు నెలల్లోనే రైతు ఆత్మహత్యలంటూ వగల ఏడ్పులు మాత్రం మొదలుపెట్టారు.

మద్దతు ధర అడిగిన మిర్చి రైతులకు ఖమ్మంలో బేడీలు వేసిన తన చరిత్ర కేసీఆర్ మర్చిపోయినట్టున్నారు. గిరిజన రైతుల పోడు భూములు లాక్కొని, అడ్డొచ్చిన మహిళా రైతులను చెట్లకు కట్టేసి కొట్టి ఈడ్చుకుపోయిన దురాగతాలు గుర్తు లేవా? మల్లన్న సాగర్ రిజర్వాయర్ పేరుతో రైతుల భూములు లాక్కున్న వీళ్లు రైతుల గురించి పోరాడుతాం అంటే జనం నవ్వుకుంటున్నారు. పత్రికా సమావేశాల్లో హరీష్ రావు బోరుబావులు ఎండిపోయాయి అంటున్నారు. పదేళ్లలో కేసీఆర్ గ్రౌండ్ వాటర్ రీచార్జ్ అయిందని సుద్దులు చెప్తుంటే రెండు నెలల్లోనే గ్రౌండ్ వాటర్ పాతాళానికి మాయమైపోయిందా? అది ఎట్లా సాధ్యం? అయితే కేసీఆర్ చెప్పిన గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనే మాటైనా అబద్ధం అయి ఉండాలి లేదా ఇప్పుడు గ్రౌండ్ వాటర్ అడుగంటిపోయింది అనే వాదన అబద్ధం అని ఒప్పుకోవాలి.

నల్గొండ, కరీంనగర్‍లలో బీఆర్‌ఎస్ నిర్వహించిన రాజకీయ సభల్లో పాల్గొనడానికి కేసీఆర్ చూపించిన ఉత్సాహం, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద చర్చించడంలో చూపించకపోవడం ఆయన నిరంకుశత్వానికి నిదర్శనం. ప్రజాస్వామ్య విలువలు లేని కేసీఆర్ కనీసం ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కూడా విఫలమవుతున్నారు.

పదేళ్ళ పాలనలో రైతులను పూర్తిగా విస్మరించి కేసీఆర్, నేడు కేవలం పార్లమెంటు ఎన్నికలలో లబ్ధి పొందేందుకు రైతుల పేరుతో ప్రజా ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్రలకు తెరతీసిండు. నాడు పరిపాలనలో విఫలమైన కేసీఆర్, కనీసం ప్రధాన ప్రతిపక్షనేత పాత్ర పోషించడంలో కూడా విఫలమైతున్నడు. ఓట్ల కోసం కేసీఆర్ వేసే ఎత్తులకు జిత్తులకు తెలంగాణ ప్రజలు, మరీ ముఖ్యంగా రైతులు, తగిన గుణంపాఠం చెప్తారు. కేసీఆర్ అండ్ కో ఎన్ని కుట్రలు చేసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వ్యవసాయమే ప్రాధాన్యంగా, రైతు సంక్షేమమే పరమావధిగా మన ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది.

డాక్టర్ కొనగాల మహేష్

కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి

Updated Date - Mar 28 , 2024 | 01:30 AM