Share News

ఈ దానవ పాలన అంతానికి సహకరిద్దాం కామ్రేడ్స్‌!

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:55 AM

ఒక వ్యక్తి ఊళ్లో ఉన్న కొండని మోస్తానని చెపితే దాన్ని నమ్మిన ఊరి జనమంతా అతనితో కల్సి ఊరి బయట కొండ దగ్గరకు వెళ్లారు. ఎంత సమయం గడుస్తున్నా అతనట్లా నిలబడి...

ఈ దానవ పాలన అంతానికి సహకరిద్దాం కామ్రేడ్స్‌!

ఒక వ్యక్తి ఊళ్లో ఉన్న కొండని మోస్తానని చెపితే దాన్ని నమ్మిన ఊరి జనమంతా అతనితో కల్సి ఊరి బయట కొండ దగ్గరకు వెళ్లారు. ఎంత సమయం గడుస్తున్నా అతనట్లా నిలబడి ఉంటే జనం అడిగారట. దాంతో అతను సరే అలాగే మోస్తాను, మీరంతా కల్సి కొండను ఎత్తి నా తలపై పెట్టమన్నాడట. సరిగ్గా అలాంటి మనిషే మన ఆంధ్రప్రదేశ్‌ని పాలిస్తున్న జగన్మోహన్‌రెడ్డి.

మొత్తం పార్లమెంటు స్థానాల్లో గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని పోయిన ఎన్నికల ముందు మైకు విరగగొట్టిన జగన్మోహన్‌రెడ్డిని నమ్మి ప్రజలు 23 లోక్‌సభ సీట్లలో గెలిపించారు. తర్వాత వారే నివ్వెరపోయే విధంగా ‘బీజేపీకి మ్యాజిక్‌ ఫిగర్‌‍కి 20 సీట్లు తగ్గి మన మద్దతుపై ఆధారపడితే అప్పుడు సాధించగలం కాని వారికే సరిపడా ఎంపీ సీట్లు వస్తే మనమేం చేయగలం’ అన్నాడు. అతని నోటికి నరం లేదు, ఎవరేమనుకుంటారో అనే బిడియం లేదు. మాట తప్పటం మంచినీళ్ల ప్రాయం.

అతనిలా కపటం లేని మనషులే గాని ఆచరణాత్మకమైన ఎత్తుగడలు లేని మంచివాళ్లు మన కామ్రేడ్స్‌. వ్యూహం – ఎత్తుగడలు అనేవి మన డాక్యుమెంటుకే పరిమితం. 1967 నుంచి అనుసరిస్తున్న ఐక్య సంఘటన ఎత్తుగడలు అప్పుడప్పుడూ మర్చిపోతుంటారు. సువిశాలమూ, భిన్నభిన్న రాజకీయ పరిస్థితులూ ఉన్న 29 రాష్ట్రాల సమాహారమైన దేశంలో రాష్ట్రానికీ రాష్ట్రానికీ మధ్య రాజకీయాల్లో తేడాలు వుంటాయనే ఉద్దేశంతోనే కదా కేరళలో మతతత్వ పార్టీ అని తెల్సినా ముస్లిం లీగుతో జత కట్టింది. దేశమంతా ‘ఇండియా’ కూటమిగా కాంగ్రెస్‌తో కల్సి ఊరేగుతున్నా కేరళలో దానికి ప్రత్యర్థిగా నిలబడింది.

కామ్రేడ్స్‌కు జగన్‌ అరాచకాలు ఎలా ఉన్నాయో సర్వమూ తెలుసు. ఆ దాష్టీకాల్ని సంపూర్ణంగా చవిచూశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఎన్నికల్లో అక్రమాలు ఏ స్థాయిలో వెల్లువెత్తాయో చూశారు. అలాంటప్పుడు బీజేపీనీ వైసీపీనీ రెంటినీ ఓడించమని పిలుపునివ్వటంతోపాటు, అది సాధ్యమయ్యే రీతిలో తెలుగుదేశం – జనసేన లాంటి బలమైన పార్టీలకు ఒక రూట్‌మ్యాప్‌ అందించాలి, అంతేతప్ప ‘మీరు బీజేపీ బుట్టలో పడ్డారు, మోదీకి లొంగిపోయారు’ అని శాపనార్థాలు పెట్టటం సరైనదేనా?

ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితిని బట్టేకదా 1985 ఎన్నికల్లో ఎన్టీఆర్‌తో – ఆయన ఒక పక్క బీజేపీని మరోపక్క మనల్ని పెట్టుకొని ఎన్నికలకు వెళ్తే – మనమూ కలిసి నడిచాం. మరి ఈనాడు అంతకంటే దారుణ స్థితిలో రాష్ట్రం ఉంటే చంద్రబాబుని ఎందుకు తప్పు పట్టటం. బీజేపీతో కలిస్తే చాలా ఓట్లు పోతాయని, వారి వలన వచ్చేది కేవలం ఒక శాతం ఓట్లేనని చంద్రబాబుకు తెలియదా? మరి ఎందుకు వారికి 6 లోక్‌సభ, 10 శాసనసభ స్థానాలు ఇవ్వటం. చంద్రబాబేమన్నా అమాయకుడా? ఒంటరిగా పోటీ చేసినా తెలుగుదేశం గెలుస్తుందనీ, బీజేపీ జైలుకు పంపుతామని భయపెట్టి బలవంతంగా పొత్తుపెట్టుకుందని సీపీఎం వాళ్లు ప్రకటన చేశారు. ఓట్లు ఉండటం కాదు కామ్రేడ్స్‌ అవి పోల్‌ చేసుకొనే పరిస్థితులు పోలింగ్‌ బూతుల వద్ద ఉండాలి కదా. ఆ పరిస్థితిలో ఎన్నికల కమీషన్‌ సహకారం కోసమే కదా చంద్రబాబు వెంపర్లాట. అది అర్థం చేసుకొనే పాటి రాజకీయ పరిణతి మనకు లేదా?

మనకు పోయేదేమీ లేదు. ఒక జోగి మరొక జోగే కాదు కాంగ్రెసును కలుపుకుని ఎందరు జోగులు రాసుకున్నా రాలేది బూడిదే. కాని తెలుగుదేశం – జనసేనలకు అలా కాదు. వారిది జీవన్మరణ పోరాటం. జగన్‌ మరోసారి గెలవటమంటే రాష్ట్రం నాశనమవ్వటమే కాదు జనసేన – తెలుగుదేశం పార్టీలు నామరూపాలు లేకుండా పోతాయి. వాళ్లే పోతారని గమ్మునుంటే తర్వాత మనమేమైనా మిగులుతామా? అంగన్‌వాడీ ఆందోళన సమయంలోనూ, ఉపాధ్యాయుల నిరసనలోనూ రాజ్యం రాష్ట్ర ప్రభుత్వ రూపంలో ఎలా ప్రవర్తిస్తుందో చూశాం కదా! మనమూ, మన ప్రజా సంఘాలు ఎలా మనుగడ సాగిస్తాయో ఆలోచించాలి కదా!

జగన్‌ ప్రభుత్వం చేసిన రూ.8,10,000 కోట్ల అప్పు తీర్చాలి. అమరావతి, పోలవరం నిర్మించాలి. గుంతలమయమైన రోడ్లు వేయాలి. అసంపూర్ణంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయాలి. ఉద్యోగుల సమస్యలు తీర్చాలి. ఉద్యోగాలు కల్పించాలి. పెట్టుబడులు సమీకరించాలి. పారిపోయిన పారిశ్రామికవేత్తల్ని తిరిగి రప్పించాలి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా జరుగుతాయా? ఎన్డీఏ కాకుండా ఇండియా గెలుస్తుందనే నమ్మకం మీరు కల్గించగలిగారా? ఒకవేళ ఎప్పుడైనా అవసరమైతే ఎన్డీఏని జగన్‌ ఎదిరించగలడా? కుప్పలు తెప్పలుగా కేసులుండి భవిష్యత్తులో మరిన్ని కేసులు ఎదుర్కొనే జగన్‌కి అది సాధ్యమా? ఎన్డీఏని ఎదిరించిన చరిత్ర చంద్రబాబుకి ఉంది కదా! అలాంటి నాయకుడికి అవకాశమొస్తే మనం అడ్డుపడే ఎత్తుగడ సమంజసం కాదు కదా!

మన దినపత్రికల మొదటి పేజీల్లో వికసిత్‌ భారత్‌ ప్రకటనలను మోదీ బొమ్మలతో ముస్తాబు చేసి ఆయన విజయాలను శ్లాఘిస్తూ ప్రజలకు చేర్చటంలో తప్పు లేదు గాని చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి కోసం మోదీతో కలుస్తానంటే మాత్రం దిగజారుడా కామ్రేడ్స్? ఇంతెందుకు ఒకసారి చరిత్ర గుర్తు చేసుకుందామా? తొలిసారి ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీని ఓడించి ఏడు రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీలు అధికారంలోకి వచ్చిన సందర్భంలో మనం జతకట్టిన పార్టీల సమూహంలో జనసంఘం కూడా వుంది గుర్తుందా? అది బీజేపీ పూర్వనామం అదే అనే విషయం గుర్తుందా? సీపీఎం వాళ్లు ఎన్నికల పొత్తుకే పరిమితమైతే సీపీఐ వాళ్లు యూపీ, బిహార్ మంత్రివర్గాల్లో కూడా పదవులు వెలగబెట్టారు కదా!

ఇదే పత్రికలో ఒకసారి చెరుకూరి సత్యనారాయణ చెప్పినట్లు మన నాయకత్వం పార్టీని పార్లమెంటరీ పంథాలో నడిపించటంలోనూ, విప్లవోద్యమంగా మల్చటంలోనూ విఫలమైందన్నది నిజం. కాని కాంగ్రెస్ వ్యతిరేకతతో పుట్టి పెరిగిన మనం ఇప్పుడు కాంగ్రెసుతోనే జతకడుతున్నాం. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగానే కోరుకున్నాం. వారి దయాదాక్షిణ్యాలతో తెలంగాణ శాసన సభలోకి అడుగుపెట్టాం. ఏపీ శాసన సభలోకి ఇప్పుడప్పుడే అడుగు పెట్టదల్చుకోలేదు. దేశంలో బీజేపీని ఎదుర్కోగలమో లేదో గాని రాష్ట్రంలో ఈ దానవ పరిపాలన సాగనంపే అవకాశం వచ్చింది. దాన్ని అందిపుచ్చుకోనివ్వండి. అడ్డం పడకండి. ఒకేసారి ఇద్దరు రాక్షసులతో పోరాడే శక్తి తెలుగు ప్రజలకు లేదు. ఒకరినైనా అంతం చేయనీయండి కామ్రేడ్స్‌!

సి. మేఘనాధరెడ్డి

Updated Date - Mar 27 , 2024 | 12:55 AM