Share News

ఆలోచనలను గౌరవించని అవార్డులు!

ABN , Publish Date - Feb 07 , 2024 | 03:46 AM

‘ఢిల్లీ వెళితే ప్రస్తుతం మన సమస్యలు చెప్పుకోవడానికి పెద్ద దిక్కుగా ఉన్న నాయకులు లేరు. వ్యాపారస్తులు ప్రజా ప్రతినిధులవుతున్నారు..’ అని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పద్మా పురస్కార గ్రహీతలకు సన్మానం చేస్తూ.....

ఆలోచనలను గౌరవించని అవార్డులు!

‘ఢిల్లీ వెళితే ప్రస్తుతం మన సమస్యలు చెప్పుకోవడానికి పెద్ద దిక్కుగా ఉన్న నాయకులు లేరు. వ్యాపారస్తులు ప్రజా ప్రతినిధులవుతున్నారు..’ అని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పద్మా పురస్కార గ్రహీతలకు సన్మానం చేస్తూ వాపోయారు. నిజమే. ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఒక స్థాయి గల ప్రజా ప్రతినిధులు కనపడడం లేదు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, వెంకయ్యనాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఎర్రన్నాయుడు తదితరులు ప్రజా ప్రతినిధులుగా ఉన్న కాలంలో నిత్యం నేతలతో మాట్లాడుతూ, విలేఖరులకు సమయం కేటాయిస్తూ గడిపేవారు. ఒక రోజు ఏఐసీసీ ఏర్పాటు చేసిన ఒక కమిటీ సమావేశంలో కోట్ల విజయ భాస్కర్ రెడ్డి తెలంగాణను వ్యతిరేకించారని తెలిసి వార్త రాశాను. మరుసటి రోజు ఎప్పటి మాదిరే ఏఐసీసీలో రోజువారీ విలేఖరుల సమావేశం పూర్తి కాగానే నలుగురైదుగురు సీనియర్ జర్నలిస్టులతో పాటు ఆయన ఇంటికి వెళ్లినప్పుడు ‘ఆ వార్త ఎందుకు రాశావు.. మళ్లీ నాకు కనపడకు’ అని కోట్ల ఆగ్రహించారు. మరునాడు ఆయన ఇంటికి వెళ్లలేదు. దీనితో ఆయనే ఫోన్ చేశారు. ‘నిన్న ఏదో కోపంతో అంటే మనసు మీదికి తీసుకుంటావా.. నీకంటే ఎంతో పెద్దవాడిని కదా..’ అనేసరికి ఎంతో సంతోషంతో ఆయనను కలుసుకున్నాను. జైపాల్ రెడ్డి ఢిల్లీలో కేంద్రమంత్రిగా ఉన్నా సరే, ఆయన ఇంటి గేట్లు ఎప్పుడూ తెరిచే ఉండేవి. ఆయనతో మాట్లాడిన తర్వాత ఎన్నో పుస్తకాలు చదివిన జ్ఞానం కలిగేది. మురళీ మనోహర్ జోషి లాంటి సాంప్రదాయవాది కూడా జైపాల్ అంటే ఇష్టపడేవారు. వెంకయ్యతో ఆయనకు వ్యక్తిగత స్నేహం బలంగా ఉండేది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న ఒక దశలో కూడా ఇరు ప్రాంతాల ఎంపీలు, నేతలు ఆయనను కలుసుకుని ముఖ్యమంత్రిగా ఉండమని జైపాల్‌ను కోరడం ఆయన పట్ల ప్రాంతాలకు అతీతంగా ఉన్న గౌరవానికి నిదర్శనం. కాని అందుకు ఆయన నిరాకరించారు. వెంకయ్యనాయుడు బీజేపీలో జాతీయ స్థాయికి ఎదిగి ఢిల్లీలో ప్రవేశించిన తర్వాత పార్టీకి ప్రజల్లో, ఆమోదయోగ్యత పొందడంలో కీలక పాత్ర పోషించారు. ఒక అజాతశత్రువుగా పేరు పొందిన వెంకయ్య పార్టీలకు అతీతంగా అందరికీ అందుబాటులో ఉండే ప్రజాస్వామ్యవాదిగా పేరు తెచ్చుకున్నారు. రాజశేఖర్ రెడ్డి కూడా ఎంపీగా ఉన్న కాలంలో ఇతరపార్టీ నేతలతో, మీడియాతో అరమరికలు లేకుండా ఉండేవారు. వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఎర్రన్నాయుడు పార్లమెంటరీ పార్టీ నేతలుగా ఉన్న కాలంలో తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలిగింది. ఎర్రన్నాయుడు పిల్లల కోడిలా ఎప్పుడూ ఎంపీలను, రాష్ట్ర నేతలను వెంటవేసుకుని కేంద్ర మంత్రుల వద్దకు తీసుకువెళ్లేవారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా ఎర్రన్నాయుడును చూసి చిరునవ్వుతో పలకరించేవారు.

ఇప్పుడు ఢిల్లీలో ఆ వాతావరణమే లేదు. రేవంత్ అన్నట్లుగా ఢిల్లీకి వెళ్లే తెలుగు రాజకీయ నేతలకు వెంకయ్యలాంటి పెద్ద దిక్కు ఎవరూ లేరు. అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులను తన వద్దకు పిలిపించి ఉభయ రాష్ట్రాల సమస్యలు చర్చించి పరిష్కారం సాధించగల శక్తి వెంకయ్యకు ఉండేది. ఎవరు ఢిల్లీకి వచ్చినా తన ఇంటికి పిలిచి సంభాషించే జైపాల్ రెడ్డి లాంటి విజ్ఞాన ఖని కనపడడం లేదు. వెంకయ్య, జైపాల్ ఇద్దరూ దక్షిణాది వారన్న అభిప్రాయం ఉత్తరాది వారికి కూడా ఉండేది కాదు. ఇద్దరూ తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో పట్టు సంపాదించారు. జైపాల్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు అంబానీ, రూపర్ట్ మర్దోక్ అయినా అపాయింట్‌మెంట్ తీసుకుని కలుసుకోవాల్సి వచ్చేది.

17వ లోక్‌సభ చిరి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయమది. ఆలోచిస్తుంటే గడిచిన అయిదేళ్లలో ఢిల్లీలో మన తెలుగువారి దుస్థితి గుర్తుకు వచ్చి ఆవేదన కలుగుతోంది. ఒక స్థాయిగల తెలుగు నేతలు పెద్దగా ఢిల్లీలో కనపడడం లేదు. వైసీపీకి ఉభయసభల్లో 30 మంది ఎంపీలున్నా వారు తమదైన ముద్ర ఢిల్లీలో వేయలేకపోయారు. బీఆర్ఎస్ ఎంపీలు సరే సరి. బీజేపీ అగ్రనేతలు కనపడితే వంగివంగి దండాలు పెడుతుంటే మన తెలుగు రాష్ట్రాల నేతలు ఇంత మరుగుజ్జులా అన్న అభిప్రాయం కలుగుతోంది.

రెండు రాష్ట్రాలకు చెందిన పద్మా పురస్కార గ్రహీతలకు, ముఖ్యంగా పద్మవిభూషణ్ పురస్కారాలు అందుకోనున్న వెంకయ్య, చిరంజీవిలకు సన్మానం చేయడం ద్వారా రేవంత్ అటు కేంద్రానికీ, ఇటు జగన్ ప్రభుత్వానికీ సంకేతాలు పంపారు. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామంటూనే వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాలని ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి కోరుకోవడం రాజకీయ సందేశమే. రెండవది, సామాన్యుల్లో అసామాన్యులైన వ్యక్తులకు మోదీ ప్రభుత్వం పద్మా పురస్కారాలు ఇవ్వడం గొప్ప విషయమే అయినప్పటికీ కేవలం ఈ పురస్కారాల వల్ల ఏమి ఒరుగుతుంది? ప్రయాణ ఖర్చులు కూడా పెట్టుకోలేని వారికి చప్పట్ల వల్ల, దుప్పట్ల వల్ల ఏమి ప్రయోజనం? అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వేసిన ప్రశ్న కూడా యోచించదగిందే. నిజానికి పద్మా పురస్కారాలు పొందినవారు అనేకమంది దుస్థితి వర్ణనాతీతం. ఒడిషాలో గత కొన్నేళ్లుగా పద్మశ్రీ పురస్కారాలు లభించిన 83 మందిలో పలువురు చాలీచాలని ఆదాయంతో దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని ఒడిషా ప్రభుత్వమే ప్రకటించింది. ఆ రాష్ట్రంలో దైతరీ నాయక్ అనే వ్యక్తి గోనసికా పర్వతాన్ని తానొక్కడే మూడేళ్ల పాటు శ్రమించి త్రవ్వి కాలువ నిర్మించడంతో ఆ ప్రాంతంలో దాదాపు వంద ఎకరాలకు సాగు నీరు లభించింది. పద్మశ్రీ పురస్కారం లభించిన తర్వాత తనకు కూలీగా కూడా ఎవరూ పని ఇవ్వలేదని ఆయన వాపోయారు. పేదరికంతో మగ్గుతున్న దైతరీ నాయక్ దుస్థితి గురించి పేపర్లలో వార్త చదివిన తర్వాత స్పందించిన ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆయనకు నెలకు రూ. పదివేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

ఇటీవలే శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన అయోధ్యలో మొహల్లా ఖిర్కీ అలీబెయిగ్‌లో నివసించే మహమ్మద్ షరీఫ్ అనే వ్యక్తికి నాలుగేళ్ల క్రితం మోదీ ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది. గత పాతికేళ్లుగా ఇదే అయోధ్యలో ఆయన 25వేల అనాథ శవాలకు అంత్యక్రియలు చేస్తూ వచ్చారు. చనిపోయిన వారు ఏ మతం అన్న దానితో నిమిత్తం లేకుండా ఆయన వారి వారి ఆచారాల ప్రకారం అంత్యక్రియలు జరిపించారు. కాని ఇదే మహమ్మద్ షరీఫ్ ఇవాళ దుర్భర పేదరికంతో, అనేక జబ్బులతో కునారిల్లుతూ తానే ఒక శవంలా పడి ఉన్నారని వార్తలు వచ్చాయి.

ఇలాంటి వార్తలు వచ్చిన తర్వాత హర్యానాలో గత ఏడాది పద్మా పురస్కారాలు వచ్చిన తమ రాష్ట్ర పౌరులకు ముఖ్యమంత్రి మనోహర్ ఖట్టర్ రూ. 10 వేల పింఛను ప్రకటించారు. ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా పద్మాపురస్కారాలు పొందిన వారిలో నిరుపేదలకు రూ. పదివేల నెలసరి ఆర్థిక సహాయాన్ని అందించాలని నిర్ణయించారు. రేవంత్ ఒక్కడుగు ముందుకు వేసి రూ. 25 లక్షల నగదుతో పాటు పాతికవేల పింఛను ప్రకటించారు.

పద్మా పురస్కారాలు ఇచ్చిన తర్వాత వారి అతీగతీ పట్టించుకోకపోడం ఒక ముఖ్యమైన విషయం అయితే వారి మనోభావాలకు, ఆలోచనలకు కూడా విలువ ఇవ్వడం అవసరం. అనేక అంతర్జాతీయ క్రీడల్లో పతకాలు గెలుచుకుని భారతదేశ కీర్తి ప్రతిష్టలను చాటిచెప్పిన మల్లయోధులు బజ్రంగ్ పునియా, వీరేందర్ సింగ్ యాదవ్ తమ పద్మశ్రీ పురస్కారాలను తిరిగి ఇచ్చేశారు. రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగిక వేధింపులకు గురి చేశారని ఏడాదికి పైగా ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోనందుకు సుదీర్ఘకాలం తీవ్ర నిరసన తెలిపిన తమ తోటి మహిళా మల్లయోధులకు సంఘీభావంగా వారు తమ అవార్డులను తిరిగి ఇచ్చారు. బజ్రంగ్ పునియా తన పద్మశ్రీ పతకాన్ని ఇండియాగేట్ వద్ద ఫుట్ పాత్ వద్ద పెట్టేసి తిరిగి వచ్చారు. కనీసం వారినైనా పిలిచి మాట్లాడి సమస్యను పరిష్కరించి ఉంటే బాగుండేది కదా! కాని రాజకీయ కారణాలు అందుకు అడ్డువచ్చి ఉంటాయనడంలో సందేహం లేదు.

రామజన్మభూమి ఉద్యమాన్ని నిర్వహించి బీజేపీ బలోపేతం కావడానికి ప్రధానకారకుడైన లాల్‌కృష్ణ ఆడ్వాణీకి మోదీ ప్రభుత్వం భారతరత్న ప్రకటించడంలో ఆశ్చర్యం లేదు. బాబ్రీ మసీదు కట్టడం కూల్చివేతకు ప్రధాన కారకుడైన అప్పటి ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్‌కు కూడా ఆయన మరణానంతరం 2022లో మోదీ ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించింది. కల్యాణ్ సింగ్‌ను అభిశంసించి, ఒక రోజంతా బోనులో నిలబెట్టిన సుప్రీంకోర్టు, తర్వాత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్ హయాంలో అయోధ్యలో మందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. జస్టిస్ గొగోయ్‌ను రాజ్యసభ సభ్యత్వం వరించింది. ఇది బీజేపీ సైద్ధాంతిక విశ్వాసాలకు సంబంధించిన విషయం. కాని లాల్‌కృష్ణ ఆడ్వాణీ అనేకమంది నాయకులకంటే ఎక్కువగా ప్రజాస్వామ్యాన్నీ, పత్రికా స్వేచ్ఛనూ, రాజకీయాల్లో ఉన్నత ప్రమాణాల్నీ ప్రేమించారు. ఆయన శిష్యుడైన వెంకయ్య కూడా ఏ పదవిలో ఉన్నా అదే దారిలో పయనించారు. ‘పటిష్ఠమైన ప్రతిపక్షం, పత్రికా స్వేచ్ఛ, స్వతంత్ర న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్యంలోని మూడు ప్రధాన లక్షణాలు’ అని ఆడ్వాణీ తన ఆత్మకథలో వివరించారు. మెజారిటీ ఉన్నది కదా అని ఒక నియంత ఆ మెజారిటీనీ ఆయుధంగా మార్చుకోవడాన్ని, చట్టసభను కూడా ఇష్టారాజ్యంగా వాడుకోవడాన్ని ఆయన విమర్శించారు. పార్లమెంటరీ ముద్రపడితే చాలు ఎటువంటి దుర్మార్గాన్నైనా సమర్థించుకోవడాన్ని, ఎటువంటి పాపమైనా పవిత్రమవుతుందనుకోవడాన్ని ఆయన తీవ్రంగా నిరసించారు. రాజకీయాల్లో శత్రువులు ఉండరని, ప్రత్యర్థులు మాత్రమే ఉంటారని, రాజకీయ ప్రత్యర్థులను తుడిచిపెట్టాలనుకునే ఆలోచన సరిఅయినది కాదని ఆయన విశ్వసించారు. ప్రజాస్వామ్యంలో శత్రుత్వమనే భావన ప్రమాదకరమైనదని, వేర్వేరు సిద్దాంతాలు ఉన్నప్పటికీ జాతీయ ప్రాధాన్యం గల అంశాలపై కీలక ఏకాభిప్రాయసాధన అవసరమని ఆయన భావించారు. ఆడ్వాణీకి భారతరత్న పురస్కారం ప్రదానం చేయడమే కాదు, ఆయన ఆలోచనలను కూడా గౌరవించడం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అవసరం. ఎంతైనా ఆడ్వాణీ బీజేపీ మార్గదర్శక మండలి సభ్యుడే కదా!

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Feb 07 , 2024 | 03:46 AM