Share News

సేవాశీలి, సౌజన్యమూర్తి

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:54 AM

ఆయనో గతానుభూతుల జ్ఞాన శిఖరం. పదవులు ఆశించని పనితనం ఆయన సొంతం. నిరంతర అక్షరాన్వేషి. వ్యాపార, సామాజిక సేవా వర్గాల పాలిట పెన్నిధి....

సేవాశీలి, సౌజన్యమూర్తి

ఆయనో గతానుభూతుల జ్ఞాన శిఖరం. పదవులు ఆశించని పనితనం ఆయన సొంతం. నిరంతర అక్షరాన్వేషి. వ్యాపార, సామాజిక సేవా వర్గాల పాలిట పెన్నిధి. ఋజువర్తనకు నిలువెత్తు సాక్ష్యం. నిత్యం సామాజికసేవలో తరించే సామాజిక సేవాపరాయణుడు. స్వాతంత్య్ర సమరయోధుడు, గాంధేయవాది. ఆయనే కోన వెంకటచలమయ్య. మార్చి 23వ తేదీన ఆయన అస్తమయంతో నెల్లూరు ఒక్కసారిగా వెలితిపడ్డది. ప్రజలు, ప్రభుత్వాలు కీర్తించి సత్కరించిన తొంభైఏళ్ళ కురువృద్ధుడు, నెల్లూరు ప్రముఖుడు చలమయ్య అలసి సొలసి ఇక సెలవంటూ వెళ్ళిపోయారు.

పొట్టి శ్రీరాములు అనుయాయిగా తోటి హరిజన దేవాలయ ప్రవేశంలో పాల్గొన్న సంస్కరణాభిలాషి చలమయ్య. పొట్టి శ్రీరాములుతో సాన్నిహిత్యంతో ఆయన భావపరంపరలోనే జీవించారు. పొట్టి శ్రీరాములు ప్రత్యేకాంధ్ర ఉద్యమదీక్ష కోసం మద్రాసుకు వెళ్ళే సమయంలో సైతం చెంతనున్నారు. నెల్లూరుకు పొట్టి శ్రీరాములు పేర నామకరణం కోసం జరిగిన పోరాటాల్లో చలమయ్య పాల్గొన్నారు. ఆ పోరాటం సఫలమయ్యే వరకూ ఎన్నో సభలు, సమావేశాలు, ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపారు. పొట్టి శ్రీరాములుకు భారతరత్న ఇవ్వాలనేది ఆయన చిరకాల కోరిక. అందుకోసం ప్రతి వేదికలోను ఆ ఆకాంక్షను వెలిబుచ్చేవారు. కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో విజ్ఞాపనలు పంపారు.

తెలుగుపట్ల చలమయ్యకు అంతులేని అభిమానం, అవ్యాజానురాగం. ఎక్కడ తెలుగు మహాసభలు జరిగినా పనిగట్టుకొని వెళ్ళే వ్యక్తిత్వం, మూర్తిమత్వం చలమయ్యది. తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలకు, హైదరాబాదులో జరిగిన సభలకు హాజరయ్యారు. ఆ సభల్లో ఎన్నో పుస్తకాలు కొనుగోలు చేశారు కూడా! చలమయ్యకు సాహిత్యం పట్ల మిక్కిలి ఆరాధన. ఇంటిని ఒక గ్రంథాలయంగా తీర్చిదిద్దారు. నడిచే నిఘంటువుగా ప్రసిద్ధికెక్కారు. స్వాతంత్య్ర సమరం నాటి గాథలు, పొట్టి శ్రీరాములు ఆమరణదీక్ష నాటి ఉద్దీపనలు నిర్విరామంగా తారీఖులు, దస్తావేజులతో చెప్పగలిగేవారు.

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యతో చలమయ్యకు ఎంతో సాన్నిహిత్యం, స్నేహం ఉండేది. ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్‌గా రోశయ్య ఎప్పుడు నెల్లూరు వచ్చినా చలమయ్య ఇంటి సందర్శన ఒక భాగమయ్యేది. రోశయ్య రాకతో కుచేలుడింటికి శ్రీకృష్ణుడు వచ్చాడని మురిసిపోయే చలమయ్యను రోశయ్య మరణం చాలా కృంగదీసింది.

రొటేరియన్‌గా రోటరీ క్లబ్‌ సభ్యునిగా వివిధ హోదాలలో సామాజిక సేవాంశాల్లో పాల్గొన్నారు. ఆ పాత్రల్లో లీనమై తనదైన ముద్రవేశారు. నెల్లూరులో రోటరీ క్లబ్‌ నిర్మించిన స్మశాన వాటికకు విరాళమిచ్చి దాత కూడా అనిపించుకొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆర్యవైశ్యుల అన్నదాన సత్రాలకు, వాసవీ మాత దేవాలయాలకు కొన్నింటికి కార్యదర్శిగాను, మరికొన్నింటికి కార్యవర్గ సభ్యులుగాను, లేదంటే సలహాదారులుగానైనా నియమించి ఆయన పట్ల తమ గౌరవాన్ని చాటుకొన్నాయి ఆర్యవైశ్య సంఘాలు, మహాసభలు సైతం. వరల్డ్‌ ఆర్యవైశ్య మహాసభలో ఆయనది కీలకపాత్ర. ఎంతోమందిని సభ్యులుగా చేర్పించి ఆ సంస్థ అభివృద్ధికి కృషి సల్పిన వ్యక్తిత్వం ఆయనది. వయసురీత్యా, అనుభవం రీత్యా పెద్దరికం ఉన్నా, అందరితో కలిసిపోయే స్నేహశీలి, సౌజన్యమూర్తి చలమయ్య. ఆయనో వటవృక్షం. ఆ నీడన ఎందరో స్ఫూర్తిని పొందారు. పనిలో తరించే తపన, తపస్సు చలమయ్యది. తాను సభ్యుడిగానున్న హార్డ్‌వేర్‌ మర్చెంట్స్‌ అసోసియేషన్‌ భవన నిర్మాణానికి ‘రాళ్ళెత్తిన’ చలమయ్య మరణం తీరనిలోటు. ఆ మహోన్నతుడికి అక్షర నివాళి.

చిన్ని నారాయణరావు

Updated Date - Mar 27 , 2024 | 12:54 AM