Share News

ఆదివాసీ స్వయం పాలన సారధి

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:48 AM

ఆదివాసీ లిబరేషన్ టైగర్స్‌ వ్యవస్థాపకుడు కుంజ రాము 17వ వర్ధంతి నేడు. ఆదివాసీలు ఇతర ప్రాంతాల వారితో సమానంగా వృద్ధి చెందాలంటే స్వయం పాలనా ఉద్యమాలు తప్పని సరి అని త్రికరణశుద్ధిగా...

ఆదివాసీ స్వయం పాలన సారధి

ఆదివాసీ లిబరేషన్ టైగర్స్‌ వ్యవస్థాపకుడు కుంజ రాము 17వ వర్ధంతి నేడు. ఆదివాసీలు ఇతర ప్రాంతాల వారితో సమానంగా వృద్ధి చెందాలంటే స్వయం పాలనా ఉద్యమాలు తప్పని సరి అని త్రికరణశుద్ధిగా నమ్మిన విప్లవ యోధుడు, ఆదివాసీ నాయకుడు కుంజ రాము. అవిభక్త వరంగల్ జిల్లా పాకల కొత్తగూడెం మండలంలోని మోకాళ్ళపల్లిలో నిరుపేద కోయతెగ కుటుంబంలో పుట్టిన కుంజ రాము పదిహేనేళ్ళ వయసులోనే విప్లవోద్యమబాటలో నడిచారు. 35 ఏళ్ళ పాటు సాగిన అజ్ఞాత ఉద్యమ జీవితంలో ప్రజాస్వామ్య, సామాజిక మార్పు కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక ఉద్యమాల రూపకల్పనలో క్రియాశీలకంగా వ్యవహరించారు. తుడుందెబ్బ, మాదిగ దండోరా, డోలి దెబ్బ, మోకు దెబ్బ, పూసల కేక వంటి అనేక కుల ఉద్యమాలను సంఘటితపరిచాడు. స్వయం పాలన కోసం గెరిల్లా తరహా పోరాటమే శరణ్యమని భావించిన రాము 2004 సెప్టెంబర్ 30వ తేదీన ఆదివాసీ లిబరేషన్ టైగర్స్ అనే సంస్థను స్థాపించాడు. ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకూ షెడ్యూల్డ్ ప్రాంతాలను ఐక్యం చేస్తూ ప్రత్యేక పరిపాలనా విధానాన్ని స్వయంపాలనను ఆదివాసీలకు అందించాలని తద్వారా ఆదివాసీ సమాజం విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్ధిక రంగాల్లో పురోగతి సాధించగలదని ఆయన త్రికరణశుద్ధిగా విశ్వసించాడు. 2005 మార్చి 27వ తేదీన వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దు ప్రాంతమైన ఎర్రమ్మ గుట్టలపై సమావేశంలో ఉన్న రాముపై పోలీసులు ఏకపక్షంగా జరిపిన కాల్పుల్లో ఆయన మరణించాడు. జల్, జమీన్, జంగల్‌పై సర్వహక్కులు మావే అని గర్ఙించి మా గూడెంలో మా రాజ్యం కావాలని నినదించి తెగలను ఏకంచేసి పోరాడిన కొమురం భీం వారసుడు కుంజ రాము.

వూకె రామకృష్ణ

Updated Date - Mar 27 , 2024 | 12:48 AM