Share News

మోదీ జిత్తులతో విపక్షాలు చిత్తు...!

ABN , Publish Date - Jan 31 , 2024 | 12:54 AM

ప్రజల శ్రేయస్సు, సిద్ధాంతాల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార సాధనకే మెజిరిటీ రాజకీయ పక్షాలు ప్రాధాన్యమిస్తున్నాయని బిహార్‌లో నితీశ్ కుమార్ మళ్లీ ఎన్డీఏ ఒడిలో చేరడంతో మరోసారి రుజువైంది. లేకపోతే డిసెంబర్‌లో...

మోదీ జిత్తులతో విపక్షాలు చిత్తు...!

ప్రజల శ్రేయస్సు, సిద్ధాంతాల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార సాధనకే మెజిరిటీ రాజకీయ పక్షాలు ప్రాధాన్యమిస్తున్నాయని బిహార్‌లో నితీశ్ కుమార్ మళ్లీ ఎన్డీఏ ఒడిలో చేరడంతో మరోసారి రుజువైంది. లేకపోతే డిసెంబర్‌లో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ‘ఇండియా’ కూటమికి చెందిన దాదాపు 150 ఎంపీలతో పాటు తన పార్టీకి చెందిన ఎంపీలను కూడా మోదీ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా బహిష్కరించిన విషయాన్ని నితీశ్ ఇంతలోనే ఎలా మరచిపోయారు? మర్యాదపురుషోత్తముడు, రామరాజ్య స్థాపకుడు, అధికారాన్ని తృణప్రాయంగా విసర్జించాడని, ప్రజల నిందలకు విలువ ఇచ్చేవాడని గుర్తింపు పొందిన శ్రీరాముడికి ప్రాణప్రతిష్ఠ చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం ఆలయం నుంచి బయటకు రాగానే సార్వత్రక ఎన్నికల తర్వాత మూడోసారి ఎలా అధికారంలోకి రావాలా అన్న విషయంపైనే అధికంగా దృష్టి సారించడంలో ఆశ్చర్యం లేదు.

రాముడి ప్రాణప్రతిష్ఠ మూలంగా ఏర్పడిన భావోద్వేగాలు, తన పాలన, వ్యక్తిగత ఆకర్షణ పైనే మోదీ నమ్మకం పెట్టుకోలేదని, ప్రతిపక్షాల ఎజెండాను, ఐక్యతను దెబ్బగొట్టడంతో పాటు వాటిని కకావికలం చేయడం గురించి కూడా ఆయన ఎంతో ముందుగా వ్యూహరచన చేసి పెట్టుకున్నారని గత కొద్ది రోజులుగా సంభవిస్తున్న పరిణామాలను బట్టి ఎవరికైనా అర్థమవుతుంది. 2019 ఎన్నికల్లో బిహార్ నుంచి ఎన్డీఏ 39 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసినవారెవరైనా బిహార్‌ను మోదీ వదిలివేస్తారని ఎలా అనుకుంటారు? జెడి(యు), ఆర్‌జెడి, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు కలిసి పోటీ చేస్తే 2019 ఫలితాలు తారుమారవుతాయని భావించినందువల్లే ఆయన చక్రం తిప్పారు.

అంతే కాదు, మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించడం, రామమందిర భావోద్వేగాలు సృష్టించడంతోనే ‘ఇండియా’ కూటమి నేతల్లో భవిష్యత్ పట్ల అయోమయం ఏర్పడిందనడంలో సందేహం లేదు. ఈ సమయంలోనే మోదీ వెనువెంటనే పావులు కదిపి బిహార్ నేత కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న ప్రకటించడం, నితీశ్‌ను ఎన్డీఏలో చేర్చుకోవడం వ్యూహాత్మకంగా జరిగింది. ఉత్తరాది రాష్ట్రాల్లో విజయం తర్వాత మోదీ దూకుడుగా వ్యవహరించి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్ష ఎంపీలందర్నీ గెంటేసి కీలకమైన బిల్లులను ఇష్టారాజ్యంగా ఆమోదించుకున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ జోడో యాత్ర బిహార్‌లో ప్రవేశిస్తున్న సమయంలో, పార్లమెంట్ చివరి సమావేశాలు జరుగుతున్న సమయంలో నితీశ్‌ను చేరదీసి ప్రతిపక్షాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారు. ‘ఇండియా కూటమి నుంచి నితీశ్ వైదొలగడం రాత్రికిరాత్రి జరిగిన పరిణామం కాదు. చాలా ముందుగా పథకం ప్రకారం జరిగిన కుట్ర’ అని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇప్పుడు బాధపడితే లాభం ఏమిటి?

దేశ రాజకీయాల్లో బీజేపీ ధాటిని చూసి భయపడిన నితీశ్ మోదీ రక్షణలో చేరడమే మంచిదని భావించవచ్చు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండానే దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న నితీశ్ కుమార్‌కు రాజకీయాల్లో ఎలా మనుగడ సాగించాలో తెలుసు. ఎమ్మెల్సీగా ఉంటూనే సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్న నితీశ్ కుమార్ ప్రాప్తకాలజ్ఞత వల్లే తొమ్మిదోసారి ముఖ్యమంత్రి కాగలిగారు. ఈ రికార్డుతోనే ఆయన తన జీవిత చరమాంకం క్షేమంగా గడపాలని నిర్ణయించుకున్నారు. దేశంలో రాజకీయాల ప్రమాణాలు రోజురోజుకూ క్షీణిస్తున్న సమయంలో విలువల గురించి ఆలోచించడం వృధా అని ఆయన భావించి ఉంటారు. అదే సమయంలో బిహార్ రాజకీయాల్లో నితీశ్‌కు ఎంతో కొంత బలం లేకపోతే ప్రతి పార్టీ ఆయనతో చేతులు కలపాలని ఎందుకు అనుకుంటుంది అన్న విషయం కూడా ఆలోచించాలి. 2013, 2017, 2022లో మూడుసార్లు బీజేపీని వదుల్చుకున్నప్పుడు నితీశ్‌ను ఘోరంగా తిట్టిపోసిన ఆ పార్టీ నేతలు నాలుగోసారి 2024లో ఆయనను ఎందుకు అక్కున చేర్చుకున్నారు? ఇది బీజేపీ నైతికతకు సంబంధించిన విషయం కాదు, దాని రాజకీయ అవసరానికి సంబంధించిన విషయం. అదే సమయంలో ఆర్‌జెడి, కాంగ్రెస్‌లు కూడా నితీశ్ తమవైపు ఎన్నిసార్లు వచ్చినా అన్నిసార్లు ఆలింగనం చేసుకున్న విషయం మరిచిపోరాదు.

బీజేపీ వర్గాల ప్రకారం కోయి, కుర్మీ, ధనుక్ వంటి యాదవేతర ఓట్లలో అత్యధికులు నితీశ్ వైపు ఉన్నారు. 14 శాతం యాదవులను మినహాయిస్తే, మిగిలిన 13 శాతం ఎన్డీఏ వైపు మళ్లించేందుకు బీజేపీ కృషి చేస్తోంది. నితీశ్ చొరవతోనే తొలుత ఇండియా కూటమికి కదలిక ఏర్పడింది. సీ ఓటర్ సర్వే ప్రకారం ఈసారి 40 లోక్‌సభ సీట్లలో సగానికిపైగా మహా కూటమికి లభిస్తాయని తేలింది. ఒకవైపు ప్రతిపక్షాల అవకాశాలను దెబ్బతీస్తూనే బిహార్‌లో బలోపేతం అయ్యేందుకు నితీశ్‌తో బీజేపీ చేతులు కలిపింది. ఇప్పటికే చిరాగ్ పాశ్వాన్, జితన్‌రాం మాఝీ బీజేపీతో ఉన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్‌కు వ్యతిరేకంగా నితీశ్ కుమార్ రంగంలోకి దిగినప్పుడు లవకుశ రాజకీయాలను ఉపయోగించుకుని కుశావహ నేత శకుని చౌదరిని తన వెంట ఉంచుకున్నారని బిహార్‌కు చెందిన ఒక సీనియర్ జర్నలిస్టు తెలిపారు. ఇప్పుడు శకుని చౌదరి కుమారుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాట్ చౌదరిని ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. అంటే అతి వెనుకబడిన వర్గాలు, దళితులు, మహాదళితులను తన వైపు తిప్పుకునేందుకు మోదీ ఒక పథకం ప్రకారం వ్యవహరించారు. అదే సమయంలో అగ్రవర్ణాలకు చెందిన విజయసిన్హాను రెండో డిప్యూటీ ముఖ్యమంత్రిగా నియమించి వారికి కూడా బీజేపీ తగిన సంకేతాలను పంపింది.

బిహార్‌లో జరుగుతున్నది దేశ రాజకీయాలకు అద్దం పడుతోంది. దేశంలో మెజారిటీ పార్టీలకు నైతికత కానీ, సైద్ధాంతికత కానీ, లేవు. జనతాదళ్ (ఎస్) నేత దేవెగౌడ కూడా నితీశ్‌కు తక్కువేం కాదు. పలుసార్లు ఈ పార్టీ బీజేపీ, కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి నేతృత్వంలోని బిఎస్‌పి చేతులు కలపని పార్టీ అంటూ లేదు. డీఎంకే, అన్నాడీఎంకే కూడా పొత్తులు మారుస్తూ వచ్చాయి. కనుక బిహార్‌లో జరుగుతున్నది ప్రత్యేకమైన విషయం ఎంత మాత్రమూ కాదు. అయినప్పటికీ ప్రతిపక్షాలు కాడిని పడేయాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే ఇక ప్రజాస్వామ్యాన్ని మరిచిపోవాల్సిందే అని మల్లికార్జున ఖర్గే అనడం ఆయనలోని భయాన్ని సూచిస్తోంది. కాని జరుగుతున్న పరిణామాలు మోదీలో భయాన్నే ఎక్కువగా సూచిస్తున్నాయి. ఇండియా కూటమి జనతా ప్రయోగం మాదిరి సంఘటితం అవుతుందని భయపడినందువల్లే ప్రతిపక్షాలను కుప్పకూల్చేందుకు ఆయన విజృంభిస్తున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి 37.3 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. ప్రతిపక్షాల ఓట్లు చీలిపోవడం ద్వారానే ఆయన విజయం సాధించగలిగారు. 2024 ఎన్నికల్లో మోదీ బీజేపీ 50 శాతం పైగా సాధించాలని పార్టీ నేతలను ఉత్సాహపరుస్తున్నప్పటికీ 63 శాతం బీజేపీ యేతర ఓట్లను చీల్చనిదే అది సాధ్యం కాదని ఆయనకు తెలియనిది కాదు. ఆ దిశన ఆయన ఎత్తుగడలు సాగుతున్నాయి.

భారతదేశ రాజకీయాలను పూర్తిగా నియంత్రించేందుకు రానున్న రోజుల్లో మోదీ ఇంకా ఎన్ని ఆయుధాలను ప్రయోగిస్తారో ఊహించలేము. అవి ప్రజాస్వామికమా, అప్రజాస్వామికమా అన్న ప్రశ్నలను బీజేపీ పట్టించుకోదని చండీగఢ్‌లో జరిగిన మేయర్ ఎన్నిక తీరు, లోక్‌సభ ఎన్నికల సమయంలో బిహార్, జార్ఖండ్‌లో ఈడీ స్వైరవిహారం స్పష్టం చేస్తున్నాయి. బిహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్‌ను మనీలాండరింగ్ కేసులో పదిగంటలకు పైగా విచారణ జరపడం ఇప్పటికే దెబ్బతిన్న మహా కూటమిని మరింత బలహీనపరచే చర్యల్లో భాగమే. జెఎంఎం కనుక ఎన్డీఏలో ఉండి ఉంటే ఇప్పుడు ఈడీ ధాటికి తట్టుకోలేక ముఖ్యమంత్రి హేమంత సోరెన్ ఎక్కడో తలదాచుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. చండీగఢ్‌లో మేయర్ పదవి పొందడం కోసం ప్రతిపక్షాలకు చెందిన 8 ఓట్లు చెల్లవని ప్రిసైడింగ్ అధికారి ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజని, ఒక్క మేయర్ పదవికోసమే బీజేపీ ఇంత దిగజారితే ఇక లోక్‌సభ ఎన్నికల్లో గెలిచేందుకు ఎంతకైనా దిగజారవచ్చని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించాయి.

అయితే లోక్‌సభ ఎన్నికల్లో గెలిచేందుకు మోదీ సర్వశక్తులు ఒడ్డుతారని ఎవరికైనా తెలియకపోతే అది అమాయకత్వమే అవుతుంది. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే తమ మనుగడ ఏమవుతుందో అని కొన్ని రాజకీయ పార్టీలు భయపడడం, మరి కొన్ని రాజకీయ పార్టీలు ఈ భయంతోనే మోదీ అండదండలకు ప్రయత్నించడం సహజమే. నిజంగానే మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే అసలు ప్రతిపక్షమే ఉండకపోవచ్చు. కాని ఈ భయం ప్రజల్లో ఏర్పడిందా? ఆ భయం చైతన్యంగా మారుతోందా? అలా మార్చే ప్రయత్నాల్లో ఈ పార్టీలు ఎంతవరకు కార్యసాధకం కాగలుతున్నాయి? మోదీలోని ఏ లక్షణాలు ప్రజల్లో ఆయన పట్ల సానుకూలత ఏర్పరుస్తున్నాయి? దక్షిణాదిన తెలంగాణ, కర్ణాటకలో సాధించిన ఫలితాలు కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల్లో ఎందుకు సాధించలేకపోతోంది? జాతీయ స్థాయిలో ఒక బలమైన ప్రత్యామ్నాయాన్ని ఏర్పర్చుకోవడం మాత్రమే కాదు, ఈ ప్రత్యామ్నాయాన్ని నీరుకార్చేందుకు చేసే ప్రయత్నాలను వమ్ము చేసే నాయకత్వం కూడా దేశానికి అవసరం. ఈ లోటు స్పష్టంగా కనపడుతోంది.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Jan 31 , 2024 | 12:54 AM