Share News

మోదీ బ్రహ్మాస్త్రం–విపక్షాల పాశుపతాస్త్రాలు

ABN , Publish Date - Jan 17 , 2024 | 05:26 AM

దేశంలో ఇప్పుడు అంతటా అయోధ్య సంరంభం కనిపిస్తోంది. ఇంటింటికీ అక్షింతలు, రామమందిరం ఫోటోలు పంచిపెడుతున్నారు. ఉత్తర భారతంలో అనేక దేవాలయాల్లో పూజలు ఉధృతంగా జరుగుతున్నాయి...

మోదీ బ్రహ్మాస్త్రం–విపక్షాల పాశుపతాస్త్రాలు

దేశంలో ఇప్పుడు అంతటా అయోధ్య సంరంభం కనిపిస్తోంది. ఇంటింటికీ అక్షింతలు, రామమందిరం ఫోటోలు పంచిపెడుతున్నారు. ఉత్తర భారతంలో అనేక దేవాలయాల్లో పూజలు ఉధృతంగా జరుగుతున్నాయి. ఉదయం లేవగానే ఎక్కడి నుంచో భజనలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలోని పలు కాలనీల అపార్్ట్‌మెంట్ సొసైటీల్లో రామభక్తులు జనవరి 22న సంబరాలు నిర్వహించనున్నారు. దేశ రాజధాని అంతటా ఒక వైపు మోదీ, మరో వైపు శ్రీరాముడి చిత్రంతో పోస్టర్లు వెలిసాయి. మీడియాలో అయోధ్యపై ప్రత్యేక కథనాలు పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి. రానున్న కొద్ది రోజుల్లో బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థలు రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమంపై మరింత ఉధృతంగా జనంలోకి వెళతాయనడంలో సందేహం లేదు. భారతదేశం బానిసత్వం నుంచి విముక్తి పొందిందని, మందిర ప్రారంభం రోజు దీపావళి జరుపుకోవాలని పిలుపునిచ్చిన నరేంద్రమోదీ ఈ మొత్తం ప్రచార ఘట్టానికి సారథ్యం వహిస్తున్నారనడంలో సందేహం లేదు. ఈ దిశలో ఆయన ప్రతి కదలికా, ప్రతి ప్రసంగం, ప్రతి చర్యా రికార్డు చేసేందుకు సమాచార దళం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ప్రాణప్రతిష్ఠకు ముందుమూడు రోజులు మోదీ నేలపై కంబళి కప్పుకుని పడుకుంటారని, కేవలం ఫలాలు మాత్రమే తింటారని వార్తలు వ్యాపిస్తున్నాయి.

నిజానికి మందిర ప్రారంభం సాధారణ కార్యక్రమం కాదు. 2024 ఎన్నికలకు ముందు మోదీ పూరించిన శంఖారావంగానే దీన్ని భావించవచ్చు. కొద్ది రోజుల ముందు వికసిత్ సంకల్ప్ యాత్రను ప్రకటించి లబ్ధిదారుల వద్దకు వెళ్లమని పార్టీ నేతలను ప్రేరేపించిన మోదీ, మరోవైపు మందిర ప్రారంభాన్ని కూడా ప్రజలను బీజేపీ వైపు పూర్తిగా తిప్పుకునేందుకు ఒక అస్త్రంగా ప్రయోగిస్తున్నారనడంలో సందేహం లేదు.

మోదీ విసురుతున్న అస్త్రాలు సామాన్యమైనవి కావని ప్రతిపక్షాలకు తెలుసు. హిందువులను ద్వేషిస్తున్నందువల్లే రామమందిర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ రావడం లేదని బీజేపీ నేతలు ఇప్పటికే విస్తృత ప్రచారం మొదలుపెట్టారు. ఈ రీత్యా రామమందిర భావోద్వేగాలను ఎదుర్కోవడంకోసం ప్రతిపక్షాలు సైద్ధాంతికంగా సమాయత్తం కావల్సివున్నది. ప్రతిపక్షాల ఆరు దశాబ్దాల పాలనలో దేశం పూర్తిగా వెనుకబడి ఉన్నదని, తన పదేళ్ల కాలంలోనే కనీవినీ ఎరుగని అభివృద్ధి జరిగిందని, ప్రజలకు సంక్షేమం పూర్తిగా అందుతోందని కూడా మోదీ టీమ్ విస్తృత ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారాన్ని తుత్తునియలు చేసేందుకు కూడా ప్రతిపక్షాలు గణాంక వివరాలతో సిద్ధం కావల్సివున్నది. మూడవది ప్రతిపక్షాలన్నీ అవినీతి భూయిష్టమైనవని, వారసత్వ పాలన తప్ప వాటికి మరో లక్ష్యం లేదని మోదీ చేస్తున్న ప్రచారాన్ని ఎలా ఎదుర్కోవాలో తేల్చుకోవాలి. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే దేశంలో అభివృద్ధి వెనుకబడుతుందని, అధికారంలో వాటా కోసం కుమ్ములాటలు జరుగుతాయని కూడా మోదీ ప్రజల్లోకి వెళతారనడంలో సందేహం లేదు.

వీటన్నింటినీ ఎదుర్కోగల అస్త్రాలు ప్రతిపక్షాలకు లేవని చెప్పలేము. మందిర నిర్మాణం ప్రారంభం కాకముందే ప్రాణ ప్రతిష్ఠ చేయడం, అందునా ఆ పవిత్ర కృత్యాన్ని మోదీయే నిర్వహించడం వెనుక రాజకీయం ఉన్నదని శంకరాచార్యులు విమర్శించడం వంటివి ప్రస్తావించడం మాత్రమే సరిపోదు. శ్రీరాముడి గురించి మాట్లాడుతూనే మరో వైపు చేతుల్లో కత్తులు ఝళిపిస్తున్నారని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మణిపూర్‌లో విమర్శించారు. ‘ప్రతి ఒక్కరికీ మత విశ్వాసాలు ఉంటాయికాని ఓట్ల కోసం ఆ విశ్వాసాలను ఎవరూ ఉపయోగించుకోరు. బీజేపీ ఓట్లకోసం మతాన్ని ఉపయోగించుకుంటోంది’ అని ఆయన విమర్శించారు. ఈ ప్రచారం ప్రజల్లోకి ఉధృతంగా వెళ్లనంతవరకూ రామమందిర నిర్మాణం బీజేపీకే అనుకూలంగా ఉంటుంది.

నిజానికి మతాన్ని రాజకీయాలను కలగలపడంపై ఉన్నతన్యాయస్థానం పలు సందర్భాల్లో పలు రకాలుగా వ్యాఖ్యానించింది. హిందూత్వ అనేది ఒక జీవన విధానమని, దానిపై ఎన్నికల్లో ఓట్లు అడిగినంత మాత్రాన చట్టాన్ని ఉల్లంఘించినట్లు కాదని 1995లో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వర్మ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. హిందూ రాష్ట్రం పేరుతో ఓట్లు అడిగినందుకు శివసేన నేత మనోహర్ జోషితో పాటు 9 మందిని అనర్హులుగా ప్రకటిస్తూ బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కొట్టివేసింది. శివసేన అధినేత బాల్ థాకరే ఉద్రేకపూరిత ప్రసంగాలను కూడా సుప్రీం కోర్టు విస్మరించింది. మతాన్ని రాజకీయాలకు ఉపయోగించుకోకూడదని ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123(3) విధించిన నిబంధనను అది బుట్టదాఖలు చేసింది. ఈ నిబంధన ప్రకారం మతాన్ని రాజకీయాలకు ఉపయోగించుకోవడం కూడా అన్ని విధాలా అవినీతే. సుప్రీంకోర్టు రూలింగ్‌పై పార్లమెంట్ కానీ, ఎన్నికల కమిషన్ కానీ పెద్దగా ప్రతిస్పందించలేదు. సుప్రీంకోర్టు కూడా రెండు దశాబ్దాలు మౌనం పాటించింది. ఒక రకంగా ఈ తీర్పు బీజేపీ ఎదుగుదలకు కారణమైందన్న వ్యాఖ్యలు కూడా ఉన్నాయి.

కాని మతాన్ని రాజకీయాలతో కలగాపులగం చేయడాన్ని రాజ్యాంగమే నిషేధించిందని దాదాపు 20 ఏళ్ల తర్వాత 2017లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ బెంచ్ స్పష్టంచేసింది. జస్టిస్ మదన్ బి. లోకూర్, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు ఈ విషయంలో ఏకీభావం వ్యక్తం చేయగా, ఈ అంశాన్ని పార్లమెంట్‌కు వదిలి వేయాలని న్యాయమూర్తులు ఆదర్శ్ గోయెల్, యుయులలిత్, డివై చంద్రచూడ్ ప్రకటించారు. ఈ తీర్పుపై నాడు అసమ్మతి ప్రకటించిన జస్టిస్ డివై చంద్రచూడ్ ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి. రామమందిరాన్ని రాజకీయాలకు బీజేపీ ఉపయోగించుకోవడంపై ఎవరైనా మళ్లీ కోర్టుకు వెళితే ప్రస్తుత న్యాయస్థానం ఏమి చెబుతుందో చెప్పలేము. అంతకు ముందు ఎన్నికల కమిషన్ ఆ విషయంలో కలుగచేసుకునే ధైర్యం చూపాలి కదా! మతాన్ని రాజకీయాలకు ఉపయోగించుకోవడం రాజకీయ నాయకులు ఆపనంతవరకూ విద్వేష ప్రసంగాలు ఆగబోవని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నాగరత్నమ్మ ఇటీవల వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఏమి ఒరుగుతుంది? నిజానికి రాజకీయ నాయకులు ఉపయోగించుకుంటే ఉపయోగపడే ప్రజలు ఉన్నంతకాలం వారు భావోద్వోగాలకు గురవుతూనే ఉంటారు. మతాన్ని రాజకీయాలకు ఉపయోగించుకోవడం ద్వారా తమను మభ్యపెడుతున్నారని ప్రజలు గ్రహించాలి. ఆ గ్రహింపు వచ్చేందుకు వారిని చైతన్యపరచాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీలదే. రామమందిరం విషయంలో ఒక స్పష్టమైన సైద్ధాంతిక దృక్పథం ముందుగా రాజకీయ పార్టీలకు ఏర్పడాలి. ఈ పార్టీలే అధికార పార్టీ ఉధృత ప్రచారానికి లోనై ఆత్మరక్షణలో పడితే ఎవరూ ఏమీ చేయలేరు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మాటేమిటి? అని ఖర్గే అన్నమాటలు జనం మనసుల్లో కూడా ప్రతిధ్వనింపచేయాలి.

ఈశాన్యం నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభించడం ఒక వ్యూహాత్మక నిర్ణయమే. ఈశాన్య రాష్ట్రాల్లో 25 లోక్‌సభ సీట్లున్నాయి. ఇందులో కేవలం అస్సాంలోనే 14 సీట్లు ఉన్నాయి. ఈ పాతిక సీట్లను రాహుల్ గాంధీ యాత్ర ఎంతో కొంత ప్రభావితం చేయగలదని కాంగ్రెస్ భావిస్తోంది. మణిపూర్‌లో కుకీలు, మైతీలు ఒకర్నొకరు నరుక్కున్న ప్రాంతాల్లోనే రాహుల్ పర్యటించి వారిమధ్య సయోధ్యకు కాంగ్రెస్ కృషి చేస్తుందనే సందేశం పంపారు. సముద్ర స్నానాలు చేసేందుకు సమయం ఉంటుంది కాని మణిపూర్‌లో అడుగు పెట్టేందుకు, జాతుల మధ్య సామరస్యం కుదిర్చేందుకు మోదీకి సమయం లేదని ఆయన విమర్శించారు. మణిపూర్‌లో జాతుల సమస్యను ప్రస్తావిస్తే ఇతర రాష్ట్రాల్లో బీజేపీ మతప్రచారానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ కులం గురించి ప్రస్తావిస్తున్నారు. కుల జనగణన జరిపిస్తామని హామీలు ఇస్తున్నారు. నిజానికి కుల జనగణన గురించి ఇటీవల మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్నికల సభల్లో ఎంత మాట్లాడినా కాంగ్రెస్‌కు అంత ప్రయోజనం కలుగలేదు. అంత మాత్రాన భారత రాజకీయాల్లో కులానికి అంత ప్రాధాన్యం లేదని కొట్టి పారేయలేము. ప్రజలు మత ప్రాతిపదికన ఏకం అవుతారని కూడా తీర్మానించలేము. మతం గురించి మాట్లాడుతూనే కులాలను ఉపకులాలుగా చీల్చిప్రయోజనం పొందేందుకు బీజేపీ తీవ్ర యత్నాలు చేస్తున్న విషయాన్ని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు విస్మరించరాదు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రలో ప్రధానమైనది సామాజిక న్యాయం అందించడం. దేశంలో దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం అందించేందుకు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు చిత్తశుద్ధితో కృషిచేస్తాయని నమ్మకం కలిగించనంతవరకూ అణగారిన వర్గాలు మతం వెల్లువలో కొట్టుకుపోకుండా ప్రతిపక్షాల వైపు మొగ్గు చూపే అవకాశం లేదు. ఇందుకు ఇండియా కూటమి కనీస ఉమ్మడి ఎజెండాను ఏర్పర్చుకోవాలి. జయప్రకాశ్ నారాయణ్ లాగా వివిధ వర్గాలను, కులాలను సమీకరించగలిగిన శక్తి ప్రతిపక్ష నేతల్లో ఎవరికైనా ఉన్నదా? 2024 ఎన్నికలను మండల్, కమండల్ పోరాటంగా మార్చే సైద్ధాంతిక శక్తి ప్రతిపక్షాలకు ఉన్నదా? అన్నది చర్చించాల్సి ఉన్నది.

వారసత్వం, అవినీతిని బీజేపీ కూడా ప్రోత్సహిస్తున్నందువల్ల ఆ విషయంలో ప్రతిపక్షాలను విమర్శించడంలో పసలేదనే చెప్పాలి. వివిధ రాష్ట్రాల్లో వందలాది వారసులను బీజేపీ అందలం ఎక్కించింది. బీజేపీతో చేతులు కలిపిన అనేకమంది అవినీతిని విస్మరించారు. సంకీర్ణ ప్రభుత్వాల వల్ల దేశం విచ్ఛిన్నమవుతుందని చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడం కూడా అంత కష్టమేమీకాదు. ఐదేళ్ల పాటు నరసింహారావు మైనారిటీ ప్రభుత్వంలోనూ, ఆ తర్వాత వాజపేయి నిర్వహించిన సంకీర్ణ ప్రభుత్వంలోనూ దేశం విచ్ఛిన్నమైందా లేక అభివృద్ధి పథంలో నడిచిందా అన్న ప్రశ్నలు వేసుకుంటే సరైన జవాబులు లభిస్తాయి. పదేళ్ల పాటు యూపీఏ ప్రభుత్వం విజయవంతంగా పాలించిన సమయంలో జరిగిన అభివృద్ధికీ, పదేళ్ల పాటు మోదీ హయాంలో జరిగిన అభివృద్ధికీ మధ్య తేడాపై గణాంక వివరాలతోసహా చర్చిచేందుకు వెనుకాడనక్కర్లేదు. పదేళ్ల మన్మోహన్ సింగ్ పాలనలో సగటు అభివృద్ధి రేటు 8.4 శాతం కాగా మోదీ హయాంలో సగటు అభివృద్ధి రేటు 5.4 శాతం మాత్రమేనని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ చేసిన వ్యాఖ్యలు కొట్టిపారేయదగినవి కావు. రామమందిరం మోదీకి బ్రహ్మాస్త్రమే కావచ్చు కాని ప్రతిపక్షాల వద్ద కూడా పాశుపతాస్త్రాలు తక్కువేమీ లేవు.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Jan 17 , 2024 | 05:26 AM