Share News

మోదీ గ్యారంటీ రైతులకు లేదా?

ABN , Publish Date - Feb 14 , 2024 | 02:22 AM

దేశ రాజధాని చుట్టూ యుద్ధ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూస్తే అక్కడ బారికేడ్లు కనపడుతున్నాయి. వందలాది లారీల్లో ఇసుకను, మట్టిని తీసుకువచ్చి జేసీబీ ప్రొక్లెయినర్లతో రహాదార్లపై పోస్తున్నారు. ఢిల్లీ నలుమూలల నుంచి...

మోదీ గ్యారంటీ రైతులకు లేదా?

దేశ రాజధాని చుట్టూ యుద్ధ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూస్తే అక్కడ బారికేడ్లు కనపడుతున్నాయి. వందలాది లారీల్లో ఇసుకను, మట్టిని తీసుకువచ్చి జేసీబీ ప్రొక్లెయినర్లతో రహాదార్లపై పోస్తున్నారు. ఢిల్లీ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు బాష్పవాయువు, నీటి కానన్లను ప్రయోగించి వారిని చెదరగొడుతున్నారు. రాజధానికి ఇతర వాహనాల రాకపోకల్ని నిషేధించారు. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను విధించారు. అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాలు అంగుళం కదలాలంటే కష్టమయ్యే పరిస్థితి ఏర్పడింది. 2020–21లో ఢిల్లీ పొలిమేరల్ల్లో కనపడ్డ దృశ్యాలే మళ్లీ పునరావృతమవుతున్నాయి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలల పాటు రైతులు తీవ్ర నిరసన తెలిపినప్పుడు వారి పోరాట పటిమను నీరు కార్చేందుకు ప్రభుత్వం తరఫున చాలా ప్రయత్నాలు చేశారు. రైతులను సంఘ వ్యతిరేక శక్తులు, ఉగ్రవాదులని కూడా నిందించారు. అభివర్ణించారు. తీవ్రమైన చలికి, వానకు, నిర్బంధానికి గురైన 700 మంది రైతులు ఆ నిరసన ప్రదర్శనల సందర్భంగా మరణించారు. 11 సార్లు రైతు ప్రతినిధులతో చర్చలు జరిపిన నాటి వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సాగు చట్టాలను వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని 2021 జూలై 28న ప్రకటన చేశారు. 2021 అక్టోబర్‌లో ఉత్తర ప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరీలో నిరసన తెలుపుతున్న రైతులపై కేంద్రహోంశాఖ సహాయమంత్రి కుమారుడు వాహనం నడిపించడం, తర్వాత జరిగిన హింసాకాండలో 8 మందికి పైగా మరణించారు. చివరకు 2021 నవంబర్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజల ముందుకు వచ్చి సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతులకు కనీసమద్దతు ధరను మరింత సమర్థంగా, పారదర్శకంగా అమలు చేసేందుకు కమిటీని వేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత మాత్రమే రైతులు శాంతించారు.

మళ్లీ ఇప్పుడు రైతులు ఎందుకు తీవ్ర నిరసన తెలిపేందుకు సమాయత్తమయ్యారు? మోదీ ప్రకటన చేసిన 9 నెలల తర్వాత 2022 జూలై 12న వ్యవసాయశాఖ మాజీ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ అధ్యక్షతన ఒక కమిటీ నేర్పాటు చేశారు. ఈ కమిటీలో సాగు చట్టాలను వ్యతిరేకించిన ఆర్థికవేత్తలు కానీ, నిపుణులు కానీలేరు. ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రానికి చెందిన రైతు ప్రతినిధులను ఎవర్నీ అందులో నియమించలేదు. విచిత్రమేమంటే ఈ కమిటీ ఇంతవరకూ మధ్యంతర నివేదిక కూడా సమర్పించలేదు. ఇప్పుడు సార్వత్రక ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు మళ్లీ తమ డిమాండ్లను ప్రజల ముందుకు తీసుకువచ్చేందుకు నిరసన ప్రదర్శనలు నిర్వహించాలనుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. మోదీ సర్కార్ మళ్లీ వారిని అణిచివేసేందుకు యథా ప్రకారం చర్యలు తీసుకోవడంలో కూడా ఆశ్చర్యం లేదు.

నిజానికి 2014లో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చేందుకు ప్రధానంగా రైతులు కారణమయ్యారు. అనేక సభల్లో మోదీ కనీస మద్దతు ధర గురించి మాట్లాడారు. గోధుమ, వరి వంటి పంటలకు ఉత్పత్తి వ్యయం భరించడంతో 50శాతం లాభం కలిగించే విధంగా కొత్త ఫార్ములాను రూపొందిస్తామని ఆయన ప్రకటించారు. ఈ ఫార్ములా మోదీది కాదు. ఇటీవల మోదీ భారతరత్న ప్రకటించిన వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌ది. మోదీ అధికారంలోకి వచ్చాక ఈ ఫార్ములాను ఏనాడూ అమలుచేయలేదు. పైగా కనీసమద్దతు ధర అనే దానికే అర్థం లేకుండా చేసేందుకు, కార్పొరేట్లు వ్యవసాయ రంగంలో ప్రవేశించేందుకు వీలుగా సాగు చట్టాలను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు! ఈ చట్టాలను ఉపసంహరించుకున్న తర్వాత మోదీ ప్రభుత్వం ప్రకటించిన కనీసమద్దతు ధరలు స్వామినాథన్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా లేవు. భూసంస్కరణలు, రైతుల ఆత్మహత్యలు అరికట్టడం, వ్యవసాయ భూమి అమ్మకాన్ని క్రమబద్ధీకరించడం, నీటిపారుదల రంగంలో పెట్టుబడులు పెట్టడం, వ్యవసాయ భూమిని కార్పొరేట్లకు వ్యవసాయేతర అవసరాలకోసం అమ్మకుండా నిషేధించడం, గ్రామీణ బీమా అభివృద్ధి నిధిని ఏర్పాటు చేసి పంట బీమా, గ్రామీణ మౌలిక సదుపాయాలు కల్పించడం, రైతులకు 4 శాతం సరళ వడ్డీతో రుణాలు అందించడం వంటి అనేక సిఫారసులను కూడా స్వామినాథన్ కమిషన్ చేసింది. వీటిలో ఎన్ని మోదీ ప్రభుత్వం అమలు చేసింది? అమలు చేస్తే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, తమను అప్పుల వలయం నుంచి తప్పించాలని, రైతులకు, రైతు కూలీలకు పింఛను చెల్లించాలని, రైతులు ఇవాళ వీధుల్లోకి ఎందుకు వస్తారు? గత నిరసన ప్రదర్శనల సందర్భంగా రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోనే లేదు. ఆ ప్రదర్శనల్లో మరణించిన వందలాది రైతులకు నష్టపరిహారం కూడా చెల్లించలేదు. ఇది కాకుండా మోదీ ప్రభుత్వం నీరుకార్చిన భూసేకరణ చట్టం, 2013ను పునరుద్ధరించాలని కూడా రైతులు కోరుతున్నారు. విద్యుత్ చట్టానికి చేసిన సవరణలు రైతులను వ్యవసాయం నుంచి దూరం చేసే లక్ష్యంతో రూపొందించారని విమర్శిస్తున్నారు. నాడు రైతులతో చర్చలు జరిపిన నరేంద్రసింగ్ తోమర్‌ను కేంద్ర కేబినెట్ పదవి నుంచి తప్పించి మధ్యప్రదేశ్ అసెంబ్లీకి పోటీ చేయించారు. కేంద్రంలో కనీసం 8 కేబినెట్ పదవులు నిర్వహించిన తోమర్ ఇప్పుడు అసెంబ్లీలో స్పీకర్‌గా బాధ్యత నిర్వహిస్తున్నారు. ఆయన స్థానంలో వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అర్జున్ ముండా కనీస మద్దతు ధరపై చట్టాన్ని హడావిడిగా చేయలేమని తాజాగా ప్రకటించారు. మరి గత అయిదు సంవత్సరాలుగా ఏమి చేస్తున్నారు?

అసలు స్వామినాథన్ కమిషన్ సిఫారసులను పూర్తిగా అమలు చేయకుండా ఆయనకు భారతరత్న ప్రకటించడంలో అర్థం ఉన్నదా? ఇవాళ దేశంలో వ్యవసాయ రంగానికి న్యాయం చేయాలంటే పంటలకు కనీస మద్దతు ధరను హామీ ఇచ్చే చట్టాన్ని చేయాల్సిందేనని స్వామినాథన్ కమిషన్ సభ్యుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డా. ఆర్‌బి సింగ్ మంగళవారం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఏ పంటకైనా ఉత్పత్తి వ్యయంలో కనీసం 50 శాతం అధికంగా కనీస మద్దతు ధరను నిర్ణయించాలని తాము సిఫారసు చేశామని, కానీ దీన్ని దేశమంతటా ఒకే విధంగా అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు. కనీస మద్దతు ధర విషయంలో మాత్రమే కాదు వ్యవసాయమౌలిక సదుపాయాలను కూడా మోదీ ప్రభుత్వం కల్పించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. రూ. లక్షకోట్లతో వ్యవసాయ మౌలికసదుపాయాల నిధిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన మోదీ ప్రభుత్వం గత మూడేళ్లలో కేవలం రూ. 12వేల కోట్లే కేటాయించిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఇవాళ దేశంలో ఏ ప్రసార సాధనాలను చూసినా మోదీ గ్యారంటీ పేరుతో ప్రకటనలు ఊదరగొడుతున్నాయి. మోదీ చెప్పింది చేస్తారని ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు సర్వయత్నాలు చేస్తున్నారు. అయోధ్యలో బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ చేసి మోదీ తన వాగ్దానం నిలుపుకున్నారేమో కాని ఈ దేశ రైతులకు మాత్రం తాను ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఇవాళ లక్షలాది రైతులు వీధిన పడడాన్ని బట్టి అర్థమవుతోంది. 2016–17లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న దష్ట్యా 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామనే విధాన ప్రకటన చేశారు. అయితే దేశంలో 70 శాతం మంది రైతుల ఆదాయం సంవత్సరానికి రూ.15 వేలు కూడా మించడం లేదని, కేవలం 10శాతం మాత్రమే రూ.30 వేల కంటే ఎక్కువ ఆర్జిస్తున్నారని భారత వ్యవసాయ పరిశోధనా మండల అధ్యయనం ఒకటి తెలిపింది. దేశంలో రైతాంగ సంక్షోభం నానాటికీ తీవ్రమవుతోంది కానీ తగ్గడం లేదని గత పదేళ్లలో పెద్ద ఎత్తున జరిగిన రైతుల ఆత్మహత్యలను బట్టి తెలుస్తోందని రైతు సంఘాలు అంటున్నాయి. మరి మోదీ గ్యారంటీ ఎవరికి? ఈ పది సంవత్సరాల్లో భారీ ఎత్తున సంపదను పోగు చేసుకున్న బడా పారిశ్రామికవేత్తలకేనా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

విచిత్రమేమంటే రైతుల నిరసన ప్రదర్శనల సందర్భంగా ఎన్డీఏ నుంచి వైదొలగిన అకాలీదళ్‌ను మళ్లీ ఎన్డీఏలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఒకప్పుడు రైతుల నిరసనల్లో కీలకపాత్ర పోషించి అనేక రైతు ప్రదర్శనల్లో పాల్గొన్న భారతీయ లోక్‌దళ్ నేత జయంత్ చౌదరిని కూడా ఎన్డీఏ వైపు దృష్టిసారించేలా చేశారు. కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న ప్రకటించి నితీశ్ కుమార్‌ను ఎన్డీఏలోకి లాగినట్లే, జయంత్ చౌదరిని ఇండియా కూటమిలోంచి లాగి బీజేపీ వైపు తిప్పుకునేందుకు ఆయన తాత చౌదరి చరణ్‌సింగ్‌కు భారతరత్న ప్రకటించారు.

పీవీ నరసింహారావును కాంగ్రెస్ పార్టీ గుర్తించకపోయినప్పటికీ ఆయనకు భారతరత్నను ప్రదానం చేయడం ద్వారా ఆ ఘనత పొందేందుకు మోదీ ప్రయత్నం చేయడంలో ఆశ్చర్యం లేదు. పీవీ తన అయిదేళ్ల పాలనలో అనేక నిర్ణయాలను ఏకాభిప్రాయ సాధన ద్వారా అమలు చేశారు. ఆయన హయాంలో పార్లమెంట్‌లో ఏనాడూ చర్చించకుండా ఏ బిల్లూ ఆమోదం పొందలేదు. ఇవాళ పి.వి. చనిపోయిన తర్వాత భారతరత్నను ప్రకటించారు కాని వాజపేయి ప్రతిపక్ష నేతగా తనను విమర్శిస్తారని తెలిసినప్పటికీ పి.వి. ఆయనకు పద్మవిభూషణ్ ఇచ్చారు. జెనీవాలో ఐక్యరాజ్యసమితి సమావేశానికి కేబినెట్ హోదాలో వాజపేయిని పంపించారు. అయినా సరే వాజపేయి పి.విపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. పరస్పర మర్యాదలకు లోటు రాకుండా రాజకీయాలు నిర్వహిచేందుకు నాడు నేతలు జాగ్రత్తపడేవారు. కాని నేడు ప్రతిపక్షాలను నిర్మూలించేందుకు మోదీ కంకణం కట్టుకున్నట్లు కనపడుతోంది. పార్లమెంట్‌లో స్థాయీ సంఘాలను ప్రవేశపెట్టి ప్రతి కీలక బిల్లునూ క్షుణ్ణంగా చర్చించే పద్దతిని ప్రవేశపెట్టిన నేత పి.వి. మరి ఆయన బాటలో మోదీ ఏనాడైనా నడిచే ప్రయత్నం చేశారా?

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Feb 14 , 2024 | 02:22 AM